Pages

Friday, December 28, 2018

భస్మ భూషితాంగ దేవ చంద్రశేఖరా


భస్మ భూషితాంగ దేవ చంద్రశేఖరా
అరుణ కిరణ శోభితా చంద్రశేఖరా
కరుణా రస సాగరా చంద్రశేఖరా
కామ బాణ నాశకా చంద్రశేఖరా
కామ కోటి భూషణా చంద్రశేఖరా
కమల నయన పూజితా చంద్రశేఖరా
విమల మూర్తి ధారకా చంద్రశేఖరా
కృపా కటాక్ష శోభితా చంద్రశేఖరా
పార్వతీ మనోహరా చంద్రశేఖరా
భస్మ భూషితాంగ దేవ చంద్రశేఖరా
అమర జన సేవితా చంద్రశేఖరా
సత్య వ్రత క్షేత్ర వాసి చంద్రశేఖరా
దేవ సింధు శేఖరా చంద్రశేఖరా
నీల గరళ శోభితా చంద్రశేఖరా
కామకోటి దేశికా చంద్రశేఖరా
కాల దర్ప నాశకా చంద్రశేఖరా
నాగ రాజ భూషణా చంద్రశేఖరా
రామ రామ రామ రామ చంద్రశేఖరా
రామ దాస సేవితా చంద్రశేఖరా
కామకోటి పూజ్య పీఠ చంద్రశేఖరా
శశి కిషోర శేఖరా చంద్రశేఖరా
దక్ష యజ్ఞ ధ్వంసకా చంద్రశేఖరా
సకల శాస్త్ర సన్నుతా చంద్రశేఖరా
నిగమ మార్గ గోచరా చంద్రశేఖరా
భస్మ భూషితాంగ దేవ చంద్రశేఖరా

(Collection)

Saturday, December 15, 2018

ధనుర్మాసమ్ ప్రాచీన వ్రతం

శ్రీ గురుభ్యోనమః

ధనుర్మాసమ్ తిరుప్పావైతో మాత్రమే మొదలవ్వలేదు.. అంతకన్నా ప్రాచీన వ్రతం ఇది..

ధనుర్మాసం కాల విభాగం చేసినప్పటినుండీ ఉన్నది. తిరుప్పావైతో మొదలవ్వలేదు. తిరుప్పావై పాశురాలు గోదామాత యొక్క మధుర భక్తి ప్రకటనంగా మనకి తదనంతర కాలంలో అందించబడ్డవి. అవి తమిళ భాషలో రచింపబడినవి. ధనుర్మాసంలో (సూర్యుడు ధనస్సు రాశిలోకి చేరిన మరునాటినుండి మకర సంక్రాంతి వరకు) తెల్లవారుఝామున విష్ణు ఆరాధన, శివాభిషేకం తులసి పూజ, గోపూజ విధించబడ్డాయి. చలిని తట్టుకోలేని ఆర్తులకు అగ్నిదానం, వస్త్ర కంబళి దానం విధింపబడ్డాయి. 

ఈ మాసంలో ద్రవిడ దేశంలో తిరుప్పావై (విష్ణు సంబంధం) - తిరువెంబావై (శివ సంబంధం) తమిళ స్తోత్రాలు పఠిస్తారు. వైష్ణవ సాంప్రదాయంలో పూర్వాచార్యులవల్ల ముఖ్యంగా దక్షిణ భారతంలో ఎక్కువగా దేవభాషకన్నా తమిళ ప్రభావం తీవ్రంగా ఉన్నకారణాన ఈ ప్రాంతాల్లోని వైష్ణవాలయాల్లో తిరుప్పావై ప్రాభవం ఎక్కువ. ఐతే తిరుప్పావై రచించిన కాలానికి మునుపే ఈ ధనుర్మాస వ్రతం ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తున్నది. ఈ కాలంలో విష్ణు పురాణం, భాగవతం, ఇతర పురాణాలు పారాయణ చేయాలని బ్రహ్మగారు నారదునిద్వారా బోధించారు.

ఈ ధనుర్మాసంలో ఐదు నాణేల ఎత్తు విష్ణుమూర్తిని స్థాపించి ఈ నెలంతా అభిషేకార్చనాదులు పంచామృతాలు తులసీ జాతి పుష్పాలతో నిర్వహించి మిరియాలు, పెసరపప్పు, లవణం బియ్యం కలిపి వండిన పొంగలి, ఆవుపాలతోచేసిన పాయసం, దధ్యోదనం నివేదన చేయాలి. ఈ వ్రతం ఆచరించేవారు విష్ణుపూజతోపాటు తులసి పూజ, గోపూజ నిర్వహించాలి. చివరి రోజున ఆ మూర్తిని భోజన దక్షిణ తాంబూలాదుల సహితంగా పురోహితునికి గానీ సద్బ్రాహ్మణుకిగాని ఇచ్చి ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి. 

ఈ మాసంలోనే తెల్లవారు ఝామున 3 గంటల ప్రాంతంలో శివాభిషేకం అద్భుతంగా చేస్తారు అతి ముఖ్యంగా ఆర్ద్రా నక్షత్రం ఉన్నరోజు మరింత శోభాయమానంగా నిర్వహిస్తారు శివాలయాల్లో.

