Pages

Wednesday, January 19, 2011

తోటకాష్టకం

విధితాఖిలశాస్త్రసుధాజలధే! మహితోపనిషత్ కథితార్థనిధే!
హృదయే కలయే విమలం చరణం! భవ శంకర దేశిక మే శరణమ్!!
కరుణావరుణాలయ పాలయ మాం! భవసాగరదుఃఖ విదూనహృదమ్!
రచయాఖిలదర్శనతత్త్వవిదం! భవ శంకర దేశిక మే శరణమ్!!
భవతా జనతా సుహితా భవితా! నిజబోధవిచారణ చారుమతే!
కలయేశ్వర జీవవివేక విదం! భవ శంకర దేశిక మే శరణమ్!!
భవ ఏవ భవానితి మే నితరాం! సమజాయత చేతసి కౌతుకితా!
మమ వారయ మోహమహాజలధిం! భవ శంకర దేశిక మే శరణమ్!!
సుకృతేధికృతే బహుధా భవతో !భవితా సమదర్శనలాలసతా!
అతిదీనమిమం పరిపాలయ మాం! భవ శంకర దేశిక మే శరణమ్!!
జగతీమవితుం కలితాకృతయో! విచరంతి మహామహసశ్ఛలతః!
అహిమాంశు రివాత్ర విభాసిగురో! భవ శంకర దేశిక మే శరణమ్!!
గురుపుంగవ పుంగవకేతన తే! సమతామయతాం నహి కో? సుధీ:!
శరణాగతవత్సల తత్త్వనిధే! భవ శంకర దేశిక మే శరణమ్!!
విదితా న మయా విశదైకకలా! న చ కించన కాంచనమస్తి గురో!
ద్రుతమేవ విధేహి కృపాం సహజాం! భవ శంకర దేశిక మే శరణమ్!!
ఈ స్తోత్రమును శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరభగవత్పాదుల శిష్యులు
శ్రీశ్రీశ్రీ తోటకాచార్యుల కృతము. వారి పూర్వ నామము "గిరి" తోటకవృత్తములో
ఈ స్తోత్రమును చేసినందుకు వారి పేరు తోటకాచార్యులుగా మారినదిఅని పెద్దలు
అంటారు. తోటక వృత్తంలో ప్రతి పాదము / వాక్యము నందు ౧౨ (12) అక్షరములు
ఉంటాయి.
- సూర్య నాగేంద్ర కుమార్ అయ్యగారి

Sunday, January 16, 2011

నేనెవరు?

శ్రీ గురుభ్యోనమః
సత్సంగం కుటుంబీకులందరికీ నమస్కారములతో….
ఈ క్రింది విషయాన్ని ఎవరికి వారు చదివి వారు వారు ఆలోచించుకోవడానికిగాను పెద్దలు చెప్పిన విషయాన్ని ఇక్కడ పొమ్దు పరచడం జరుగుతోంది ఇది ఒక అంతశ్చర్చలాగా సాగుతుంది.
నేను : నేనెవరు? నేను శరీరమా? శరీరము నాదా? ఒక వేళ శరీరము నేనైతే! ఈ శరీరము నాకు తెలియకుండా మారిపోతోంది ఎందుకు? ఒహొ ఐతే శరీరము నాది.
శరీరము : ఈ శరీరము నీదైతే నీకు తెలియకుండా మార్పులు ఎలా జరుగుతున్నాయి ? నీకు తెలియకుండా, నువ్వు చెప్పకుండా ఆకలి దప్పులు ఎలా కలుగుతున్నాయి ?
నేను: మా సైన్స్ చెప్పింది అది శరీరధర్మము అని, శరీరము నాదే
శరీరము: ఐతే ఇది ఎక్కడినుంచి వచ్చింది ?
నేను: మా తల్లి తండ్రుల వల్ల ఎప్పుడో పుట్టింది.
శరీరము: ఓహొ అవునా ? ఐతే, శరీరం మీ తల్లి తండ్రుల వల్ల వచ్చింది నీదెలా
అవుతుంది ?

నేను: అవును అవును, ఇది మాతల్లి తండ్రుల వల్ల వచ్చింది. అది వాళ్ళది.
నాదికాదు.

శరీరము: ఓహొ మరి అది శుక్లమిచ్చిన నీతండ్రిదా ? శోణితముతో కలిపి గర్భంలో
మోసిన తల్లిదా ?

