Pages

Friday, August 21, 2020

వినాయక వ్రతం సాయంత్రమే చేయాలా? చర్చ

 వినాయక చవితి నక్త వ్రతమా (అంటే సాయంత్రం నక్షత్రోదయంలో చేయవలసిన వ్రతమా  ? మరో ముఖ్య మీమాంసపై చర్చ

వ్రతంలొ చెప్పిన పురాణోక్త కథ ప్రకారం (వ్రతకల్పం) 


పూర్వపక్షం: - విశేషేణ "నక్తం" కుర్యాచ్చ తద్వ్రతమ్ .... అని స్కాందంలో ఉంది కాబట్టి ఇది నక్త వ్రతం సాయంత్రం నక్షత్రోదయ సమయంలో చేయాలి.


వివరణాత్మక చర్చ:


స్కాంద పురాణం ప్రకారం  చెప్పబడిన శ్యమంతకోపాఖ్యానం లో  "సదా కృష్ణపక్ష చతుర్థి వ్రతం - నక్త్ర వ్రతం" అంటే "సంకష్ట చతుర్థి వ్రతము నక్త వ్రతం" అని చెప్పబడింది


పితామహ ఉవాచ:- చతుర్థ్యాం దేవ దేవోఽసౌ పూజనీయస్సదైవ హి, కృష్ణపక్షే విశేషేణ "నక్తం" కుర్యాచ్చ తద్వ్రతమ్ అపూపైర్ఘృతసంయుక్తమ్......


భాద్రపద శుక్ల చతుర్థి నాటి వ్రతం గురించి చెప్తూ మృణ్మయ మూర్తిని బంగారు మూర్తిగా భావన చేసి పూజించమని చెప్పబడింది తప్ప ప్రత్యేకంగా నక్త వ్రతం అని చెప్పబడలేదు.


ఇక వ్రత కల్పంలో మూలము ముఖ్యమైనదైన భవిష్యోత్తర పురాణంలో వినాయ వ్రత కల్పంలో ఏం చెప్పారో చూద్దాం


శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఉపదేశిస్తున్న వ్రత విధానం:-

ప్రాతశ్శుద్ధతిలైస్నాత్వామధ్యాహ్నేపూజయేన్నృప, నిష్కమాత్రసువర్ణేన, తదర్థార్థేన వాపునః స్వశక్త్యా గణనాథస్య స్వర్ణరౌప్యమయం కృతం, అథవా మృణ్మయం కుర్యాద్విత్తశాఠ్యం నకారయేత్... 


పొద్దున్నే లేచి తెల్లనువ్వులు కలిపిన నీటితో స్నానం చేసి, మధ్యాహ్నం వరసిద్ధివినాయకుణ్ణి పూజించాలి. నిష్కమాత్రం బంగారం లేదా అందులో సగంతోమూర్తిని చేయాలి లేదా వెండితోనైనా
. ఈ రెండూ కుదరకుంటే మట్టితోనైనా చేయాలి. లోభం మాత్రం చూపకూడదు... అని ఇలా వ్రత విధానం మొత్తం ఉపదేశిస్తారు...

నిర్ణయ సింధు:-

యత్ర భాద్రశుక్ల చతుర్థ్యాదౌ గణేశవ్రత విశేషే మధ్యాహ్న పూజోక్తా...

సంకష్ట చతుర్థీతు చంద్రోదయ వ్యాపినీ గ్రాహ్యా....


భాద్రపద శుక్ల చతుర్థి శ్రీ వరసిద్ధివినాయక వ్రతమందు మధ్యాహ్న పూజ విశేషము

సంకష్ట చతుర్థి వ్రతమునకు చంద్రోదయము పూజాసమయము అని నిర్ణయసింధు స్మృతికారులచే సిద్ధం


నిర్ణయం:-

కాబట్టి ఇది నక్త వ్రతం కాదు, మధ్యాహ్నమే చేయవలసిన వ్రతం అని వ్రతకల్పం ప్రకారం సశాస్త్ర సిద్ధము.


(సాధారణ గృహస్థులందరికీ, స్మార్తులకూ ఇదే వర్తింపు)

-శంకరకింకర



21 పత్రాల ప్రమాణం - ముఖ్య విషయం

నమస్తే

21 పత్రాల ప్రమాణం - ముఖ్య విషయం.


