Pages

Friday, July 31, 2026

బృందావన కథలు – 46 (రామానంద రాయ – గోదావరి తీరంలోని రసతత్త్వ సంభాషణ)

జయ శ్రీరాధేకృష్ణ!

గోదావరి నది...
సాయంత్రపు సంధ్యారుణ కిరణాలు నదీతరంగాలపై నాట్యం చేస్తున్నాయి. ఆ నదీ తరంగాలపై పడ్డ కిరణాలు ఆ నీటికి బంగారు తాపడాన్ని అద్దినట్లు మెరుస్తున్నాయి. మెల్లగా వీచే గాలి ఒడ్డున ఉన్న తోటల్లోని పువ్వుల స్వచ్ఛమైన పరిమళాన్ని మోసుకొస్తోంది. నది ఒడ్డున ఉన్న ఊరిలోని వేదపారాయణ చేస్తున్న పండితులు నిత్యకర్మానుష్ఠానలకై ఉద్యుక్తులౌతున్న విషయం తెలుపుతూ వేదఘోషలు సాయం సంధ్యాసమయంలోకి క్రమంగా తగ్గుతూ కలిసిపోతుండగా, ప్రకృతి అంతా ఏదో దివ్యసంగమానికి సిద్ధమవుతున్నట్లు అనిపించింది.
ఆ సమయంలో...
బంగారువర్ణంతో ప్రకాశించే ఒక సన్యాసి గోదావరి తీరానికి వచ్చారు. ఆయన కన్నులలో అపారమైన కరుణ, ముఖంలో దివ్యమైన ప్రశాంతత.
ఆయనేశ్రీకృష్ణచైతన్య మహాప్రభు.
అదే సమయంలో...
ఒరిస్సా రాజు ప్రతాపరుద్రుని రాజ్యంలో ఉన్నతాధికారిగా ఉన్నప్పటికీ, తన అంతరంగంలో శ్రీరాధాకృష్ణుల ప్రేమరసంలో మునిగిపోయిన ఒక మహాభాగవతుడు అక్కడికి వచ్చాడు.
ఆయనేరామానంద రాయ.
ఇద్దరు మహానుభావులూ ఒకరినొకరు చూడగానే...
బాహ్యంలో చూసినవారికి తొలిసారి కలిసిన వారిలా కనిపించినా, అంతరంగంలో యుగయుగాల స్నేహితులు కలుసుకున్న విధంగా ఆనందం ఉప్పొంగింది.
రామానంద రాయ వినమ్రంగా నమస్కరించగానే, మహాప్రభువు వెంటనే లేచి ఆయనను ఆలింగనం చేసుకున్నారు.
ఆ క్షణంలో...
ఇద్దరి కన్నుల నుండి ప్రేమాశ్రువులు జాలువారాయి. అది చూస్తున్న భక్తులకు జరుగుతున్నది అర్థం కాలేదు. "ఒక సన్యాసి... ఒక రాజోద్యోగిని ఎందుకింత ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు?" అని ఆశ్చర్యపోయారు.
కానీ...
ఆ ఇద్దరి హృదయాలలో మాత్రం శ్రీరాధాకృష్ణుల ప్రేమరసం జీవనదియైన గోదావరీ నది నీటిలా ప్రశాంతంగా నిరంతరం పొంగి పొరలుతూనే ఉంది .
ఆ సాయంత్రం...
గోదావరి తీరంలోని ఇసుకపై ఇద్దరూ కూర్చున్నారు. మహాప్రభువు చిరునవ్వుతో "రాయా! జీవునికి పరమసాధ్యం ఏమిటి? దానిని ఎలా పొందాలి?" అని అడిగారు.
రామానంద రాయ ఎంతో వినయంతో సమాధానం చెప్పసాగారు. మొదట వర్ణాశ్రమధర్మం గురించి చెప్పాడు. మహాప్రభువు తల ఊపి
"ఏహో బాహ్య, ఆగే కహ ఆర్... ఇది ఇంకా బాహ్యమే... ఇంకా లోతైన తత్త్వాన్ని చెప్పు రాయా!." అన్నారు.
ఆ తర్వాత కర్మార్పణం, జ్ఞానం, వైరాగ్యం, భక్తి...ప్రతి మెట్టును రామానందుడు వివరించగా, మహాప్రభువు మళ్లీ మళ్లీ... "ఇది కూడా ఇంకా పూర్తికాదు... ఇంకా చెప్పు..." అని ప్రోత్సహించారు.
ఆ సంభాషణ ఒక ప్రశ్నోత్తరంలా కాదు...
ఒక హృదయం మరొక హృదయంలో దాగిన ప్రేమను వెలికితీస్తున్న గొప్ప సంవాదంలాగా ఉంది.
చివరకు...
రామానంద రాయ గంభీరంగా "జ్ఞానమూ కాదు... యోగమూ కాదు... స్వార్థరహితమైన శుద్ధభక్తియే పరమసాధ్యం.
ప్రేమ-భక్తి సర్వ-సాధ్య-సార్" "ప్రేమభక్తియే సమస్త సాధ్యాలకు సారభూతం." అని సమాధానం చెప్పారు.
అప్పుడు మహాప్రభువు ముఖంలో సంతోషం వికసించింది. "ఇంకా వివరించు... రాయా!" అని అన్నారు.
