Pages

Wednesday, June 22, 2016

సంకల్పం - అనృత దోషం

సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం,
కుశలాన్న పరమదితవ్యం, భూత్యైన ప్రమదితవ్యం,
స్వాధ్యాయ ప్రవచనాభ్యాం ప్రమదితవ్యం,
దేవపితృకార్యాభ్యాం ప్రమదితవ్యం,
మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదెవో భవ, అతిథిదేవో భవ.

సత్యమార్గం నుండి మరలకుము, ధర్మ మార్గం నుండి మరలకుము, ఆత్మ సంరక్షణ నుండి మరలకుము, స్వాధ్యాయ ప్రవచనాల నుండి మరలకుము, దేవ పితృ కర్మల నుండి మరలకుము, తల్లీ, తండ్రీ, గురువు, అతిథిలను దైవ సమానులుగా తలచి పూజించుము. ఇత్యాదిగా తైత్తరీయ శిక్షావల్లిలో శిష్యానుశాసనం చేస్తారు గురువులు. ఇది విద్య ఇచ్చిన తరవాత తన శిష్యునికి ఒక గురువు అందించే సంకల్పం. తర తరాలుగా పరంపరాగతంగా వైదిక విద్యా విధానంలో శాసనం గురువు శిష్యునికిస్తాడు, అంటే తన శిష్యుడు ఎలా ఉండాలో సంకల్పించి శిష్యునికిమార్గనిర్దేశనం చేస్తాడు. శిష్యుడు దాన్ని తన జీవితానికి గురువు అందించిన సంకల్పంగా తీసుకుని పరంపరని కొనసాగిస్తాడు. గురువుల సంకల్పాలు అంత తేలికగా తీసుకునేలా ఉండవు. సంకల్పం గురువుదే ఐనా నిలబెట్టి సంకల్పానుగుణంగా నిలబడవలసినవాడు శిష్యుడు. ఎవరి సంకల్పాలు వాళ్ళు చేసుకుని దాన్ని సాకారం చేసుకోవడం చేసుకోకపోవడం వ్యక్తిగతం. కానీ ఇక్కడ గురుసంకల్పానికి కట్టుబడడం వేరు. అదే సత్యాన్నప్రమదితవ్యం..... రాముడు దశరథుని సంకల్పానికి కట్టుబడ్డాడు, వశిష్ఠుని సంకల్పానికి కట్టుబడి తన్న విద్యనంతా లోకహితానికే వాడాడు. అందుకే  ...లోకహితేరతః..

చిత్తశుద్ధి కలిగిన మహానుభావుల హృదయంలోంచి వచ్చిన సంకల్పాల శక్తి చాలా గొప్పది. అసలు సంకల్పవికల్పాలకు అతీతమైన స్థాయిలో ఉండే గురువుల సంకల్పిస్తే ఒక్కకారణానికే సంకల్పిస్తారు అది లోక కళ్యాణం, శిష్య హితం కోసం. లోకం మీద వారికున్న ప్రేమ కరుణ, శిష్యుల యెడ వాత్సల్యం. సంకల్పం బహు గహనమైనదీ విచిత్రమైనదీనూ... గురువులు, మహానుభావులు ఏదైనా సంకల్పిస్తే దాన్ని నెరవేర్చడానికి శిష్యగణం వెంపర్లాడుతుంది. ఒకచో ఆగురువాక్యం, సంకల్పం ఆగిపోకుండా కొనసాగుతూనే ఉండడానికి శిష్యగణం వచ్చి భుజాలెత్తుకుని నిలబెడుతూ ఉంటుంది. శిష్యుడే కానక్కరలేదు ఆస్తిక్యబుద్ధి ఉన్న ఎవరైనా సత్సంకల్పాలకు తామున్నామని నిలబడతారు. దీంట్లో గమ్మత్తేమంటే సంకల్పం గురువుది నెరవేరుస్తున్న ఎవరిదీ కాదు వాళ్ళు సంకల్ప సాధనలో సాధనాలే అంటే పనిముట్లే. భావన ఉన్నవారికి కర్తృత్వభావన కలగదు. ఎంత సేపూ దృష్టి గురు సంకల్పాన్ని సాకారం చేయడమే కోసం పని చేయడం ఒక్కొక్కచో సంకల్పాన్నే జీవితంగా మలచుకోవడం జరుగుతుంది. ఇంకో రకం సంకల్పాలుంటాయి వ్యక్తిగతమైనవి అవి ఏదో ఒక కారణానికి పుడతాయి అవీ సాకారం దాలుస్తాయి. వాటినీ సాధించడానికి పదుగురు కలుస్తారు. ఒక్కొక్కచో వాటిని సాకారపరచుకునే క్రమంలో గురు స్పర్శకలిగి గురుసంకల్పాలుగా చెప్పబడతాయి. రెండింటిలోనూ గురువుగారి సంపర్కం ఉంటుంది. కానీ, మొదటి సంకల్పానికి శిష్యుడు పనిముట్టు, రెండవసంకల్పానికి గురువు లేదా గురువాక్కు పనిముట్టు... మరింత విచారిద్దాం దీన్ని...

