Pages

Friday, November 1, 2013

నైమిశారణ్య యాత్ర -2

నైమిశారణ్య యాత్ర - మొదటి రోజు విజయ నామ సంవత్సర ఆశ్వీయుజ పాడ్యమి (18-Oct-2013)

నైమిశారణ్యం సిద్ధి క్షేత్రం కనుక అక్కడ అందరూ కనీసం వారి వారి అనుష్ఠానాలు తప్పక చేసుకోవాలి. సాధారణంగా నైమిశారణ్యంలో అందరూ తప్పక చేసుకునేది శ్రీ సత్యనారాయణస్వామి వారి వ్రతం, భాగవత పారాయణ/శ్రవణాదులు. అక్కడ ప్రతిరోజూ ఇవి జరుగుతూనే ఉంటాయి.

నైమిశారణ్యం అడుగడుగునా పవిత్రమైనదే తరచూ ఎవరూ తిరగని చోట్ల అడవుల్లోకూడా యజ్ఙకుండాలు కనపడతాయి అలా ఎన్నో తీర్థాలూ, వృక్షరాజాలు కనపడతాయి. మాతో వచ్చిన పెద్దలు మమ్మల్నుద్దేశించి మీ వయసు వారు వచ్చి 2-3 నెలలుండి అన్నీ చూసి ఆనందించి వస్తే టైమ్ సరిపోతుందేమో మా ముసలి వాళ్ళం వారం పదిరోజుల్లో వెళ్ళిపోతామంటే కుదిరేది కాదు నైమిశారణ్య క్షేత్రం అని అంటే నామటుక్కు నాకైతే ఏమీ అతిశయం అనిపించలేదు కదా సమయం కూడా సరిపోదనిపించింది. ఐనా మనకి శాస్త్రాలు, తపోనిష్ఠాగరిష్ఠులైన మహర్షాదులు ఎక్కడికక్కడ సూక్ష్మంలో మోక్షం పొందే ఉపాయాలని అందిస్తుంటారు.

అంత గొప్ప మహిమాన్వితమైన తపోభూమిలో ఎంతని చూడగలం ఎన్ని ఆలయాలు, యజ్ఞవాటికలు, తపోభూములు ఆశ్రమాలు చూడగలం మనకు తెలియక కొన్ని సమయం లేక కొన్ని చూడడం కుదరకపోవచ్చు. అన్నీ చూసినా చూడకున్నా నైమిశారణ్య క్షేత్రంలో తప్పక చూడవలసినవి ఏవి చూస్తే నైమిశారణ్య క్షేత్ర సంపూర్ణ దర్శన ఫలితమూ వస్తాయో వాటిని సప్త స్కంధాలనీ, సప్త వినాయక స్థలాలనీ అంటారు. అవి "చక్రతీర్థం, భూతనాథం,వ్యాసం, సూతంచ శౌనకం లలితా దేవదేవేశ వందే సప్తవినాయకం"

1.     చక్రతీర్థం
2.     భూతనాథేశ్వరుడు
3.     వ్యాస గద్ది
4.     సూతగద్ది
5.     శౌనకాది మహర్షుల స్థానములు
6.     లలితా అమ్మవారి ఆలయం
7.     దేవదేవేశ్వరాలయం

ఇవి కాక ఇంకా ముఖ్యమైన వాటిలోఇక్కడికి దగ్గర్లోనే దధీచి మహర్షి ఆశ్రమం, దధీచి కుండం, రుద్రావర్తం, దేవరాజ (నైమిశ్ నారాయణ్ అని అంటారు 108 వైష్ణవ దేవలాల్లో ఒకటి), సీతమ్మ నివసించిన ప్రదేశం, అయోధ్యగా పిలిచే శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం, స్వాయంభువ మనువు-శతరూపాదేవిల తపోస్థలం, పాండవులు నివసించిన ప్రదేశం, నూతనంగా కట్టబడిన బాలాజీ ఆలయం, భద్రకాళీ ఆలయం, సాయి మందిరం. వేదపురాణ ఆలయం, ఇంకా ఎన్నో ఇతర ఆలయాలూ ఉంటాయి

ఇక మొదటి రోజు తెల్లవారుఝామున నిత్యకర్మానుష్ఠాన జపాదుల తరవాత ఉదయం 6 గంలకి ఋత్విక్కులచే పంచాయతన హోమ సంకల్పం పుణ్యాహవాచనం గణపతి పూజ, ఇత్యాది.. జరిగాయి. తరవాత ఆటో చేసుకొని కొన్ని ప్రదేశాలు చూద్దామని బయలుదేరాం...

