Pages

Friday, February 28, 2014

ఎన్నడూ లేశమాత్రమైన మార్పు చెందని స్థిరభక్తి ప్రతిష్టించబడుగాక..


శ్రీ గురుభ్యోనమః

నమస్తే

 

ఉపదిశతి య దుచ్చైర్జ్యోతి రామ్నాయ విద్యాం

పర మవర మదూరం దూర మాద్యంతశూన్యం !

త్రిపురజయిని తస్మిన్ దేవదేవే నినిష్టా

భగవతి పరివర్తోన్మాథినీ భక్తి రస్తు !!

 

ఏ శివజ్యోతిస్సు సర్వోత్తమ జ్ఞానమగు ఆమ్నాయ విద్యను జనులకు ఉపదేశిస్తున్నదో, ఏది అన్నిటికంటెను పెద్దదైన, అన్నిటికంటే చిన్నదిగా అవుతున్నదో, ఏది చాలా దూరముగా ఉన్నదో, ఏది అత్యంత సమీపముగా ఉన్నదో ఏతత్త్వమునకు ఆదియు అంతమును లేవో, అట్టి త్రిపురవిజయుడగు దేవదేవుడే శివుడు. ( అవిద్య, కామ, కర్మములు అనే సంసార బీజమును నాశము చేయువాడు లేదా జ్ఞాతృ-జ్ఞేయ-జ్ఞాన నామక త్రిపుటిని లయముచేసి తన ఉపాసకులకు విమలమైన జ్ఞానాత్మక తత్త్వమును అనుగ్రహించువాడు అని అర్థము) అట్టి భగవానుని విషయంలో నాకు ఎన్నడూ లేశమాత్రమైన మార్పు చెందని స్థిరభక్తి ప్రతిష్టించబడుగాక.

 

సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు

 

Thursday, February 27, 2014

శివుని పదిహేడు తత్త్వముల రహస్యము - ఉపాసన


శ్రీ గురుభ్యోనమః

నమస్తే

బ్రహ్మమునకు సంబంధించి ముఖ్యముగా 17 నామములు లేదా గౌణముల రహస్య తత్త్వరహస్యములను తెలుసుకొని శివునిగా ఉపాసిస్తారు. ఆ రహస్యాన్ని అనామయ స్తవంలో స్తవకర్త రహస్యంగా మనకి అందించారు. ఎల్లరూ ఈ 17తత్త్వములను గూర్చి తెలుసుకొని దాని పై విచారణ చేసి శివునుపాసింతురుగాక..


వందే రుద్రం వరద మమలం దండినం ముండధారం

దివ్యజ్ఞానం త్రిపురదహనం శంకరం శూలపాణిం

తేజోరాశిం త్రిభువనగురుం తీర్థమౌళిం త్రినేత్రం

కైలాసస్థం ధనపతిసఖం పార్వతీనాధ మీశమ్.


రుద్రం = రుద్రుడు (జీవుల పాప పుణ్య ఫలప్రదుడై, పాప ఫలము ననుభవింపజేయు రుద్ర స్వరూపము, ఆశ్రయించినవారి పాప ఫలమునుకు రుద్రుడై ఆ పాపఫలితాన్నితొలగించి గలవాడు ఐన లయకారక తత్త్వంతో ఉనన్ రుద్రతత్త్వం)

వరదం = వరప్రదుడు (అతి సులభుడు, ప్రాపంచిక - పారలౌకిక కోరికలను అతి సులువుగా తీర్చగలవాడు)

అమలం = నిర్మలుడు (అన్నియూ తానేఐనా, తనవేఐనా , తనకేదీ అంటనివాడు, అన్నపూర్ణ భర్తయైనా అంటులేనివాడు అని రుద్రం వ్యాఖ్యానించిన పెద్దలు సూచించారు అదే, దరిద్రత్+నీలలోహిత మంత్రాలలో రుద్రంలో చెప్పబడేది)

దండినం = దండాన్ని ధరించినవాడు (రక్షకుడు)

ముండధారం = కపాలధరుడు (కపాలము భ్రూమధ్యనుంచి బ్రహ్మరంధ్రం వరకు అక్కడనించి సరిగ్గా భ్రూమధ్య రేఖ వెనకవేపుకు పాయింట్ వరకు సరిగ్గా ఉన్న అర్థ చంద్రాకారమే రుద్రంలో చెప్పిన ధనస్సు, దానికి సంకేతమే కపాల ధారణం, శ్రీవిద్యా రహస్యంగాకానీ, శివోపాసన రహస్యములుగాకానీ పెద్దల ద్వారా ఇవి తెలుసుకోవచ్చును)

