Pages

Tuesday, October 8, 2013

కంచి కామాక్షి ఆలయం మానసిక దర్శనం....1

కంచి కామాక్షి ఆలయం మానసిక దర్శనం....1

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

       పొద్దున్న పూజకు కూర్చునే ముందు కామాక్షి తల్లికి సంబంధించిన కీర్తన వింటూ సన్నద్ధమవుతుంటే ఒకసారి కంచి కామాక్షి ఆలయం ఆ వైభవం గుర్తుకొచ్చాయి వరసగా ఆ ఆలయంలో అన్ని విశేషాలూ చూస్తూ అమ్మవార్ని తలుస్తూ మనసు బుద్ధి అంతా కంచి కామాక్షి అమ్మవారి ఆలయం నిండి పోయింది.

       యాత్రినివాస్నుండి బయటికి రాగానే ఎడంపక్క ఠీవీగానించున్న పెద్ద గోపురం దాని మీద ’మోక్షపురి కంచి ’ అని తెలుగు, తమిళ, దేవనాగరి లిపులలో తెలుపు నీలం రంగుల బోర్డు, అటు వెళ్తూంటే, మల్లెలు, గులాబీలతో కట్టిన దండలు, ప్రత్యేకంగా 108 తామర పువ్వులతో కట్టి ఉంచిన పెద్ద పెద్ద దండలు, బిల్వం దండలు, ఆపక్కనే మిరాసీదార్లైన ముగ్గురు పరంపరాగత స్థానాచార్యులలో ఒకరైన అర్చకస్వామిగారిల్లు ఆ పక్కనే వారి వంశీకుల మరో ఇల్లు ఆ ఇంటికానుకుని ప్రత్యేకంగా తయారు చేయబడిన కుంకుమ లభించే దుకాణం. చూస్తూ అమ్మవారికి సమర్పించడానికని పూల హారాలు తీసుకొని గోపురంలోంచి ముందుకు వెళ్తూ చూస్తుంటే ఈ రాజ గోపురానికీ ఇరుపక్కలా శంఖనిధి పద్మనిధి మూర్తులు కనపడతారు  (తిరుమలలో ఎలా ఐతే శంఖనిధి పద్మనిధి రాజ గోపురం దగ్గర క్రింద వేపుకుంటారో అలా ) వారికి నమస్కరించి లోపలికి అడుగుపెడ్తూంటే ఎదురుగా కంచి కామకోటి పీఠాధిపతుల చిత్తరువులు, శ్రీ శంకరాచార్య స్వామి అమ్మవారిని పూజిస్తున్నట్టుగా ఉన్న చిత్తరువు కనిపిస్తూంటాయి,   గోపురం మధ్యలో చిన్న గదిలో అమ్మవారి మూర్తులు, చిత్తరువులు, ఇతర ఇత్తడి, రాగి పూజా సామాగ్రి అమ్ముతూ ఉంటారు లోపలికెళ్ళగానే వెనక్కి తిరిగిచూస్తే ఎత్తులో శ్రీ కాలభైరవులవారు, దుర్గాదేవి ఆలయాలుంటాయి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే కుడివైపుకి ఆలయంలోపలికి అనుమతించే క్యూలైను, మంటపం కనపడుతుంది, ఎడమ పక్క ధ్వజస్తంభం ఎత్తుగా కనపడుతుంది.

       ఆలయానికి ప్రదక్షిణంగా ఎడమవేపు కొంచెం ముందుకు కదిలి ధ్వజస్తంభానికి నమస్కరించి అక్కడే సాష్ఠాంగ నమస్కారం చేసుకొని లేచి చూస్తే ధ్వజ స్తంభం ఎదురుగా ఆలయ ప్రాకారం గోడకి చిన్న రంధ్రం వంటి అమరిక ఉంటుంది పరమాచార్య నడిచేదేవుడు జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతీ స్వామి వారు అందులోంచి లోపల అమ్మవారిని దర్శించేవారంటారు, క్యూలైనులో వస్తే మనమూ దర్శించే వీలుండవచ్చు, అలా ముందుకు సాగి కుడివేపుకు తిరిగితే ఎడమవైపున అన్నదాన సత్రం, ఆ పక్కనే వెనక్కి ఐమూలగా కొంచెం పాతదానిలా కనిపించే ఈశ్వరాలయం ఉంటాయి. ఈ ఆలయంలో స్వామివారు విశ్వేశ్వరుడుగా కొలువుంటారు పక్కనే అన్నదాన మంటపం. అన్నపూర్ణ పక్కనే అయ్యవారన్నమాట. ఆ ఆలయానికి ప్రదక్షిణగా తిరిగి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ బిల్వ వృక్షం, ఇతర పుష్పవృక్షాలుంటాయి కొంచెం ముందుకు కదిలితే దక్షిణ గోపురం ఎదురుగా కోనేరు "పంచ గంగ" చుట్టూ మెట్లతో ఆకుపచ్చ నీళ్ళతో నిండా చేపలతో లోతుగా ఉంటుంది