వ్యాసపూజ చేయకపోతే ఈ వ్రతం నిష్ఫలం
----------------------------------------------------
ఈ ధనుర్మాసంలో ఒకసారైనా వ్యాసపూజ చేయాలి, వ్యాసపూజ చేయకపోతే ఈ ధనుర్మాస వ్రతం నిష్ఫలమని చతుర్ముఖబ్రహ్మ నారదునికి ధనుర్మాస వైశిష్ఠ్యంలో చెప్పారు.

సర్వం శ్రీ రంగరాజ - శ్రీ నటరాజ పాదారవిందార్పణమస్తు

- శంకరకింకర

Friday, December 14, 2018

స్థాయి బేధాల గురించి..

స్థాయి బేధాల గురించి మాట్లాడేవాళ్లని చాలామందిని చూస్తుంటాం... (నాలాంటి టుమ్రీలైతే బోల్డుమంది). నిజానికి ఆ స్థాయి ఈ స్థాయి అని బేధాలు మాట్లాడే ఎవరుకూడా అసలు చేరవలసిన స్థాయిని చేరకుండా ఉన్నవారే. నూటికి తొంభైమందికి అసలు విషయంలో ప్రవేశమే ఉండదు కానీ ఈ కవిత స్థాయి కాదండీ ఆ పాట ఈ స్థాయి కాదండీ ఈనకి పూజలో అంత స్థాయి లేదండీ అంటూ అతిఎక్కువగా విషయ పరిజ్ఞానంలేనివారే మాట్లాడేస్తారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక విద్యలలో ఇది ఎక్కువ. అసలు ఆంతర స్థాయి ఎవరికి తెలుస్తుంది? "ఆధ్యాత్మ విద్యలలో ఎవరి స్థాయి ఏంటి అనేది పరసంవేద్యం కానేకాదు అది స్వసంవేద్యం". అది తెలిసినవారు స్థాయీ బేధాలగురించి మాట్లాడరు. మాట్లాడుతున్నారంటే తరణం సంగతి దేవుడెరుగు ఒడ్డున ఇసకలో గవ్వలేరుకుంటున్నవారే... పైన చెప్పినట్లు నాతో సహా!

-శంకరకింకర

Tuesday, December 11, 2018

తపోజలాలను

తపో జలాలను సిరాగ మార్చి
పదునెక్కిన మనో కలాన్ని ముంచి వ్రాస్తానొక శాసనం!

ధర్మపరుల ఆలోచనలనావాహన చేస్తూ
ఉపాసకుల ఊపిరులతొ కొత్త శ్వాస తీస్తున్నా!

దృశ్యమే తామైన సమాధి స్థితి పొందిన ద్రష్టల దృష్టిని కోరుతు ఉన్నా!

మాటల చేతల అంతరాలనూ
చండీసింహపు గర్జనలతో ప్రశ్నిస్తున్నా!

శివపార్వతుల తాండవ కేళీ
విలాస సాక్ష్యమై కాలి అందెగా సత్యాన్నై నిలుస్తున్నా!

-శంకరకింకర (10-01-2018)

భవాని త్వం... భవానిత్వం



దేశిక పాద స్మరణం!

ఆ జగజ్జనని అనుగ్రహంలేనివారు ఎంతటి నీచ కార్యములను చేయడానికైనా వెనుకాడరు. గురు స్త్రీ బాల వృద్ధులనే బేధం లేకుండా అష్టాదశ వ్యసనాలయందూ మునిగి తేలుతుంటారు. అష్టాదశ వ్యసనాలేవి అంటే మహానుభావుడైన మహర్షి మనువు ధర్మ సూత్రాలలో వీటి గురించి చెప్పి ప్రతి మనిషి ప్రయత్న పూర్వకంగా విసర్జించి దూరంగా ఉండాలని జాగ్రత్త చెప్పారు.

మృగయాక్షో దివాస్వాపః పరివాదస్త్రియోమదః
తౌర్యత్రికం వృధాట్యాచ కామజో దశకోగణః
పైశున్యం సాహసం ద్రోహ ఈర్ష్యాసూయార్ధ దూషణేః
వాగ్దండనంచ పారుష్యమ్ క్రోధజోఽపి గణోఽష్టకః (మనుస్మృతి)


వేటాడడం, జూదం, పగలు నిద్రించడం, నిందాలాపనలు చేయడం, స్త్రీలౌల్యం, గర్వం, దుష్టమైన ఆలోచనలను రేకిత్తించు నృత్య , గీత, వాద్యములందు విపరీతమైన ఆసక్తి, పని పాట లేక తిరుగుచుండుట-ఈ పది కామజనక వ్యసనములు.

చాడీలు చెప్పుట, దుస్సాహసము, సాధుజనులపై ద్రోహచింత, పరుల కీర్తిని చూసి అసహనము ఓర్వలేని తనము కలిగియుండుట, ఇతరుల గుణములందుదోషములు ఆరోపించి చులకన చేయుట తద్వారా కీర్తి హననము , నీచముగా కఠినముగా మాట్లాడుట అను ఈ ఎనిమిది క్రోధజములైన వ్యసనములు.

