సూత గద్ది
సూత సూత మహాభాగ వద నో వదతాం వర
కథాం భాగవతీం పుణ్యాం యదాహ భగవాఞ్ఛుకః
అని శౌనక మహర్షి సూతపౌరాణికుడిని కోరగా భాగవతం నైమిశారణ్యంలో 88వేల ఋషులకు వారి శిష్య ప్రశిష్యులకూ రెండవసారి ప్రవచనం చేయబడింది (మొదటి సారి శుక మహర్షి చేత గంగాతీరంలో పరీక్షిత్తునకు ప్రవచనం చేయబడింది). అటువంటి మహానుభావుడైన సూత పౌరాణికుడు ప్రవచించిన స్థలానికి బయలుదేరాం. చక్రతీర్థం నుంచి ఉత్తరంగా కొంతదూరం నడిచి దుకాణాలమధ్యగా తూర్పువేపుగా ఉన్న సన్నని చిన్న మట్టి దారిలోకి మళ్ళి వెళితే సూతగద్ది వస్తుంది (దారిలో హిందీలో సూచికలుంటాయి).
సూత మహర్షి ప్రవచించిన స్థానం ఎత్తైనదై దాదాపు 20మెట్లెక్కిపైకి చేరుకోవాలి. బయటి ప్రాకారం అంతా పురాతనంగా కనబడుతూ ఉంటుంది. బహుశా అది కాస్త ఎత్తైన చిన్న కొండవంటి రాతి ప్రదేశం మీద కట్టినదేమో. ఆఎత్తైన ప్రదేశం నుంచి సూత మహాభాగుడు ప్రవచనం చేసేవారట. అన్ని లక్షకు పైగా ఉండే ఋషులు, మునులు, వారి శిష్యులు ప్రశిష్యులందరికీ చక్కగా వినబడేటట్టు ప్రవచనం జరిగేది వారి వారి తపోబలాలచేత రోమహర్షణులు (సూతులు) ఎక్కడో నైమిశారణ్యం మధ్యలో ఉండి ప్రవచించినా చిట్ట చివర కూర్చుని వింటున్న వారికి కూడా తమ పక్కనే కూర్చుని చెప్తున్నట్లుండేదిట. ఇప్పట్లా మైకులు స్పీకర్లు లేవుగా అప్పట్లో. ఆ ఎత్తైన ప్రదేశంనుంచి చక్రతీర్థం దగ్గర్లో ఉన్న ఇతర ప్రదేశాలూ కనిపిస్తాయి ఇప్పుడు ఇళ్ళు వసతి భవనాలు ఇతర కట్టడాలు వచ్చాయి కాబట్టి అన్నీ కనపడవు బహుశా అప్పట్లో అక్కడనుంచి సూత మహర్షి నైమిశారణ్యం అంచులదాకా ఉన్న అందరినీ అన్ని ప్రదేశాలనూ చూస్తూ ప్రవచించేవారేమో...
ఇక ఆలయం లోపలికెళ్ళగానే ఎదురుకుండా అంతరాలయంలో మెట్లు మెట్లగా ఉన్న అమరికపై భాగంలో బలరామ సహిత శ్రీ రాధా కృష్ణుల మూర్తులు క్రింది మెట్లలో శౌనకాది ఇతర మహర్షులు అర్చించినటువంటి సాలగ్రామాది శిలలు (108కి పైగా) వాటికి అప్పుడే అర్చన జరిగినట్లున్న ఆనవాళ్ళు వాటిపై తులసి, ఇతర పుష్పాలు చూసి. పక్కనే ఉన్న సూత మహర్షి సింహాసనాన్ని చూసి "సూత సూత మహాభాగ వ్యాస శిష్య నమోస్తుతే" అంటూ నమస్కరించి. అక్కడ ఉన్న మహంతుగారిని పలకరించగా ఆ ఆలయ విశేషాలు తెలిపారు.
