Pages

Thursday, November 7, 2013

కార్తీక పురాణము -04వ అధ్యాయం

అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే చతుర్థోధ్యాయః
శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం నాలుగవ అధ్యాయం

రాజోవాచ!
తనవాగమృతంపీత్వా తృప్తిర్నాసీన్మహామతే
కిందానంకార్తికేమాసి కిముద్దిశ్యవ్రతంచరేత్
భూయాహంశ్రోతుమిచ్ఛామి ధర్మంకార్తికసంభవం!!
తా! జనకుడడుగుచున్నాడు ఓ మునీంద్రా! నీయొక్క వాక్కు అనే అమృతాన్ని తాగుతున్న నాకు ఇంకా తృప్తి కలుగలేదు. కాబట్టి ఇంకనూ ఈ కార్తీక మహాత్మ్యమును తెలుపుము. కార్తీకమందు ఏ దానము చేయవలెను దేనిని కోరి వ్రతము చేయవలెనో తెలుపుము.

వశిష్ఠ ఉవాచ!
భూయశ్శ్రుణుష్వాఘహరం సర్వపుణ్యవివర్థనం
ప్రవక్ష్యామిమహారాజ ధర్మం కార్తిక సంభవం!!
కార్తికే మాసిసాయాహ్నె శివాగారెశుభప్రదె
యోదీపమర్చయేద్భక్త్యా తదనంత ఫలప్రదం!!
గోపురద్వారశిఖరె లింగాగ్రెనృపపుంగవ
కార్తిక్యామర్పయేద్దీపం సర్వపాపైః ప్రముచ్యతే!!
యంకుర్యాద్భక్తిభావేన కార్తిక్యామీశ్వరాలయె
గవ్యేనచఘృతేనాపి తైలాద్వామధుతైలతః!!
నారంగ తైలాద్రాజేంద్ర దీపంయశ్శంభవేర్పయేత్
సధన్యస్సర్వధర్మజ్ఞో సధర్మాత్మానసంశయః!!
తా! విశిష్ఠుడు చెప్పుచున్నాడు " ఓ రాజా! పాపములను నష్టపరచి, పుణ్యమును వృద్ధిపొందించేది అయిన కార్తీక వ్రతమును ఇంకనూ చెప్పెదను వినుము. కార్తీక మాసమందు సాయంత్రము శివాలయములందు దీపారాధన చేసిన అనంతఫలదాయకము. కార్తీక మాసములో శివాలయములో గోపురద్వారమునందు శిఖరమునందు లింగ సన్నిధియందు దీపారాధన చేసిన సమస్తపాపములు నశించును. ఎవరు కార్తికమాసమునందు శివాలయములో ఆవునేతితో కానీ, నేతితో కానీ, నువ్వులనూనెతో కానీ, యిప్పనూనెతో కానీ, నారింజనూనెతోగానీ భక్తితోదీప సమర్పణము చేయునో వాడే ధన్యుడు. వాడు సమస్త ధర్మవేత్త . వాడు ధర్మాత్ముడును అగును. అందులో సందేహములేదు.

యదితత్తభావేతు కార్తికెమాసిభూమిప
దీపమేరండతైలాద్వా యోర్పయెత్సతుపుణ్యభాక్!!
మోహేనైవాధవాదంభా ద్భక్త్యావాపార్వతీపతెః
కార్తికెచార్పయేద్దీపం సశివప్రియభాఙ్నరః!!
తా! పైన చెప్పిన నూనెలు లభించకున్నచో కనీసము ఆముదముతోనైననూ దీప సమర్పణ చేయుట పుణ్య ఫలము. కార్తీక మాసములో మోహంతో కానీ, గర్వంతో కానీ లేదా నిండు భక్తితో కానీ ఏ భావముచేతనైనా దీపమిచ్చువాడు శివప్రీతిని పొందును.