హనుమాన్ గడి వద్ద గల వేద పురాణ మందిర దర్శనం
ఎత్తైన ఆలయ గోపురం కల ప్రాకారంలోకి వెళ్ళి ఎడమ పక్కనున్న దేవాలయంలో వేద పురుష స్వరూపంగా చిలుక రూపంలో ఉన్న శుక మహర్షిని దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు సమర్పించి కుడి వేపున ఉన్న పురాణ మందిరంలో మధ్యలో గాజుపలకలతో నిర్మించిన గది మధ్యలో చెక్క అలమారాలో పేర్చి పట్టుబట్టలతో కట్టి  ఉంచిన వేద-వేదాంగాలకి, అష్టాదశ పురాణ గ్రంధాలకి నమస్కరించి ప్రదక్షిణ మార్గంలోనే ఉన్న శుకమహర్షి, వేదవ్యాస మహర్షి పక్కనే చిన్నగా ఉన్న దక్షిణామూర్తులను దర్శించుకొని ఇతర దర్శనీయ స్థలాలు దర్శించుకోవడానికి బయలుదేరాము.

వ్యాసగద్ది (వ్యాస పీఠం)
అల్లంత దూరాన వ్యాసపీఠం ఉన్నదన్న బోర్డు కనబడగానే ఏదో తెలియని ఆనందం భక్త్యావేశం, వ్యాసమహర్షి లేని సనాతన ధర్మం, భారతదేశం ఊహించడానికి కూడా కుదరదు, ఆయన చెప్పింది వినా మరోటిలేదు, సమస్త వాజ్ఞ్మయమూ ఆయన భిక్షగానే ఇప్పటికీ మనకందుతున్నాయి  అటువంటి వేదవ్యాసులవారు అధిష్టించిన పీఠం వారు కూర్చున్న స్థలంగా చెప్పబడే దేవళం చూడడానికి, నమస్కరించడానికి నిజంగా అదృష్టం ఉండాలి. నామటుకు నాకైతే సనాతన ధర్మంలోని ప్రతిఒక్కరూ (కనీసం ఆర్థికంగానూ, అరోగ్యంగానూ వీలైన) తప్పకుండా దర్శించ వలసినదే!

వ్యాసగద్ది వద్దకు చేరుకొని నాలుగు మెట్లెక్కి ఆలయంలో పట్టు చెమికీ వస్త్రం కప్పిన సింహాసనం పక్కనే వ్యాసుల వారి మూర్తి మూర్తికి పక్కన చామరం వీస్తున్న విష్ణుపార్శ్వదులు సింహాసనానికి ఎడమపక్క శుక మహర్షి వారిని చూసి ఎంతో తన్మయత్వానికి లోనైయ్యాం. అక్కడే కొద్ది సేపు కూర్చుని వ్యాసులవారిని ప్రార్థించి నమస్కరించి సాష్ఠాంగ నమస్కారాలు సమర్పించుకొని అక్కడే ఉన్న ఆలయ అర్చకులు (మహరాజ్)ని వ్యాస గద్దిలోనికి అనుమతిస్తారా అని అడిగి పై పట్టుబట్టలతో కట్టిన ఆచ్ఛాదన లేకుండా సింహాసనాన్ని చూడడం గూర్చి విచారణ చేసాం. ఆయన సంతోషంతో మీరు లోపలెకెళ్ళి సింహాసనాన్ని తాకి దణ్ణం పెట్టుకురండి. రేపు వస్తే వస్త్రాచ్ఛాదన తీయించి మీతో అర్చన చేయిస్తాను అని చెప్పడంతో ఆనందం రెట్టింపైంది.  వ్యాసులవారి అనుగ్రహం ఉంటే చాలు అనుక్కుని ప్రదక్షిణ చేసి, వ్యాస గద్ది వద్ద భాగవతంలో ఏదైనా ఘట్టం కానీ, విష్ణు సహస్ర నామం కానీ ఉన్న రోజుల్లో ఒకరోజు పారాయణ చేద్దామనుక్కుని బయలుదేరి పక్కనే ఉన్న చ్యవన మహర్షి స్థానానికీ ప్రదక్షిణం చేసి వచ్చాం. నాలుగు మెట్లు దిగుతుంటే కుడివేపున ఉన్న శౌనక మహర్షి మూర్తికి నమస్కరించి యజ్ఞకుండానికి ప్రదక్షిణం చేసి బయటికి వచ్చాం.

పక్కనే వేల యేళ్ళనుంచీ ఉన్న పంచ వటవృక్షాలలో ఒకటైన వృక్షానికి ప్రదక్షిణం చేసి నమస్కరించి వృక్షం మొత్తాన్నీ తల పైకెత్తితే తుది కానరాలేదు, భుమిలో వేళ్ళెక్కడున్నాయో మనకి కనపడవు వెంటనే శివుని అగ్నిస్థంభోద్భవమూర్తి గుర్తొచ్చారుఆపాతాళ నభ స్థలాంత భువన బ్రహ్మాండ మావిస్పురత్ ఆ వెంటనే ఆవృక్షం కిందఉన్న వ్యాసులవారి మూర్తిని చూస్తుంటే దక్షిణామూర్తే కదలాడారు....  శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే నమః....