1) మా గురువుగారు ఒక దివ్య సంకల్పం చేసి కార్యం చేయమని నాకు చెప్తే, (లేదా) చిత్తశుద్ధితో ఒక మంచి సంకల్పం చేసి ఆయనకు ఎరుక పరచి అంగీకారం తీసుకుంటే దివ్య సంకల్పానికి నేను పని ముట్టుని.

2) నేను ఒక మంచి సంకల్పం చేసి గురువుగారి పేరు చెప్పుకుంటే నా సంకల్పానికి మా గురువుగారిని పనిముట్టు చేసి వాడుకున్నట్లు.. ఆయన చెప్పనిది చేయనిది నేను ఆయన చేసారని చెప్పారని చేయమన్నారని చెప్తే సమ్తింగ్ సిమిలర్ టు పుట్టింగ్ మై వర్డ్స్ ఇన్ టు హిస్ మౌత్... అనృత దోషం పట్టదూ?... సత్యాన్నప్రమదితవ్యం...


Monday, June 20, 2016

అభ్యాసమే మహావ్రతం

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

జ్ఞానినామపి చేతాంసి, దేవీ భగవతీ హి సా
బలా దాకృష్య మోహాయ, మహామాయా ప్రయచ్ఛతి!
జ్ఞానులమనసులనుకూడా బలముగ ఆకర్షించి మోహమున పడవేసే మహామాయ భగవతి! దేవి!కి నమోవాక్కములు.

       దేవీ సప్తశతిలోని శ్లోకరూప మంత్రములనే తంత్ర గ్రంథ సహాయములతో యజుస్సులుగా మార్చి చండీహోమం చేయబడుతున్నది. చండీ సప్తశతి గూర్చిఇతః పూర్వం కూడా మనం కొన్ని భాగాలు చర్చించుకున్నాం. సప్తశతి అంతా స్థూల కథలుగా అమ్మవారు మహామాయ కావించిన (జరిపించిన) రాక్షస వధ కనపడుతుంది. కైటభులను విష్ణువు ద్వారా సంహరింపజేస్తుంది. అలానే మహిషాసురుని సంహరిస్తుంది. తరవాత శుంభనిశుంభులనూ వారి వారి పరివారమైన సుగ్రీవ, ధూమ్రలోచన, చండముండ, చిక్షురుడు, ఉగ్రాస్యుడు మహాహనువు, బిడాలుడు ఇలా ఎందరో రాక్షస మూకలను దునుమాడుతుంది. ప్రయత్న పూర్వకంగా కోరిన మీదట, చేసిన ప్రార్థనలకు పరుగున వచ్చి దేవతల పక్షాన నిలచి వారిని రక్షిస్తూ ఉంటుంది. మన వాఙ్మయంలో స్థూలంగా దేవ రాక్షస యుద్ధాలన్నీ ఇటువంటి విధంగానే ఉంటాయి.

