Pages

Friday, November 8, 2013

కార్తీక పురాణము (సంస్కృత మూల సహితం) - 05వ అధ్యాయం

అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే పంచమోధ్యాయః
శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం ఐదవ అధ్యాయం

వసిష్ఠ ఉవాచ
ఆచరేత్కార్తికేమాసి నారీవాపురుషోపివా
పాపక్షయార్థంరాజేంద్ర కార్తికెయత్రభాజనం
యద్వాచరతిరాజేంద్ర ఫలమక్షయమశ్నుతె!!
యః కార్తికె హరెరగ్రేగీతాపాఠం కరిష్యతి
ససర్వపాపనిర్ముక్తః జీర్ణత్వచమివోరగః!!
కార్తికేతులసీ పత్రైః కరవీరైస్సితాసితైః
అలంకరోతిసద్భక్త్యా విష్ణుమాద్యంజగద్గురుం
సవిష్ణోర్మందిరంప్రాప్య విష్ణునాసహమోదతే!!
తా! వశిష్ఠ మహర్షి తిరిగి చెప్తున్నారుఓ జనక మహారాజా! వినుము కార్తీక మాసమందు పాప క్షయము కొరకు పుణ్య కార్యాచరణము చేయవలెను. పుణ్యకార్యాచరణముచేత పాపము నశించుటయే గాక పుణ్యమధికమగును. కార్తీక మాసమందు శ్రీ హరి సన్నిధిలో భగవద్గీతా పారాయణము చేయుటవలన పాము కుబుసము వలె పాపములు విడువబడును. కార్తీక మాసమున తులసీదళంతోనూ, తెలుపు, నలుపు అయిన గన్నేరు పూలతోను హరిని పూజించిన వైకుంఠముచేరి హరితో కూడగలడు.

విభూతింవిశ్వరూపంచ కార్తికేకేశవాగ్రతిః
యోజపేద్భక్తియోగేన సవైకుంఠేశ్వరోభవేత్!!
పాదం వా శ్లోకమేకంవా పురాణం కార్తికే హరెః
అగ్రతఃకురుతేరాజన్ సముక్తస్సర్వకర్మభిః!!
తా! కార్తీక మాసమందు భగవద్గీతలోని విభూతి, విశ్వరూప సందర్శన అధ్యాయములను శ్రీ హరి సన్నిధిలో పారాయణ చేయువాడు వైకుంఠాధీశునితో సమమగును. కార్తీక మాసమందు హరి సన్నిధిలో శ్లోకముగానీ, శ్లోక పాదముగానీ పురాణము చెప్పినవారునూ, విన్నవారునూ కర్మబంధ వినిర్ముక్తులగును.

యః కార్తికెసితేపక్షే వనభోజనమాచరేత్
సయాతి వైష్ణవంధామ సర్వపాపైః ప్రముచ్యతే!!
జపహోమార్చనెకాలే భోజనేపితృ తర్పణె
చండాల పతితానాంచ శూద్రసూతకభాషణం
శ్రుత్వాసమాచరేద్ధీమాన్ కార్తికేవనభోజనమ్
తా! కార్తిక మాసమందు శుక్ల పక్షమందు వనభోజనము చేయువారికి సమస్త పాపములు నశించును. ఇతర కాలములలో జపకాలమందు హోమ కాలమందు పూజాకాలమందు భోజన కాలమందు తర్పణ కాలమందు మాట్లాడకూడని వారితో నూ యొక్క పాపాత్ములతోనూ అశౌచవంతులతోనూ సంభాషణములను వినిన దోషపరిహారము కొఱకు కార్తీక మాస వన భోజనమాచరించవలెను.