దివ్యజ్ఞానం =  అందరూ దేనిగూర్చి తెలుసుకోవాలో ఆ దివ్యజ్ఞానస్వరూపుడు

త్రిపురదహనం= త్రిపురములను దహించినవాడు (స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలను దహింపజేసి జ్ఞానాన్ని ఇవ్వగలిగినవాడు, జ్ఞాన స్వరూపుడు)

శంకరం = శం కరోతి ఇతి శంకరః - ఎల్లప్పుడూ శుభమునే కూర్చేవాడు (వంశ వృద్ధికావించి అందరినీ మంగళప్రదులుగా చేసేవాడు అంటే సృష్టికార్యం నిర్వహించే చతుర్ముఖబ్రహ్మతత్త్వంగానూ, స్థితికారకత్వంతో విష్ణుతత్త్వంగానూ ఉండేవాడు)

శూలపాణిం = శూలమును ధరించేవాడు (త్రిశూలము పైన మూడుగా ఉన్నా ఆధారముగా ఉన్న కర్రవంటిదాన్ని ధరించే వాడు, అంటే మూడింటికి ఆధారమైన వస్తువును చేతిలో పట్టుకున్నవాడు లేదా తానే ఆధారమైనవాడు)

తేజోరాశిం = అనంత తేజోరాశి, అజ్ఞాన దాహకత్వానికి కావలసిన సంపూర్ణమైన తేజోపుంజం

త్రిభువనగురుం = మూడులోకములకూ గురు స్వరూపము ఐనవాడు (లేదా ఈ భువనములో ముఖ్యంగా మూడు రూపములలో గురువుగా ఉండేవాడు అవే తల్లి, తండ్రి, ఆచార్యుడు అని కూడా వ్యాఖ్యానమున్నది)

తీర్థమౌళిం = తీర్థమును ధరించినవాడు, గంగాధరుడు (నీరు ప్రాణములను నిలబెట్టునది, ప్రాణములను నిలబెట్టు నీటిని తన అధీనంలో ఉంచుకొనేవాడు, తద్వారా సృష్టి రక్షకుడు దీనినే స్థితికారకత్వమైన విష్ణుతత్త్వం అని తెలుసుకోవలె)

త్రినేత్రం = మూడు కన్నులు కలిగినవాడు (సూర్య, చంద్ర, అగ్నిలుగా ఉండి లోక సాక్షిగా ఉన్నవాడు)

కైలాసస్థం = కైలాస వాసి, కేళి జరుగు స్థలమున నుండు వాడు

ధనపతిసఖం = కుబేరునకు మిత్రుడు ( తాను అందరికీ ఇచ్చేవాడు తనకేమీ ఇవ్వనవసరంలేనివాడు, అన్నిటా పరిపూర్ణుడు)

పార్వతీనాథం = పార్వతీ దేవికి పతిఐనవాడు (పర్వతం లేదా గిరి అంటే అనంత వేద రాశి, దానినధిష్టించినది లేదా దాని చివరల ఉన్నది నాద రూపమైన పరబ్రహ్మ తత్త్వం ప్రణవం అదే ఓం కారం, దానికి సూచనే గిరీశుడు అన్నపేరు లేదా పార్వతీనాథుడన్నపేరు)

ఈశం= ఈశ్వరుడు, శివుడు

వందే = నమస్కరించుచున్నాను


బ్రహ్మాండ, పిండాండములలో లేదా సాధనలో సహస్రార చక్రములో అమృతధారలు కురిపిస్తున్నటువంటి చంద్రుని కళలు 16 ఇందులో 15 కళలు శుక్ల, కృష్ణ పక్షములలో క్షయ వృద్ధిని పొందుతూనే ఉంటాయి, ఇక పదహారవ కళ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది అదే శివుని తలమీది చంద్రవంక. అది సదా ఉంటుంది కాబట్టి దానికి సాదా కళ ని పేరు దాన్నే బృ.ఉ లో ’ధృవా’ అని చెప్పారు. ఈ పదహారవ కళ సంకేతమే శివునికన్న అభిన్నమైన శక్తి రూపము అని. అందుకే ఇద్దరికీ ఈ చంద్రకళ ఉంటుంది. ఆ శక్తి ఏ తత్త్వాన్ని ఆశ్రయిస్తుందో అది సర్వాతీతమైన తత్త్వం. అదే శివుడు.


దీని సూచన ఏమిటి? ఏం చెప్తోందిది? అంటే సర్వాతీతమైన అద్వితీయమైన పరబ్రహ్మం గురించి, ఆయన జరిపే ఈ అనంత సృష్టి క్రమం గురించి ఎన్నో గ్రంధరాజాలు సమస్త  వాజ్ఞ్మయమూ చెప్పినదాన్ని సూచకంగా ఒక్క శ్లోకంలో ఈ పదిహేడు తత్త్వాలలో రహస్యంగా ఇమడ్చబడి చెప్పబడింది..


