(శ్రీశైల ఖండంలో వర్ణించబడిన గిరిప్రదక్షిణ మహిమను, పూర్వం అక్కడ భక్తులు చెప్పుకునే ఒక దివ్యమైన కథను ఆధారం చేసుకుని అందించే ప్రయత్నం)
---
నల్లమల దట్టమైన అరణ్యాల నడుమ...
అపర కైలాసంగా,
జ్యోతిర్లింగంగా,
అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా,
అనేక కోటి దేవతలు నిత్యం సంచరించే దివ్య భూమిగా,
మహర్షులు, సిద్ధులు, యోగులు తపస్సు చేసిన మహాతపోభూమిగా,
చెంచు జాతి అమాయక భక్తి నుంచి పరమయోగుల సమాధి వరకు సమానంగా ఆలింగనం చేసుకునే కరుణామయ క్షేత్రంగా,
శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారి శ్రీశైల మహాక్షేత్రం
జ్యోతిర్లింగ క్షేత్రంగా - శక్తిపీఠంగా శ్రీశైల మహాక్షేత్రం నిత్యవిభూతిగా వెలుగొందుతోంది..
ఈ దివ్య క్షేత్ర ప్రాశస్త్యం గురించి స్కాంద పురాణంలోని శ్రీశైల ఖండంలో విశేషమైన మహిమ వర్ణించబడింది.
శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబా మల్లికార్జునులే కాక, అక్కడ కొలువైన ప్రతి దేవీదేవతలూ, అంతెందుకు... చివరికి అక్కడి దివ్య వృక్షాలూ అనుగ్రహ వృష్టిని కురిపిస్తాయి. బ్రహ్మేంద్రోపేంద్ర స్కంద గణపత్యాదులతో సహా సమస్త దేవకోటి శ్రీశైల క్షేత్రంలో అమ్మవారు, స్వామివార్ల సేవకై దివ్య రూపాల్లో, మారు రూపాల్లో వచ్చి వెళ్తుంటారు.
శ్రీశైలే శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే!
శ్రీశైలంలో అమ్మవారు, అయ్యవారే కాదు... ఆ శ్రీ పర్వతం పర్వతంగానే అత్యంత మహిమాన్వితమైనది!
ఇక కథలోకి వెళ్దాం...
రాయలసీమలోని ఒక చిన్న పల్లెటూర్లో గంగయ్య అనే రైతు ఉండేవాడు. పెద్దగా చదువు లేదు, సాధారణ మధ్యతరగతి కుటుంబీకుడు. కానీ, అతని మనసులో ఎప్పుడూ భ్రమరాంబ మల్లికార్జునులపైనా, శ్రీశైల క్షేత్రంపైనా అచంచలమైన భక్తినమ్మకాలు ఉండేవి.
"నా తల్లిదండ్రులు భ్రమరాంబ తల్లి, మల్లికార్జున స్వాములే! నా ఇల్లు శ్రీశైలమే! వాళ్ల కోసం నేను ఒక్క అడుగు వేస్తే... వాళ్లు నాకోసం వంద అడుగులు వేస్తారు! ఆ జగజ్జననీజనకులు ఉండగా నాకేం తక్కువ!" అనే అచంచలమైన విశ్వాసంతో అతడు జీవించేవాడు.
పుణ్య స్థలంబులు పుణ్య వనంబులు వాటమైన పూదోటలు మిక్కిలి,
మాటలు నేర్చిన మంచి మృగంబులు కామధేనువులు కల్పవృక్షములు,
క్షేమ కరంబగు చింతామణులు అమృత గుండంబులు,
కడు నైష్ఠికమును కలిగిన విప్రులు విడువక శంభుని వేడెటి రాజులు,
సంతత లింగార్చన గల శైవులు శాంతులైన వేదాంతులు సిద్ధులు,
గణగణ మ్రోగెటి ఘంటనాదములు విజయ ఘోషయగు శంఖ నాదములు,
వీర శైవులు వీరాంగంబులు సాధు బృందములు కామిత భక్తులు అగరు ధూపములు,
జపములు చేసెటి జంగమోత్తములు తపములు చేసెటి తాపసోత్తములు....