నానాద్రుమలతాకీర్ణె వనెచామలకాగ్రతః
సమభ్యర్చ్య విధానేన సాలగ్రామనివాసినం
దామోదరంజగద్వంద్యం గంధపుష్పాక్షతాదిభిః!!
యథావిత్తానుసారేణ విప్రాన్ సంపూజ్యభక్తితః
ఏవంయఊర్జెమాసెస్మిన్ వనభోజనమాచరేత్!!
సస్ర్వపాపనిర్ముక్తో యద్యత్కాలాదిసంభవైః
తస్మాత్సర్వ ప్రయత్నేన వనభోజనమాచరేత్!!
తా! ఈ వన భోజనములెట్లు చేయవలెననగా.. అనేక వృక్ష జాతుల సమూహముచే కూడినదైన వనమునందు, ఉసిరిక చెట్టు వద్ద సాలగ్రామమునుంచి గంధ పుష్పాక్షతాదులతో పూజించి శక్తికొలది బ్రాహ్మణులను పూజించి బ్రాహ్మణులతో కలిసి భోజనము చేయవలెను. ఇట్లు కార్తిక మాసమునందు వనభోజనము చేసిన ఆయా కాలములందు చేసిన సమస్త దోషములు, పాపములు నశించి విష్ణులోకమునందు సుఖముగా ఉండెదరు. కాబట్టి తప్పక కార్తీక మందు వనభోజనము ఆచరించవలెను.

పురాణ శ్రవణం భక్త్యా మహాత్మ్యంకార్తికస్యచ
యథావిప్రసుతోముక్తో రాజన్ దుర్యీని సంకటాత్!!
కోవిప్రసూనుః కింకర్మ కృతవాన్ కేసముచ్యతె
తద్బ్రహ్మన్ సమాచక్ష్వ శ్రోతుముచ్ఛామిసాంప్రతం!!
తా! కార్తీక మహాత్మ్యము భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడైన దుర్యోన సంకటము వలన ముక్తుడాయెను. అని వశిష్ఠమహర్షి పలికెను. అంత జనక మహారాజుఓ మునీశ్వరా! బ్రాహ్మణునికుమారుడైన ఈ దుర్యోనుడెవ్వడు? వాడేకర్మ చేసెను? దేని చేత విముక్తుడాయెను. ఈ వృత్తాంతమును వినవలెనని కుతూహలముగ నున్నది కనుక దయతో చెప్పుముఅని ప్రార్థించెను.

వసిష్ఠ ఉవాచ
శ్రుణురాజన్ ప్రవక్ష్యామి కావేర్యావైతటె శుభే
దేవశర్మ ఇతిఖ్యాతో వేద వేదాంగపారగః!!
తస్యసూనుర్దురాచారో తమాహస్వసుతంపితా
వక్ష్యామిశ్రుణుతెపుత్ర సర్వపాపవిముక్తయే!!
కురుష్వకార్తికె మాసి స్నానం కేశవ పూజనం
దీపమాలార్పణంతస్య విష్ణోరమితతేజసః!!
ఇతిశ్రుత్వాసుతస్తస్య పితరంపునరబ్రవీత్
కుతఃకార్తిక ధర్మేతి తన్న కార్యం మయాక్వచిత్!!
తా! విశిష్ఠుడు చెప్పుచున్నాడుజనక మహారాజా! చెప్పెదను వినుము, కావేరీ తీరమందు దేవశర్మయను బ్రాహ్మణుడు వేద వేదాంగ పారీణుడు కలడు, అతనికి దురాచారవంతుడైన ఒక కుమారుడు కలడు, అతని దుర్మార్గము చూసి, తండ్రి నాయనా నీకు పాపములు నశించెడి మాటను చెప్పెదను వినుముఅని ఇట్లు చెప్పసాగెను. ’అబ్బాయీ కార్తీక మాసమందు ప్రాతః స్నానము చేయుము సాయం కాలములో హరిసన్నిధిలో దీపమాలను సమర్పించుము.’ అంత ఆ కొడుకు ఈ మాట విని అసలీ కార్తీక మాసధర్మమంటే ఏమిటి? ఈ కార్యాన్ని నేనెప్పుడు చేయవలెను (నేను చేయడమా అనినట్లు)’ అని పరుషముగా బదులిడెను.