సూతగద్దిగా పిలవబడుతున్న ఈ ఆలయం అసలు సత్యనారాయణస్వామివారి ఆలయమనీ అందులోనే, స్కాందపురాణాంతరంగా ప్రవచించబడిన శ్రీ సత్యనారాయణస్వామి వారి వ్రతం ఇక్కడే ప్రవచింపబడిన మీదట శౌనకాది మహర్షులు ఇక్కడే మొదట సత్యనారాయణ వ్రతమాచరించారనీ తెలిపారు. తురుష్కుల దండయాత్రలలో భిన్నం చేయబడిన ఆలయాలలో ఇదీ ఒకటనీ దాన్ని పునర్మించే ప్రయత్నంలో ప్రభుత్వం వారి మద్ధతుకోరగా పురాతత్త్వశాస్త్రవేత్తల బృందం ఈ ప్రాంతాన్ని సందర్శించి పరిశోధనలు జరిపి పూర్వం ఇక్కడ సత్యనారాయణస్వామి వారి ఆలయం ఉండేదని నిర్థారించి 2011లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందనీ తెలిపారు. అతి త్వరలో మొట్ట మొదట సత్యనారాయణ స్వామివారి వ్రతం తెలుసుకొని ఆచరింపబడిన క్షేత్రంలో సత్యనారాయణస్వామివారి ఆలయ పునర్నిర్మాణ ప్రణాళిక జరుగుతోందనీ తెలిపారు. అదే ఆలయ ప్రాంగణంలో తవ్వకాలలో బయల్పడిన శ్రీ శివ పరివార మూర్తులు ఈశాన్యంలో ఉన్న శివాలయం గోడకి అమర్చారు. అద్భుతమైన మూర్తి అక్కడక్కడా భిన్నమై ఉంది. కానీ అద్భుతమైన మూర్తి. ఆ శివాలయంలో ఉన్న ఈశానలింగాన్ని అప్పటి సూతాది మహర్షులు అర్చించేవారట. పురాతనంగా ఉంది దర్శించుకొని ప్రదక్షిణం చేసి బయటకు వచ్చాం. బయటికి వచ్చి అంత ఎత్తునుంచి పరిసరాలు చూస్తే రమ్యంగా అనిపించింది సూత మహానుభావునికి మరోసారి నమస్కారం తెలుపుకుని అప్పటికే ఆలస్యం అవుతుండటంతో తిరిగి బసకి బయల్దేరాం.
అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న భిలాయి మాతాజీ గారు ఆవిడ శిష్యులు, కుటుంబ సభ్యులు పరమ ప్రేమతో అన్నిరోజులూ మాకు ఆతిథ్యమిచ్చారు. మేముకాక మొత్తం 1100 మందికి పైగా ప్రతిపూట ఉపాహారం, భోజనాదులు ఏర్పాటు చేసారు. అంతమందికి పూటకి 5-6 పంక్తులు వండి వడ్డిస్తున్నా ఒక్కరూ అలిసిపోయినట్లుగాకానీ చిరాకుగా ఉన్నట్లుకానీ కనపడలేదు, రోజురోజుకీ మరింత ఉత్సాహంతో కొసరి కొసరి వడ్డనలు. ఒకపూట పెళ్ళిభోజనానికే అలిసిపోయేవారు భోజనం దగ్గర ఆతిథ్యం ఎలా ఇవ్వాలో ఇక్కడ చూసి నేర్చుకోవచ్చు. సరే ఆరోజు మధ్యాహ్నం భోజనం తరవాత గదుల్లో విశ్రాంతి తీసుకునేవారు విశ్రాంతి తీసుకున్నారు కొత్తగా కలిసినవాళ్ళని పరిచయం చేసుకోవడం ఇత్యాది కార్యక్రమాలు జరిగాయి.