పై వ్యసనాలు ఎవరియందైనా స్పష్టంగా ప్రకటంగా కనిపిస్తున్నాయంటే దానర్థం ఆ జగజ్జనని యొక్క అనుగ్రహానికి అటువంటి వ్యక్తులు పాత్రులు కారు అని మనకు సప్తశతీత్యాదిగా అమ్మవారి స్తుతులలో తెలుస్తున్నది.

ధర్మ్యాణి దేవి సకలాని సదైవ కర్మా- ణ్యత్యాదృతః ప్రతిదినం సుకృతీ కరోతి !
స్వర్గం ప్రయాతి చ తతో భవతీప్రసాదా- ల్లోకత్రయేఽపి ఫలదా నను దేవి తేన!!

అమ్మా ధర్మ కార్యాలను ఎవరు చేయగలరో తెలుసా, నీ దయ ఉన్నవాడు, నువ్వు ఎవరిని అనుగ్రహిస్తావో ఆ వ్యక్తి మాత్రమే దైవీ గుణ సంపత్తిని పెంచుకొని, ధర్మ కార్యములను నిర్వర్తించగలడు. నీ అనుగ్రహం ఉన్నవారే సుకృతములను చేయగలరు. అనగా, అనుగ్రహం లేనివారు దుష్కృత్యములను నిర్వహిస్తూ, పర ధనయశోకాంతలనాశిస్తూ వివేక హీనుడై, ధర్మ హీనుడై ప్రవర్తిస్తాడు. ఏ వ్యక్తి యైనా , అధార్మికమైన కార్యం చేస్తున్నాడు, స్త్రీబాలవృద్ధసాధుభక్తజనులలో ఏ ఒక్కరి గురించి చెడు ఆలోచన చేస్తున్నా దానికి తాత్పర్యం ఆ వ్యక్తికి జగజ్జనని అనుగ్రహం లోపించింది అని గుర్తు. ఎవరైతే నీ అనుగ్రహాన్ని పొందడం వల్ల దైవీ గుణసంపన్నులై మంచిని పెంచి పంచుతారో, అందరినీ ఆదరిస్తారో అటువంటివారు స్వర్గాది త్రిలోకములే కాదు నీ చరణ సీమనే పొందెదరు.


దుర్గే స్మృతా హరసి భీతిమశేషజన్తోః స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి!
దారిద్ర్యదుఃఖభయహారిణి కా త్వదన్యా సర్వోపకారకరణాయ సదాఽఽర్ద్రచిత్తా!!

అమ్మా, నీ భక్తుల సంకటములెల్లను పోగొట్టి నిన్ను సదా తలిచి నిలిచేవారికి భయాన్ని, బాదను తొలగించి స్వస్థతను చేకూర్చెదవు. అలాంటి వారికి మరింత మంచి బుద్ధిని కటాక్షించి నీ మార్గమునుండి మరలని స్థిరబుద్ధిని ప్రసాదించెదవు.  నీవు ఎలాంటి వారికైనా మంచి చేయాలనే తలపు గలదానవు, కానన్జేశి నీ భక్తులకు గూడా భవాని త్వం... భవానిత్వం గామారి అటువంటి లక్షణములే అలవడి అపకారులను కూడ ఉపేక్షించి ఉపకారమే చేయుదురు. నీ అనుగ్రహ వృష్టిచే దారిద్ర్య దుఃఖాలను తాపార్తిని హరించడంలో నీకన్నా పణ్డితులెవరున్నారు లోకంలో అని నీదరి చేరిన వారిని అక్కున చేర్చుకుందువు. సత్యము సత్యము సత్యము.

- శంకరకింకర






Saturday, November 17, 2018

ధీరుడెప్పుడూ స్వశక్తిపైనే నిలబడతాడు


శ్రీగురుభ్యోనమః

శ్రీరాముడికన్నా అవమానం పొందినవారూ, కష్టపడ్డవారూ లేరు. ఆఖరికి వెలివేయబడి నలుగురు మంత్రులతో కలిసి కాలం వెళ్ళదీస్తున్న వానర నాయకుడు సుగ్రీవుడు కూడా శ్రీరాముని పరాక్రమానికి ప్రజ్ఞకి పరీక్ష పెట్టాడూ. అది నాస్థాయి కాదని అలగలేదు, రాముడు. రావణుడైతే మరీ ఘోరంగా పిరికివాడు, మనికిమాలిన రాముడన్నాడు  నీ ప్రజ్ఞ, నీ విశేషం, నీ ప్రతిభ, నీ నేర్పరితనం లోకులెరగకపోవచ్చు, తెలియక నిన్ను తక్కువగా ఎంచవచ్చు నిర్లిప్తత పొందక, ఓ నవ్వు నవ్వుకుని, నిన్ను నువ్వు మెఱుగు పెట్టుకునే అవకాశంగా తీసుకో..  గుర్తింపు కతీతంగా ధీరుడెప్పుడూ స్వశక్తిపైనే నిలబడతాడు, మార్గదర్శకుడౌతాడు.