కంటిని శ్రీగిరి కన్నుల నిండా... వింటిని మహిమలు వీనుల నిండా!
ఒకసారి శ్రీశైల యాత్రకు వెళ్లి అమ్మవారు అయ్యవార్ల దర్శనం చేసుకున్నాక సాయంత్రం అక్కడ ఒక మంటపంలో ఒక వృద్ధ సన్యాసి శ్రీశైల మాహాత్మ్యాన్ని, శ్రీగిరి ప్రదక్షిణ మహిమను అనుగ్రహ భాషణం చేస్తూ "శ్రీశైల పర్వతానికి అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణ చేసేవారికి అనంత యజ్ఞాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. భక్తుడు వేసే ప్రతి అడుగూ పాపక్షయానికి, పీల్చే ప్రతి శ్వాసా మోక్షమార్గానికి సోపానమవుతుంది. భక్తులారా! గిరిప్రదక్షిణ అంటే కేవలం పర్వతం చుట్టూ నడవడం కాదు. అహంకారాన్ని విడిచిపెట్టి, వేసే ప్రతి అడుగులోనూ, ఆ కొండలో, అడవిలో, ప్రతి చెట్టు, పుట్ట, జంతువు, జీవిలో శివశక్తులను దర్శించడం... వారి దివ్యనామాన్ని స్మరిస్తూ ప్రదక్షిణం పూర్తిచేయడం!" అని చెప్పారు.
ఆ మాటలు గంగయ్య మనస్సులో గట్టిగా నిలిచిపోయాయి.
ఒక సంవత్సరం మాఘమాసంలో గంగయ్య శ్రీశైల క్షేత్రానికి రాయలసీమ వైపున ఉన్న శ్రీశైల ద్వారమైన సిద్ధవటం క్షేత్రానికి చేరుకున్నాడు. శ్రీశైలానికి వెళ్లే యాత్రికులు ప్రాచీనకాలంలో తప్పక దర్శించాల్సిన నాలుగు మహాద్వార క్షేత్రాలలో సిద్ధవటం దక్షిణ ద్వారంగా ప్రసిద్ధి పొందింది. అక్కడ దైవ దర్శనం చేసుకుని, శ్రీశైలానికి పయనమై కొండమీదికి చేరుకుని బయలు సాక్షిగణపతిని, వీరభద్రుని దర్శించుకున్నాడు.
(శ్రీశైల క్షేత్రానికి నాలుగు వైపులా నాలుగు దివ్య ద్వారాలు ఉన్నాయి 1) ఉమామహేశ్వరం, 2) అలంపురం జోగులాంబ, 3)సిద్ధవటం, 4) త్రిపురాంతకం. శ్రీశైలానికి ఎటువైపు నుంచి వెళ్లేవారు ఆ దిశలో ఉన్న ద్వార క్షేత్రాన్ని దర్శించుకుని, ఆ తర్వాత శ్రీగిరి చేరుకోవడం సంప్రదాయం.)
మరుసటి రోజు బ్రాహ్మీముహూర్తంలో లేచి, పాతాళగంగలో స్నానం చేసి, మడి వస్త్రాలు ధరించి, విభూతి పుండ్రాలు, కుంకుమ బొట్టు పెట్టుకున్నాడు. మనసులోనే భ్రమరాంబ అమ్మవారికి ప్రణమిల్లి, మల్లికార్జున స్వామి దివ్యనామాన్ని జపిస్తూ ప్రదక్షిణ ప్రారంభించాడు.
...పాతాళ గంగలో తెప్పున తేలుచు తీర్థంబాడుచు
చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి అనువుగ నుదుట విభూతి ధరిస్తిని
పొలుపుగ మెడ రుద్రాక్షలు దాల్చితి గురు కటాక్షమును గోప్యము చేసితి
గురు మంత్రంబును జపమును చేసితి అకళంకుడనై ఆశ జయిస్తిని
శివ పంచాక్షరి మనసున నిలిపితి...
ఎంతో ఉత్సాహంగా అడుగులు వేశాడు. ఎంతో రమణీయమైన ప్రకృతి!