తచ్ఛ్రుత్వాకోపతామ్రాక్ష శ్శశాపసుతమంచసా
మూషకోభవదుర్బుద్ధే అరణ్యేదృమకోటరే!!
అయాచతవిశాపంచ పశ్చాత్తాపేనభూమివ
దురాచారస్యమేతాత కథంముక్తిర్భవిష్యతి!!
సచాహకార్తికంధర్మం యదాశ్రోష్యసిపుత్రక
ముక్తిస్తెభవితానూనం తస్య పుణ్యప్రభావతః!!
తా! అంత ఆ తండ్రి కోపగించిఓరి దుర్మార్గుడా! ఎంత మాట అన్నావు! నువ్వు అరణ్యములో చెట్టుతొఱ్ఱలో ఎలుకవై ఉండుముఅని శపించెను. ఆ శాపమును విన్న దుర్యోనుడు, తండ్రీ నాగతియేమి నాకు ముక్తి ఎప్పుడు అని అడుగగా తండ్రివిని పశ్చాత్తప్తుడై శాపవిమోచనమార్గమును చెప్పెను.’ కుమారా నీవు కార్తీక మాహాత్మ్యమును ఎప్పుడు వినెదవో అప్పుడు నీకు మూషకత్వమునుండి విముక్తి కలుగునుఅని చెప్పెను.

ఇత్యుక్త్వావిరతెశీఘ్రం సుతః పితరిసోప్యథ
తత్క్షణాన్మూషకోభూత్వా గజారణ్యెద్రుమెనృప!!
సుఫలేసర్వజీవానామాశ్రయేచసుఖప్రదే
తా! తండ్రి చెప్పిన మాటలు వినగా ఆ కుమారుడు అప్పుడే ఎలుకయై గజారణ్యమందు ఫలములతో గూడి అనేక జంతువుల కాధారమై, సకల వృక్షసమూహమైన ఆ అడవినందు నివసించుచుండెను.

ఏవమంతరితె కాలె తత్రాగాత్కౌశికోమునిః!!
శిష్యెభ్యః కార్తికస్నానం కృత్వాతన్మూలమాశ్రితః
పురాణపఠనంతత్ర మహాత్మ్యంకార్తికస్యచ!!
చకారభక్తి భావేన తన్మూలెనరపుంగవ
తదాకశ్చిద్దురాచారో వ్యాధః చాపధరఃశఠః!!
మృగయాసంచరన్నాగాత్ప్రాణిహింసాపరాయణ
విప్రాన్ హంతుసముద్యుక్తో దయాహీనో ఘమూర్తిమాన్!!
తేషాందర్శనతోద్భూతా సంజ్ఞాసర్వార్థదాయినీ
తానువాచతతఃప్రీతః కిమిదంకర్మ ఉత్తమం
తేనైవముక్తోరాజర్షిర్విశ్వామిత్రస్తమబ్రవీత్
తా! ఇట్లు కొంత కాలము గడచిన తరవాత ఒకప్పుడు విశ్వామిత్ర మహర్షి శిష్యులతో సహా కార్తిక స్నానం చేసి ఒక వృక్షము మొదటి భాగమందు కూర్చొని కార్తీక మహాత్మ్యమును భక్తితో చెప్పుచుండెను. అంత దురాచారుడు, దయాహీనుడు ఐన ఒక వ్యాధుడు వేట నిమిత్తము అటు వచ్చి, అక్కడి బ్రాహ్మణులను పాపాత్ముడై చూసి సంహరించుటకు నిశ్చయించుకొనెను. అంతలోనే విశ్వామిత్ర మహర్షిని చూచినంత పురుషార్థదాయకమైన జ్ఞానము కలిగి సంతోషించి అయ్యా ఇదేమిటి మీరేమి చేయుచున్నారు దీని వలన ఫలమేమి అని అడిగగా విశ్వామిత్ర మహర్షి ఆ కిరాతునకు ఇట్లు చెప్పుచున్నారు...