నేను: …….
శరీరము: పాలిచ్చి పెంచిన తల్లిదా? పోషణ భారం వహించిన తండ్రిదా ?
నేను: ఆఁ….
శరీరము: సరే కొంత పెరిగాక, పశువులిచ్చే పాలు తాగి పెరిగావు. ఇది ఆ పశువులదా?
నేను: అయ్యబాబోయ్.. ఈ శరీరము నాదనుకుంటే దీనికి ఇంత మంది యజమానులు వస్తున్నారేంటి?
శరీరము: సరి, మరి భోజనాదులు, పళ్ళు ఫలాలు తిని కదా ఈ శరీరం మార్పు చెందింది అన్న వికారంగా? మరి ఇది ఆ మొక్కలు చెట్లది కాదా?
నేను: మళ్ళీ ఇదోటా ?
శరీరము: సరి, పెరిగి పెద్దవుతున్నప్పుడు విద్యాబుద్దులు నేర్పి, సంస్కారాలునేర్పి శరీరాన్ని నిలబెట్టిన గురువులది కాదా?
నేను: ఇంకా ఎంత మంది దీనికి యజమానులు ?
శరీరము: ఉద్యోగమిచ్చి, నీ జీవన గమనానికి గాను భత్యమిచ్చిన నీ యజమాని వల్లనే కదా దీనిని పోషించి రక్షించు కుంటున్నావు, మరి ఇది ఆయనది కాదా?
నేను: నేను ప్రతిఫలంగా పని చేస్తున్నానే !
శరీరము: అవునా మరి ఇటువంటి శరీరాలు కొన్ని కోట్లు భూమి మీద ఉన్నాయి, ఇది చేసే పనే వేరొకరు కూడా చేస్తున్నారు వారికి తక్కువ దీనికి ఎక్కువ భత్యం ఎందుకు?
నేను: సరే అదీ ఒప్పుకున్నాను, అయ్యిందా ఇంకెవరన్నా ఉన్నారా?
శరీరము: దీనికి ఇంకో శరీరంతో పెళ్ళి అయ్యింది? ఆ శరీరం దీని పోషణార్థమై కష్టపడిందా లేదా? దీన్ని సుఖపెట్టిందా లేదా? మరి దానిది కూడా కదా !
నేను: అవును
శరీరము: ఇది పడిపోయాక దీని అంత్యక్రియ జరిపేవాడొకడున్నాడు కదా! మరి ఇది వాడిది కాకపోతే దానినెందుకు అంత్యేష్టి పేర నాశనము చేస్తున్నాడు? ఐతే ఇది వానిది కూడా!
నేను: అర్థం అవుతోంది…
శరీరము: ఈ శరీరములోని పంచ భూతాలను తిరిగి పంచభూతాలలో కలుపుకునే పంచభూతాలదా కాదా
నేను: అవును ఇది అందరిదీ !
శరీరము: మరి అంత దానికి నాది నాది అని నన్ను (శరీరాన్ని) పట్టుకుని విర్రవీగుతావేం? ఇది ఆ పంచ భూతాలది కూడా కాదు వానిని కూడా సృష్టించి నిర్వహించే వాడున్నాడే వానిది. ఈ శరీరానికి ఇంత మంది యజమానులు లౌకికంగా ఉంటే అందరినీ సమానంగా మాతా పితృభావంతో చూడక ఎందుకు స్వార్థచింతనతో ఉంటావ్? ఇది నీది కానప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసి దానితో ఉత్తమమైన పనులు చేయించక, నీస్వార్థం కోసం వాడుకుంటావే? అలా చేస్తే నువ్వూ ఒక దొంగవేగా?
నేను: బోధ పడింది, ఓ శరీరమా, నేను ఎప్పుడూ నేను నేను అని చూపే నువ్వు నేను కాదు. నువ్వు నా మొదటి గురువువి, నా సంరక్షకుడివి. ఎల్లప్పుడూ నాతో ఉండి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పే గురు స్వరూపానివి. ఓ శరీరమా నా జీవన గమ్యంలో కలిగే మార్పులను పరమాత్మ తోడి నాసంబంధాన్ని ప్రకృతితోడి సంబంధాన్ని తెలిపే దానవు. నీవు నేను కాదు నేను నీవు కాదు, నువ్వు నాదానవు కాదు. నేను నీవాడను కాను. పరమాత్మ నాకిచ్చిన తొడుగువు నువ్వు, కానీ లేని పోని సిద్ధాంతాలతో నేనే నీవని భావించి అసలు నెనెవరినో నేనెవరివాణ్ణో మరిచిపోయాను. అశాశ్వతమైన నువ్వు (శరీరము) నేను కాదు, అఖండము, అనంతము, ఐన పరమాత్మకు చెందినవాడను

- శంకరకింకర