       ఇక ప్రస్తుత గ్రంథానికి వస్తే మధు కైటభులు మనకి మొదటి అధ్యాయంలోనే తటస్థిస్తారు. మధువు అంటే తీపి, ఎవరి శరీరమంటే వారికి తీపి 'మధువు'. అదే నేను అనే దురహంకారం. మధువుకి తోడు కైటభ భావం అంటే కీటభ గుణం తీపి ఉన్న చోట చుట్టూ చేరేవి కొన్ని ఉంటాయి బంధాలు వగైరా అదే నాది-మమకారం. ఒక స్థాయిలో మనోబుద్ధ్యాహంకారచిత్తాల ప్రతిరూపమైన బ్రహ్మ పైవాటి వత్తిడికి తలొగ్గలేక భగవతికి శరణాగతి చేస్తే ఆమె ప్రబోధంవల్ల జీవాత్మ (విష్ణువు) ఎరుక కలిగి నేను-నాది అహంకార-మమకారములు నశిస్తాయి. మధు కైటభులే కాదు రాక్షసులు చూసినా ఒకటే పని. అది ఏమంటే తమది కాని దాన్ని తమదిగా చెప్పుకోవడం, కోరుకోవడం, తెచ్చుకోవడం, అడ్డొస్తే ఎదురుతిరగడం యుద్ధం చేయడం. అర్హత అధికారం లేకున్నా దైవీ స్థానాలు ఆక్రమించే ప్రయత్నం చేయడం ( అన్నీ కబ్జా అనుకోవచ్చు). ఒకరు కట్టబెట్టడం వేరు తనది కాకున్నా వద్దంటే ఆక్రమించుకోవాలనుక్కోవడం వేరు. రావణుడూ అదేగా చేసింది. కైలాసాన్నే ఆక్రమిద్దామనుక్కున్నాడు పది తలలు తెగి పుత్ర మిత్రలతో వంశమంతా నాశనమయ్యేలా చచ్చాడు.

       ఇలాగే మహిషాసుర వధ చూసినా అంతే, అంతా అహంకారం, కండకావరముంది కాబట్టి  ఆదిగురువు, సృష్టికర్త, నిర్మించిన నియమాలనే ఉల్లంఘిస్తాడు. కేవలం బలముంది బలగముంది అన్ని గర్వంతో...! అంత ఉద్ధతితో ఉన్నవాణ్ణి ఎదిరించడం తేలికకాదు. కారణమొక్కటేనియమ పాలనంశిష్టులు, గురువులు, వేదం ఎలా జీవించమందో అలా జీవించే దైవీ గుణ సంపత్తి కల దేవతలు నియమోల్లంఘనం కావించలేరు. కానీ మహిషాసురుడో, వాడికి కావలసింది నియమం కాదు, వాడు గెలవడం - ఎదుటివాడు ఓడడం, ధర్మమా అధర్మమా అనవసరం. గొప్పనైన రాక్షస వధగా పురాణేతిహాసాల్లో చెప్పినా ఇదే ముఖ్య లక్షణం తప్ప ఇంకోటి ఉండదు. దీనికి అదనంగా మరికొన్ని హంగులుంటాయి. నియమోల్లంఘనం చేసినవాడు ఎన్ని చెడుగుణాలనైనా అలవర్చుకుంటాడు వీలైతే మంచిగుణాన్నీ తన కార్యానికి అనుకూలంగా సహాయంగా తెచ్చుకుంటాడు. అందులో భేషజమూ పడడు. వాళ్ళ తపస్సులలాంటివేగా మరి..! చక్కగా తపస్సు చేస్తారు, ఎందుకని విచారిస్తే నియమోల్లంఘనం చేయడానికే... మొట్టమొదటిది నేను చావకూడదు.. లేదంటే నేను ఓడిపోకూడదు.. ఎంత తపస్సు పూజాధికాలు చేసినా అక్కడే మొదలైందిఅస్మిత - నేను’. తపస్సు మంచిదే అని వాళ్ళను గొప్ప తపస్వులనగలమా... అది కుదరదు వాళ్ళ లక్ష్యమే వేరు అస్మితమమతలతో అంటకాగిపోయిందది.