విశ్వామిత్ర ఉవాచ
శ్రుణువ్యాధప్రవక్ష్యామి బుద్ధిస్తేవిమలోదయా
ధర్మః కార్తిక మాసస్య నరాణాం కీర్తివర్ధనః
కార్తికె మాసియోమోహాత్ స్నానందానాదికంచరేత్
సర్వపాపవినిర్ముక్తో యాతి విష్ణోఃపరంపద!!
భగవద్భక్తిభావేన కార్తికేమాసిమానవః
ధర్మంసమాచరేత్సద్యో జీవన్ముక్తోనసంశయః!!
తా! విశ్వామిత్రుడు ఇలా చెపుతున్నాడుఓ కిరాతా! వినుము, నీ బుద్ధి మంచిదైనది, ఇది కార్తీక ధర్మము, ఈ ధర్మము మనుష్యులకు కీర్తినిచ్చును. కార్తిక మాసమందు మోహముచేత నైనా సరే స్నానాదికములు చేసిన వాడు పాపవిముక్తుడై వైకుంఠలోకమును చేరును. కార్తిక మాసమందు భక్తి శ్రద్ధాసంయుక్తుడై స్నానదానాది వ్రతములను ఆచరించువాడు జీవన్ముక్తుడగును.  అందు సందేహము లేదు.

వ్యాధః ప్రత్యుక్తమాకర్ణ్య ధర్మంచఋషిణానృప
మూషకస్తత్తతచ్ఛ్రుత్వాముక్తదేహస్తతోభవత్!!
విశ్వామిత్రస్తుతందృష్ట్వా సబభూవాతివిస్మితః
నివేద్యసకలంకర్మ విప్రసూనురుదారధీః!!
సద్యస్సందర్శయర్తత్ర వ్యాధాయైతత్ఫలంనృప
అనుజ్ఞాతో యయౌశీఘ్రం విప్రసూనుస్స్వమాశ్రయం!!
తా! విశ్వామిత్రమహర్షి ఇట్లు కిరాతునకు చెప్పిన కార్తీక ధర్మము వృక్షమున తొఱ్ఱలో ఉన్న మూషకము విని  వెంటనే మూషక రూపమును వదిలెను. విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయిచూడగా, ఆ బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతమంతయును తెలిపి విశ్వామిత్ర అనుజ్ఞతో తన ఆశ్రయమైన తన తండ్రిదరికి పోయెను.

వ్యాధోపిసకలంతస్మాచ్ఛృత్వావాపశుభాంగతిం
ఇచ్చంతియదియేలోకే గతిమత్యంత దుర్లభాం!!
కార్తికస్యచమహాత్మ్య శ్రవణం చాభ్యసేచ్ఛుధీః
పుణ్యం తేవాధికం ప్రాప్య ప్రయాతి పరమాంగతిం!!
తస్మాత్సర్వప్రయత్నేన కార్తికేధర్మమాచరేత్
ఇదంసత్యమిదంసత్యం చిథాత్రానుశ్రుతంమయా!!
పురాణేషుమతింరాజన్ కురుసమ్యక్ర్పయత్నతః
యాస్యసిత్వంపుణ్యగతిం నాత్ర కార్య విచారణా!!
తా! కిరాతుడు మూషకము దేహత్యాగము చేసి బ్రాహ్మణ కుమారుడుగ మారుటను బట్టిమ్, కార్తీక వ్రత ధర్మములను పూర్తిగా విశ్వామిత్ర మహర్షి చేత తెలుసుకుని వైకుంఠమును చేరెను. ఉత్తమ గతులను కోరువారు ఈ కార్తీక మహాత్మ్యమును ప్రయత్న పూర్వకముగ వినవలెను. విన్నంతనే పుణ్యవంతులై అంత్యమును పరమును పొందెదరు. కాబట్టి తప్పక కార్తీక వ్రతమాచరించవలెను. ఇది నిజము నిజము నాకు బ్రహ్మ చెప్పినాడు. రాజానీవు పురాణములందు బుద్ధినుంచుము. అట్లైన పుణ్యగతికి పోయెదవు ఈ విషయమై విచారణతో పనిలేదు ఇది నిశ్చయము.

ఇతి స్కాందపురాణే కార్తిక మహాత్మ్యె పంచమోధ్యాయస్సమాప్తః
ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి ఐదవ అధ్యాయము సమాప్తము.

సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు

మీ
శ్రీ అయ్యగారి సూర్యనాగేంద్ర కుమార్ శర్మ
Visit this group at http://groups.google.com/group/satsangamu?hl=te-IN.

~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
जय जय शंकर हर हर शंकर

No comments:

Post a Comment