సాయంత్రం 4గం,,లకి మాతాజీగారి ఆశీస్సులతో ఆవిడ ప్రారంభోపన్యాసంతో పూజ్య గురువులచే నైమిశారణ్యంలో పోతనామాత్య విరచిత శ్రీమద్భాగవత ప్రవచనం మొదలైంది. మొదటిరోజు ప్రవచనంలో భాగంగా శ్రీమద్భాగవతాంర్గత నైమిశారణ్య వర్ణనం, భాగవత అవతారిక, శ్రీకృష్ణ భీష్మాదుల గురించి పూజ్యగురువులు ప్రవచించారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ రెండు గంటలలోపుగానే ప్రవచిస్తున్న పూజ్య గురువులు నైమిశారణ్యంలో జరిగే ఈ ప్రవచనాలను కంఠం నొప్పిస్తున్నా, అనారోగ్యంగా ఉన్నా సరే పట్టించుకోకుండా ప్రతిరోజూ మూడు గంటలకుపైగా ఏకధాటిగా ప్రవచించారు. వారి ప్రవచనామృత ధారలలో నైమిశారణ్యం వచ్చిన తెలుగువారేకాదు, అక్కడి హిందీవారు కూడా విని తరవాత అర్థం కాని వివరాలను పక్కవారినడిగి తెలుసుకొని ఆనందించారు.
రాత్రి దాదాపు8గంటలకి ప్రవచనం పూర్తైంతరవాత నీరాజన మంత్రపుష్పాలు తీసుకొని రాత్రి భోజన/ఫలహారాలకు 9కల్లా వెళ్ళి రాత్రి 9:30 కల్లా గదికి వచ్చి విశ్రాంతి. అంత వత్తిడిలోనూ పూజ్య గురువులు రోజూ రాత్రి 10గంల సమయంలో మా వసతి సముదాయానికి వచ్చి అందరినీ పలకరించి క్షేమ సమాచారాలు వసతి భోజన సౌకర్యాలు విచారించి 20-30 నిలు గడిపి వెళ్లేవారు. అందులోనే అన్యాపదేశంగా దేశకాలాలను సద్వినియోగ పరుచుకోండి అని చెప్తూండేవారు.
నైమిశారణ్య యాత్ర - రెండవ రోజు విజయ నామ సంవత్సర ఆశ్వీయుజ విదియ (తది స్పర్శతో) (19-Oct-2013)
ప్రతిరోజూ అలారం 4:30కి పెట్టునున్నా ఎప్పుడు తెల్లవారుఝామవుతుందా అని ఎదురుచూడడంతోటే సరిపోయేది. మరునాడు అలారం కన్నా ముందే ఉదయం 3:45 (లేచి అలారం కట్టేసి కాల కృత్యాలు తీర్చుకొని స్నానం చేసి 4:30 కల్లా బయట వరండాలో ఆసనం వేసుకొని సంధ్యావందనం ఇతర జపాలకు కావలసిన సామగ్రి మంచినీరు సమకూర్చుకోవడానికి తలుపు తీసి బయట చూస్తే దాదాపు అన్ని మిగతా గదులలో వాళ్ళు కూడా అప్పటికే అదే పనిలో ఉండడం చూసి మునిపల్లెలంటే ఇలాగే ఉండేవేమో, ఎవరూ ఎవరికీ చెప్పుకోకుండా దాదాపు ఒకే సమయానికి అందరూ నిత్యానుష్ఠానానికి సిద్ధమయ్యారంటే అది ప్రదేశ మహాత్మ్యం అని తెలుసుకొని నమస్కరించుకున్నాను. పిల్లా పెద్దా అందరూ 5:30 కల్లా నిత్యానుష్ఠానంలో ఉండేవారు. (తపో క్షేత్రాలలో చేసుకునే అనుష్ఠానాలు కోట్లాది రెట్లు, అందునా కలి దోషం తగలని నైమిశారణ్యమాయె... ఎవరు వదులు కుంటారు సిద్ధాన్నాన్ని?)
