జై రాధే కృష్ణ!
జై లడ్డూ గోపాల్!
జై బృందావన్!
బృందావనంలో ఒక కృష్ణ భక్తుడైన మహాత్ముడు నివసించేవాడు. ఆయన ఇంట్లో చిన్న లడ్డూ గోపాలుడు కొలువై ఉండేవాడు. ప్రతిరోజూ స్నానం చేయించడం, అందమైన వస్త్రాలు తొడగించడం, వెన్న, పాలు, మిఠాయిలు నివేదించడం, రాత్రికి పవళింపజేయడం, పిల్లలతో, యువకులతో సత్సంగం చేయడం ఇదే ఆయన దినచర్య.
ఒక రోజు కొందరు యువకులు "బాబాజీ! ఈ చిన్న విగ్రహాన్ని ఎందుకు చిన్నబిడ్డలా చూసుకుంటారు? మనిషితో వ్యవహరిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు? భగవంతుడు జగన్నాథుడు. ఆయనకు మన సేవ మరీ ఇంత అవసరమా?" అని ఆయన్ని అడిగారు.
ఆ మహాత్ముడు చిరునవ్వు నవ్వి. "మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పను. గోపాలుడే చెబుతాడు." అన్నాడు.
అని వారిని కూర్చోబెట్టాడు. కొద్దిసేపటి తరువాత ఆయన లడ్డూ గోపాలుడిని ఒడిలోకి తీసుకుని చిన్నబిడ్డతో మాట్లాడినట్లుగా మాట్లాడసాగాడు.
"గోపాలా! ఈరోజు వెన్న తింటావా? లేక పాలు తాగుతావా? ఈ కొత్త పట్టు వస్త్రం నీకు నచ్చిందా?" అని ముద్దాడాడు.
ఆ దృశ్యాన్ని చూసి యువకులు ఆశ్చర్యపోయారు.
వారిలో ఒకడు నవ్వుతూ "బాబాజీ! గోపాలుడు నిజంగానే మీ మాటలు వింటాడా?" అని అడిగాడు.
మహాత్ముడు ప్రశాంతంగా "ఒక చిన్నబిడ్డను ప్రేమతో పెంచితే, అతడు మన ప్రేమకు స్పందిస్తాడు కదా! అలాగే బాలగోపాలుడు కూడా ప్రేమకే స్పందిస్తాడు. భగవంతుని ఐశ్వర్యరూపాన్ని చేరుకోవడం కష్టమై ఉండవచ్చు. కానీ ఆయన బాలరూపాన్ని ప్రేమతో సేవిస్తే, ఆయన మన హృదయంలో తన సాన్నిధ్యాన్ని అనుభవింపజేస్తాడు." అంటూ సమాధానమిచ్చాడు
కొద్దిసేపు ఆగి...
"మీరు గమనించారా? చిన్నపిల్లలను ఎంతగా ప్రేమిస్తే, వారు అంత త్వరగా మనకు దగ్గరవుతారు. కోపం వచ్చినా కాసేపటికే మళ్లీ నవ్వుతూ మన ఒడిలోకి వచ్చేస్తారు. బాలకృష్ణుడి స్వభావం కూడా అంతే. ఆయన ప్రేమను మాత్రమే చూస్తాడు." అన్నాడు
"అయితే ఆయనను ఎలా సేవించాలి?" అని మరో యువకుడు అడిగాడు.
అందుకు ఆమహాత్ముడు "ఆయనను నీ తండ్రిగా భావించు... గురువుగా భావిచు... కుమారుడిగా భావించు... లేక తమ్ముడిగా భావించు... లేక మనవడిగా భావించు... నీ స్నేహితుడిగా భావిచు... నీ హృదయానికి ఏ బంధం అత్యంత మధురమో, ఆ బంధంతో గోపాలుడిని పిలువు. ఆ భావాన్ని ప్రతిరోజూ ప్రోదిచేసుకో.
ఆయనకు భోజనం పెట్టు. నీకు తినిపిస్తున్నట్లే ప్రేమగా నివేదించు.