పురాపాంచాల దేశేతు రాజా భూధ్ధనదోపమః
పుత్రహీనస్తపస్తేపె గోదావర్యాస్తటేశుభే!!
స్నాతు కామస్సమాయాతః పైప్పలోమునిసత్తమః
రాజానమబ్రవీత్తత్ర కిమర్థంక్రియతేతవః!!
తతోవాచమహీపాలో మునింసత్యపచాన్వితం
మునెపుత్రవిహీనోస్మి తదర్థంతప్యతెతవః!!
తా! పూర్వకాలమందు పాంచాల దేశమున కుబేరునితో సమమైన ఐశ్వర్యము గల ఒక రాజు ఉండెడివాడు. అతడు సంతానము లేక పవిత్ర గోదావరీ తీరమున తపస్సు చేయుచుండెను. గోదావరీ స్నానార్థమై పైప్పలుడనే ముని వచ్చి రాజుని చూచి ఓ రాజా! ఎందుకు తపస్సు చేయుచున్నావు’ అని అడిగెను. ఆ మాటవిని ఆ రాజు ఓ మినీశ్వరా ! నాకు సంతానము లేదు, కాబట్టి సంతానము కొరకు తపస్సు చేయుచున్నాను’ అని చెప్పెను.

బ్రాహ్మణోవాచ!
కురుష్వభక్త్యావిప్రేభ్యో తుష్టింవాపార్వతీపతే
తేనతేపుత్రసంతానో భవిష్యతి నసంశయః!!
ఇతి తేనోదితంశ్రుత్వా ప్రహర్ష మతులంలభేత్
నమస్కృత్యగృహంగత్వాసుస్నాతః సమలంకృతః
చకారదీపదానంతు విధినేశ్వరతుష్టయే!!
తతస్తేనైవపుణ్యేన సాధ్వీగర్భమధత్తసా
ప్రాసూతకాలేసాపుత్రం ద్వితీయమివభాస్కరం!!
రాజాప్రహర్షమతులం సంప్రాప్యేవమువాచహ
సత్యం కార్తిక మాసస్య మహాత్మ్యంపురుషార్థదం
సర్వేషామేవభూతానాం సుఖహేతుర్నసంశయః!!
తస్యాభిధానంచక్రే సౌ బాలస్యపృథివీపతేః
శతృజిన్నామపుత్రస్య విప్రాస్నంపూజ్యభక్తితః!!
తా! ఆ బ్రాహ్మణోత్తముడు రాజుతో ఇట్లు చెప్పుచున్నాడురాజా భక్తితో బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టుము, అట్లయిన నీకు పుత్ర సంతానము కలుగగలదు.’ అది విన్న ఆ రాజు ఆనంద మగ్నుడై నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానము చేసి అలంకృతుడై శివప్రీతికొరకు దీప దానములను చేసెను. తరవాత ఆ పుణ్యమువలన రాజు భార్య గర్భాన్ని దాల్చి పదోనెలలో రెండవ సూర్యుడా అన్నంతగా వెలుగుతున్న కొడుకుకు జన్మనిచ్చినది. ఆరాజువిని ఆనంద పరవశుడై కార్తీక మాహాత్మ్యము సత్యమే, ఈ కార్తీక వ్రతమును ధర్మార్థకామ మోక్షములను పురుషార్థములనిచ్చును సమస్త భూతములకు సుఖము కల్గించునది కార్తీక మాసము అని చాటించెను. ఆ రాజు తన కుమారునకు శతృజిత్ అని పేరు పెట్టి బ్రాహ్మణులకు గోభూదానములనిచ్చి తృప్తి పరచెను.

తతోవృద్ధింగతో బాలో రాజపుత్రోవనీపతే
శూరస్సురూపోనృపతే త్తనయః ప్రాప్తయౌవనః!!
వారాంగనాసునిరతో పరస్త్రీరతిలాలసః
గురువిప్రజనద్వేషీ జాతిసంకర కారకః!!
నిందకోనిష్ఠురః పాపః ఖడ్గపాణిర్దురాగ్రహః
రూపయౌవన సంపన్నో నానాలంకార భూషితః!!
తా! ఓ రాజా! ఆబాలుడు క్రమముగా వృద్ధిచెంది యువకుడై శూరుడై సుందరుడై అలంకారభూషణుడై వేశ్యాంగనాలోలుడై అంతతో తృప్తి లేక పరస్త్రీలయందు ఆసక్తి కలిగి వారించిన గురువుల బ్రాహ్మణులను ద్వేషించుచూ జాతి సంకరమును కావించుచూ పరులను నిందుస్తూ, నిష్ఠూరములాడుతూ, పాపుడై, బయపెట్టుటకు నిత్యమూ ఖడ్గమును చేత ధరించి దురాగ్రహముతో తిరుగుతూండెడివాడు.