       అలాగే శుంభ నిశుంభులు... మళ్ళీ అదే అహంకారం శుంభుడు అంటే అస్మితఅని చెప్పారు వ్యాఖ్యానంలో. తోడుండేది నిశుంభుడు అంటేమమత. చూడండి రెండే చండీ సప్త శతిలో మళ్ళీ మళ్ళీ చెప్పారు. అంటే వీటిని జయించడం ఎంత కష్టమైన విషయమో అర్థమౌతుందినాకు అహంకారంలేదు అనుక్కుంటాను, నేను వాటికతీతంగా ఉన్నాను ఎదుటివాళ్ళే అలా ప్రవర్తిస్తున్నారు అనుక్కుంటుంటాను. కానీ, విషయానికొచ్చేసరికి తెలుస్తుంది శుంభనిశుంభులు లోపలే ఉన్నారో,లేరో.. లౌకికంగా సంసారం నడిపించడం కోసం ఇద్దరినీ నేను పట్టుకోవడం వేరు. సంసారంలో ముంచడంకోసం ఇద్దరూ నన్ను పట్టుకోవడం వేరు.. కదూ! అది గుర్తించడమూ కష్టమే. గుర్తించడమంటే ఒప్పుకోవడమే.. అదే చాలా కష్టం. నేను అహంకార, మమకారాలతో అంటకాగిపోతూ అవతలి వ్యక్తే అందులో మునిగిపోయాడంటాను. తప్ప, ‘నేను అహంకరించానుఅని ఒప్పుకోవడం ఒక్కనాటికి నా అంతరంగంలో కూడా జరగదు,  ఎందుకంటే వారి (శుంభనిశుంభులు - అస్మిత,మమత) సైన్యంలో ఉండేవారు చండ ముండులు, సుగ్రీవుడు, ధూమ్రలోచనుడు వంటివారు.

       వీళ్ళెవరూ అని తరచి చూస్తే.. సు-గ్రీవుడు అంటే మంచి కంఠమున్నవాడు. వాడేం చేస్తాడంటే చక్కగా కబుర్లు చెప్పి వాడు చెప్పిందే నిజం, ఇంక తిరిగులేదు అనేలా చేస్తాడు. ఆఖరికి గురువేవచ్చి చెప్పనీ కాదంటాడు. గురువుగారు చెప్పిందానికే వక్రభాష్యం చెప్పి కొత్తర్థాలు తీస్తాడు. అదేగా మనకి కథలో ఆది గురువైన శివుడు దూతగా వెళ్ళి చెప్పినా శుంభనిశుంభులు వినకపోవడానికి కారణం.
      
       నా అంతవాణ్ణి నేను మధ్యలో నువ్వెవరు అనేలా కళ్ళు మూసుకుపోయేలా చేస్తాడు ధూమ్రలోచనుడు. పేరులోనే ఉంది పొగచూరిన కళ్ళవాడు. పొగ చూరితే ఏం కనిపిస్తుంది అంతా మసక మసక తప్ప సత్య వస్తువు కనపడదు. సత్య వస్తువుని కప్పి అసత్య వస్తువునే సత్యవస్తువుగా చూపిస్తుంటాడు ధూమ్రలోచనుడు.

       వీళ్ళిద్దరి ప్రభావంలో పడ్డామో అంతే.. పది మంది పెద్దలు కాదు కదా, స్వయంగా గురువే బుద్ధి చెప్పినా, ఇంటివారు చెప్పినా, హితులు చెప్పినా ఎక్కదు. ధిక్కార స్వరం పెరుగుతుంది. నియమోల్లంఘనం తీవ్రమౌతుంది. దాంతో మళ్లీ మొదలు దేవ దానవుల యుద్ధం. దేవతల పని దేవతలని చేయనివ్వడు, అకారణ ద్వేషంతోటీ, అర్హతాధికారాలు లేకున్నా నాకెందుకు దక్కవు హవిర్భాగాలు అని విపరీతత్వంతో ప్రవర్తిస్తాడు.