చంద్రుని 16వ కళ శివునికన్నా అభిన్నమైన శక్తి స్వరూపమని తెలియబడింది కదా, అంటే శివుని నుండి వ్యక్తమైనది అది ఎన్నటికీ మారదు, ఆయననే అంటిపెట్టుకొని ఉంటుంది, అందుండి మరో పదిహేను కళలు బయటికొచ్చాయి ఇవి కాలంలో పెరుగుతూ తరుగుతూ ఉంటాయి. సృష్ట్యాంతంలో ఇవి తిరిగి 16వకళలోకి వెళ్లిపోతాయి ఆ పదహారవదైన సాదా కళ శివునికన్నాభిన్నముగాకాక శివునియందే ఉండిపోతుంది. 17వ తత్త్వమైన శివమొక్కటే శాశ్వతము, అద్వితీయమైనదిగా ఉండిపోతుంది, అదే వేదాంత ప్రతిపాదితమైన పరబ్రహ్మస్వరూపము.


సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు..

Wednesday, February 26, 2014

శివరాత్రి - చేయవలసిన స్తోత్రాలలో కొన్ని..




శ్రీ గురుభ్యోన్నమః

లింగోద్భవ మూర్తి ధ్యాన శ్లోకం

దేవమ్ గర్భగృహస్య మానకలితే లింగే జటాశేఖరమ్
కట్యాసక్తకరమ్ పరైస్చ తతతమ్ కృష్ణమ్ మృగమ్ చాభయమ్!
సవ్యే టంకమమేయ పాదమకుటే బ్రహ్మాచ్యుతాభ్యామ్ యుతమ్
హ్యూర్ధ్వాతస్థిత హంసకోలమమలమ్ లింగోద్భవమ్ భావయే!!

వశిష్ఠ కృత శివ లింగ స్తుతి (అగ్నిపురాణం)




నమః కనక లింగాయ వేద లింగాయ వై నమః
నమః పరమ లింగాయ వ్యోమ లింగాయ వై నమః
నమః సహస్ర లింగాయ వహ్నిలింగాయ వై నమః
నమః పురాణా లింగాయ శ్రుతి లింగాయ వై నమః
నమః పాతాళ లింగాయ బ్రహ్మ లింగాయ వై నమః
నమో రహస్య లింగాయ సప్తద్వీపోర్థ్వలింగినే
నమః సర్వాత్మ లింగాయ సర్వలోకాంగలింగినే
నమస్త్వవ్యక్త లింగాయ బుద్ధి లింగాయ వై నమః
నమోహంకారలింగాయ భూత లింగాయ వై నమః
నమ ఇంద్రియ లింగాయ నమస్తన్మాత్ర లింగినే
నమః పురుష లింగాయ భావ లింగాయ వై నమః
నమో రజోర్ద్వలింగాయ సత్త్వలింగాయ వై నమః
నమస్తే భవ లింగాయ నమస్త్రైగుణ్యలింగినే
నమః అనాగతలింగాయ తేజోలింగాయ వై నమః
నమో వాయూర్ద్వలింగాయ శ్రుతిలింగాయ వై నమః
నమస్తే అథర్వ లింగాయ సామ లింగాయ వై నమః
నమో యజ్ఙాంగలింగాయ యజ్ఙలింగాయ వై నమః
నమస్తే తత్త్వలింగాయ దైవానుగత లింగినే
దిశనః పరమం యోగమపత్యం మత్సమం తథా
బ్రహ్మచైవాక్షయం దేవ శమంచైవ పరం విభో
అక్షయం త్వం చ వంశస్య ధర్మే చ మతిమక్షయామ్