కస్యచిద్ద్విజముఖ్యస్య భార్యాపరమశోభనా
హరిమధ్యావిశాలాక్షీ బృహచ్ఛ్రోణిపయోధరా
రంభోరుశ్శుకవాణీచ సౌందర్యస్మరవిభ్రమా!!
సరాజతనయస్తాంతు దృష్ట్వాసౌందర్యతోషితః
తందృష్ట్వాసాతథారాజన్ సత్యరూపేణభామినీ!!
సాగత్వారాజతనయం ద్విజంత్యక్త్వామహానిశి
తేనసారమతెనిత్యం సంతుష్టారాజమందిరె
రాత్రిశేషంతథానీత్వా పునః పతిముపాగతా!!
తా! ఒక బ్రాహ్మణోత్తముని భార్య బహుచక్కనిది సింహపు నడుము వలె సన్నని నడుము గలది, పెద్ద కన్నులు కలది, చక్కని అంగసౌష్ఠవము కలది, చక్కని కంఠ స్వరము కలదియై మన్మథోద్రేకము కలది. రాజ కుమారుడు అట్టి బ్రాహ్మణుని భార్యను చూసి ఆమె సౌందర్యమును చూసి సంతోషించి ఆమెయందాసక్తి కలవాడైయ్యెను, ఆమెయును రాజకుమారుని యందాసక్తి కలదయ్యెను. తరవాత బ్రాహ్మణుని భార్య నిశిరాత్రి భర్తను విడిచి రాజకుమారునితో రాత్రిశేషమంతయునూ క్రీడించి ఉదయాత్పూర్వమే తిరిగి ఇంటికి వచ్చుచుండెను. ఈ ప్రకారముగా అనేక దినములు గడచినవి.

తత్ జ్ఞాత్వాసద్విజః కోపా ద్భార్యాందృష్ట్వాతినిందితాం
ఖడ్గపాణిస్సకోపేన తస్యాశ్చోపపతేన్నృప
వథోపాయంస్మరన్నిత్యం యేనకేనావ్యుపాయతః!!
కదాచిత్కార్తికేమాసి పౌర్ణమ్యామిందువాసరే
దిష్ట్యా శివాలయంగత్వా రాజపుత్రస్తయాసహ!!
సాకరోద్వర్తికాసుభ్రూ శైలాంతేనైవభూమిప
సరాజపుత్రోమోహేన తైలమేరండకంస్వయం!!
దీపంసాదీపపాత్రేతు ప్రజ్వాల్యాతి ప్రయత్నతః
సంస్థాప్యవెదికాయాంచ శివాగ్రెవ్యభిచారిణీ!!
తత్రతత్తేజసారాజన్ సురతోత్సాహనిర్భరైః
కామశాస్త్ర కలాపైశ్చ క్రీడాంచక్రతురాదరాత్!!
తా! ఆసంగతిని బ్రాహ్మణుడు తెలుసుకొని నిందితమైన నడతగల భార్యను ఆమెతో ప్రియుడైన రాజకుమారుని చంపుటకు చేత కత్తిని పట్టుకుని ఎప్పుడు చంపుటకు వీలు దొరుకునా అని కాలముకొరకై నిరీక్షించుచుండెను. ఇట్లు కొంత కాలము గడచిన పిదప ఒకప్పుడు కార్తిక పూర్ణిమా సోవవారము నాడు ఆ రాజకుమారుడు బ్రాహ్మణ భార్యయు తమకు సంభోగ స్థానము దొరకక ఒక శివాలయములోనికి పోయి చీకట్లో క్రీడించుటకు వీలు కాక దీపము వెలిగించుటకై బ్రాహ్మణి తన చీర చింపి వత్తిని చేసెను, ఆరాజకుమారుడు ఆముదమును తేగా ఆవత్తితో వారు వారి సుఖము కొరకై మోహముతో దీపమును వెలిగించి అరుగు మీద పెట్టి తరవాత వారిద్దరూ అత్యుత్సాహముతో క్రీడించుచుండిరి.