       అలా ఎప్పుడెప్పుడు ధర్మోల్లంఘనం నియమోల్లంఘనం జరిగినా వచ్చి అడ్డుపడి దారిన పెట్టేది నియమాలకి ఆవల ఉన్న మహాశక్తియే. ధర్మియే ధర్మాన్ని మార్చగలడు. కాబట్టి ధర్మి / మహాశక్తియే అవతార స్వీకారం చేసి రాక్షసులను దునుమాడి ధర్మ స్థాపనం కావిస్తుంది. కథ చూడండి, ఇవే అంశాలుంటాయి. లేకపోతే ఏకారణానికి ఒకే కుటుంబానికి చెందిన కశ్యప సంతానం (దితి, అదితిల సంతానం) విడిపోయారు అంటే కేవలం శుంభనిశుంభులవల్లనే (అస్మిత, మమతలవల్లనే) కాదూ??!.... దేవతలేదో పొందారు మాకివ్వలేదు అనే దుగ్ధ తప్ప, అది పొందే అర్హత అధికారం పొందాలని, అస్మితమమతల ప్రేరేపణతో యుద్ధంలో గెలవాలనే కావరం తప్ప! నిజాయితీ తపన ఏదీ? జగద్గురువు ఆదిగురువు పెట్టిన నియమానికి కట్టుబడడం ఎక్కడుందీ రాక్షసులకు. కట్టుబడి ఉండడమే, లొంగి ఉండడమే ఆధ్యాత్మికత అన్న పదానికి సామాన్య తేలిక అర్థం అది దైవీలక్షణం.

       మన సనాతన ధర్మంలో సమస్త కర్మలూ, యజ్ఞ యాగాదులూ, తపస్సులూ, యోగమూ సమస్త ఆర్ష వాఙ్మయసారమూ ఏదైనా సరే మనసుని సంస్కరించుకోవడం కోసమే, కానీ శుంభనిశుంభులు దానికి ఎప్పుడూ అడ్డువస్తారు. వారిని జయించడంకోసమే సప్తశతీ పారాయణ, చండీహోమం నిర్వహించడం తోబాటు నిరంతర అంతః పరిశీలనతోటే సాధ్యం.

       ఏ ఆఖ్యానం వింటున్నా చూస్తున్నా చదువుతున్నా  ఏది అధర్మం అని ఉన్నదో ఏది చెడు అని ఉన్నదో అది నాయందు ఉన్నదా అని పరిశీలించుకొని దాన్ని దిద్దుకునే ప్రయత్నమే అభ్యాసం. అదే సాధన. వీటిని మనలో మనం పరిశీలించుకుంటూ... మన జీవన లక్ష్యానికి, మన విశ్వప్రేమకు ఎక్కడ ఏవేవి అడ్డు వస్తున్నాయో!? ఎలా అమ్మ పాదాలు, గురువుల పాదాలు పట్టుకుని పరిశీలిస్తూ ఇలాంటి వాటినుండి పక్కకు జరిగి జీవితాన్ని పండించుకోవాలో!? చూసుకోవడమే అభ్యాసం., వ్రాయటం వల్లనో, చెప్పడం వల్లనో, కేవల విచారం వల్లనో అంతిమ లక్ష్యం సిద్ధించదు. అభ్యాసం వల్లనే అని యోగ సూత్రాల ద్వారా తెలుస్తున్నది. అదే గీతాచార్యుడు చెప్పినదీను.. “అభ్యాసమే మహావ్రతం”. దాని ద్వారానే చివరికి జ్ఞాన వైరాగ్యాలు సిద్ధించి పరమప్రయోజనమైన పునరావృత్తి స్థితిని చేరుకోగలం.

పరబ్రహ్మార్పణమస్తు.