శ్రీ గురుభ్యోన్నమః
శ్రీ గణేశాయ నమః
దైవం సంపూర్ణ మానవరూపంలో సంచరించిన అవతారాలలో ప్రముఖమైనది శ్రీ రామావతారం. అచ్చంగా మానవుడు ఎలా తన జీవితాన్ని గడుపుతాడో అలా జీవించి, మానవ జీవితాన్ని ధర్మ బద్ధంగా ఎలా జీవించాలో ఈ మానవ శరీరంలోకి వచ్చి ఈ శరీరాన్ని ఎలా ఋతుమంతం చేసుకోవాలో నడిపి చూపించిన అవతారం శ్రీ రామావతారం.
స్వామీ రామచంద్ర ప్రభో !
ప్రభో..ఎక్కడో మానవనేత్రానికి కనపడకుండా ఉన్న నువ్వు మాకోసం సమస్త మానవాళికోసం, నరజాతి గొప్పదనాన్ని చాటటంకోసం మేమెవరమూ అడగకపోయినా, అడగడం కూడా చేతకాని అమాయకులని తలచి నీఅంత నీవుగా నరుడిగా నాలుగు అంశలుగా విభజించుకుని శ్రీరామ, భరత,లక్ష్మణ, శత్రుఘ్నులుగా ఈ నేలమీద నడిచిన నీ చరితం సమస్తం కరుణాపూరితం. ఎంత దయ లేకపోతే మాకొరకు అన్ని కష్టాలు పడ్డావు స్వామీ! రామచంద్రా! పుట్టవలసిన అవసరం లేని నువ్వు, మనుష్యుల వానరుల వలన తప్ప అన్యుల వలన సంహరింపబడనని, నరజాతిని, వానరజాతిని అధమస్థాయి జీవులుగా గుర్తించి నిర్లక్ష్యధోరణితో ఉన్న రావణాసురుని సంహరించడానికీ, అప్పటికే లోకంలో నరుడంటే చులకన భావం పెచ్చుమీరగా, నువ్వే నలుగురిగా ముగురమ్మల గర్భవాసం పన్నెండునెలలు చేసి నరుడిలా పుట్టాలని మా అందరిలా గర్భవాసం చేశావా తండ్రీ.. కౌసలేయా!!
నరులకి చిన్నప్పుడే వశిష్ఠమహర్షి చే సుశిక్షితుడవై, మాఖు ఆచారంనేర్పడానికి యవ్వనమంకురించగానే గురువైన విశ్వామిత్రుని వెంట కానలలో లక్ష్మణ సహితుడవై పాదచారివై తిరిగి, "కింకరౌ సముపస్థితౌ" అంటూగురు శుశ్రూష ఎలా చేయాలో నేర్పావు.. వశిష్ఠవిశ్వామిత్రాది గురువులకి ప్రియశిష్యుడవైనావు.
వీర్య శుల్కగా అయోనిజ మాయమ్మ సీతమ్మను గెల్చుకున్నా స్వంత అభిప్రాయాలు కావు పెద్దలు ఒప్పుకుంటేనే చేసుకుంటానని , తండ్రి ఒప్పుకుంటే తప్ప వివాహం చేసుకోను అని జనకుడికి చెప్పి ఒక నరుడు వివాహ విషయంలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి మాకందరకూ చూపెట్టావా.. దాశరథీ!!
తండ్రి కుదిర్చిన సంబంధమని అత్యంత ప్రేమతో సీతమ్మను లాలించి, అన్యోన్యంగా ఉన్నవేళ, మహారాజు పట్టాభిషేకం చేస్తానని చెప్పి, ఒక్క రాత్రికే దైవ వశాత్, కైకేయీ మాత వరాలవల్ల పదునాలుగేళ్ళు కాననలకు వెళ్ళాల్సివస్తే, నెత్తిమీద సముద్రజలాలతో, దివ్య నదీ జలాలతో అభిషేకించబడి యువరాజువి కావలసిన వాడివి, శిరసుపై మర్రిపాలు పోయించుకొని నీ ఉంగరాల జుట్టుని ఆ పాలతో తడుపుకుని జటలు కట్టుకున్నావా.. తండ్రిని సత్యంలో నిలపడానికి హాయిగా కాననలకి తాపసులలాగా వెళ్ళి ఉండాల్సిన ఆ కష్టాన్ని నెత్తిన వేసుకున్నావా...సీతాపతీ !