కనక లింగమునకు నమస్కారము, వేదలింగమునకు, పరమ లింగమునకు, ఆకాశ లింగమునకు, సహస్ర లింగమునకు, వహ్ని లింగమునకు, పురాణ లింగమునకు, వేద లింగమునకు, పాతాళ లింగమునకు, బ్రహ్మ లింగమునకు, సప్తద్వీపోర్థ్వ లింగమునకు, సర్వాత్మ లింగమునకు, సర్వలోక లింగమునకు, అవ్యక్త లింగమునకు, బుద్ధి లింగమునకు, అహంకార లింగమునకుభూత లింగమునకు, ఇంద్రియ లింగమునకు, తన్మాత్ర లింగమునకు, పురుష లింగమునకు, భావ లింగమునకు, రజోర్ధ్వ లింగమునకు, సత్త్వ లింగమునకు, భవ లింగమునకు, త్రైగుణ్య లింగమునకు, అనాగత లింగమునకు, తేజో లింగమునకు, వాయూర్ధ్వ లింగమునకు, శ్రుతి లింగమునకు, అథర్వ లింగమునకు, సామ లింగమునకు, యజ్ఙాంగ లింగమునకు, యజ్ఙ లింగమునకు, తత్త్వ లింగమునకు, దైవతానుగత లింగ స్వరూపము అగు శివునికి పునః పునః నమస్కారము! ప్రభూ నాకు పరమయోగమును ఉపదేశించుము, నాతో సమానుడైన పుత్రుడనిమ్ము, నాకు అవినాశి యగు పరబ్రహ్మవైన నీ యొక్క ప్రాప్తిని కలిగించుము, పరమ శాంతినిమ్ము, నావంశము ఎన్నటికీ క్షీణము కాకుండుగాక, నా బుద్ధి సర్వదా ధర్మముపై లగ్నమైఉండుగాక.



---------

అరూప రూపి అగు జ్యోతి స్వరూప లింగావిర్భావము జరిగిన ఈ నాడు ఆ పరమేశ్వరుని వద్ద ఈ స్తోత్రము చేయడం ఉత్తమం. ఈ స్తోత్రముని పరమేశ్వరుని వద్ద రోజూ విన్నవించుకొనవచ్చు.



లింగోద్భవ కాలంలో జ్యోతి స్వరూపునిగా శివుని ఒక దీపాన్ని కానీ, కర్పూర దీపాన్ని కానీ చూస్తూ అందులో పరమేశ్వరుని ధ్యానిస్తూ ఈ క్రింది శ్లోకం చెప్పుకోవాలి (సరిగ్గా మధ్య రాత్రి సమయంలో)



కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః

జలేస్థలే యే నివసంతి జీవాః

దృష్ట్వా ప్రదీపం నచజన్మ భాగినః

భవన్తి త్వం శ్వపచాహి విప్రాః




సర్వం శ్రీ ఉమా మహేశ్వరార్పణమస్తు



~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు

जय जय शंकर हर हर शंकर

శివరాత్రంటే లేటుగాలేచి సాయంత్రం పళ్ళు తిని రాత్రి సినిమాలు చూడడం కాదు!