రామానందుడు ఇప్పుడు గోపికాభక్తిని వివరింస్తూ "భగవంతుణ్ణి భర్తగా, ప్రియుడిగా, ప్రాణసఖుడిగా ప్రేమించిన గోపికల ప్రేమకు సమానం మరొకటి లేదు.
గోపీ-భావామృతే యార లోభ హయ, వేద-ధర్మ త్యజి సే కృష్ణే భజాయ - గోపీభావామృతంపై లోభం కలిగినవాడు, బాహ్య ఆచారాలకే పరిమితం కాక, శ్రీకృష్ణుని అనన్యభక్తితో సేవిస్తాడు." అన్నాడు.
మహాప్రభువు కన్నులు మూసుకున్నారు. రామానంద రాయుని ఆ మాటలు వినగానే ఆయన శరీరం ఆపాదమస్తకం పులకించింది.
ఐనా... ఇంకా ఆయన ఆగలేదు. "దానికంటే గొప్పది ఏదైనా ఉందా?" అని అడిగారు.
రామానంద రాయ ఒక్క సారి కళ్ళు మూసుకొని...
ఆర్ధ్రతపొందిన స్వరంతో "ఉంది... అది... ’శ్రీరాధాదేవి ప్రేమ!’"
కృష్ణుడినే తన ప్రేమకు బంధించిన ప్రేమ...
తన సుఖాన్ని కాదు... కృష్ణుని సుఖాన్నే కోరుకునే ప్రేమ...
ప్రేమకు పరాకాష్ఠ...
అదే రాధాభావం." అని చెప్పగానే...
మహాప్రభువు ఒక్కసారిగా లేచి "ఆహా! ఆహా! ఏమి రసతత్త్వ వర్ణన రామానంద రాయా!" అంటూ గాఢంగా ఆలింగనం చేసుకున్నారు.
ఒక తండ్రి తన పుత్రుని ఆలింగనం చేసుకున్నట్లు...
ఒక గురువు తన శిష్యుని ఆలింగనం చేసుకున్నట్లు...
ఆ సాయంత్రం...
గోదావరి జలాలు కేవలం నదీజలాలు కాదు...
రాధాకృష్ణుల ప్రేమరసాన్ని మోస్తున్న అమృతప్రవాహాలయ్యాయి.
ఆ తరువాత అనేక సంధ్యా సమయాలు, రాత్రులు...
చంద్రకాంతిలో ఇద్దరూ గోదావరి తీరాన కూర్చుని శ్రీరాధాకృష్ణుల నిత్యలీలలు, గోపికల భావాలు, ప్రేమరహస్యాలు, భక్తి యొక్క అంతిమస్వరూపం గురించి సంభాషించారు. ఆ సంభాషణలే తరువాత "రామానంద సంభాషణం" గా గౌడీయ వైష్ణవ సంప్రదాయం సాహిత్యంలో అమూల్యమైన రత్నంగా నిలిచాయి.
ప్రేమాఞ్జనచ్ఛురితభక్తివిలోచనేన
సన్తః సదైవ హృదయేషు విలోకయన్తి !
యం శ్యామసున్దరమచిన్త్యగుణస్వరూపం
గోవిన్దమాదిపురుషం తమహం భజామి !!
(బ్రహ్మసంహిత)
ప్రేమ అనే దివ్య అంజనాన్ని పూసుకున్న భక్తి నేత్రాలతో ఉన్న మహాత్ములు, శ్యామసుందరుడైన శ్రీగోవిందుణ్ణి తమ హృదయంలో ఎల్లప్పుడూ దర్శిస్తారు. అనంతమైన దివ్యగుణాల స్వరూపుడైన ఆ ఆదిపురుషుడైన గోవిందుణ్ణి నేను భజిస్తున్నాను.
మహాప్రభువు స్వయంగా తన శిష్యులతో "రసతత్త్వాన్ని ఇంత లోతుగా వివరించగలవాడు రామానంద రాయ తప్ప మరొకడు లేడు." అని అనేవారు.
---
భక్తి అనేది కేవలం ఆచారం కాదు.
కేవలం జ్ఞానం కాదు.
కేవలం పూజ కాదు.
ఒక తంతు కాదు.
తన ఆనందాన్ని మరచి, భగవంతుని ఆనందంలో జీవించే హృదయభావమే నిజమైన భక్తి.
గోదావరితీరంలో రామానంద రాయ పలికిన 'ప్రేమభక్తియే సమస్త సాధ్యాలకు సారము' అనే అమృతవాక్యం, ఈ రోజుకీ రాధాకృష్ణ భక్తుల హృదయాలలో ప్రేమదీపాన్ని వెలిగిస్తూనే ఉంది.
మనమూ రాధారాణి చరణరజస్సును ఆశ్రయించి...
"నాకు ఏమి కావాలి?" అని అడగకుండా,
"శ్రీకృష్ణునికి ఏది ప్రీతికరం?" అని ఆలోచించడం ప్రారంభించిన రోజు...
మన హృదయంలోనూ ఆ రాధాకృష్ణ భక్తిపూర్వక రసతత్త్వ గోదావరి జీవనదిలా ప్రవహించడం మొదలవుతుంది.
---
జయ శ్రీరాధే!
జయ శ్రీకృష్ణ!
జయ జయ బృందావన్!
- శంకరకింకరః (శ్రీ అయ్యగారి నాగేంద్ర)

No comments:

Post a Comment