ఆత్మానంగోపయిత్వాతు శనైర్గత్వాతదాలయం
కవాటం సుస్థిరంబధ్వా ఖడ్వమాదాయకోపతః!!
చిచ్ఛేదరాజతనయంతతో భార్యాంనరాధిప
రాజసూనుశ్శనైస్స్థిత్వా జఘ్నివా నసినాచతం!!
జీర్ణ దేవాలయేదైవా దన్యోన్యాఘాతయోగతః
త్రయోపిమరణంజగ్ముః కార్తిక్యామీశ్వరాలయే!
మోహాత్కార్తిక పౌర్ణమ్యా మిందువారెశివాలయె
పౌర్ణమ్యామిందువారేతు సర్వపుణ్యఫలప్రదె!!
తా! అంత ఆ బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారు వేషములో జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని నరికి తరవాత భార్యను నరికెను. అంతలో రాజకుమారుడు ఓపిక తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుని నరికెను. ఇట్లు పరస్పర ఘాతములచేత ఆ జీర్ణదేవాలయమందు ముగ్గురూ విగతజీవులైరి. ఆ దినము కార్తీక పూర్ణిమ సోమవారము దైవ వశము చేత అట్టి పర్వమందు వారి ముగ్గురికి శివాలయములో శివుని సన్నిధియందు మరణము గలిగినది.

తదాగతయమభటాః పాశహస్తాభయంకరాః
శివదూతాస్తదాజగ్మూ రుద్రలోచనభీతిదాః!!
అథతాంరాజపుత్రంచ విమానేసన్నివేశ్యచ
పాదౌచాబధ్యతంవిప్రం యమదూతెస్సుదారుణా!!
ఏవంభిన్నాంగతిందృష్ట్వా తానాహద్విజసత్తమః
తావుభౌతుల్యపాప్మానౌ కులటానృపపుత్రకౌ
అహంద్విజవరఃపుణ్యః గతిభేదోహ్మభూదిహ!!
తా! అంతలో పాశహస్తులై యమ కింకరులు వచ్చిరి, అప్పుడే శివనేత్ర ధారులై శివకింకరులూ వచ్చిరి. శివదూతలు రాజకుమారుని, బ్రాహ్మణిని విమానమును ఎక్కించిరి, యమదూతలు బ్రాహ్మణుని కాళ్లుగట్టి తీసుకొని పోవ ప్రయత్నించిరి. ఇట్లు జారులైన తన భార్య, రాజకుమారుని విమానమెక్కించుట చూసి శివదూతలతో బ్రాహ్మణుడిట్లనె " ఓ శివ దూతలారా! నా భార్య, ఈ రాజ కుమారుడు జారులు, నేను బ్రాహ్మణుడనై సదాచారవంతుడనుకదా, మరి నాగతి ఇదేమి వారికా ఉత్తమగతేమి’ అని అడిగెను.

శివదూతాః స్తతఃప్రోచు ర్బ్రాహ్మణందీనమానసం
మోహాత్కార్తికపౌర్ణమ్యామిందువారెశివాలయే!!
ఏషాచాతి దురాచారా వస్త్రఖండేనవర్తికాం
చకారతేనపుణ్యేన సర్వ పాపక్షయాభవేత్!!
అనేనదీపపాత్రంచ తైలమేరండసంభవం
సర్వపాపక్షయమభూత్పుణ్యం తత్తైలపాత్రయోః!!
దానేనైవాథవామోహాత్కార్తిక్యాంశంకరాలయె
యోర్పయేద్దీవమేకంవా సధన్యస్సర్వయోగినామ్!!
తా! అనంతరం అతి దీనవదనుడైన బ్రాహ్మణునితో శివదూతలు ఇట్లు పలికిరి. ఓ బ్రాహ్మణుడా! నీవన్నమాట సత్యమే, కాని ఇందు ఒక విశేషమున్నది. ఈ నీ భార్య రాకుమారుడు పాపకర్మములు చేసినవారైననూ, కామ మోహముచేత కార్తిక పౌర్ణము సోమవారము నాడు శివాలయమున దీపారాధనము కావించిరి. దీపమునకు వత్తిగా తన చీరను చింపి నీ భార్య ఇచ్చినది, రాకుమారుడు ఆముదమును తెచ్చెను కాబట్టి వారి పాపములన్నీ క్షయములైనవి. ఏ కారణము చేతనైననూ కార్తీక మాసమునందు దీపదానము చేసినవాడు ధన్యుడు సర్వ మహాయోగులందు శ్రేష్ఠుడు అగును. కనుక దీపార్పణము వలన నీ భార్యకు, ఈ రాకుమారునికి కైలాసము. దీపదానము చేయనందుకు నీకు నరకము సిద్ధించినది.

