అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే సప్తమోధ్యాయః
శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం ఏడవ అధ్యాయం
శ్రీ వసిష్ఠ ఉవాచ
పునః కార్తిక మహాత్మ్యం ప్రవక్ష్యామిసమాసతః
తచ్ఛ్రుణుష్వనరశ్రేష్ఠ ప్రసన్నేనాంతరాత్మనా
యః కార్తికేయజేద్భక్త్యా కమలైఃకమలేక్షణం
తస్యగేహేవసేన్నిత్యం కమలానాత్రసంశయః
దేవేశంభక్తియోగేన తులసీజాతిపుష్పకైః
అర్చయేద్యదిమాసెస్మిన్ సచభూయోనజాయతె
కార్తికేబిల్వపత్రేణ విష్ణుంవ్యాపకమీశ్వరం
యఃపూజయేన్నరశ్రేష్ఠ నతుభూయోభిజాయతె
తా! వసిష్ఠ మహామును ఇట్లు చెప్పుచున్నారు. ’ ఓ జనక మహారాజా! వినుము కార్తీక మహాత్మ్యము ఇంకా చెప్పెదను. ప్రసన్న చిత్తుడవై వినుము. కార్తిక మాసమునందు ఎవరు కమలములచేత పద్మపత్రాయతాక్షణుడైనటువంటి శ్రీ హరిని పూజింతురో వారి ఇంట పద్మవాసిని ఐన లక్ష్మీదేవి నిత్యమూ వాసము చేయును. ఈ మాసములో భక్తితో తులసీదళములతోనూ, జాతి పుష్పములైన జాజి, మందార, పున్నాక, చంపక ఇత్యాదులతోనూ శ్రీ హరిని పూజించువాడు తిరిగి భూమిమీద జన్మించడు. ఈ మాసమున మారేడుదళములతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించినవాడు తిరిగి భూమిమీద జన్మించడు.
కార్తికెఫలదానంచ యఃకుర్యాద్భక్తిసంయుతః
పాపానివిలయంయాంతి తమాంసీవారుణోదయె
యోధాత్రీఫలమూలేతు దృష్ట్వావిష్ణుంప్రపూజయేత్
యమస్తంనేక్షితుంశక్తో నాత్ర కార్యావిచారణా
సాలగ్రామార్చనం రాజన్ ఊర్జెమాసి ప్రయత్నతః
తులసీదళైరర్చయేచ్చ యస్సధన్యోనసంశయః
యోవనేభోజనంకుర్యాద్విప్రైస్సార్థంనృపోత్తమ
కార్తికేతేననశ్యంతి మహాపాతకకోటయః
ధాత్రీవృక్షసమీపేతు సాలగ్రామార్చనంనరః
యఃకుర్యాద్రాజశార్దూల కార్తికేబ్రాహ్మణైస్సహ
సవైకుంఠపురంప్రాప్య విష్ణువన్మోదతేచిరం
తా! కార్తీక మాసమందు భక్తితో పండ్లను దానమిచ్చిన వానిపాపములు సూర్యోదయము కాగానే చీకటి తొలగినట్లు నశించును. వుసిరిక కాయలతో ఉన్న వుసిరి చెట్టు క్రింద శ్రీ హరిని పూజించు వానిని యముడు చూడడానికి కూడా శక్తికలిగి యుండడు. కార్తీక మాసమున తులసీ దళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును, దానిలో సందేహమేలేదు. కార్తికమాసమందు బ్రాహ్మణులతోకూడా వనభోజన మాచరించు వాణి మహాపాతకములన్నీ నశించును. బ్రాహ్మణులతో కూడి వుసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణుపదమొందును.