       ఆ పంచగంగా తీర్థం (కోనేరు) మొదలు దగ్గర ఆలయం ప్రాకారం వెనుకకు మధ్య సందులా ఉంటుంది ఆ సందులోకి వెళ్తే అక్కడ మూడురకాలుగా ఉన్న విష్ణుమూర్తి మూడు అంతస్థులతో ఉంటారు ఈ విష్ణుమూర్తి ఆలయం 108 దివ్య క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయంలో ఒక అంతస్తులో శయనరూపంలో ఒక అంతస్తులో కూర్చొని, మరో అంతస్తులో నిలబడి స్వామి వారుంటారు. చిన్న దీపం వెలుతురులో జాగ్రత్తగా గమనిస్తే కనిపిస్తుంది కొద్దిగా చీకటిగా ఉంటుంది. అక్కడ పక్కన మెట్లుంటాయి కానీ సాధారణంగా ద్వారానికి తాళం వేసుంటుంది. అక్కడనుంచి ముందుకు వెళితే గోడమీద వినాయక స్వరూపం నమస్కరించి ముందుకు వస్తే ఆలయం వాయువ్యం మూలకి వస్తాం కోనేరుకి ప్రదక్షిణం చేయాలంటే తిరిగి వెనక్కి వచ్చి కోనేటి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ అక్కడ ఉన్న పాత పెద్ద మంటపం చూసి పశ్చిమ రాజ గోపురం చూసి ముందుకు వస్తే అక్కడ ఒక పెద్ద చెట్టు చుట్టూ చాలా మంది కూర్చొని ప్రసాదాలు ఇత్యాది స్వీకరిస్తుంటారు. అక్కడే దక్షిణముఖంగా పంచగంగా తీర్థానికి ఉత్తరాన దుర్గాదేవి ఆలయం ఉంటుంది. కామాక్షివిలాసంలో చెప్పబడిన అమ్మవారికి తోడుగా వచ్చిన దుర్గా స్వరూపంగా చెప్తారు. అక్కడ్నుంచి ఆలయ ప్రాకారంవేపు చూస్తేమూడు పెద్ద గోపురాలు అమ్మవారి స్వర్ణగోపురం ప్రాకారంపైన ఉన్న సింహాలు కన్పిస్తాయి.

       అలా ముందుకు వస్తే ఇంతకుముందు నమస్కరించిన గణపతి ఆలయ వాయువ్య భాగం కుడివేపున ఉంటే ఎడమవేపున ఒక పెద్ద స్తంభ మంటపం ఆ మంటపం చుట్టూ ప్రదక్షిణగా వెళ్తూంటే ఆ అరుగుల మీద ఎన్నో రకాల శివ మూర్తులు ఊర్థ్వతాండవ మూర్తి, త్రిపురాసుర సంహార ఘట్టాలు పార్వతీ కళ్యాణ ఘట్టాలు, మహిషాసుర మర్ధిని, కల్పవృక్షం కింద సపరివారంతో వామదేవమూర్తిలా కూర్చున్న స్వామివారి మూర్తి, సుబ్రహ్మణ్య స్వామి విఘ్నేశ్వరుడు ఇలా ఎన్నో హృద్యమైన మూర్తులు అందులో కొన్నింటికి పసుపు కుంకుమలు వ్రాసి ఉంటాయి. పైన మంటపం మధ్యలో ఉత్సవాలకి సిద్ధంగా ఒక వేదిక అలంకరించి ఉంటుంది. అలా తిరిగి తూర్పు రాజ గోపురం వేపుకి ముందుకు వస్తే కుడివేపున ఆలయ ప్రవేశానికి అనుమతించే మంటపం ఉంటుంది అక్కడనించుని లోపలకి చూస్తే పెద్ద పెద్ద ఫ్రేములలో ఉంచిన బాలా త్రిపురసుందరి, వారాహి, రాజశ్యామలా మూర్తులుంటాయి. ఇక్కడ ఉన్న మంటపంలోనే అమ్మవారికి ఉత్సవాల సమయంలో పూజాధికాలు నిర్వహిస్తారు ఉత్సవం చేస్తారు.

