Pages

Sunday, July 19, 2026

బృందావన కథలు – 42 (గోపీనాథుడి ఖీర్ చోరలీల)

జయ శ్రీరాధే!

జయ శ్రీకృష్ణ!
జయ గోపీనాథ్!
జయ జగన్నాథ!
భక్తుని మనసులో పుట్టే ప్రతి కోరికను భగవంతుడు నెరవేరుస్తాడన్నది లేదు...
భక్తునికేది హితమో అది నెరవేరుస్తాడు...
ఐతే...
తన కోసమేమీ కోరకుండా, భగవంతుని సేవ కోసమే మహాత్ములకు పుట్టిన కోరికను మాత్రం భగవంతుడు ఏదోరీతిన తీరుస్తాడు, అవసరమైతే దొంగతనమూ చేస్తాడు. అలాంటి నిర్మల భక్తికి సాక్ష్యంగా నిలిచిన అపూర్వమైన సంఘటనే "క్షీర / ఖీర చోర గోపీనాథుడు" అనే దివ్యలీల. పదండి ఆలస్యం లేకుండా ఆ దొంగతనమేమిటో, ఎవరికోసమో తెలిసుకుందాం!
జయ జయ క్షీరచోర గోపీనాథా!
మాధవేంద్ర పురి మనోరథపూరకా!
భక్తహృదయ నివాసా! రేముణా విహారా!
జయ జయ జగన్నాథ! జయ గోపాలా!
ఒడిశాలోని రేముణా అనే పవిత్ర గ్రామం.
అక్కడ వెలసిన శ్రీ గోపీనాథస్వామి అత్యంత మనోహర మూర్తి. ఆయన ముఖారవిందంలో చిరునవ్వు ఎల్లప్పుడూ విరాజిల్లుతూనే ఉంటుంది.
భక్తులను చూస్తూ అనునయంగా...
"ఏం కావాలి?" అని అడుగుతున్నట్టుగా ఆ కరుణామయ నేత్రాలు ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉంటాయి.
ఆ ఆలయంలో ఒక విశిష్ట సంప్రదాయం ఉండేది.
ప్రతిరోజూ రాత్రివేళ పన్నెండు మట్టి పాత్రలలో "అమృతకేళి క్షీరం - అమృత్ కేళి ఖీర్" అనే పరమాన్నాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించేవారు. (1 వంతు బియ్యం, 2 వంతులు పంచదార, 12 వంతులు చిక్కటి ఆవు పాలు, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు, ఎండు ఖర్జూరం, జీడిపప్పు, ఎండు ద్రాక్షం వంటి ద్రవ్యాల ముక్కలు కొద్దిగా నేతిలో పోపు వేసి చివర్లో పరమాన్నంలో కలుపుతారు. ఈ పదార్థాన్ని అమృతకేళి క్షీరం అని ఆ ప్రాంతంలో పిలుస్తారు.)
ఆ అమృతకేళి క్షీరం ఆ ఆలయంలో ఎంతో ప్రసిద్ధి చెందింది.
దాని రుచి అమృతాన్నికూడా మరిపిస్తుందని అక్కడి భక్తులు, వచ్చిన యాత్రికులు చెప్పుకునేవారు.
అదే కాలంలో...
భగవద్భక్తి అనే మహాసముద్రంలో పూర్తిగా లీనమైన ఒక మహాత్ముడు భూమిపై సంచరిస్తున్నాడు.
ఆయనే "శ్రీ మాధవేంద్ర పురి."
ఆయనకు ఆకలి ఉన్నా అడగడం తెలియదు...
దాహం వేసినా చెప్పడం తెలియదు...
తన అవసరాలన్నీ మరచిపోయినవాడు...
కృష్ణ సేవ తప్ప ఇతరమేమీ ఎరుగనివాడు....
కేవలం "కృష్ణా..." అనే ఒకే నామంతో జీవించేవాడు.
బృందావనంలో గోవర్ధనగిరిపై ప్రత్యక్షమైన "శ్రీ గోపాలదేవుని" సేవ చేస్తూండేవాడు, ఆయన ఆజ్ఞపై ఆయన సేవ కోసం చందనం తీసుకురావడానికి జగన్నాథపురికి బయలుదేరాడు.
మార్గమధ్యంలో రేముణాకు చేరుకున్నాడు.
అక్కడ ఆలయంలో "గోపీనాథుని" దర్శించగానే...
ఆయన దేహం పులకించింది.
కళ్లలో ఆనందంతో కన్నీళ్లు ఉబికాయి.
హృదయం కరిగిపోయింది.
"ఇదే నా గోపాలుడు...
ఇదే నా కృష్ణుడు... ఆహాహా..!"
అంటూ భావసమాధిలో నిలిచిపోయాడు.
తరవాత కొంత సేపటికి బహిర్ముఖుడై, ఆ ఆలయంలోని అర్చకులు, అధికారులు, భక్తులతో మాట్లాడుతుండగా...
