శ్రీ గురుభ్యోనమః
నమస్తే
అమ్మ నిత్యానపాయనీం, శ్రీ విష్ణు హృత్కమలవాసిని, అయ్యవారో పద్మవతీ చరణ చారణ చక్రవర్తి... ఆ యిద్దరికీ ఎవరి కనురాపూ తగలకుండా ఎప్పుడూ ఆంతరంగా కలిసేఉన్నా బాహ్యంలో కూడా ఎప్పుడూ విడివడకుండా ఎవరికనురాపూ తగలకుండా మంగళం జయమంగళం!!
అలమేలుమంగ ఆవిర్భవిమ్చిన పర్వదినం బాహ్యంగా అమ్మ అయ్యవారితో చేరిన పర్వదినం ( అలర్ మేలు మంగై =అందమైన పువ్వు (పద్మం) మీద కూర్చున్న కోమలాంగి) సందర్భంగా శ్రీ లక్ష్మీ పంచమి (కార్తీక శుద్ధ పంచమి) శుభాకాంక్షలు..! ఈ సందర్భంగా అన్నమయగారి అద్భుత మంగళ కృతి
చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ
కూడున్నది పతి చూడి కుడుత నాంచారి
ఓ పడతులారా చూడరమ్మా! తనభర్తతో కలిసి ఉన్న ఈ చూడికుడుత నాంచారి (లక్ష్మీదేవి/ గోదాదేవి తమిళ్ లో చూడికుడుత్త నాచ్చియర్) ఈ సౌభాగ్యవతిని గూర్చి మంగళములు పాడరమ్మా!,
శ్రీమహాలక్ష్మియట సింగారాలకే మరుదు
కాముని తల్లియట చక్కదనాలకే మరుదు
సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు
కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి
సోబానె సోబానె.. సోబానె సోబానె..
ఈ శోభనవతి ఎవరో తెలుసా! ఆమెయే శ్రీమహాలక్ష్మియట, ఆమెకు సిరిసంపదలకు, సింగారాలకు ఏమిలోటు?.. ఆమె అంతందగాడైన మన్మధుని కన్న తల్లి అట, ఆమె చక్కదనానికి ఏంతక్కువ?... చంద్రునితోపాటు పాల సముద్రంలోంచి వచ్చినది, చంద్రునికి సోదరి అందమైన సొంపైన కళలు ఆమెకేంతక్కువ?.... అంత గొప్పనైన అతి కోమలమైన సుకుమారమైన అంగములు కల ఈ చూడికుడుత్త నాచ్చియార్ (లక్ష్మీదేవికి ) మంగళములు పాడరమ్మా
కలశాబ్ధి కూతురట గంభీరలకే మరుదు
తలపలోక మాతయట దయ మరి ఏమరుదు
జలజనివాసినియట చల్లదనమేమరుదు
కొలదిమీర ఈ చూడి కుడుత నాంచారి
సోబానె సోబానె.. సోబానె సోబానె..
అతి గంభీరానికి మారుపేరైన సముద్రునికి కూతురట ఆమె గాంభీర్యానికి ఏమిలోటు?... తెలుసుకుంటే ఈమెయే లోకాలని కన్నతల్లి మరి ఆ తల్లి దయకి ఏమిలోటు?... నీళ్ళలోంచి పుట్టిన చల్లని పద్మంలో నివసిస్తుంది ఆ చల్లనితల్లి చల్లతనానికేమిలోటు?... దేనికీ ఇది అని పరిమితి లేని ఈ తల్లి చూడికుడుత్త నాచ్చియార్ గురించి మంగళములు పాడరమ్మా…
అమరవందితయట అట్టీ మహిమ ఏమరుదు
అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు
తమితో శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె
కొమెర వయస్సు.. ఈ చూడి కుడుత నాంచారి
చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ
కూడున్నది పతి చూడి కుడుత నాంచారి
సోబానె సోబానె.. సోబానె సోబానె..
దేవతలందరిచేతా స్తుతింపబడి నమస్కారములచే గౌరవింపబడేతల్లికి మహిమలకేం లోటు?... అమృతమో చుట్టమే (తనతో పాటు పాల సముద్రంలో పుట్టునదే) అందువల్ల ఆనందానికేం లోటు?... అందుకే కాబోసు శ్రీ వేంకటేశ్వరుడు తానే వచ్చి కష్టపడి ఎంతో ప్రణాళిక వేసి వకుళమాతని, సప్తర్షులు పంపి, కుబేరునిఅప్పుఅడిగి కోరి కోరి నిత్యయవ్వనవతిఅయైన ఈ చూడికుడుత్త నాచ్చియార్ ని పెళ్ళిచేసుకున్నాడమ్మా... ఈ తల్లి లక్ష్మీ దేవి గురించి మీరమ్తా మంగళములు పాడరమ్మా!
సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు
చూడికుడుత్త నాచ్చియర్...ఈ ఆలోచనే రాలేదండీ..మా చిన్నప్పుడు ఈ పాట సీమంతం వేడుకల్లో పాడేవారు. అందుకని చూడి కుడుత అంటే మాతృత్వం ఇవ్వబోతున్న తల్లి అని అనేసుకున్నా..ఇప్పటికీ అలాగే అనుకుంటూ ఉంటా...ఇప్పుడు మీ టపా చదివాకా తెలిసింది.
ReplyDeleteనమస్కారం ఎన్నెల గారూ! మీకు స్వాగతం, కొన్నాళ్ళ క్రితం వరకూ నాకూ అర్తమయ్యేది కాదు, తమిళ స్పర్శ ఉన్న పదం అని అర్థమయ్యేది కానీ అసలంటూ ఏమిటి అని తెలిసేది కాదు. చాలామంది చూడికుడుత నాంచారి అని గర్భం/ చూలు తో ఉందని పాడుతారేమో... కానీ ఏదైనా సౌభాగ్య ప్రదమైనదే కదా ధన్యవాదాలు.
Deleteకానీ ఏదైనా సౌభాగ్య ప్రదమైనదే కదా!.. .నిజమేనండీ, మొన్న ఒకసారి సీమంతం వేడుకల్లో ఒకావిడ అన్నారు ఈ సందర్భంగా పాటలు లేవు ఎక్కువ అని, నేను ఇది గుర్తు చేసి రాసిచ్చాను. మీ పోస్ట్ చదివాక అరె అంత కాంఫిడెంట్ గా చెప్పేసానే తప్పా అని అనుకున్నా. కానీ ఏదైనా సౌభాగ్య ప్రదమైనదే కదా అన్న మీ మాటతో తెగ సంతోషపడిపోయా...ధన్యవాదాలండీ.
Delete