నీ కారుణ్యానికేది సాటి, నీ అంతటి వానికి గుహునితో మైత్రా?.. తండ్రి మరణించాడని తెలిసి గారపిండితో పితృ కార్యం జరిపావా... నీరాజ్యం నీది తీసుకో నాకొద్దు మొర్రో అని భరతుడంటే ఆ రాజ్యం నాకొద్దు నాతండ్రిమాటే ముఖ్యమని అడవులలోనే గడిపావే.. నీ ధృతి ధైర్యం మాకూ ఇవ్వవా తండ్రీ.... భరతాగ్రజా!
హంసతూలికా తల్పాలపై పరుండవలసిన మీ మువ్వురూ, రాక్షస సంహారం, కౄర జంతు సంహారం చేస్తూ తాపసులలాగా ఆశ్రమాలలో ఉంటూంటే, ఇంకో సంవత్సరంలో తిరిగి రాజ్యానికొస్తారనగా, ఆ చుప్పనాతి శూర్పణఖ వల్ల ఖర దూషణాదులతో యిద్దం చేసి పదునాలుగువేలమందిని ఒక గంటా పై చిలుకు నిమిషాలలో హతమార్చినందుకు రావణుడు మాయాజింక మాయోపాయంతో తల్లి అయోనిజ, కష్టమెరుగనిది, కులాంగన, నిన్ను వీడి ఉండని మా యమ్మను ఎత్తుకుపోతే, ఆసమయంలో అడ్డుపడ్డందుకు జటాయువుని సంహరిస్తే, జటాయువు నీ తండ్రి స్నేహితుడైనందుకు అంత కష్టంలోనూ ఆ పక్షిరాజుకు నీ తండ్రికి చేసినట్టే ఉత్తర క్రియలు చేశావా... రఘుపుంగవా!
ఎంతో పౌరుష పరాక్రమాలు ఉండీ క్షణంలో సీతమ్మును విడిపించుకోగల సత్తా ఉండీ, కేవల నరుడిలా వ్యవహరించి, భార్యా వియోగిలా ఏడిచి, సుగ్రీవుని స్నేహం పొంది, ఆ కోతుల రాజు పెట్టిన పరీక్షలు నీ సామర్థ్యానికి తగినవి కాకపోయినా వాటిని స్వీకరించి, సుగ్రీవునికి సహాయపడి వాలిని ధర్మ బద్ధంగా చంపి సుగ్రీవుని రాజుని చేశావా.. మిడిమిడిజ్ఙానంతో మేము ఇప్పటికీ నీది అధర్మమని యుగాలు గడచినా నోళ్ళు బాదుకుంటుంటే పోనీలే అమాయకులని ఊరుకున్నావా... దయా సముద్రా!!
హనుమంతులవారి ద్వారా అంగుళీయకాన్ని పంపితే, పాపం ఆంజనేయ స్వామి సముద్ర లంఘనం దగ్గరనుంచీ చుక్క మంచినీరు కూడా తాగకుండా మధ్యలో సింహికను భంజించి, లంకిణిని ఓడించి రాత్రి రాత్రంతా లంకను నాలుగంగుళాలు వదలకుండా వెదికి వెదికి, నిర్వేదం పొంది, మళ్ళీ నీకోసం, అయోధ్యవాసులకోసం వానరులకోసం మళ్ళీ మళ్ళీ వెతికి సీతమ్మ జాడ కనిపెట్టి నీక్షేమ వార్త చెప్పి రాక్షస సంహారం చేసి రావణుడికి బుద్ధి చెప్పి బెదిరించి లంకాదహనం కావించాడు, మరి మాకో అన్నీ అనుమానాలే, నీ సేవలో అన్ని కోట్ల వానరాలు పాల్గొన్నాయి కనీసం చివరి వానరం చేసిన సేవలో కోటోవంతు చేయకపోయినా మమ్మల్ని కాస్తూనే ఉన్నావా స్వామీ.. ఆర్తత్రాణ పరాయణా!
మీ వంశీకులైన సగరుల వల్ల పుట్టిన సముద్రుడు కూడా మీకు లంకకు వెళ్ళే మార్గం చూపక నీ సహనాన్ని పరీక్షించినంత పెల్లుబికిన నీ ఆగ్రహానికి భయపడి వారధి కట్టమంటే వారధి కట్టావా, రావణుడి సోదరుడని తెలిసినా, ధర్మజ్ఙుడైన విభీషణుని అక్కున చేర్చు కున్నావా, మేము అంత విభీషణుడంత ధర్మజ్ఙులం కాదు స్వామీ.. అల్పజ్ఙులం మాతప్పులు కాసి మమ్మల్నీ అక్కున చేర్చుకోవూ.. కరుణాంతరంగా!