ఉదయాన్నే గురువుగారు కబురు పెట్టి అందరం ఫలహారాలు చేసి నైమిశారణ్యంలోని ఇతర ప్రదేశాలు చూసొద్దాం అని చెప్పారు.
మొదటగా తీర్థ రాజమైన చక్రతీర్థానికేగి ససంకల్ప స్నానం చేసి ఎదురుగా ఉన్న సూర్యబింబానికి నమస్కరించి చక్రతీర్తంలో గురువుగారు ఇతర మిత్రులందరితో కలిసి దిగాం. చక్రతీర్థంలో నీరు ఆకుపచ్చగా కాస్త పాకుడుగా కనిపిస్తుంది కానీ అది అడుగున ఉన్న నాచువల్ల నీరు బానే ఉంటుంది. అందరూ చక్రతీర్థానికి నమస్కరించి పుష్పాలు సమర్పించటం వల్లనూ కావచ్చు. పాలరాతి మెట్లు జారుడుగా ఉంటాయి జాగ్రత్తగా దిగాల్సుంటుంది. దిగిన తరవాత తీర్థం మధ్యలో ఉన్న గుండ్రటి బావి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ పురస్సరంగా భగవన్నామం చెప్తూ తిరిగి చివర్న మూడు సార్లు తల మునిగేటట్లుగా మునగి ఒక్కొక్కరమూ బయటికొచ్చాం. నీళ్ళలో స్నానం అంటే పిల్లలకి మరీ సరదా (అప్పటికే గురువుగారు జలక్రీడలు కాదు చక్కగా నమస్కరించి పవిత్ర భావనలతో మజ్జనంచేసి రండి అని చెప్పడంతో) ఐనా ఉన్న జనాలందరికీ అవకాశం ఉండాలనీ పైగా మరోచోటుకు వెళ్ళే ఏర్పాటున్న కారణం చేతా బయటికి వచ్చి బట్టలు మార్చుకొని గురువుగారు మాచే చెప్పించిన నామాలు పలికి.. నైమిశారణ్య ప్రవేశం- చక్రతీర్థ స్నానం-తీర్థ సేవనం... జన్మ ధన్యం.. అని అందరం అనుక్కుని... లింగధారిణిగా పిలువబడే లలితా అమ్మవారి ఆలయానికి బయలుదేరాం.
లింకధారిణి / లలితాంబికాలయం
చక్రతీర్థం నుండి ఉత్తరంవేపు బయటికొచ్చి ఆ దారిలోనే వెళ్తే ఈ ఆలయం ఉంటుంది (నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు 1/4కిమీ) నైమిశారణ్య క్షేత్రంలోని సప్తవినాయక క్షేత్రాలలో ఒకటీ, ముఖ్యమైనదీ ఐన లలితా అమ్మవారి ఆలయ ప్రాంగణం విశాలంగా ఉంటుంది. ఆలయం బయట మిఠాయిలూ, సుగంధ ద్రవ్యాలు, పసుపు, కుంకుమ, గాజులు ఇంకా ఎరుపు రంగులో చెమికీలతో ఉండే పల్చటి బట్టలూ, ఇతర పూజా ద్రవ్యాలు పువ్వులూ అమ్మే దుకాణాలు వరుసగా ఉంటాయి దక్షిణ ద్వారం గుండా అమ్మవారి ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళగానే ఎడమ చేతిపక్క పెద్ద రావి-మర్రి చెట్టు పక్కనే అతి పురాతన మైన హనుమంతుల వారి మూర్తి సింధూర లేపనం చేయబడి ఉంటుంది ఆయన, కాలభైరవుడు అక్కడ క్షేత్ర పాలకులు. కుడిపక్క అమ్మవారి ఆలయం ఉంటుంది తిన్నగా అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మార్గంలో