ప్రతి దినం రాత్రి వేళా సమర్పించబోయే అమృతకేళి క్షీరం గురించి అందరినోటా చాలా గొప్పగా విన్నాడు.
ఆశ్చర్యం వేసింది, ఈ విషయం విన్న వెంటనే...
అప్రయత్నంగా ఒక చిన్న ఆలోచన ఆయన హృదయంలో మెరిసింది.
"ఈ క్షీరం రుచి ఎలా ఉంటుందో ఒక్కసారి తెలిసితే... బృందావనంలోని నా స్వామి గోవర్ధన గోపాలుడికి కూడా ఇలాగే ప్రతిదినం నేనూ తయారు చేసి ఖీర్ సమర్పించగలనేమో..." అనుకున్నాడు.
అంతే... వెంటనే ఆలోచనలోంచి తేరుకున్నాడు.
ఆలోచన అక్కడితో ముగిసిపోయింది.
అది తన జిహ్వ కోసం కాదు.
అన్ని రుచులు చూసేయాలన్న కోరిక కోసం కాదు.
స్వార్థం కోసం అసలే కాదు.
తన ఆరాధ్యదైవానికి మరింత మధురమైన సేవ చేయాలనే సేవాభావం మాత్రమే.
అయితే వెంటనే ఆయన దిగులుపడ్డాడు.
"అయ్యో! నైవేద్యం సమర్పించకముందే దాని రుచి గురించి ఆలోచించాను. ఇది కూడా పరమాత్ముని సేవకుడైన భక్తునికి తగినది కాదు. కృష్ణుని తప్ప ఎవరినీ ఏమీ అడగని నాకు ఈ కోరిక కలగడం ఆశ్చర్యంగా ఉంది" అని తననే తాను మందలించుకున్నాడు.
ఆలయం నుండి బయటకు వచ్చి, గ్రామంలోని సంత మధ్యలో ఉన్న బాటసారుల మంటపంలో కూర్చొని కృష్ణనామంలో లీనమయ్యాడు.
ఆ రాత్రి...
అర్చకులు అన్ని సేవలూ పూర్తయ్యాయి...
అమృతకేళి క్షీర (ఖీర్) నైవేద్యం పన్నెండు మట్టి కుండ పాత్రల్లో సమర్పించడం పూర్తయింది...
పాత్రల్లో అమృతకేళి క్షీరం భక్తులకు పంచేశారు...
ఆలయ తలుపులు మూసివేశారు...
అర్చకుడు పక్కనే ఉన్న తన ఇంటికివెళ్ళి భోజనం చేసి విశ్రమించాడు.
అర్చకుడు నిద్రలోకి జారుకున్నాడు.
అంతలో...
సాక్షాత్తు ’గోపీనాథుడు’ అర్చకుని స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు.
మధురమైన చిరునవ్వుతో...
"లే వత్సా!
నా పంచె వెనుక ఒక అమృతకేళి క్షీరపాత్రను ఎవరికీ తెలియకుండా తీసి దాచేసాను.
నువ్వు పదకొండు పాత్రల ప్రసాదమే భక్తులకు పంచావు...
కానీ,
పన్నెండోది నేను తీసేసానని నువ్వు గమనించలేదు.
ఆ పాత్రను నేను బృందావనం నుంచి వచ్చిన నా భక్తుడు మాధవేంద్ర పురి కోసం తీసాను.
ఐతే, అతడు నన్నుకూడా అడగలేదు...
ఎప్పుడూ ఎవరినీ అడగడు కూడా...
కానీ అతని హృదయంలోని కోరిక నాకు తెలుసు.
వెంటనే తీసుకెళ్లి అతనికి ఇవ్వు." అని అన్నాడు
అర్చకుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు.
"ఇది కలా? లేక నిజమా?" అనే ఆశ్చర్యంతో ఆలయానికి పరిగెత్తాడు.
తలుపు తీసి, తెరను తొలగించి చూశాడు.
స్వామివారి పంచె వెనుక...
నిజంగానే...
ఒక మట్టి పాత్రలో ఖీర్!
అర్చకుడి చేతులు వణికాయి.
కళ్లలో ఆనందబాష్పాలు పొంగాయి.
"భక్తుడి కోసం...
స్వామివారే క్షీరం దాచారా!"
అని పరవశించిపోయాడు.
ఆ ఖీర్ పాత్రను చేతబట్టి గ్రామమంతా వెతకసాగాడు.
"మాధవేంద్ర పురిగారూ! ఎక్కడ ఉన్నారు?
మీ కోసం గోపీనాథుడు అమృతకేళి క్షీరం దొంగిలించాడు!
రండి...
ఈ ప్రసాదాన్ని స్వీకరించండి!" అని అంటూ జనం ఉండే ప్రాంతాలు, సత్రాలు తిరిగుతున్నాడు...