కొండలు, గుట్టలు, వాటిపై నుంచి ప్రవహించే జలపాతాలు, చిన్న చిన్న సెలయేళ్లు... వాటి పక్కనే గుబురుగా పెరిగిన వట్టివేర్ల పొదలు! అడవిమామిడి, నేరేడు, పనస, సంపంగి, నాగలింగం, నాగమల్లి వంటి దివ్యమైన దేవతా వృక్షాలు... అక్కడక్కడా తెల్లమద్ది చెట్లు, వాటిని చుట్టుకున్న అడవి మల్లె తీగలు!
సంధ్యారంభ విజృంభితం శ్రుతిశిరస్థానాంతరాధిష్ఠితం
సప్రేమ భ్రమరాభిరామ మసకృత్సద్వాసనా శోభితమ్!
భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం
సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితమ్!!
అలా ప్రకృతిలో భ్రమరాంబ మల్లికార్జునులను పరవశంతో దర్శిస్తూ తరిస్తుండటంతో గంగయ్య ఆలస్యమయ్యాడు. బాటలో ఉన్న మిగతా భక్తులు అతనిని దాటుకుని చాలా ముందుకు వెళ్ళిపోయారు.
సమయం గడుస్తున్న కొద్దీ ఎండ తీవ్రత పెరిగింది. దారంతా రాళ్లు, రప్పలు, ముళ్ల పొదలు ఉండే ప్రాంతానికొచ్చాడు. దారిలో సెలయేళ్లు లేవు, కనీసం నీటి కుంటలూ లేవు. దాహంతో పెదవులు ఎండిపోతున్నాయి. ఆకలితో కడుపు నకనకలాడుతోంది. కాళ్లకు బొబ్బలెత్తి ప్రతి అడుగూ వర్ణనాతీతమైన బాధగా మారింది.
"ఇంకా ఎంత దూరం నడవాలి?" అని మనసులో సందేహం కలిగిన మరుక్షణమే, తలవంచి ఆవేదనతో వేడుకున్నాడు "అమ్మా! నా కాళ్లు ఇక ముందుకు పడటం లేదు. నువ్వే నా చేయి పట్టుకుని నడిపించు తల్లి! నేనేదైనా తప్పు చేసి ఉంటే క్షమించమ్మా, మల్లయ్యా క్షమించు!" అని వేడుకుని, శక్తిని కూడదీసుకుని ముందుకు సాగాడు.
మిట్టమధ్యాహ్న సమయానికి తీవ్రంగా అలసిపోయిన గంగయ్య ఒక పెద్ద బండరాయి నీడన కూర్చున్నాడు. అక్కడ కూడా వాతావరణం ఎంతో వేడిగా ఉంది. దాహంతో ప్రాణం విలవిలలాడుతూ శోష వచ్చి పడిపోతాడేమో అనుకున్న సమయాన...
ఎరుపు అంచుగల ఆకుపచ్చని చీర ధరించి,
పైకెత్తి ముడివేసిన కొప్పులో అడవి మల్లెలు తురుముకుని,
ముఖంపైనా, చేతులపైనా తుమ్మెదల్లాంటి పచ్చబొట్లతో,
పసుపు పచ్చని కాంతితో ప్రకాశించే ముఖమండలంపై పెద్ద ఎర్రని బొట్టుతో,
కళ్లలో వాత్సల్యం, పెదవులపై చల్లని చిరునవ్వుతో,
మెడలో పచ్చని మంగళసూత్రం, కాళ్లకు పెద్ద పెద్ద కంకణాలు మెరుస్తుండగా...
ఒక చేతిలో మట్టికుండ, మరొక చేతిలో తీపి అడవి మామిడి, అడివి ఉసిరి, తునికి, పాలపండ్లు, వెలగ పండ్లున్న బుట్టతో ఒక వృద్ధ గిరిజన స్త్రీ అక్కడికి వచ్చింది.