అదే స్థలంలో కొన్ని అడుగుల దూరంలో ఉన్న మను- శతరూప తపోస్థలం అక్కడ ఉన్న, మానవులందరికీ ఆద్యులుగా చెప్పబడి, నిర్గుణ పరబ్రహం సగుణంగా శ్రీరామ కృష్ణాదులుగా మానవులుగా మనముందు కదలాడడానికి కారణ భూతులు మనుషులందరికీ ఆది తల్లి దండ్రులుగా చెప్పబడే స్వాయంభువ మనువు- తల్లి శతరూపల తపోస్థలం నిజంగానే తల్లి దండ్రుల ఒడిని గుర్తుచేస్తుంది. అక్కడనుంచి తీర్థ రాజమైన చక్రతీర్థానికి సాగింది మా ప్రయాణం


చక్రతీర్థం
చక్ర తీర్థ స్నానం యజ్ఞవరాహ దర్శనం ముఖ్యంగా నైమిశారణ్యంలో చేయవలసినవని పెద్దలు చెప్తారు. చక్రతీర్థం దగ్గర దాని ఉత్పత్తి గూర్చి విని తెలుసుకొని, చుట్టూ ఉన్న ఆలయాలు చూసి చక్ర తీర్థంలోని నీళ్ళను చల్లుకొని ఆచమించి సంకల్పం చెప్పుకొని అక్కడ బ్రాహ్మణులకు యథాశక్తి అన్నదానానికి ద్రవ్యం సమర్పించాం. పక్కనే ఉన్న భూతనాథేశ్వరాలయంలోకి వెళ్తుంటే గోడలకిరుపక్కలా ఉన్న మనకి కుడివేపున యజ్ఞవరాహస్వామి, ఎడమవేపున కాలభైరవస్వామిని దర్శించి భూతనాథేశ్వరుని దర్శించుకొని చక్రతీర్థానికి ప్రదక్షిణ చేసి మరునాడు చక్ర స్నానానికి ఉదయమే వద్దామని సంకల్పించి కొద్దిసేపు అక్కడే ఉన్న చెక్క బల్లలపై విశ్రమించాం...

భూతనాథేశ్వరాలయం
చక్ర తీర్థానికి ఈశాన్యంలో భూతనాథేశ్వరాలయం ఉంటుంది ఆలయంలో శివలింగం గురించి వివిధ గాథలు వ్యాప్తిలో ఉన్నాయి. చక్రం నిమి పడ్డచోటునుంచి శివుడు నీటిరూపంలో పైకి ఎగిసి లోకాలను ముంచెత్తుతుంటే బ్రహ్మగారి ప్రార్థన మేరకు లలితాదేవి లింగరూపంలో నీటిమీద ఉండిపోయిందని చెప్తారు. శివలింగానికి కళ్ళూ ముక్కు చెవులూ నోరూ ఉంటాయి. మూడు పూటలా మూడు రకాలుగా కనిపిస్తారని చెప్తారు.

చక్రతీర్థానికి పశ్చిమ భాగంలో సుదర్శనాలయం ఉంటుంది అతి పురాతనమైనది పక్కనే బ్రహ్మగారి ఆలయం అలా ప్రదక్షిణ పురస్సరంగా వెళ్తూంటే లక్ష్మీగణపతి ఆలయం రాధా కృష్ణ ఆలయం ఇత్యాది కనిపిస్తాయి. అలా ఈశాన్యంలో భూతనాథాలయం దగ్గరికి వచ్చాక పక్కనే వేంకటేశ్వరస్వామి వారి ఆలయం అలా ముందుకెళితే గోకర్ణ శివాలయం, శృంగి ఆలయం ఇంకా ఇతర కొత్త ఆలయాలూ కనిపిస్తాయి. చక్రతీర్థం ప్రాంగణంలోనే పక్కనే సరస్వతీ తీర్థం ఉంటుంది (స్నానానికనువుగాలేదు). ప్రాంగణంలో అక్కడ పెద్ద పెద్ద రావి, మర్రి చెట్లుంటాయి. చక్రతీర్థం నుంచి బయటికి రాగానే కుడిపక్క ఒక చిన్న ఆలయంలో నిలువెత్తు ఆంజనేయ స్వామి వారి సుందర మూర్తి నుంచుని ఉంటుంది స్వామిని దర్శించిన తరవాత సూత గద్దివైపు సాగింది ప్రయాణం….

(మిత్రులు అడిగినట్లు అక్కడి ఫోటోలు విడిగా చివర వరుస క్రమంలో పేర్లతో సహా పొందుపరుస్తాను)

No comments:

Post a Comment