వినాయకుడికి ఏయే పత్రాలతోపూజించాలి అన్న మీమాంసలో కొన్ని కొన్ని చోట్ల కొందరు కొందరు పెద్దలు కొన్ని సంప్రదాయాలలో చేసుకుంటున్న వ్రత విధానం ప్రకారం  రెండు మూడు పత్రాలలో వ్యత్యాసం ఉంది. ఐతే మరి మేము ఏవి వాడాలి ఏపత్రాలతో పూజించాలి. ప్రముఖంగా తులసిపత్రంపైన ఈ సందేహం ఎక్కువ. శైవ సంప్రదాయస్తులు ఒకానొక పురాణోక్త మైన గణేశ తులసీ సంవాదాన్ని దృష్టిలో ఉంచుకొని తులసీ పత్రంతో పూజించరాదని చెప్తారు. కొందరు నేరేడు ఆకులతో పూజిస్తారు. ఔత్తరాహికులు కేతకీపత్రం అంటే మొగలి ఆకులతోపూజిస్తారు, అలాగే కొన్ని చోట్ల శ్వేత దూర్వ అంటే తెల్లగడ్డి, ఆగస్త్య పత్రం ఇలా వేర్వేరు పత్రాల మార్పులతో ఉంటుంది.  ఉత్తరభారతంలోనూ చలి దేశాల్లోనూ దేవదారు దొరుకుతుంది మనకి లభ్యంలో ఉండదు.


అలాగే ప్రాంతాలవారీగా బీజాపూరఫలం ఇష్టమని గింజలు ఎక్కువగా ఉండే జామ, దోసపండు, దోసకాయ, చిట్టడవులదగ్గర ఉండే ప్రాంతం వారు పంపరపనాస, మాదీఫలం వంటివి కూడా వాడడం కద్దు. కొన్ని చోట్ల దొరికితే పనస కూడా నివేదిస్తారు. తెలుగులో కుడుములు, ఉండ్రాళ్ళు, బూరెలు, ఔత్తరాహికుల మోదకాలు ఇవన్నీ ప్రాంతాచారాలను బట్టి మారిన ఒకే వంటయొక్క రూపాలు


ఐతే ఇవన్నీ మన శ్రద్ధ ప్రకటించడానికే. పైగా ఏ కల్పంలోనూ 21పత్రాలు అంటే ఇవే అని రూఢి లేదు. 

21 పత్రాలు

21 నామాలతో దూర్వాయుగ్మ పూజ

21 నేతి కుడుములతో (ఉండ్రాళ్ళ) నివేదన


//దైవీ గుణ సంపత్తి కలిగి 21 దోషాలను తొలగించి తద్వారా పాపఫలితాన్ని తీసి 21 రకాల నరకలోక బాధలను పడకుండా కాపాడమని. సాత్విక బుద్ధినిమ్మని, ప్రకృతి యెడల దైవీ భావనతో వ్యవహరిస్తామని, నివేదన బుద్ధితో వ్యవహరిస్తామని భగవంతుని దగ్గర చెప్పుకోవడమే ఈ 21 నామాలతో 21 దైవీ గుణ సంపత్తి కలిగిన పత్ర పూజ అంతరార్థం.//


పరంపరాగతంగా మీ ఇళ్ళలో మీ సంప్రదాయం ప్రకారం ఏయే పత్రాలతో పూజిస్తున్నారో వాటితోనే పూజించాలి. మీ ఇంటి ఆచారాన్ని వంశఆచారాన్ని అనుసరించి గతంలో మీపెద్దలు చేసిన విధంగా లేదా మీ ఇంటి పురోహితుడు సూచించిన విధంగా లేదా మీరు ఆశ్రయించిన స్వగురువు సూచన మేరకు ఆచరించాలి. ఇవేమీ మాకు తెలియదు అనుకుంటే, తేలిగ్గా స్కాంద పురాణాంతర్గతంగా వివరించి వ్రతకల్పంగా రూపొందించబడిన వ్రత విధానాన్ని వ్రతచూడామణి ఇత్యాది గ్రంథాలలో ప్రకటించారు దాని అనుసరించి చేసుకోవచ్చు. దీని గురించి పెద్ద అల్లరి పడనవసరంలేదు, మన ఆచారంలోలేని ఇతర ప్రాంత, సంప్రదాయ విషయాలను మనవాటిలో జొప్పించుకోనవసరంలేదు. తండ్రి యైన శివుడు ఆచార ప్రియుడు అని శివపురాణం చెప్తుంటే కొడుకైన గణపతి అదే పరంపరాగతమైన మార్గంలో చరిస్తే ఆనందిస్తాడు, బావుందనో, అందంగా చెప్పబడిందనో మరోమార్గంలోకి మళ్ళడం మంచిది కాదు.


-శంకరకింకర



Wednesday, August 12, 2020

సుదర్శన స్తోత్రం - అందరూ జపించవచ్చు

సుదర్శన మహాజ్వాలా కోటి సూర్య సమప్రభ!

అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ!!