-శంకరకింకర


Thursday, October 25, 2018

'ప్రజాస్వామ్యం' మూలం 'జన వాక్యంతు కర్తవ్యం' అనే సూక్తి


ప్రజలయొక్క, ప్రజలచేత, ప్రజలకోసం పాలించే పాలనయే ప్రజాస్వామ్యం - జన వాక్యంతు కర్తవ్యం. జనుల యొక్క మాటలు, నిర్ణయాలను కర్తవ్యంగా భావించి పాలించడం.

ప్రజాస్వామ్యం మూలం 'జన వాక్యంతు కర్తవ్యం' అనే సూక్తి. రాముడలా పాలించాడు, ప్రజాస్వామ్యానికి నాంది అదే, ప్రజలొద్దన్నదే నిర్ణయించే ప్రభుత్వ పాలకులు, నిర్ణయాధికారులున్నారంటే అది నియంతృత్వం. ప్రజాస్వామ్యం కాదు, 'ప్రజాస్వామ్యం' సెక్యులర్స్ పేరిట అల్పసంఖ్యాక వర్గాలు చేస్తున్న దాడిలో అంపశయ్యపై ఉన్నది.

ఇప్పటి ధర్మం "మైనారిటీ జన వాక్యం తు కర్తవ్యం" మైనారిటీ (అల్పసంఖ్యాక వర్గాలు) అంటే అల్ప సంఖ్యాకులైన నాస్తికులు, ప్రధాన జనస్రవంతి పాటించే మత ద్వేషులు, పరిపాలనలోనూ, అధికారాలలోనూ, న్యాయశాలలోనూ ఉన్న కొందరు అల్పమతులు!


-శంకరకింకర


Thursday, October 4, 2018

పూజ, అభిషేకం, నీ భజనలు పారాయణలు ట్రాష్ అని ఏ జ్ఞానీ, పండిన ఏ పండితుడూ చెప్పడు


పరమాత్మనాశ్రయించిన గజేంద్రుడు గొప్పవాడుకాడా? స్తోత్రం చేయలేదా భగవానుడు రక్షించలేదా?

శ్రీకృష్ణుణ్ణాశ్రయించి రాజ్యం బడసిన పాండవులు గొప్పవారు కారా? పూజించలేదా భగవానుడు రక్షించలేదా?
-------------++

శ్రీగురుభ్యోనమః

చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున !
ఆర్తో జిజ్ఞాసురర్థార్టీ జ్ఞానీ చ భరతర్షభ !!
అర్జునా! ఆపదలో ఉన్నవారు, ధనాన్ని కోరుకునేవారు, నన్ను తెలుసుకోగోరేవారు, జ్ఞాని అనే ఈ నాలుగు రకములవారూ నన్ను భజిస్తారు.

ఈ శ్లోకం అనంతరం ఇందులో నాకు జ్ఞాని, జ్ఞానికి నేను ఇష్టులం అని చెప్పారు పరమాత్మ. సరే అసలు విషయానికొస్తే, స్వయం పరమాత్మయే ఆయనను పూజించేవారు/ కీర్తించేవారు/స్తుతించేవారి/ సేవించేవారు నాలుగురకాలు అని ఒప్పుకున్నారు. కాదనడానికి మనమెవరం?  స్థాయీ బేధాలున్నాయని భగవానుడే చెప్పినపుడు, ఠాఠ్ మిగతా ముగ్గురూ వేష్ట్ జ్ఞానమున్నవాళ్ళే బెస్ట్ అని చెప్పడానికి కాదు జ్ఞానం ప్రోది చేసుకునేది.

కొత్త కొత్త మాటలు వినబడుతున్నాయ్ భగవంతుడు స్తోత్రప్రియుడుకాడు, పూజాప్రియుడుకాడు ఇత్యాది ఇత్యాది... అది అహంకారాజ్ఞానజనితమైన మాట అని భగవంతుని మాటల సారంగా ఎరగవచ్చు.

Ø పరమాత్మనాశ్రయించిన గజేంద్రుడు గొప్పవాడుకాడా? స్తోత్రం చేయలేదా భగవానుడు రక్షించలేదా?

Ø శ్రీకృష్ణుణ్ణాశ్రయించి రాజ్యం బడసిన పాండవులు గొప్పవారు కారా? పూజించలేదా భగవానుడు రక్షించలేదా?

Ø ధ్రువ ప్రహ్లాదాదులు గొప్పవారు కారా? సర్వత్ర సమభావన చూపి రాజ్యాదులు పొంది భగవంతుని తెలుసుకోలేదా?

Ø జ్ఞానులైన నారద మైత్రేయ విదురాదులు పైవారినెప్పుడైనా తక్కువగా చూశారా? మా భక్తియే భక్తి మీవికావన్నారా?
 
అలా కానే కాదు, అలా తేడా చూపడం కుదరదు. పండిన జ్ఞానం ఉన్నప్పుడు ఔదార్యం ఇనుమడించాలి.

న బుద్ధిభేధం జనయేదజ్ఞానాం కర్మసఙ్గినామ్!
జోషయేత్సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్!!
కర్మలయందాసక్తిని కలిగియున్నవారి బుద్ధిని పండితుడు/జ్ఞాని చెదర కొట్టరాదు. తాను జ్ఞానమార్గంలో నిలిచి, ఆమార్గంలో  చక్కగా కర్మలనాచరిస్తూ, కర్మాసక్తులైన వాళ్ళని ఆ మార్గాన్ని అనుసరించి కర్మలాచరించేలా ప్రోత్సహించాలి.