       అవి చూస్తూ లోపలికి వెళ్తే గుమ్మం ఎదురుగా ఇంకో ధ్వజస్తంభం అదే జయ స్తంభం అది కనపడుతుంది కుడివైపున గ్రిల్స్లో ఆలయంవారి కార్యాలయం ముందుకు వెళ్తూ ధ్వజస్తంభానికి నమస్కరించి దక్షిణం వేపుకు నాలుగడుగులు వేయగానే ఎదురుగా అమ్మవారి ఆలయంలోకి దారి కుడివేపున గణపతి ఆలయం నమస్కారం పెట్టుకొని గుమ్మం దాటగానే “ ఇప్పటికొచ్చావా నాన్నా” అన్నట్లు గోపురం మీదనుంచి అమ్మ చూస్తూంటుంది కుడివేపున శ్రీ ఆది శంకరచార్యస్వాములవారి ఆలయం పక్కగా అభిషేకం టిక్కెట్టు కొనుక్కున్న వారు తమ వంతుకోసం ఎదురుచూసే మంటపం, ఎడమపక్కగా చిన్నగా సందులా ఉన్న వరుసలో ముందుకు దాటి వెళ్తూంటే ఎదురుగా ఉన్న మెట్లెక్కి నాలుగడుగులేయగానే ‘మహానుభావుడు క్రోధభట్టారకుడు అని అమ్మవారి భక్తులలో పేర్గాంచి ఆర్యాద్విశతి రచించి కంచి కామాక్షి ఆలయంలో పూజా విధానాన్ని నిర్దేశించిన దుర్వాసో మహాముని’ చిరునవ్వుతో ధ్యానముద్రలో ఉన్నా “ఓహ్.. వచ్చావా అమ్మని చూడడానికి..” అని చిరునవ్వుతో సంజ్ఞ చేస్తున్నట్లు కనపడతారు.
      
       ఎడమపక్కకి తిరగగానే మూలకి ఒక చిన్న గదిలాంటిది ఉంటుంది అదే అమ్మవారి శయన మందిరం. రాత్రి అమ్మవారి మూర్తికి పూజ చేసి తోసుకొచ్చి ఈ గదిలో శయనింపచేస్తారు, వేడిపాలు, జీడిపప్పు, ఎండుద్రాక్ష వంటివి అక్కడ ఉంచుతారు వాటితోపాటు అమ్మవారికి తాంబూలాలు ఒక పాత్ర ఉంచుతారు. అక్కడ ఓ నమస్కారం చేసి వెనక్కి తిరిగితే అక్కడ ఒక గణపతి ఉంటారు. అమ్మ శయనమందిరంలోంచి బయటికి రాగానే ఎదురుగా వినాయకుణ్ణి చూసిన వాత్సల్యంతోటే అందరినీ చూసి అనుగ్రహిస్తుంది. ఎవరికోగానీ ఆ అమ్మవారి తాంబూల ప్రసాదం దక్కదు. ఆయమ్మ అనుగ్రహం. అలా కుడివేపుకి తిరిగి ముందుకు వస్తే పక్కనే అమ్మవారి ఉత్సవ మూర్తులు చిన్న ఆలయంలో దక్షిణాన్ని చూస్తూ ఉంటాయి.