ఇంద్రజిత్తు బాణాలకి లక్ష్మణస్వామి పడిపోతే ఒక సాధారణ మానవునిలా ఏడిచావా, తమ్ముడులేకపోతే ఈ యుద్ధమెందుకు, సీతెందెకు నేనెందుకు అని విలవిలలాడావా! పొద్దున్నలేస్తే అన్నదములు అక్కాచెల్లెళ్ళతో గొడవలుపడే మావంటివారికి మీ అన్నాదమ్ములే కదా ఆదర్శం స్వామీ! లక్షణస్వామి ఇంద్ర జిత్తుని సంహరించడంకోసం నీ సత్య సంధతను ధర్మాన్ని పణంగా పెట్టి ఇంద్రజిత్తుని తుక్కుతుక్కుగా కొట్టేసినా నీధర్మాచరణం మీద మాకు ఇంకా అపనమ్మకమే.. మమ్మల్ని క్షమించు స్వామీ , కుంభకర్ణ రావణులని వధించడంలో ఒక నరుడు ఎలా యుద్ధం చేస్తాడో అలా యుద్ధం చేసి అలసి సొలసావా... వారెంత నీ ఒక్కబాణంతో చచ్చేవారు కేవలం నరుడుగా ఉండి చంపడం కోసం అంత యుద్ధం చేశావా... రావణహంత్రీ!
బుద్ధిలేని మానవులు స్త్రీకి స్వాతంత్ర్యమిచ్చావా అని అన్నా అంటారేమోనని సీతమ్మతో పరుషవాక్యాలాడితే మాకోసం సీతమ్మ అగ్నిలోప్రవేశించి తన స్వచ్చతను నిరూపించుకునేఘట్టంలో ఎరుపు జీరతో కూడిన నీకళ్ళలోంచి కారిన వేడినీళ్ళను చూచినవారెందరు తండ్రీ.... అందరూ సీతమ్మని అగ్ని ప్రవేశం చేయించాడు అని మాటలన్నవారే కాని మీఇరువురూ ఒక్కటే అని స్వయంగా హనుమే అన్నా ఒప్పుకోరేం తండ్రీ.... మాబాధలుపోగొట్టటానికి ఆ కష్టాలు నీనెత్తిమీద వేసుకుని మేమెలా బ్రతకాలో నేర్పిన నీకు ఏమని బదులు చెప్పాలి? ఏమని బదులు ఇవ్వాలి?
ఇన్ని కష్టాలు పడి పట్టాభిషేకం చేసుకుంటే అంతపెద్దరాజ్యంలో తప్ప తాగిన ఒక్కడు అన్న మాటకి ప్రభువెలా ఆదర్శంగా నిలవాలో చూపిన రాజారాముడు మారాముడని కాక ఎన్ని అభాండాలు తండ్రీ నీమీద.. ఐనా మాకోసం ఓర్చుకున్నావా... అలా పదకొండు వేల ఏళ్ళు జీవించి ఈ భూమిని పాలించావా ఎంత కష్ట పడ్డావు తండ్రీ.. కరుణా పయోనిధీ..
ఏం ఇవ్వగలం నీకు? ఏముందని మాకు? నీదికానిదేమున్నదిక్కడ నీకివ్వటానికి! నిజాయితీగా ఒక్క నమస్కారం తప్ప!
"యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధరా తావత్వమిహ సర్వస్య స్వామిత్వమనువర్తయ"
ఈ భూమి ఉన్నంతకాలం నీవే స్వామివని మా అందరి తరపున భరతస్వామి ఆనాడే చెప్పాడు.
నాది అంటూ ఏం ఉంది. అన్నీ నీవే అంతానీవే ఐనప్పుడు.
ఆ..... నా అనే అహంకారాది దుర్గుణాలు నా దగ్గర కోకొల్లలు, నువ్వేమో రాక్షసమర్ధనుడివి, నా ఈ రాక్షసగుణాలను తీసేసుకుని మర్దించెయ్.. కానీ ఒక్క కోరిక, మరోకల్పంలో మళ్ళీ వచ్చే త్రేతాయుగంలో మాత్రం మాకోసం ఇంత కష్టపడకేం.. మాయమ్మను అసలు కష్టపెట్టకు స్వామీ.. మా కష్టాలనైనా మేము ఓర్వగలం కానీ, ఏం చేస్తాడా ధూర్తుడైన రావణుడు మహా ఐతే చిత్రవధ చేసి చంపేస్తాడు... కానీ మీరు పడ్డ ఈ కష్టాలు మేమోర్వలేం తండ్రీ.... మావల్లకాదయ్యా..రామయ్యా !!!
సర్వం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణార్పణమస్తు
~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
జయ జయ శంకర హర హర శంకర
https://groups.google.com/group/satsangamu
No comments:
Post a Comment