పైవిధంగా భగవానుడే చెప్పాడు. నువ్వు చేసే పత్రి పూజ ట్రాష్, నువ్వు చేసే అభిషేకం ట్రాష్, నీ భజనలు పారాయణలు ట్రాష్ అని ఏ జ్ఞానీ, పండిన ఏ పండితుడూ చెప్పడు , భగవంతుడంతకన్నా చెప్పడు. సగం సగం జ్ఞానం ఉంటేనే మిడిసిపాటు తొట్రుపాటు అది పామర జనానికి గ్రహపాటు.
 

మేము సామూహికంగా పారాయణ చేస్తున్నామండీ. సంతోషం ఈఈ జాగ్రత్తలు తీస్కుని ఇలా పారాయణ చేయండి. ఫలానా అభిషేకం అండీ, ఓహ్ అద్భుతం, ఆయా ద్రవ్యాలను చక్కగావాడి ఈ విధంలో వినియోగించి చక్కగా అభిషేకించండి, ఫలానా పత్రి పూజండి, రొట్టలు తెచ్చి వేయకండి, ఇదిగో ఈఈ రకంగా సేకరించి తెచ్చి చేయండి సమాజంలో కలిసి మెలిసి చేయీ చేయీ పట్టుకుని ప్రస్థానం సాగించండి అని మార్గదర్శనం చేస్తారు విజ్ఞులు. అంతే తప్ప ఠాఠ్ ఎవడు చెప్పాడు, ఒక్కడివీ పూజ చెయ్, ఒక్కడివీ భజన చెయ్ ఇవి తాలుధాన్యం మాటలు.
 

సాధన క్రమంలో ఒక్కడుగా సాధించలేనివి సంగంతో పదిమందితో కలిసి సాధిస్తాడు. పోను పోనూ ఏకాంతతపై అనురక్తి కలుగుతుంది ఒక్కోమెట్టూ ఎక్కుతాడు. అంతే తప్ప పై అంతస్థులలో ఉన్నవాడు కిందున్నవాణ్ణి చూసి గేలి చేస్తే ఆ వ్యక్తిని అవివేకి అనే అంటారనడంలో సందేహంలేదు!

పండిన జ్ఞానానికి గుర్తు నీలో లోకులపై పెరిగిన ఔదార్యం, ప్రేమ. అంతేకాని హేళన లోకువ కాదు!

-శంకరకింకర

Wednesday, October 3, 2018

మా అమ్మ నాన్నంటే నాకు గౌరవభక్తిప్రపత్తులు, వాళ్ళు చెప్పిన మాట వినను

నేనుః- "మా అమ్మ నాన్నంటే నాకు గౌరవభక్తిప్రపత్తులు అమితమైన ప్రేమ, వాళ్ళు చెప్పిన మాట వినను, వాళ్లు వద్దన్న పని చేస్తాను, వాళ్లు చెప్పిన మాటవినడం బాటలో నడవడం అంటే నాకు వ్యక్తిత్వం లేకపోవడం, వాళ్ళు చెప్పిన కట్టుబాట్లకి లొంగడం ఓ బానిసత్వం, అది వాళ్ళకి నాపై ఉన్న వివక్ష". ......

అది విన్న ఓ విజ్ఞుడు నన్ను చూసిః- "నీ బొందరారేయ్ నీ బొందరా అవివేకీ...!!"

:D

similarly, I believe in God, but I don't believe in what is taught by him or through rishis, the rules framed by him or through risihs, I do on my own...  :D LoL
:D :D



restriction of access to certain things is to protect and is not a discrimination. Allowing everyone is just purely, lack of understanding n heights os stupidity.

Friday, September 28, 2018

శంబుక వధ (శంబూక వధ) ప్రామాణికత విచారణ


శ్రీ గురుభ్యోనమః

శ్రీరాముడు శంబుకుణ్ణి వధించాడా? అది ప్రక్షిప్తమా లేక నిజమా ? అసలు త్రేతాయుగంలో శ్రీరామాయణ కాలంలో శూద్రులు తపస్సు చేయుట నింద్యమా లేక శ్రీరాముని ప్రాభవాన్ని తగ్గించడానికి జరిగిన సాహిత్య సంకరంలో భాగమా? ఎవరికి వారు ఈ విశేషాలను చదువుకొని శ్రీ రామాయణం సాంతం చదివి వాల్మీకి హృదయాన్ని, శ్రీరాముని నడతను పరిశీలించి తెలుసుకోదగును.