ఉగ్రలోచన వధూమణి కొప్పుగల్గిన భామినీ
విగ్రహంబుల కెల్ల ఘనమై వెలయు శోభనకారిణీ
అగ్రపీఠమునందు వెలసిన ఆగమార్థ విచారిణీ
శీఘ్రమేకని వరములిత్తువు శ్రీగిరి భ్రమరాంబికా!!
ఆమె ఎంతో వాత్సల్యంతో చిరునవ్వు చిందిస్తూ — "బిడ్డా! ముందు ఈ నీళ్లు తాగు, ఈ పండ్లు తిను. ఆ తర్వాత నీ ప్రదక్షిణ పూర్తిచేయి" అంటూ గంగయ్య దగ్గరకు వచ్చి అందించింది.
ఆమె దగ్గరకు వచ్చిన వెంటనే చుట్టూ సంపెంగలు, మల్లెపూల పరిమళం వెదజల్లింది.
ఎక్కడినుంచో వచ్చిన తుమ్మెదలు ఆమె చుట్టూనే గిరగిరా తిరుగుతున్నాయి ఎగురుతున్నాఇ
గంగయ్య కృతజ్ఞతతో ఆ నీరు తాగి, పండ్లు తిన్నాడు. ఆశ్చర్యం! క్షణాల్లో అతని శరీరంలోకి క్రొత్త శక్తి ప్రవహించినట్లయింది. అలసటంతా మాయమైంది. కాళ్లలో ఎక్కడలేని సత్తువా వచ్చింది!
"అమ్మా! ఇంత అడవిలో నా దాహార్తి తీర్చావే, ఎవరమ్మా మీరు?" అని అడిగేలోపే... ఆమె మృదువైన చిరునవ్వుతో — "శ్రీశైలం ప్రదక్షిణ కోసం వచ్చి అలసిపోయిన భక్తులకు దారి చూపడం... ఒక తల్లి ధర్మం కాదా బిడ్డా? నీ అమ్మనే అనుకో!" అని చెప్పి అడవి దారిలోకి నడిచిపోయింది.
గంగయ్య ఆశ్చర్యంతో లేచి ఆమె వెనుక గబగబా వెళ్ళాడు. కానీ ఎక్కడా ఆమె కనిపించలేదు. ఆశ్చర్యకరంగా ఆ దారిలో కనీసం మనుషుల అడుగుజాడలు కూడా లేవు!
చివరకు గంగయ్య గిరిప్రదక్షిణ పూర్తి చేసుకుని భ్రమరాంబ అమ్మవారి ఆలయానికి చేరుకున్నాడు. గర్భగుడిలోకి అడుగుపెట్టి అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని చూడగానే అతని హృదయం ఒక్కసారిగా పులకించిపోయింది! గర్భగుడిలో దీపజ్యోతి ఒక్కసారిగా పెద్దకాంతితో మెరిసింది. అమ్మవారి కిరీటం పక్కన ఒక తుమ్మెద వచ్చి క్షణకాలం పరిభ్రమించి మళ్లీ ఎగిరిపోయింది. గంగయ్య హృదయం ఇక సందేహానికి తావివ్వలేదు.
ఆలయంలోని అమ్మవారి ముఖంలో... అదే చిరునవ్వు! అవె పెద్ద పెద్ద కళ్లు, అదే ఎర్రంచుల ఆకుపచ్చ చీర, అమ్మవారి ముఖాన పచ్చని పసుపు, పెద్ద కుంకుమబొట్టు, తుమ్మెద రెక్కల అలంకారం! అడవిలో తనకు నీళ్లు ఇచ్చి ఆదుకున్న ఆ గిరిజన స్త్రీ కళ్లలోని అదే మాతృవాత్సల్యం ఇక్కడ స్పష్టంగా అనుభవంలోకి వచ్చింది.
గంగయ్య ఆనందభాష్పాలతో అమ్మవారి ముందు సాష్టాంగపడ్డాడు. "అమ్మా! ఈ గిరిప్రదక్షిణ నేను చేయలేదు... నువ్వే నా చేయి పట్టుకుని నడిపించావు తల్లి!" అని భావోద్వేగంతో ఏడ్చేశాడు.