ఇతితైరుదిత శ్రుత్వా రాజసూనుర్దయాన్వితః
దాస్యామి దీపదానస్య ఫలం విప్రవిముక్తయె
ఏక కాలమృతానాంచ గతిరేవావశిష్యతే!!
ఇత్యుక్త్వాప్రదదౌపుణ్యం కార్తికేమాసి సంభవం
తేనపుణ్యప్రభావేన సముక్తో యమపాశతః!!
దివ్యం విమానమారుహ్యయయౌశివనికేతనం
యయురల్పేనపుణ్యేన తదా తేశివమందిరం!!

తా! శివదూతలు ఈ విధముగా చెప్పగా వినిన రాకుమారుడు దయావంతుడై అయ్యో ఈ బ్రాహ్మణుని భార్యతో క్రీడించి, ఈ బ్రాహ్మణునిచేతిలో శివాలయములో హతుడనైన నాకు కైలాసము ఇంత సదాచారవంతునికి నరకమా! ఇది చాలా దుఃఖ కరము. కాబట్టి నా దీపదాన పుణ్యము ఈ బ్రాహ్మణునకిచ్చెదను యేక కాలమున మృతినొందిన మా ముగ్గురికి సమానగతియే ఉండవలెను. అని ఆలోచించి తన దీపదాన పుణ్యమునందు కొంత బ్రాహ్మణుని పరం చేసెను. అంత ఆపుణ్య ఫలమున ఆ మువ్వురునూ దివ్య విమానమెక్కి కైలాసమును చేరిరి. మోహముచేత చేయబడిన దీపదాన పుణ్యమే ఈ మువ్వురినీ కైలాసమునకు తీసుకొని పోయినది.

తస్మాత్సర్వప్రయత్నేన కార్తిక్యాంధర్మ మాచరేత్
నాచరేద్యదిమూఢాత్మా రైరవంనరకంవ్రజేత్!!
యం కార్తికేమాసి రాజన్ మాసమేకం నిరంతరమ్
శంకరస్యాధవావిష్ణోర్దేవదేవస్యచక్రిణం!!
దీపమాలార్పణంకుర్యానపు నర్జాయతే భువి
సోపిజ్ఞానమనుప్రాప్య ముక్తోభవతినిశ్చితం!!
స్త్రియో వా పురుషోవాపి కార్తికే కేశవాగ్రతః
స్వశక్త్యాచార్పయేద్దీపం సర్వపాపవిముక్తయే!!
తస్మాత్త్వమపి రాజేంద్ర కార్తికే గిరిజాపతే
మందిరేదీపమాలాంతు సమర్పయనసంశయః!!

తా! కాబట్టి కార్తీక మాసమందు కార్తీక ధర్మమాచరించవలెను, అట్లు చేయనివాడు రౌరవ నరకమును పొందును. కార్తీక మాసమందు నిత్యము శివాలయమందుగాని, విశ్ణ్వాలయమందుగాని దీపమాలను సమర్పించిన ఆ దీపదాన పుణ్యముతో జ్ఞానమును పొంది తద్ద్వారా పునరావృత్తి రహిత భగవత్సాన్నిజ్యమును పొందును. సందేహమేమీ లేదు. కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్త్రీ గాని, పురుషుడు గానీ తన శక్తి కొలది దీపార్పణం చేసినచో సర్వపాపనాశనము పొందెదడు. కాబట్టి నీవును శివాలయమందు తప్పక కార్తీకమందు దీపమాలలను అర్పించుము.

ఇతి స్కాందపురాణే కార్తిక మహాత్మ్యె చతుర్థోధ్యాయస్సమాప్తః
ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి నాలుగవ అధ్యాయము సమాప్తము.
 
సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు
మీ
శ్రీ అయ్యగారి సూర్యనాగేంద్ర కుమార్ శర్మ
www.sri-kamakshi.blogspot.com
Visit this group at http://groups.google.com/group/satsangamu?hl=te-IN.

~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
జయ జయ శంకర హర హర శంకర
No comments:

Post a Comment