వెళ్తూంటే స్తంభం మీద ’ ముండన్ స్థల్ ’ అని వ్రాసి ఉంటుంది. అయోధ్య, నైమిశారణ్యాది క్షేత్రాలలో శిరోముండనం చేసుకోవాలని పురాణ వాక్కు . అలాగే అమ్మవారి ఆలయ ప్రదక్షిణం చేస్తుంటే ప్రదక్షిణ మార్గంలో ఈశాన్యంలో మనకి ఎడమవేపుకి పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది కుడివేపు ఆలయంలోంచి దర్శనమై బయటికొస్తుంటారు. అలా కొన్ని అడుగులు ముందుకెళ్తే (తూర్పు ఈశాన్యానికి) మహా కాళి, సరస్వతి, లక్ష్మి అమ్మవార్ల మూర్తులు ఇతర దేవతల పాలరాతి మూర్తులు ఉంటాయి. అలాగే ప్రదక్షిణం చేస్తూ ముందుకెళితే దేవాలయానికి ఆగ్నేయ భాగంలో ప్రదక్షిణ మార్గానికిరువైపులా రెండు అతి పురాతనమైన చిన్న చిన్న ఆలయాలుంటాయి మనకి ఎడమవేపున కాలభైరవ ఆలయం కుడివేపున మహాషోడశి ఆలయం ఉంటుంది. అప్పటివరకు ఇలాంటి ఆలయం ఉన్నట్లు ఎక్కడా వినలేదు మనదేశంలో ఇంకా కొన్ని చోట్ల ఉండి ఉండవచ్చేమో కానీ తెలియదు. ఇది శ్రీవిద్యాసాంప్రదాయీకులకు అత్యంత ఆనందదాయికమైన విషయం. ఆ ఆలయాల మధ్యలోంచి దక్షిణం దిశగా వెళ్ళి అమ్మవారి ఆలయ ప్రదక్షిణ కావించి లోపలికి ప్రవేశించే లైనులోంచి వెళ్ళాలి.
లైనులో ఉండగా అప్రయత్నంగా సింధూరారుణ విగ్రహాం... అంటూ నా ప్రమేయంలేకుండా నా లోపలనుంచి వినపడుతూండగా అక్కడికి వచ్చిన కొందరు పుణ్యవతులు ఇతర భాగవతులు అమ్మనామం పలుగుతుంటే లోపలికి వెళ్ళాం, ద్వారం మీద హంసవాహిని, సింహవాహిని, కమలవాసినుల మూర్తులుంటాయి అందులోంచి లోపలికెళ్ళి అమ్మవారెక్కడా అని చూస్తే పడమటి గోడలో భూమి నుంచి ఐదడుగుల ఎత్తులో ఒక చిన్న మూర్తి పసుపు కుంకుమల అలంకారాలతో చుట్టూ పూల దండలు సన్నని ఎర్రటి చెమికీలున్న వస్త్రాలతో కప్పి గోడలోనే ఉంటారు. అమ్మవారి శిరసు మీద మరో చిన్న గుండ్రటి ఆకారం లింగంగా కనిపిస్తూ ఉంటుంది (పార్థివ లింగం మీద తార అని ఒక చిన్న గోళీ వంటిది పెట్టి అర్చిస్తారు నిత్య పార్థివలింగార్చకులు అలా). దగ్గరగా పట్టి చూస్తే కానీ అమ్మవారు సరిగ్గా కనిపించకుండా ఏదో రూపంలా కనిపిస్తారు. అక్కడ అమ్మవారికెదురుగుండా యజ్ఞకుండం, పల్లకీలూ ఇతరత్రాఉంటాయి.
అమ్మవారికి ఈశాన్య భాగంలో అమ్మవారు పూజించే శివలింగం ఉంటుంది. అక్కడ అమ్మవారి అర్చకులు వచ్చిన బాలలకి అమ్మవారికి సమర్పించిన వస్త్రాలను ప్రత్యేకంగా ఇచ్చి తలకి రక్షగా కట్టించారు. తిరిగి ఇంతకు ముందు చూసిన పురాతనమైన చిన్న చిన్న ఆలయాలకి వచ్చాం.