శ్రీ రామాయణం అయోధ్య కాండ 63-64 సర్గలు

దశరథుని వలన పొరపాటున మరణించిన మునికుమారుడు (శ్రవణ కుమారుడు)

కడవలో నీటిని నింపుతున్నది ముని బాలకుడని తెలియక ఏనుగు నీరు తాగుతున్నదనుకొని చూడకుండా శబ్దబేధి ద్వారా బాణాన్ని దశరథుడు సంధిస్తాడు. దశరథుడు వేసిన బాణము ఆ ముని బాలకుని శరీరంలో దిగి ప్రాణములను పోనీయక అడ్డుపడి భయంకరమైన వ్యథకు గురిచేయుచుండగా, ఆ ముని బాలకుడు దశరథుని ఈ బాణం ములుకు మర్మావయవములు బాధించుచు ప్రాణము పోకుండా అడ్డు పడుతున్నది కాబట్టి బాణం తీసి వేయమని కోరతాడు. బాణం తీస్తే మునిబాలకుడు చనిపోతాడు తీయకపోతే బాధతో విలవిలలాడతున్నాడు పైగా తాపసి, ముని బాలకుడు అని సంశయిస్తూ దుఃఖిస్తుండగా, అతి కష్టంమీద మరణమంచున నున్న ఆ ముని బాలకుడు బలాన్ని ప్రొది చేసుకొని ఇలా చెప్తాడు.

సంస్తభ్య శోకం ధైర్యేణ స్థిరచిత్తో భవామ్యహమ్,
బ్రహ్మ హత్యాకృతం పాపం హృదయాదపనీయతామ్

నద్విజాతిరహం రాజన్ మా భూత్తే మనసో వ్యథా,
శూద్రాయామాస్మి వైశ్యేన జాతో జనపదాధిప!

నేను ధైర్యముతో మృత్యు శోకాన్ని  దిగమింగి అణగద్రొక్కి స్థిరచిత్తుడనౌతున్నాను. నీవు బ్రహ్మహత్యాపాతకము చేసానేమో అని భయపడకుము.  ఓ రాజా! నేను ద్విజుడను కాను, నీవు మనస్సులో బాధపడకు. నేను శూద్రస్త్రీయందు జన్మించిన వాడను. కాబట్టి ఈ బాణముని తొలగించి నాబాధను తీర్చు అని చెప్తాడు. అప్పుడు దశరథుడు ఆ బాణం ములుకు తీయగా ఆ తపోధనుడైన మునిబాలకుడు దశరథుని వైపు చూస్తూ ప్రాణాలు విడుస్తాడు.

ఆ విషయం దశరథుడు వెళ్ళి ఆ ముని బాలకుల తల్లిదండ్రులకి విన్నవించి మన్నింపు కోరి ఏం చేయాలో ఆజ్ఞాపించమని అడుగుతాడు. అప్పుడు ఆమునీశ్వరుడి మాటలు..

సప్తధా తు ఫలేన్మూర్థా మునౌ తపసి తిష్ఠతి,
జ్ఞానాద్విసృజతః శస్త్రం తాదృశే బ్రహ్మచారిణే!

తపస్సులోనున్న మునిపైగాని, అట్టి బ్రహ్మచారిపైగాని తెలిసి ఆయుధాన్ని ప్రయోగించినవాని శిరస్సు ఏడుముక్కలౌతుంది.  నువ్వు తెలియక చేసావు కాబట్టి ఇంకా బ్రతికి ఉన్నావు. లేకపోతే నువ్వేమిటి నీ ఇక్ష్వాకు వంశమే నశించేది. ఆ తరవాత ఆ మునిబాలకుడు (నద్విజుడు) బ్రతికుండగా తల్లిదండ్రులకు అగ్నికార్యములో సహకరించుట, వేదవాఙ్మయము పారాయణ చేసి వినిపించుట, తపస్సుకు సహకరించుట ఇట్లా అన్ని విషయాలు ఆ తాపసి జంట  వివరించి, దశరథునిపై కోపగించి పుత్రశోకంతోనే మరణిస్తావని శాపమిస్తారు. ఇక్కడ ఆ తాపసి జంట అంటే వైశ్య పురుషుడు, శూద్ర స్త్రీ ఇద్దరూ తపస్సు చేస్తున్నవారే.

---------------
దీన్నిబట్టి ఆకాలంలో శూద్రులే కాదు, స్త్రీలూ, శూద్ర స్త్రీలు, వర్ణసంకరమున జనించినవారు కూడా ముని వృత్తినవలింబించారనీ, తాపసులైనారనీ తెలుస్తున్నది. ఆ కాలంలో శూద్రులకు తపస్సు లేదన్న విషయము ప్రక్షిప్తము, పైగా తాపసిని తెలిసి తెలిసి సంహరిస్తే లేదా ఆయుధమెత్తితే తల ఏడు ముక్కలౌతుందని స్పష్టంగా చెప్పబడింది. అంతే కాదు తెలిసి తెలిసి అలాంటి పని చేస్తే తానేకాదు వంశం మొత్తం నాశనమౌతుందని తాపసి వాక్కు.

తన తండ్రికాలంలోనే అలా జరిగిన సందర్భమున్న సమయంలో అటువంటి ముని శ్రేష్టులు నివసిస్తున్న రాజ్యంలో రాముడు ఇలాంటి అకృత్యానికి ఒడిగడతాడా? బ్రాహ్మణులు,  రాజ గురువులకు ఆ కాలంలో ఇలా అందరూ తపస్సు చేసుకుంటూండేవారన్న ఈ విషయం తెలియదనుకోగలమా. అప్పుడు సమాజం కలిసే ఉంది అందరూ చక్కగా ధర్మవర్తనంతో నాలుగు వర్ణాల ధర్మాలనూ, నాలుగు ఆశ్రమ ధర్మాలనూ పాటించేవారు. తాపసులజోలికెవరూ వెళ్ళేవారు కారు. వారికుచితమైన గౌరవమున్నది.