శ్రీ గురుభ్యోనమః
అందరికీ నమస్కారం
శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు
శివరాత్రి అంటే శివుని పుట్టినరోజు అని ఒక అపోహ ప్రచారంలో ఉన్నది, ఎప్పుడూ ఉండే శివునికి ఒక పుట్టుక అంటూ లేదు ఆయనే అందరి పుట్టుకకూ కారణం ఆయన పుట్టడం అంటూ లేదు ఆయన బ్రహ్మము. ఆయననుండి జగత్ పుడుతుంది అంతేకాని శివరాత్రి శివుని పుట్టిన రోజు కాదు.
ఐతే శివరాత్రి విశేషమేమి? ఎందుకు అత్యంత ప్రాముఖ్యమున్న నైమిత్తిక తిథి. ఎన్ని రకాల ఉపాసనలనీ సిద్ధింపజేయగల నైమిత్తిక తిథి శివరాత్రి. శివరాత్రి గురించి పురాణ వాజ్ఙ్మయాన్నిపరిశీలించి చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సృష్ఠికి పూర్వం పరబ్రహ్మం తనలో తానే రమిస్తూ ఉన్నప్పుడు కలిగిన అహం స్ఫురణ ద్వారా తాను వివిధములుగా మారాలన్న కోరిక కలుగింది. పరబ్రహ్మం యొక్క అహం స్ఫురణయే శక్తి లేదా మాయ లేదా ప్రకృతి అని వివిధ నామాలు. వివిధములుగా వ్యాప్తి చెందాలన్న కోరికయే సృష్ఠికి మూల కారణమై అహం స్ఫురణతో ఉన్న పరబ్రహ్మంనుండి శ్రీ మహా విష్ణువు ఆవిర్భవించారు  ఆయన ఆవిర్భవించాక ఆయన ఒక్కరే ఉండడం వల్ల ఆయన ఎక్కడనుంచి వచ్చారు ఏమి చేయాలి అన్నదేమీ తెలియలేదు అప్పుడు ఆయనకి "తపించు" అన్న మాట వినపడింది (అదే పరబ్రహ్మము తన సృష్ఠికి ఇచ్చిన మొట్ట మొదటి ఆదేశం అదే ఇప్పటికీ శిరోధార్యం). వెంటనే శ్రీమహావిష్ణువు తపస్సు చేయసాగారు. ఆయన చేస్తున్న గొప్ప తపస్సువల్ల ఆయన శరీరంలోంచి తపోజలాలు ఉద్భవించి సమస్త సృష్ఠి జలమయం అయ్యింది. అలా తపస్సు చేస్తున్న శ్రీమహావిష్ణువు నాభిలోంచి ఒక కమలం ఉద్భవించి అందులోంచి పంచ ముఖాలతో బ్రహ్మగారు పుట్టారు.
ఆయన నేనెవరు ఎక్కడనుంచి వచ్చాను అని ఇంతకు ముందు శ్రీ మహావిష్ణువులాగానే తెలియని స్థితిలో ఉండి తాను పుట్టిన తామర పువ్వు తూడులోంచి క్రిందకు వెళ్లగా తపస్సు చేస్తున్న శ్రీ మహావిష్ణువు కనపడ్డారు ఆయనే తన పుట్టుకకు కారణమైన వారని తెలియక తాను కాక ఇంకొకరు ఉన్నారు అన్న భావన, భయం కలిగి ఆయనతో వాదానికి సిద్ధపడ్డారు. {బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ తదాత్మనమేవ ఆవైత్ అహం బ్రహ్మాస్మీతి తస్మాత్ తత్త్సర్వమభవత్! [బృహదారణ్యకోపనిషత్] (మొట్టమొదట బ్రహ్మమే ఉండెను, ఈ చరాచర ప్రపంచమంతా పరబ్రహ్మమై ఉన్నది, కానీ అజ్ఙానం వలన తన స్వస్థితి ఎరుగడు, అహంకార రహిత జ్ఙానం వలననే తాను పరబ్రహ్మం అని తెలుసుకుంటాడు)}  ఇద్దరి మధ్య గొప్ప వాదోపవాదాలు జరిగాయి, మాయా స్వరూపమైన అజ్ఙానం వల్ల నేను గొప్ప అంటే నేను గొప్ప అన్న వాదన ప్రబలింది యుద్ధం వరకూ వచ్చింది.
అటువంటి సమయంలో వారి అజ్ఙానాన్ని ధ్వంసం చేసి బుద్ధి చెప్పాలనుక్కున్న పరబ్రహ్మం అకస్మాత్తుగా వారిరువురి మధ్యా ఒక గొప్ప కాంతితో అగ్నిస్థంభంగా లింగా కారంలో తనని తాను వ్యక్తపరచుకున్నారు. వీరిరువురూ వారి వాదోపవాదాలను పక్కనబెట్టి ఈ అగ్ని లింగ యొక్క ఆది అంతం కనుక్కున్నవారే గొప్పవారు అని ఒప్పందం చేసుకుని బ్రహ్మగారు హంస రూపంలో ఆదిని కనుక్కోవడానికి ఊర్ద్వ దిశలో పయనించసాగారు. శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అధోభాగం