మహాషోడశి ఆలయంలోకి వంగి వెళ్ళి హారతి వెలుగుళొ పశ్చిమ గోడకి ఉన్న మూర్తిని చూడగానే ఆహా అమోఘం కుమారగణనాథాంబగా కుమార స్వామి, గణనాథులు ముందు వరుసులో ఉండి వెనుక మహా కామేశ్వర కామేశ్వరీ స్వరూపంగా పంచబ్రహ్మాసనాసీనులై సచామరరమావాణిగా అత్యద్భుతమైన మూర్తి ప్రతి ఒక్కరు దర్శించుకోవాల్సినదని గురువుగారు అందరికీ ప్రత్యేకం చెప్పడంతో అందరూ వరుసగా ఆ ఆలయ దర్శనం చేసుకోవడానికి చిన్న ఆలయం కారణంగా కొద్దిగా ఎక్కువ సమయమే పట్టింది. అట్నుంచి అందరం వ్యాసగద్దికి బయలుదేరాం.
రెండవరోజూ వ్యాసగద్దికి వచ్చినప్పుడు మొదట్రోజు ఏ అనుభూతి కలిగిందో అదే అనుభూతి అంతకన్నా ఎక్కువ ఎందుకంటే పూజ్య గురువుల మిగతా సత్సంగ సభ్యులతో కలిసి దర్శనం. అక్కడ ముందురోజులాగే వ్యాసపీఠ దర్శనం చేసుకొని తరవాత ఇంతకు ముందు రోజు చూసిన ఆ పక్కనే ఉన్న మహావటవృక్షం క్రింద కూర్చొని పూజ్య గురువులు మా అందరిచేతా చెప్పిస్తుండగా వ్యాసస్తుతి చెప్పుకొన్నాం అక్కడనుంచి అందరూ బసకి బయలుదేరారు.
మమ్మల్ని వ్యాసగద్దిలోని మహంతుగారు గుర్తుపట్టి పిలచి మీకోసమే ఎదురుచూస్తున్నాను రండి లోపలికి వెళ్ళి ధ్యానం చేసుకొని అభిషేకం చేసుకోండి అని చెప్పారు. ఆనందానికి అంతులేదు. వ్యాస మహానుభావుడు నైమిశారణ్యంలో ఎక్కడ కూర్చొని బోధించేవారో, ఎక్కడైతే కొంత వ్యాస వాజ్ఞ్మయం, పురాణాదులు రచింపబడ్డాయో, వేదం విభజింపబడి ప్రచారం కావింపబడిందో అక్కడ స్వామి కూర్చున్న స్థలానికి పక్కనే ఆ చిన్నమందిరంలోనే కూర్చుని కొద్దిగా స్వాధ్యాయం జపం చేసుకొని సింహాసనానికి ఉన్న ఒక మూలన అష్టమానువాకంతో జలాభిషేకం చేసి పొంగి పోయిన మనసుతో సాష్ఠాంగ పడి అదే తలచుకుంటూ తిరిగి బసకి చేరాం...
{రెండు రోజులుగా వ్రాసి పంచుకుందామనుక్కున్నా ఈ రోజు వరకూ కుదరలేదు, వ్యాస గద్ది అభిషేకం గురించి ’గురు’వారమే పంచుకోవాలనీ, పంచమి స్పర్శ ఉన్నప్పుడే పంచబ్రహ్మాసనాసీనయైన మహాషోడశి గురించి పంచుకోవాలని దైవ నిర్ణయమేమో గత రెండు మూడు రోజులూ టైపు చేయడానికి కూడా... అస్సలు కుదర్లేదు... }
No comments:
Post a Comment