జయ శ్రీరాధే!
జయ శ్రీకృష్ణ!
జయ జయ బృందావన్!
బృందావనంలో శ్రీచైతన్య మహాప్రభువు అనుగ్రహంతో భక్తిరసానికి నూతన ఒరవడిని ఆరంభించిన మహామహులలో శ్రీరూప గోస్వామి అగ్రగణ్యులు. ఆయన రచించిన ప్రతి అక్షరమూ శ్రీరాధామాధవుల దివ్యప్రేమతో నిండి ఉంటుంది. అందుకే వైష్ణవులు ఆయనను"రసాచార్యుడు","భక్తిరస సముద్రుడు" అని గౌరవిస్తారు.
సేవాకుఞ్జ సమీపంలోని చిన్న కుటీరంలో నివసిస్తూ, భిక్షతో జీవిస్తూ, మిగిలిన సమయమంతా శ్రీరాధా-గోవిందుల లీలలను ధ్యానిస్తూ గ్రంథరచనలో నిమగ్నమై ఉండేవారు.
ఆయన ప్రముఖ సుందర రసభరిత రచనలు
భక్తిరసామృత సింధు
ఉపదేశామృతం
ఉజ్జ్వల నీలమణి
శ్రీ విదగ్ద మాధవ మరియు శ్రీ లలితా మాధవ
స్తవ మాల
పద్యావళి
లఘు భాగవతామృతం
దానకేళి - కౌముది మరియు హంసదూత.
ఆయనకు ఆకలి, నిద్ర, శరీరసుఖం అనే భావనలే ఉండేవి కావు. కలం, కాగితం చేతిలో ఉంటే చాలు... హృదయంలో రాధానామం ప్రవహించేది. కళ్లముందు నిత్యం నికుంజలీలలే కనిపించేవి.
ఒకసారి "ఉజ్జ్వలనీలమణి" రచనలో ఆయన పూర్తిగా లీనమయ్యారు. మూడు రోజులుగా సరైన ఆహారం కూడా తీసుకోలేదు. శరీరం బలహీనపడినా, హృదయం మాత్రం రాధామాధవుల ప్రేమామృతంలో ఓలలాడుతూనే ఉంది.
అలాంటి సమయంలో ఆయన హృదయం నుంచి ఒక శ్లోకం సహజంగానే ఉబికివచ్చింది
తుండే తాండవినీ రతిం వితనుతే తుండావలీ లబ్ధయే
కర్ణక్రోడకడంబినీ ఘటయతే కర్ణార్బుదేభ్యః స్పృహామ్ !
చేతః ప్రాంగణసంగినీ విజయతే సర్వేంద్రియాణాం కృతిం
నో జానే జనితా కియద్భిరమృతైః కృష్ణేతి వర్ణద్వయీ !!
భావం: "‘కృష్ణ’ అనే రెండు అక్షరాలు నాలుకపై నర్తించడం మొదలైతే వేల నాలుకలు కావాలని అనిపిస్తుంది. చెవులు వినగానే లక్ష చెవులు ఉంటే బాగుండునని తపిస్తుంది. హృదయంలో ఆ నామం ప్రవేశించిన తరువాత మిగిలిన ఇంద్రియాలన్నీ నిశ్చలమైపోతాయి. ఆ రెండు అక్షరాలలో ఎంత అమృతం దాగి ఉందో వర్ణించడం అసాధ్యం."
ఆ శ్లోకం వ్రాసిన తరువాత ఆయన కన్నులు మూసుకుని రాధాకృష్ణుల స్మరణలో లీనమయ్యారు. శరీరం పూర్తిగా డస్సి పోయింది... ఇక శోషవచ్చి శరీరం పడిపోతుందేమో అన్నంత శుష్కించింది.
అప్పుడే కుటీరం వెలుపలనుండి ఒక మృదు మధురమైన స్వరంలో "బాబాజీ... రూప గోస్వామీజీ" అనే పిలుపు వినిపించింది...