యఃకార్తికేమాసి భక్త్యాతోరణం చూతపల్లవై
దామోదరాగ్రెయఃకుర్యాత్సయాతిపరమాంగతిం
కదళీస్తంభపూజాంచ యఃకుర్యాత్కార్తికేహరెః
పుష్పైర్వామంటపంవిష్ణోస్సవైకుంఠేచిరంవసేత్
కార్తిక్యాంకేశవస్యాగ్రెనమస్కుర్వంతియేసకృత్
సర్వపాపవినిర్ముక్తా అశ్వమేధఫలంస్మృతం
కార్తికేతుహరెరగ్రె జపయోమనురార్చనం
యఃకుర్యాద్యాతివైకుంఠం పితృభిస్సహభూమివ
కార్తికేవస్త్రదానంచ యఃకుర్యాత్స్నానశీతలే
సోశ్వమేధాయతానాంచ ఫలంప్రాప్నోత్యసంశయః
తా! కార్తీక మాసములో భక్తితో శ్రీ హరి ఆలయమును మామిడి ఆకులతో తోరణము కట్టినవానికి మోక్షము దొరుకును. శ్రీ హరికి అరటి స్తంభములతో గానీ, పువ్వులతో గానీ మంటపాన్ని నిర్మించి పూజిమ్చినవానికి వైకుంఠమందు చిరకాలవాసము కలుగును. ఈ కార్తీక మాసమందు ఒక్కసారైనా హరి ముందు సాష్ఠాంగ ప్రమాణము చేసినవారు పాపముక్తులై అశ్వమేధయాగఫలాన్ని పొందెదరు. హరి ఎదుట జపము, హోమము, దేవతార్చనము చేయడం వలన పితృగణములతో సహా వైకుంఠానికి పోదురు. ఈ మాసము స్నానము చేసి తడిబట్టతోనున్నవానికి వస్త్రదానము చేయువాడు పదివేల అశ్వమేధయాగములు చేసిన ఫలాన్ని పొందెదడు.
యఃకార్తికేమాసివిష్ణో శ్శికరేధ్వజమర్చయేత్
తేనశ్యంతిపాపాని వాయునాపాంసవోయథా
కార్తిక్యామతసీపుష్పైరర్చయేదచ్యుతంనరః
సితాసితైర్వారాజేంద్ర యజ్ఞాయుతఫలంలభేత్
బృందావనాగ్రెకార్తిక్యాం గోమయేనోవలిప్యచ
స్వస్తికైశ్శంఖపద్మాద్యై ర్యాకుర్యాత్సాహరిప్రియా
తా! కార్తీక మాసమందు విష్ణువుయొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణము చేయువాని పాపములు గాలికి కొట్టుకొని పోయిన ధూళి వలె నశించును. ఈ మాసములో నల్లవి కానీ తెల్లవి కానీ అవిసిపువ్వులతో శ్రీ హరిని పూజించిన పదివేల యజ్ఞములు చేసిన ఫలము కల్గును. ఈ మాసములో బృందావనమున ఆవు పేడతో అలికి, రంగవల్లులలో శంఖ పద్మాదులను తీర్చిదిద్దిన మగువ శ్రీ హరికి ప్రియురాలగును.
నందాదీపంతు కార్తిక్యామర్పయేద్విష్ణుమందిరే
తత్ఫలస్యచమర్యాదా బ్రహ్మణాపినశక్యతె
నశ్యేదేతద్యదారాజన్ వ్రతభ్రష్టోభిజాయతే
తిలవ్రీహిసమాయుక్తం మునిపుష్పైసమన్వితం
నందాదీపంవిధానేన కార్తీక్యాం విష్ణవేర్పయేత్
తా! కార్తీక మాసమున విష్ణుభగవానుని ఎదుట నందాదీపము అర్పించిన ఫమలునకు ప్రమాణము ఇంతింతని చెప్పుటకు బ్రహ్మకు కూడా శక్యము కాదు. (నందా దీపము అనగా ౧,౬,౧౧ తిథులలో అనగా ప్రతిపత్తిథి, షష్ఠీ తిథి, ఏకాదశీ తిథులందు సమర్పించు దీపము). ఈ నందాదీపము నశించినచో వ్రతభ్రష్టుడగును కాబట్టి నువ్వులతో, ధాన్యముతో, అవిసి పువ్వులతో కలిపి నందాదీపమును శ్రీ హరికి సమర్పించడం వలెను.
యఃకార్తిక్యామర్కపుష్పైరర్చయేద్గిరిజాపతిం
సలబ్ధ్వాపూర్ణమాయుష్యం పశ్చాన్మోక్షమవాప్నుయాత్
తా! కార్తీక మాసమందు శివునికి జిల్లేడు పువ్వులతో అర్చన జరిపినవాడు చిరకాలము జీవించి చివరకు మోక్షమును పొందగలడు.