అది చూసిన అక్కడ ఉన్న వృద్ధ అర్చకుడు అతనిని లేవనెత్తి మృదువుగా అన్నాడు:
"బిడ్డా! శ్రీశైలంలో కొన్ని పరమ రహస్యాలు ఉన్నాయి. గొప్ప భక్తులు, సిద్ధులు, యోగులైన వారికి మల్లికార్జున లింగం బంగారు లింగంగా కనిపిస్తుంది. అమ్మవారు ప్రతిరోజూ ఇప్పటికీ సాయం సంధ్య వేళ శ్రీశైల ఆలయమంతా తన పరివారంతో కలిసి విహరిస్తుంది. ఈ శ్రీపర్వతంపై సంపూర్ణ భక్తిప్రపత్తులతో ప్రదక్షిణ చేసే ప్రతి భక్తుడితోనూ జగన్మాత అదృశ్యరూపంలో వెంట ఉండి నడుస్తుంది. కొందరికిది ఆత్మానుభూతిగా తెలుస్తుంది... నీలాంటి నిష్కల్మష భక్తులకు ప్రత్యక్ష దివ్య దర్శనంగా లభిస్తుంది! ఎవరి భక్తి ఎంత నిర్మలమో వారికి అంత స్పష్టంగా వారి అనుగ్రహం ప్రత్యక్షమవుతుంది"
కలియుగంబున మానవులకును కల్పతరువై యుండవా
వెలయగను శ్రీశిఖరమందున విభవమై విలసిల్లవా!
ఆలసింపక భక్తవరులకు అష్టసంపదలీయవా
జిలుగు కుంకుమ కాంతి రేఖల శ్రీగిరి భ్రమరాంబికా!!
ఆ మాటలతో గంగయ్య జన్మ ధన్యమైంది. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం శ్రీశైలానికి వచ్చి గిరిప్రదక్షిణ చేయడం అతని జీవిత నియమంగా మారింది. ఎవరైనా శ్రీశైల యాత్రకు వెళ్తున్నారని తెలిస్తే వాళ్లతో కలిసి వెళ్లేవాడు. అతడు ఎప్పుడూ ఒకటే చెప్పేవాడు "ప్రదక్షిణలో కాళ్లు నొప్పిడితే భయపడకండి... ఆ నొప్పి మీది కాదు! ప్రతి అడుగులోనూ ఆ తల్లి మీ పాపభారాన్ని తగ్గిస్తోంది! అమ్మ మిమ్మల్ని అక్కున చేర్చుకుంటోంది. శ్రీశైలం ప్రదక్షిణలో భక్తుడు కొండ చుట్టూ తిరుగుతున్నానని అనుకుంటాడు... కానీ నిజానికి భ్రమరాంబికా అమ్మవారు అతని హృదయం చుట్టూ తన కరుణామయ వలయాన్ని పరిభ్రమింపజేస్తూ ఉంటుంది!"
గంగయ్య అనుకున్నట్లు తాను అమ్మను వెతుక్కుంటూ శ్రీశైలానికి వెళ్లడు...
తన పిల్లవాడిని అక్కున చేర్చుకోవాలని తల్లే కదిలివచ్చింది.
రెండుమూడు గంటలలో వెళ్లే అవకాశమున్నా అమ్మ-అయ్యల పిలుపు లేనిదే అక్కడికి చేరలేమంటారు భక్తులు.
అమ్మ-అయ్యల పిలుపు వినిపించినవారే శ్రీశైలానికి చేరతారంటారు పెద్దలు.
శ్రీగిరి ప్రదక్షిణ చేసే ప్రతి భక్తుని హృదయంలో నడిచేది భ్రమరాంబ తల్లే.
---
!!శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామినే నమః!!
అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే!
జయ దుర్గే! శివ దుర్గే! హర దుర్గే!
జయ జయ – జయ జయ కామాక్షీ!
జయ జయ – జయ జయ కామాక్షీ!
యాదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్!
తత్సర్వం క్షమ్యతాం దేవి కామాక్షి నమోస్తుతే!!
విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ!
న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి!!
-శంకరకింకరః (శ్రీ అయ్యగారి నాగేంద్ర)
No comments:
Post a Comment