       ఆ ఆలయానికి ముందు రాతి పద్మం ఉంటుంది అక్కడ నమస్కరించుకొని అమ్మవారి గర్భాలయం వేపుకి చూస్తే లోపల్నుంచి అమ్మవారు మనని చూస్తూ నవ్వుతూ దర్శనమిస్తుంది. కొద్దిగా వంగి అమ్మవారి గోపురం వంక చూస్తే గోపురంలో వున్న బంగారు కామాక్షి దర్శనమిస్తుంది లేదా మండపంలో పైన పెట్టిఉన్న అద్దంలో చూసినా గోపురంలో ఉన్న అమ్మ కామాక్షి చాలా చక్కగా కనపడుతుంది. మనం ఉత్తర ముఖంగా నుంచుని కొద్దిగా వంగి పడమరనుంచి తూర్పువేపుగా గుండ్రంగా తలతిప్పి చ్చూస్తే ఒకేసారి గర్భాలయంలో అమ్మవారు, ఎదురుగా ఉత్సవకామాక్షి అద్దంలో గోపురంలోఉన్న బంగారు కామాక్షి కనపడతారు ఆ వైభవమే వైభవం. మొదటి సారి వచ్చేవారు ఏది ఏది అని అడుగుంటే అంతకుముందు చాలా సార్లు వెళ్ళినవారు అదికో అలా చూడండి ఇలా చూడండి అని వివరిస్తుంటారు. అక్కడ పక్కకి వచ్చి ఆ మంటపంలో కాసేపు కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు (ఎక్కువ జనం లేనప్పుడు చేసుకోవడం మంచిది).

       అలా ముందుకెళ్తే అక్కడే పల్లవ మహారాజు, ఆ మంటపం చుట్టూ తమిళంలో అభిరామి అంత్యాది చెక్కబడి ఉంటుంది. అలా ముందుకెళ్తే ఎదురుగా మరో చిన్న ఆలయం మనకి ఎడమవేపున రాజ శ్యామలా మూర్తి నల్లగా ఉండి ఎర్రని పచ్చని చీరతో అన్ని చేతులతో రకరకాల ఆయుధాలతో రెండుచేతులతో వీణవాయిస్తూ నవ్వుతూ ఉంటుంది. ఆవిడక నమస్కరించి ముందు చూస్తే అక్కడ ఒకప్పుడు బంగారు కామాక్షి మూర్తి ఉండే ఆలయం. ఆ బంగారు కామాక్షి తంజావూరు తరలిపోయాక అక్కడ ఏమీ ఉండేది కాదు. నడిచేదేవుడు కంచి పరమాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారు కామాక్షికి బంగారు పాదుకలు చేయించి వాటిని అక్కడ ప్రతిష్టించారు (అమ్మవారి అభిషేకానికి గాయత్రి మంటపంలోకి వెళ్ళి వచ్చినవారు ఈ పాదుకలని తప్పక దర్శనం చేసుకోవాలి శ్రీవిద్యాసాంప్రదాయీకులకు లేదా అక్కడ కామకోటి మఠంలో పండితులకు అలా ఎందుకు అనే ఈ రహస్యం తెలుస్తుంది, రహస్యం తెలిసినా తెలియకున్నా ముఖ్యంగా గాయత్రి మంటపంలోకి వెళ్ళినవారు ఈ పాదుకలను తప్పక దర్శనం చేసుకోవడం మంచిది).