స్వయం రాముడే అరణ్యకాండలో తాపసులకి రక్షణగా ఉండి వారినిబ్బందిపెట్టేవారిని దునుమాడుతానని ప్రతిజ్ఞచేసాడు. అలాంటి వాడు ఒక తాపసిని హతమార్చడం అసంభవం. నిజంగా హతమార్చి ఉంటే, ఆ ఘట్టంలోనే, దశరథుని చేతిలో హతమైన ముని కుమారుని తల్లిదండ్రులగు తాపసుల మాటల ప్రమాణంగా శ్రీరాముని తల ముక్కలయ్యేది ఇక్ష్వాకు వంశం నశించేది (శ్రీ రామా భద్రం తే!)

ఇక అరణ్యకాండ చూద్దాం... ‍6, 9 &10 సర్గలు

దణ్డకారణ్యంలో మునులు తమను రాక్షసుల బారినుండి రక్షించమని కోరితే, తాపసులు ఆజ్ఞాపించవలెను కానీ కోరకూడదు, తాపసులను ఇబ్బంది పెట్టే రాక్షసులను నేనూ నా తమ్ముడూ సంహరించి వారిని కాపాడెదము అని ప్రమాణం చేస్తాడు (6)

సీతమ్మ రామునితో నీ ఇంద్రియాలు నీ అధీనంలోనే ఉన్నవి అని తెలుసు, కానీ ఏ వైరమూ లేకుండానే దణ్డకారణ్యంలో ఉన్న ఋషుల రక్షణ కొరకై వారినిబ్బందిపెట్టురాక్షసులను మనకు ప్రత్యక్షంగా ఏ అపకారమూ చేయకున్నా దునుముతానని ప్రతిజ్ఞ చేసావు అని తన బెంగను వ్యక్త పరుస్తుంది. (9) 

అప్పుడు శ్రీరాముడు తాను దండకారణ్యములోని ఋషులకి ఇచ్చిన మాటను చెప్పి, నేను ఇక్కడి తాపసులను నాపాలనలో రక్షించి తీరుతాను దీనికి వ్యతిరేకంగా చేయలేను. నాలో ప్రాణం ఉన్నంతవరకూ ఇచ్చిన మాటకే కట్టుబడి తాపసులను రక్షిస్తాను తప్ప దానికి వ్యతిరేకంగా ప్రవర్తించను.

సీతా! విను, 
తదవశ్యం మయా కార్యమృషీణాం పరిపాలనమ్, 
అనుక్తేనాపి వైదేహి ప్రతిజ్ఞాయ తు కిం పునః. 
ఋషులు, తాపసులు అడగకపోయినా వారిని రక్షించి పరిపాలనము చేయవలెను, ఇక ప్రతిజ్ఞ చేసిన నేను అందుకు వ్యతిరిక్తముగా చేయగలనా అని పలుకుతాడు. (10)
(శంకరకింకర)

సరే, మరో దృష్టాంతం చూద్దాం, అరణ్యకాండలోనే 73, 74 సర్గలు

కబంధుడు మతంగముని ఆశ్రమము గురించి చెప్పుచూ అందరూ ఊర్ధ్వలోకాలకేగారు వాళ్ళ పరిచారిణి, శ్రమణి (సన్యాసిని, తపస్విని) ఐన శబరి నీకు ఆతిథ్యమివ్వగలదు అని చెప్తాడు. శాబర జాతికి చెందిన స్త్రీ మతంగ మునిని,  సేవించి ఆయన పరివారంతో కలిసి తపస్సు చేసి సిద్ధిపొందుటకు శ్రీ రాముని దర్శనానికై ఎదురుచూస్తుంటుంది. శ్రీరాముడు,  శబరిని కలిసినప్పుడు, ఆతిథ్యం స్వీకరించిన సమయంలో వారి సంభాషణ చూద్దాం!

పాద్యమాచమనీయం చ సర్వం ప్రాదాద్యథావిధి,
తామువాచ తతో రామః శ్రమణీం సంశితవ్రతామ్!
కచ్చిత్తే నిర్జితా విఘ్నాః కచ్చిత్తే వర్ధతే తపః,
కచ్చిత్తే నియతః క్రోధ ఆహారశ్చ తపోధనే!
కచ్చిత్తే నియమాః ప్రాప్తాః కచ్చిత్తే మనసః సుఖమ్,
కచ్చిత్తే గురుశుశ్రూషా సఫలా చారుభాషిణి!!