ఆగ్రామంలోని సంత మధ్యలో ఉన్న బాటసారుల మంటపంలో కృష్ణా నామ కీర్తనం చేస్తున్న మాధవేంద్ర పురి ఆ పిలుపు విన్న వెంటనే... ఆశ్చర్యపోయి ఆ అర్చకుడిని ఆపి పరిచయం చేసుకున్నాడు...
అర్చకుడు చెప్పిందంతా విన్నాడు...
మాధవేంద్ర పురి కన్నీళ్లు పెట్టుకున్నాడు.
"నేను మాటగా కూడా చెప్పలేదు...
మనసులో ఒక్క క్షణం మెరిసిన భావాన్నే
నా కృష్ణుడు ఆలకించాడా!" గోపోనాథుని కరుణకు భక్తుడు మరింత కుచించుకుపోయి కరిగిపోయాడు.
అర్చకుడు ఆ అమృత కేళి క్షీరపాత్రను అందించగా...
దానిని రెండు చేతులతో శిరస్సుకు ఆనించి నమస్కరించాడు.
అది కేవలం క్షీరం కాదు.
అది భగవంతుని ప్రేమ.
అది భక్తికి వచ్చిన ప్రత్యుత్తరం.
అది సేవాభావానికి లభించిన దైవానుగ్రహం.
ప్రతి ముద్దను కన్నీళ్లతో ఆస్వాదించాడు.
(తరువాత ఆ మట్టి పాత్రను భక్తిపూర్వకంగా శుభ్రపరచి చిన్న ముక్కలుగా చేసి... ప్రతిరోజూ ఒక ముక్కను ప్రసాదంగా స్వీకరించేవాడు.)
ఆరాత్రే అర్చకుడు మాధవేంద్ర పురిని వెతకడంలో ఈ విషయం మరుసటి ఉదయానికే ఈ వార్త దేశమంతా వ్యాపించింది.
"భక్తుడి కోసం స్వామివారే ఖీర్ దొంగిలించారట!"
అని అందరూ ఒకరికొకరు చెప్పుకుంటూ ఆశ్చర్యపోయారు.
ఆ రోజు నుండి...
రేముణా గోపీనాథుడు...
"క్షీరచోర గోపీనాథుడు" అనే అపూర్వ నామంతో జగద్విఖ్యాతుడయ్యాడు.
కానీ...
మాధవేంద్ర పురికి మాత్రం ఈ కీర్తి ఇష్టం లేదు.
ప్రజల ప్రశంసలు తన భక్తికి అడ్డంకి కాకూడదని, ఆ కీర్తి, పదిమందిలో పేరు, గుర్తింపు - గౌరవాలు, గర్వానికి - అహంకారానికి మూల కారణాలని భావించాడు.
అందుకే...
తెల్లవారక ముందే...
ఎవరికీ చెప్పకుండా...
నిశ్శబ్దంగా రేముణాను విడిచి వెళ్లిపోయాడు.
నిజమైన భక్తుడు...
ప్రపంచం తనను గుర్తించాలనుకోడు.
భక్తివల్ల కీర్తి ప్రతిష్ఠలు రావాలని కోరుకోడు.
తాను ప్రేమించే భగవంతుడు తన నడతకు, ప్రవర్తనకు చిరునవ్వు నవ్వి ఆశీర్వదిస్తే అదే చాలు అనుకుంటాడు.
---
భగవంతుడు మన పెదవులపై పలికిన ప్రార్థనను మాత్రమే వినడు...
మన హృదయంలో నిశ్శబ్దంగా దాగిన సేవాభావాన్ని కూడా వింటాడు.
ఆయనకు సమర్పించే ప్రేమలో స్వార్థం లేకపోతే...
భక్తుని కోసం భగవంతుడే నియమాలను మార్చేస్తాడు.
అవసరమైతే...
"దొంగ" అనే పేరును కూడా ఆనందంగా స్వీకరిస్తాడు.
అందుకే...
రేముణా గోపీనాథుడు ఈ రోజుకీ భక్తుల హృదయాల్లో...
"క్షీరచోర గోపీనాథుడు"గా నిలిచిపోయాడు.
"క్షీరచోర గోపీనాథం
భక్తవాంఛా కల్పపాదపమ్!
మాధవేంద్రపురేర్దాస్యం
వందే ప్రేమప్రదాయకమ్!!
భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షస్వరూపుడైన క్షీరచోర గోపీనాథునికి నుతులివే. శ్రీ మాధవేంద్ర పురిపై అపార ప్రేమను కురిపించి, భక్తికి పరాకాష్టను చూపించిన ఆ ప్రభువుకు నేను వందనాలర్పిస్తున్నాను."
---
జయ గోపీనాథ్!
జయ జగన్నాథ!
జయ శ్రీరాధే!
జయ శ్రీకృష్ణ!
జయ జయ బృందావన్!
– శంకరకింకరః

No comments:

Post a Comment