రాజన్ యః కార్తికెమాసి కేశవాలయమంటపం
అలంకరోతియోభక్త్యా సయాతిహరిమందిరం
మల్లికాకుసుమైర్దేవం మాధవంకార్తికేర్చయేత్
తేననశ్యంతి పాపాని తమస్సూర్యోదయేయథా
తులసీకాష్ఠగంధంతం సాలగ్రామస్యయోర్పయేత్
సర్వపాపవినిర్ముక్తో యాతివిష్ణోఃపరంపదం
యఃకుర్యాత్కార్తికెవిష్ణోర్నర్తనంనర్తకీతథా
జన్మాంతరార్జితంపాపం నాశంయాతినసంశయః
కార్తికేమాసి రాజేంద్ర కేశవాలయమండపం
యఃకుర్యాత్సోపివైకుంఠే విష్ణుసాయుజ్యమవాప్నుయాత్
కార్తికేచాన్నదానంచ యఃకుర్యాద్భక్తిమాన్నరః
తస్యాఘంనశ్యతిక్షిప్రం పవమానాద్యధాఘనః
తా! కార్తీక మందు విష్ణ్వాలయమందు మంటపంలో భక్తితో అలంకరించేవారు హరిమందిర స్థాయిని పొందెదరు. ఈ మాసములో మల్లెపూవులతో శ్రీ హరిని పూజించువాని పాపములు సూర్యోదయానంతరం చీకట్లవలె నశించును. తులసీ గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాపముక్తుడై విష్ణులోకాన్ని చేరగలడు. హరి సన్నిధిలో స్త్రీగానీ, పురుషుడుగానీ నాట్యము చేసిన పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడ నశించును. ఈ మాసంలో భక్తితో అన్నదానమాచరించువాని పాపములు గాలికి కొట్టబడిన మబ్బులవలె తొలగును.
తిలదానంనదీస్నానం భోజనం బ్రహ్మపత్రకె
కార్తికేచాన్నదానంచ ధర్మమేతచ్చతుష్టయం
నకుర్యాద్యశ్చ కార్తిక్యాం స్నానం దానం నరాధమః
శ్వానయోనిశతంగత్వా చండాలత్వమతఃపరం
నారీవాపురుషోవాపి నకుర్యాత్కార్తికవ్రతం
రాసభీంయోనిమాప్నోతి శ్వానయోనిశతంతథా
తా! కార్తీక మాసమందు తిలాదానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్రభోజనము అన్నదానము అను నాలుగు ధర్మములు చేయవలెను. ఈ మాసమందు దానము, స్నానము యథాశక్తిగా చేయనివాడు నూరు జన్మలు కుక్కగా పుట్టి తరవాత చండాలుడగును. స్త్రీగానీ, పురుషుడుగానీ కార్తీక వ్రతమాచరించనివాడు గాడిదగా ముందు జన్మిమ్చి తరవాత నూరు మార్లు కుక్కగా జన్మించును.
కదంబపుష్పైఃకార్తిక్యాపర్చయేద్భక్తవత్సలం
ససూర్యమండలంభిత్వాస్వర్గలోకెవసేచ్చిరం
కేతక్యాకార్తికేమాసి యః పూజయతి భక్తితః
సప్తజన్మభవేద్విప్రోవేదవేదాంగపారగః
సహస్రపత్రైర్యోవిష్ణుపూజాం కుర్యాచ్చ కార్తికే
సమిత్రపదవీంప్రాప్య దీర్ఘాయుష్యమవాప్నుయాత్
అతసీపుష్పమాలాంయో హ్యలంకృత్యతథాస్వయం
స్కంధెధృత్వార్చయేద్విష్ణుం సచస్వర్గాధిపోభవేత్
తా! ఈ మాసములో కడిమి పువ్వులతో శ్రీ హరిని పూజించిన సూర్య మండలమును దాటి స్వర్గలోకమునకు పోవును. మొగలి పువ్వులతో పూజించిన వాడు ఏడుజన్మలు వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడై జన్మించును. ఈ మాసములో పద్మములతో శ్రీ హరిని పూజించిన సూర్యమండలమందు చిరకాలవాసి అగును. అవిసెపువ్వుల మాలను ధరించి శ్రీ హరినీ అవిసెపువ్వుల మాలిగలతో పూజించేవాడు స్వర్గాధిపత్యాన్ని పొందగలడు.