శబరి ఇచ్చిన పాద్యాచమనాదులు యథాశాస్త్రంగా స్వీకరించిన తరవాత, రాముడు తీవ్రమైన వ్రతనియములు పాటించుచూ, "తపస్సు చేయుచున్న ఆ తపస్విని", సన్యాసిని ఐన  శబరి (శాబర స్త్రీ) తో మాట్లాడుతూ " ఓ తాపసురాలా!  నీ తపస్సునకు విఘ్నములేవీ కలుగుటలేవు కదా? నీ తపస్సు వృద్ధి పొందుతున్నదా? నీవు క్రోధమును నిగ్రహించుకొన్నావు కదా? ఆహార నియమాదులందు కూడా నిగ్రహము పొందినావు కదా? చక్కగా మాట్లాడే ఓ శబరీ! నీవు కృచ్చచాంద్రాయణాది నియమములన్నీ పూర్తి చేసుకొన్నావా? నీ మనస్సుకు సుఖము కలిగినదా? నీవు చేసిన గురు శుశ్రూష సఫలమైందా?" అని అడగగా ప్రత్యుత్తరము ఇస్తూన శబరి మాటలు శబరి గురించి మూలంలో ఇలా ఉన్నవి...

రామేణ తాపసీ పృష్టా సా సిద్ధా సిద్ధసంమతా
శశంస శబరీ వృద్ధా రామాయ ప్రత్యవస్థితా!
అద్య ప్రాప్తా తపఃసిద్ధిస్తవ సందర్శనాన్మయా
అద్యమే సఫలం తప్తం గురవశ్చ సుపూజితాః!

తపస్సంపన్నురాలు, తపస్సిద్ధి పొందినది , తపస్సిద్ధిసంపన్నుల గౌరవము పొందినది, వృద్ధురాలు ఐన ఆ శాబర స్త్రీ రాముని మాటలు విని అతని ముందు నిల్చొని,  ఈనాడు నేను చేసిన తపస్సు సిద్ధిపొందినది, నేను చేసిన గురు శుశ్రూష కూడా సఫలములైనవి అని బదులిస్తుంది.

------------

సత్యవాక్పాలకుడైన శ్రీరాముడు, దణ్డకారణ్యంలో ఉండే అందరు ఋషులు తాపసులను రక్షిస్తానని, వారడగకుండానే వారిని రక్షించవలెనని కానీ ప్రతిజ్ఞాబద్ధుడైనందున తాపసులను రక్షించుట అను విషయమునుండి వెనుకకు మరలననీ రాముడు ఒకటీకి రెండూమాట్లు చెప్తాడు అది రాముని స్వభావం.

అలానే, అరణ్య కాండ చివర్లో మతంగముని ఆశ్రమంలో ఉండే సేవకురాలు, శాబరజాతి స్త్రీ ఐన శబరి సన్యాసియై తాపసియై గురుశుశ్రూష చేసి, తోటి తపస్వులచేత కలిసి ఎన్నియో వ్రతములు, తపస్సులు చేసి సిద్ధిపొందినది, ఆమె క్షేమమును, ఆమె తపస్సిద్ధిని విచారించి ఆతిథ్యం స్వీకరించిన శ్రీ రాముడు తపస్సు కొన్ని వర్ణాలవారికే పరిమితము కొన్ని వర్ణాలవారు తపస్సు చేయరాదు అను నిర్ణయమును అంగీకరించి అమలు పరచునా? లేక మతంగ ముని మరియు ఆయన ఆశ్రమములో ఉండు ఇతర మహర్షులందరూ దణ్డకారణ్యములో ఇతర ఋషులు కొన్ని వర్ణాలవారే తపస్సు చేయవలెనని నిర్ణయించగలరా. నిర్ణయించిన శబరి ఆసమయములో తపస్వినియై శ్రమణియై ఎట్లు జీవనము కొనసాగించగలదు?


ఈ విషయములు విచారణ చేస్తే, శ్రీ రాముడు తరువాతి కాలంలో దణ్డకారణ్యంలో చెట్టుకు వేలాడి తపస్సు చేస్తున్న తాపసిని ఖడ్గ ప్రహారం చేసి చంపెను అని అనడం కానీ, తమను రాక్షసులనుండి రక్షించమని కోరుకున్న బ్రహ్మర్షియైన వశిష్ఠుడు, ఇతర ఋషులు, బ్రాహ్మణులు మరొక తాపసిని చంపమని చెప్పడం కానీ కుదిరే పనేనా?  దాన్ని రాముడంగీకరించునా.  రామాయణాన్ని చిన్నబుచ్చితే, రాముణ్ణి చిన్నబుచ్చితే బ్రాహ్మణులను, బ్రాహ్మణ్యాన్ని చిన్నబుచ్చడమనే సంకుచిత భావంతో రామాయణ ద్వేషంతో , వైదిక ధర్మ ద్వేషంతో చేర్చిన ప్రక్షిప్త గాథ అని తెలియడంలేదూ! అదేదో బ్రాహ్మణులు రాముణ్ణి నిలదీసినట్లూ, అదీ తాపసి, బ్రహ్మర్షివశిష్ఠుడు ,  ఒక శూద్రుడు తపస్సు చేస్తుంటే చంపమంటాడా? ఇది బ్రాహ్మణులకు, ఋషులకు అంటగట్టి, ఆపై శ్రీరాముడిచేత చంపించారు అని ప్రక్షిప్తం చేసి రామాయణం మీద, రాముడిమీద, బ్రాహ్మణవర్ణం మీద సనాతన ధర్మం మీద విషం కక్కడం ఎంత అమానుషం, ఎంత అవివేకం.

శ్రీ రామ జయం
బలం విష్ణోః ప్రవర్థతామ్ (౩)

(శంకరకింకర)