వైపు పయనించి ఆ అగ్ని లింగం యొక్క చివర చూడడానికి వెళ్ళారు. ఇరువురూ వారి వారి దిశలవైపు కొన్ని వేల వేల సంవత్సరాలు పయనించినా దాని ఆది అంతు కనుక్కోలేకపోయారు. ఊర్ధ్వంగా పయనిస్తున్న బ్రహ్మగారికి ఎదురుగా ఒక మొగలిపువ్వు కిందకి పడడం చూశారు ఆమొగలిపువ్వుని ఆపి ఈ అగ్నిస్థంభం యొక్క ది ఎక్కడుంది అని అడిగారు అప్పుడు మొగలి పువ్వు దానిని చేరుకోవడం ఎవరి తరమూ కాదు ఎప్పుడో నేను ఆ లింగం మొదట్లోంచి పడ్డాను ఎన్ని ఏళ్ళు యుగాలైందో తెలీదు ఇంకా పడుతూనే ఉన్నాను అని చెప్పింది. అప్పుడు బ్రహ్మగారు విష్ణువుతో చేసుకున్న పందెం గెలవాలని ఆ మొగలిపువ్వుతొ ఒక ఒడంబడిక చేసుకుని నేను ఈ లింగం మొదలు చూసానని చెప్పమని మొగలిపువ్వుని కోరారు అదీ సరేనంది తిరిగి బ్రహ్మగారు తాను ఎక్కడ నుంచి బయలు దేరారో అక్కడికి చేరుకున్నారు. అలాగే విష్ణుమూర్తి ఆ అగ్ని లింగం యొక్క అంతు కనిపెట్టలేమని గ్రహించి తిరిగి ఆయనా ఆయన బయలుదేరిన స్థానానికే చేరుకున్నారు. బ్రహ్మగారు విష్ణువుతో తాను ఆ లింగం యొక్క ఆది చూసాననీ సాక్ష్యం మొగలి పువ్వనీ చెప్పగా మొగలు పువ్వు దానిని సమర్థించింది. వెంటనే ఆ అగ్ని లింగంలోంచి పరబ్రహ్మం సాకారుడై తప్పు సాక్ష్యం చెప్పినందుకు మొగలి పువ్వు తన పూజలకు పనికిరాదని శాపం ఇచ్చి రాజసగుణంతో అబద్ధం చెప్పి చెప్పించిన బ్రహ్మగార్కి అర్చనాదులు ఉండవని చెప్పి సత్వగుణంతో ఉండి తన ఉపదేశాన్ని పాటించి (తపించు అని చెప్పిన మాటను పాటించి) పందెం ఓడిపోతానని తెలిసినా నిజాయితీతో వ్యవహరించినందుకు శ్రీ మహావిష్ణువుకు సృష్టి రక్షణ భారాన్నీ, తనకు సాటిగా గౌరవాన్నీ ఇచ్చి తనతోపాటుగా తనకు సమానుడుగా పూజాధికాలు ఉంటాయని వరమిచ్చారు. ఇక తరవాత బ్రహ్మగారి ప్రార్థన విని వేదాన్నిచ్చి దానికణుగుణంగా సృష్ఠి సాగించమనీ, శ్రీమహావిష్ణువుని ఆ సృష్ఠిని రక్షించమనీ ఆనతిచ్చారు.
ఆ అగ్నిలింగం ఏ అజ్ఙానాన్నైతే రూపుమాపటానికి ఉత్పన్నమైందో, ఆ సమయాన్నే కాలచక్రంలో ప్రతి యేటా ఈ మహాశివరాత్రిగా నిర్ధారించి అర్థరాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో లింగోద్భవకాలంలో అభిషేకాదులు, అర్చనలూ చేస్తారు. అర్థరాత్రి శివలింగం ఉద్భవించడం అంటే చీకటి (అజ్ఙానం) దట్టంగా ఉన్న సమయంలో జ్యోతి (జ్ఙాన) స్వరూపంగా ఆవిర్భవించడమే దీని అంతరార్థం. అందుకే ఈ రోజు ఉదయంనుంచీ ఉపవాసం తోపాటు (అంటే నిర్జలోపవాసం అని కాదు, ఏపని చేస్తున్నా శివధ్యానం చేస్తూ ఉండడం ఉప= దగ్గరగా వసి= వసించడం ) శివ శివేతి శివేతి వా! భవ భవేతి భవేతి వా! హర హరేతి హరేతి వా! భజ మనః శివ మేవ నిరంతరమ్ !! శివ గాధలు, పూజలు, అభిషేకాలు, ఆలయ దర్శనాలు వంటివి చేస్తూ  అర్థరాత్రి లింగోద్భవ కాలం సమయానికి అభిషేకం చేసి కర్పూరలింగాలు లేదా దీపాలు వెలిగించి అందులోకి పరమేశ్వరుని ఆవాహన చేసి ఈ క్రింది స్తోత్రాన్ని చదువుతారు. (లింగోధ ప్రార్థన అంటారు దీన్ని, ఈ శ్లోకాన్నే కార్తీక దీప నమస్కారానికీ సమన్వయం చేస్తారు..)
కీటా: పతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః
దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః
భవన్తిత్వం శ్వపచాహి విప్రాః
ఇక ఈ లింగం అంటే ఏమిటి అది దేనికి గుర్తు అని పరిశీలిస్తే,
ఆకాశం లింగం ఇత్యుక్తం పృథివీ తస్య పీఠికా !
ఆలయః సర్వదేవానాం లయనాత్లింగముచ్యతే !!
లింగం అంటే ఆకాశం లింగం, ఈ భూమి పీఠం, సర్వదేవతలకూ ఆలయం. అన్నీ ఇందులోనే లయమవుతున్నాయి కాబట్టి ఇది లింగం అని ప్రమాణం. అంటే సర్వ వ్యాపకమైన విష్ణు తత్త్వమే శివతత్త్వం, పేర్లు వేరు ఉన్నది ఒక్కటే. ఆ రెండూ అభేధం. ఆ రెండూ ఏమి అంతటా ఉన్నది పరబ్రహ్మమే బేధం అన్న సమస్యే లేదు, ఉన్న సమస్యల్లా అజ్ఙానం, అది రెండా, మూడా, నాలుగా, నలభైయ్యా ఇంకా ఎన్నోనా అన్న సమస్య, అజ్ఙానం వల్ల పరబ్రహ్మం వేరు నేను వేరు అనే భావన. అజ్ఙానం పోగొట్టగలిగే ఉపాసన చేయగలిగిన రోజు ఈ శివరాత్రి ఇటువంటి ఇంకో తిథి శ్రీ కృష్ణ జన్మాష్ఠమి. ఇప్పుడున్న చలికాలంలో ఉన్న దట్టమైన చీకటి అజ్ఙానాన్ని సూచిస్తే, అప్పుడుండే మేఘావృత రాత్రిళ్ళు అజ్ఙానాన్ని సూచిస్తాయి. అరూపరూపి ఐన లింగం అర్థరాత్రే ఆవిర్భవించి జ్ఙానానిస్తే. సాకార రూపమైన విష్ణువు కూడా ఇప్పటికి ఆరు మాసాల తరవాత అర్థరాత్రి జన్మించి కృష్ణం వందే జగద్గురుంగా తన లీలల ద్వారా జ్ఙాన బోధ చేస్తారు. సాకార రూపార్చన నిరాకార రూపార్చనవైపు ఎదగడానికే.
మహా ప్రదోషం
ఈ శివరాత్రికే మహా ప్రదోషం అని పేరు. మనకి రోజూ ప్రదోషకాలం ఎలానో ఒక మాసానికి కృష్ణ పక్షంలో వచ్చే మాస శివరాత్రి ప్రదోష సమయం అలానే సంవత్సరకాలాన్ని చూసినట్లైతే మాఘ మాసంలో వచ్చే ఈ శివరాత్రి మహా శివరాత్రి మహా ప్రదోష కాలం. ప్రదోషకాలంలో కేవలం శివార్చన మాత్రమే నిర్దేశించబడింది కారణం ఏమంటే ప్రదోషకాలంలో సర్వదేవతలూ శివతాండవం లో పాలు పంచుకోవడానికి వెళ్తారు. విష్ణువు మద్దెల వాయిస్తారు, సరస్వతీ దేవీ నారదాదులు వీణానాదం చేస్తూ గానం చేస్తుంటారు విఘ్నేశ్వర స్కందాది  ఇతర దేవతలు దేవాది గణాలు ఋషులు తమ తమకు ఉచితమైన వాద్య పరికరాలతో ఆ శివతాండవానికి తమ సహకారాన్ని ఇస్తూంటారు. కాబట్టే ప్రదోషకాలంలో శివపూజ నిర్దేశించబడిందిఆ సమయంలో శివార్చన శివలింగాభిషేకం చేస్తే అక్కడ ఉన్న దేవతలూ సంతసిస్తారు అంటే మనకి రోజూ ప్రదోషవేళలో ఉండే ఒక గంటా గంటన్నర సమయం ఎలానో ఒక సంవత్సర కాలంలో ఈ మహా శివరాత్రి అంతే. అందుకే నేడు షాణ్మతములవారూ శివరాత్రి వ్రతం చేస్తారు వ్రతం చేయకపోయినా ఉపవాసం ఉండి శివాలయ సందర్శనం శివగాథలను వినడం ఇత్యాదులు చేసి జాగరణం ఉంటారు. జాగరణం అంటే జాగురూకాతతో ఉండడం. జాగ్రత్తగా ఉండి అజ్ఙాన నివృత్తి చేసుకొనడానికి చేసే ప్రయత్నమే ఈ రోజు ఉపాసన.
ఐనా ఇలా చెప్తూపోతే ఎన్నిపుస్తకాలైనా సరిపోదు, మౌనంలోనే ఆయన దొరుకుతారు, ఆయన మొట్ట మొదట ఇచ్చిన ఉపదేశమైన "తపించు" అన్న ఆనయే శరణం కాబట్టి ఈ రోజు వీలైనంత తపస్సు చేద్దాం, ధ్యానం చేద్దాం. పరమేశ్వరానుగ్రహాన్ని, సంపూర్ణ శివజ్ఙానాన్ని పొంది, అంత్యకాలంలో పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్యాన్ని పొందుదాం.
సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు
----------------------------
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
जय जय शंकर हर हर शंकर