కొత్త బట్టలు కొంటే ఆయనకూ ఒకటి అర్పించు.
మనసులో ఆయనతో మాట్లాడుకో...
నీ సంతోషం చెప్పు...
నీ బాధ చెప్పు...
నీ సందేహం చెప్పు...
మొదట నీవే ఆయనతో మాట్లాడుతున్నానని అనిపిస్తుంది. కానీ కొంతకాలానికి, నీ ప్రతి అడుగులోనూ ఆయన సాన్నిధ్యం నీకు అనుభూతి అవుతుంది." అని వివరించాడు.
యువకులలో ఒకతను " ఆ సాన్నిధ్యం, సాన్నిహిత్యం మాలాంటివారికి కుదురుతుందా?! అందుకు పెద్ద పూజలు, దానాలు, కఠిన తపస్సులు అవసరమా?!" అని సందేహం అడిగాడు.
మహాత్ముడు నవ్వి "లేదు నాయనా! గోపాలుడికి బంగారం, విలువైన కానుకలు అవసరం లేదు. ఆయనకు గొప్ప నైవేద్యాలు అవసరం లేదు. నీవేది తింటే అదే పెట్టు... నీ చేతనైనది శుచిగా, పవిత్రంగా సమర్పించు, ఆయన కోరేది ఒక్కటే..." అని లడ్డూ గోపాలుడి ముఖాన్ని చూస్తూ మృదువుగా పలికాడు.
"'ప్రేమపూర్వకమైన భక్తి'
భగవంతుడు పదార్థాలను స్వీకరించడు. వాటి వెనుక దాగి ఉన్న ప్రేమను స్వీకరిస్తాడు." అని ఆ మహాత్ముడు బోధ చేసాడు.
"భావగ్రాహీ జనార్దనుడు" అని శాస్త్రం చెప్పిన మాట ఇదే.
ఒక చిన్న తులసీదళం అయినా ప్రేమతో సమర్పిస్తే ఆయన పరమానందంతో స్వీకరిస్తాడు.
అలాగే ప్రేమలేని బంగారు పర్వతాలను కూడా ఆయన కోరడు.
ఆ రోజు యువకులందరూ నమస్కరించి వెళ్లిపోయారు.
వారు ఇంటికి వెళ్లిన తరువాత తమ తమ ఇళ్లలో వాళ్ళ వాళ్ళ శక్తిమేర, చిన్న బాలగోపాలుని చిత్రాన్ని, విగ్రహాన్ని ఉంచి ప్రతిరోజూ ప్రేమతో మాట్లాడటం ప్రారంభించారు.
రోజులు గడిచాయి...
వారి జీవితాల్లో సమస్యలు ఒక్కరోజులో మాయమవ్వలేదు.
కానీ వారి మనసుల్లో భయం తగ్గింది.
ఆందోళన స్థానంలో విశ్వాసం పెరిగింది.
ఒంటరితనం స్థానంలో గోపాలుడి సాన్నిధ్యం అనుభూతి కలిగింది.
ఆనాడు గోపకులందరూ గోపాలుడున్నాడనే ధైర్యంతో ఎలా జీవనం సాగించారో అలాంటి ధృతి, ధైర్యం కలిగాయి.
అదే నిజమైన గోపాలుడి కృప.
బాలకృష్ణుడిని సేవించడం అంటే ఒక విగ్రహాన్ని అలంకరించడం మాత్రమే కాదు.
మన హృదయంలో ఆయనకు ఒక స్థానం ఇవ్వడం.
ఆయనను మన కుటుంబ సభ్యుడిగా భావించడం.
ప్రేమతో పిలవడం.
ప్రేమతో మాట్లాడడం.
ప్రేమతో సేవించడం.
ఎందుకంటే...
భగవంతుని చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.
కానీ బాలగోపాలుడి హృదయాన్ని గెలుచుకోవడానికి ఒక్క ప్రేమ చాలు.
జయ జయ శ్రీ రాధే కృష్ణ!
– శంకరకింకరః (శ్రీ నాగేంద్ర అయ్యగారి)
No comments:
Post a Comment