       అక్కడ ఆ స్వర్ణ పాదుకలను స్వర్ణ శ్రీయంత్రాన్ని దర్శనం చేసుకొని ముందుకు వస్తే అక్కడ మంటపం కిందకి దిగడానికి మెట్లుంటాయి దిగగానే ఎదురుగా అన్నపూర్ణాదేవికి చిన్నఆలయం  ఉంటుంది అమ్మవారి గర్భాలయం ఉండే గాయత్రీ మటపంలోనుండి బయటికొచ్చేవారిని ఆప్యాయంగా పలకరిస్తున్నట్లుగా ఉంటుంది అమ్మవారు(అక్కడకి మళ్ళీవద్దాం). ఎడమవేపుకి తిరిగి ముందుకి వెళ్తే ఎక్కడాలేని విధంగా స్వామి అయ్యప్ప యువకుడిగా యోగపట్టం తీసి ఒక కాలు ముందు పెట్టి ఒక చేతిలో కొరడా పట్టుకొని పూర్ణ పుష్కల సమేతంగా నిలువెత్తు మూర్తిలా ఉంటారు, “జగజ్జనని ఐన తల్లి లోనున్నది ఇచ్చవచ్చినట్లు ప్రవర్తించకు” అంటూ తప్పు చేసినవారిని దండించడానికా అన్నట్లు కొరడాతో సిద్ధంగా ఉంటారు. ఆయనకు నమస్కరించి ముందుకు వస్తే మొదట్లో చూసిన ఆదిశంకరుల ఆలయం బహు రమ్యంగా ఉంటుంది మెట్లెక్కి చూస్తే ఠీవీగా పద్మాసనంలో కూర్చొని సత్యదండం చేతపట్టి చిన్ముద్రతో అరమూసిన కళ్ళతో మనని చూస్తూ "ఏం బెంగలేదు, కంచికొచ్చావుగా ఏ అవైదిక శక్తులూ నిన్ను ఏమీ చేయలేవు ధర్మ బద్ధంగా వైదికంగా జీవించు. అమ్మను నమ్ముకో, ధర్మాన్ని నమ్ముకో." అని బోధిస్తున్నట్లు చిరునవ్వుతో కనిపిస్తారు అక్కడ మెట్లు దిగి "విధితాఖిల శాస్త్ర సుధా జలధే..." అని తోటకాష్టకం చదువుతూ ఒక్కోశ్లోకానికి స్వామి వారి ముందు సాష్ఠాంగపడి స్వామీ “మీ ఆశీర్వాదంతో ఎన్నటికీ మీకింకరుడిగా జీవించే అవకాశాన్ని కలిగించండి, వీడు శంకరకింకరుడు అని జీవిత పర్యంతమూ జీవించగలిగే ధృతినిచ్చి ధర్మాన్ని వదలకుండా ఉండేట్టుగా ఆశీర్వదించండి” అని మనసా నమస్కరించి ఇతఃపూర్వం లోపలికి రాగానే చెప్పినట్లు ఆపక్కనే అభిషేకం కోసం వేచి ఉండే లైనులోకి ప్రవేశిస్తే అక్కడ మంటపం పక్కన పెద్ద పెద్ద హుండీలు ఆ మంటపం పైన ఒక పేద్ద శ్రీయంత్రం పటం ఉంటాయి. అమ్మవారి గాయత్రీమంటపంలోకి ప్రవేశమెప్పుడా అని తలుపు వంక చూస్తుంటే తలుపు పక్కనే ఒక విష్ణుమూర్తి ఉంటారు. ఓహో 108 దివ్యదేశాల్లో చెప్పిన కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉండే స్వామి ఈయనే కదా అని ఆ గోవిందుణ్ణి చూస్తూ ఇంక ఆలయంలోకి ప్రవేశమెప్పుడెప్పుడా మాయమ్మని ఎప్పుడు చూస్తామా అని మనవంతుకోసం ఎదురు చూద్దాం....

- శంకరకింకర


6 comments:

  1. Replies
    1. స్వాగతం నారాయణ స్వామి గారు!

      Delete
    2. అమ్మ దర్శనం అయింది అండీ

      Delete
  2. Kannulu yamdu aanamdabhaashpaalu kalgutunnayi.
    Amma, Kaamakshi, ennatiki nee charanaalayamdu magnulamoutaamamma...Saranu.

    Pradakshinam lo yedama vaipu kanipimche lingam saakshaattu "Kaasi Viswanaatha Lingam".

    Alaage, gopuram lo numdi lopalaku vellagane venakku tirigi chuste, atu itu yettuga metlumdi Sri KalaBhaira devaalayam mariyu DurgaDevi aalayaalu umtaayi.

    Aa paata raati mantapam lo koorma prushta mahaa peetam untumdi. Daani pai Ammavaari utsavaalu chestaaru.

    Namaste namaste namo namaha.

    ReplyDelete
  3. Namaste.

    SriMaatre namaha.

    Vaarahi Amma, RaajaSyaamala Amma, Baalambala chitra pataalu daati munduku velite manaku kanpimchedi "Jaya Stambham". Bhandaasurunni Baalaamba juttu pattukuni laakkuni vachi paati petti daani meeda Jaya Stambhaanni sthaapimchimdi.

    Parama paavanamu mahaa shakthivantamu ayina Gayatri mantapam lopalaku velli adugu pettadam valana kalgina paapam akkada unna SriChakra archana valana kaani, leka Bangaru Kamakshi (paadaalu) darsanam cheyadam valana kaani tolagutaayani puraanam lo manaku cheppina kaarunya visesham.

    Namaste Namaste Namo namaha.

    ReplyDelete