మూడుకన్నుల వానినర్చింప - ఒక కన్ను కావలెనా వేయి కన్నులు కావలెనా !!

శ్రో గురుభ్యోనమః
నమస్తే
త్వత్పాదయో రబ్జసస్రపూజాం
నేత్రాబ్జపూర్ణాం కృతవత్యుపేంద్రే,
త్రినేత్ర! నేత్రాబ్జసహస్రపూజాం
కుర్వన్నివేంద్రః ప్రణతో విభాతి
 
ఓ మూడు కన్నుల కల శివా! నీ దర్శనమునకై వచ్చి నీ పాదములపై పడి ఉన్న ఇంద్రుని చూడగా పూర్వము వేయి కమలములతో అర్చించబూని నీమాయవలన ఒక కమలము తగ్గగా శ్రీ మహావిష్ణు తన కంటినే పెరికి నీ పాదాలపై అర్పించిన సంఘటన తలచుకొని, సహస్రాక్షుడైన (వేయికన్నులున్న) ఇంద్రుడు తన వేయుకన్నులతోటీ నీ పాద పూజ చేస్తున్నాడా అన్నట్లున్నది ప్రభూ..!
 
సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు

చిత్ర విచిత్ర లక్షణములతో...


శ్రో గురుభ్యోనమః

నమస్తే

మౌళౌ లోల త్త్రిదశతటినీ తోయశీతేమృతాంశుం

కంఠే క్రూరం కబళితవిష శ్యామలే వ్యాళరాజం!

జ్యోత్స్నాగౌరే వపుషి విశదం బిభ్రతో భస్మరాగం

జ్ఞాతా సమ్యక్త్రినయన ! మయా యోగిభూషాతైవ!!

(హలాయుధ 15)

 

శివా! గంగమ్మను నీ ఘన జటాఝూటంలో బంధించినందున నీ శిరస్సు ఎప్పుడూ చాలా తడిగా చల్లగా ఉంటుంది. దానికి తోడు అమృత కిరణుడైన చంద్రుని తెచ్చి నెత్తిమీద పెట్టుకున్నావు. పోనీ హాలాహలం తాగావు కదా వేడిగా ఉంటుందేమో అనుక్కుంటే అది తాగడం వల్ల నల్లని మచ్చనీ కంఠానికి కలిగి దానికి ఆచ్చాదనగా మహా సర్పాలని మెడచుట్టూ చుట్టుకున్నావు. (నలుపు చీకటికి, చల్లగా ఉండడానికి ప్రతీకగా కవులు చెప్తారు, పైగా పాము అడుగుభాగం చల్లగా ఉంటుందనీ చెప్తారు). దీనితోపాటు స్ఫటికంలా తెల్లగా చల్లగా ఉండే నీపై చంద్రకాంతులు పడి ఇంకా మెరుస్తుంటే కాదని ఇంకా వళ్ళంతా తెల్లని చితాభస్మము పూసుకుంటూ ఉంటావు. ఇలా చిత్ర విచిత్ర లక్షణములతో ఆశ్చర్యకరంగా ఉండే ఈ యోగి భూషణాలంకారములను నీవు తప్ప ఇంకెవరూ ధరించలేరు అని తెలుస్తున్నది ప్రభూ!

 

సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు

 

Tuesday, February 25, 2014

ఎంత దయాళువయా నువ్వు...


శ్రీ గురుభ్యోనమః

నమస్తే

 
వేధా విష్ణుర్వరుణ ధనదో వాసవో జీవితేశ

శ్చంద్రాదిత్యౌ వసవ ఇతియాదేవతా భిన్నకక్ష్యాః!

మన్యే తాసామపి న భజతే భారతీ తే స్వరూపం

స్థూలే త్వంశేస్పృశతి సదృశం-తత్పునర్మాదృశోపి!!

(అనామయ - 2)


శివా! సూక్ష్మమగు నీ తాత్వికరూపము మరియు సులభమగు నీ స్థూలరూపము అనే రెండు రూపాలలో, నీ సూక్ష్మరూప విషయంలో బ్రహ్మ, విష్ణు, వరుణ, కుబేర, ఇంద్ర, వాయు, చంద్ర, సూర్య, వసువు ఇత్యాది వేర్వేరు గణములు కలవో అందులో ఏయే దేవతలు ఉన్నారో, వారి వాక్కుకు కూడా అందలేనిదైయ్యున్నది. మరి నీ స్థూల రూప తత్త్వమో, ఏమీ తెలియని నావంటి వాని వాక్కులకు కూడా అందుతున్నది... ఎంత దయాళువయా నువ్వు...

 

{శివుని సూక్ష్మతమమైన తత్త్వరూపము బ్రహ్మవిష్ణ్వింద్రాదులైనా ఎరుగలేనిది, కీర్తింప సరిపోనిది అయ్యుండీ, స్థూల రూపమును ఎవరైనా సరే కీర్తింపగలిగినంత సులువైనది.... అతి దగ్గరవాడు ఆయనే, అతి దూరుడూ ఆయనే...}

 

సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు..

 

--
~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
जय जय शंकर हर हर शंकर
---
You received this message because you are subscribed to the Google Groups "సత్సంగము (satsangamu)" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to satsangamu+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to satsangamu@googlegroups.com.
Visit this group at http://groups.google.com/group/satsangamu.
For more options, visit https://groups.google.com/groups/opt_out.