స్త్రియోమాల్యేనవావిష్ణుం పూజయేత్తులసీదళైః
ససర్వపాతకాన్ముక్తో యాతివిష్ణోః పరంపదం
కార్తికే భానువారేతు స్నానకర్మసమాచరేత్
మాసస్నానేనయత్పుణ్యం తత్పుణ్యంలభతేనృప
ఆద్యేంతి మేమధ్యమేచ దినేయస్స్నానమాచరేత్
మాసస్నానఫలంతేన లభతేనాత్రసంశయః
అథవామాసమాహాత్మ్యం యశ్శ్రుణోత్యఘనాశనం
మాసమేకంనృపశ్రేష్ఠ సముక్తస్సర్వపాతకైః
తా! స్త్రీలు మాలలచేత కానీ తులసీదళాల చేతకానీ, ఈ మాసమందు హరిని పూజిమ్చిన పాపవిముక్తులై వైకుంఠమును పొందెదరు. ఈ మాసంలో ఆదివారం స్నానం చేసిన మాసమంతా స్నానమాచరించిన పుణ్యమును బొందును. ఈ మాసమున శుక్ల ప్రతిపత్తిథినాడు, పూర్ణిమనాడు అమావాస్యనాడు ప్రాతఃస్నానమాచరించిన అశక్తులు పూర్ణఫలము పొందగలరు. అందుకు కూడా శక్తిలేని వారు కార్తీక మాసమందు నెలరోజులూ కార్తీక మాహాత్మ్యము వింటే స్నానఫలము కలిగి పాపములు నశించును.
కార్తికేమాసి యోదీపాన్ దృష్ట్వామోదతియంపుమాన్
తేనపాపానినశ్యంతి నాత్రకార్యావిచారణా
సహాయంకురుతెవిష్ణోః పూజార్థంయం ప్రయత్నతః
కర్మణామనసావాచా సస్వర్గఫలమశ్నుతె
కార్తికేమాసియోభక్త్యాహ్యర్చయేదచ్యుతంనరః
గంధపుష్పైఃసుధూపాద్యైః యాతితత్పదమవ్యయం
కార్తికేకేశవస్యాగ్రే యోజపంసమాచరేత్
సజంబుకోభవేద్భూమౌసప్తజన్మస్వసంశయః
యేప్రదోషేపురాణంతు కార్తికేకేశవాగ్రతః
కుర్వంతినరశార్దూల తేయాంతి హరిమందిరం
కార్తికేమాసిసాయాహ్నే స్తోత్రపాఠపరోనరః
సస్వర్గలోకమాసాద్య ధ్రువలోకమతఃపరం
తా! ఈ మాసములో ఇతరులు సమర్పించిన దీపమును చూసి ఆనందము పొందేవారి పాపములు ఏ సందేహములేకుండా నశించును. ఈ మాసమందు ఇతరులకు హరిపూజకై త్రికరణ శుద్ధిగా సహాయము చేయువాడు స్వర్గమును పొందును. ఈ మాసంలో భక్తితో గంధ పుష్ప ధూప దీపాదులచేత హరిని పూజించివాడు వైకుంఠాన్ని పొందును.
ఇతి స్కాందపురాణే కార్తిక మహాత్మ్యె సప్తమోధ్యాయస్సమాప్తః
ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి ఏడవ అధ్యాయము సమాప్తము.
--
~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
जय जय शंकर हर हर शंकर
Visit this group at http://groups.google.com/group/satsangamu?hl=te-IN.
~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
जय जय शंकर हर हर शंकर
Visit this group at http://groups.google.com/group/satsangamu?hl=te-IN.
Namaskaram Nagendra garu,
ReplyDeleteIf possible can you please post remaining chapters of Karthika Puranam?
Regards
Lakshmi
క్షమించాలి, కొన్ని సాంకేతిక కారణాల వల్ల బ్లాగు ఆక్సెస్ చేయలేకపోయాను అందుకే మిగతా పరంపరలు పంపలేదు. ఇవాళే ఆక్సెస్ దొరికింది. తప్పకుండా మిగిలినవి ప్రచురిస్తాను.
Delete