ఆయన నెమ్మదిగా లేచి బయటకు వచ్చి చూశారు.
అక్కడ ఒక అపూర్వ అలౌకిక సౌందర్యంతో కూడిన బ్రజగోపిక నిలబడి ఉంది. ఆమె చేతిలో వెండి పాత్రలో వేడివేడిగా పొంగించి గోరువెచ్చగా చల్లార్చిన పాలున్నాయి. ఆమె ముఖంపై వర్ణించలేని కాంతి, కళ్ళలో అపార కరుణ, మాటలో చెప్పనలవి కాని మాధుర్యం, మొత్తంగా మెరుపుతీగ వలె అనంతమైన లావణ్యం...
ఆమె వినయంగా నమస్కరించి "మీరు ఎన్నో రోజులుగా ఆహారం తీసుకోలేదని తెలిసి మాస్వామి ఈ పాలు పంపించారు. దయచేసి స్వీకరించండి." అని చెప్పింది
రూప గోస్వామి ఆశ్చర్యపోయారు. ఒక్క క్షణం తేరుకుని "అమ్మా! నీవెవరు? ఏ గ్రామం నుంచి వచ్చావు?" అని అడిగారు
ఆమె మృదువుగా నవ్వింది, "నేను ఇక్కడి బ్రజవాసినే. పక్కన బర్సానా గ్రామంలో మా తల్లిదండ్రులుంటారు... మీరు ముందు ఈ పాలు త్రాగండి." అని చెప్పి పాత్రను అక్కడ ఉంచి నెమ్మదిగా వెళ్లిపోయింది.
రూప గోస్వామి ఆ పాలను శ్రీ రాధాకృష్ణులకు నివేదించి ప్రసాదంగా భావించి సేవించారు.
అవి సాధారణ పాలా? కావు. అవి త్రాగగానే రూపగోస్వామికి
నూతనోత్సాహం వచ్చింది.
ఎక్కడలేని సత్తువ శరీర ధార్ఢ్యం వచ్చింది.
శరీరమంతా అపూర్వమైన శక్తి తరంగాలు ప్రవహించాయి.
మనస్సు మరింత ప్రశాంతమైంది.
మరింత చురుకైన ఆలోచనలు, కవితాత్మకమైన దృష్టి కలిగాయి
అప్పటినుండి తన భక్తి రచనల వ్యాసంగం మరింత వేగంగా సాగడానికి రసభావపరంపర కలగసాగింది.
కొద్దిసేపటి తరువాత గుర్తుకు వచ్చి, ఆ గోపికకు పాత్రను తిరిగి ఇవ్వాలని బయటకు వచ్చారు.
కానీ...
ఆమె ఎక్కడా కనిపించలేదు.
అప్పుడే అక్కడికి శ్రీ సనాతన గోస్వామి విచ్చేశారు.
రూప గోస్వామి జరిగినదంతా వివరించారు.
సనాతన గోస్వామి ఆ పాత్రను చేతిలోకి తీసుకుని కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలిచారు.
ఆయన కన్నుల నుంచి ఆనందబాష్పాలు జాలువారాయి.
వణుకుతున్న స్వరంతో
"రూపా! నీ భాగ్యం ఎంత గొప్పదో తెలుసా? నీకు పాలు తీసుకొచ్చింది సాధారణ గోపిక కాదు... స్వయంగా శ్రీరాధికాదేవి!" అని అన్నారు.
ఆ మాట వినగానే రూప గోస్వామి విపరీతమైన రసభక్తియుక్త ప్రేమావేశంలో నేలపై సాష్టాంగంగా పడి చిన్నపిల్లాడివలె విలపించారు...
"అయ్యో! జగజ్జననీ స్వయంగా వచ్చి నాయెదుటే నిలిచినా నేను గుర్తించలేకపోయానా! ఎంత మందభాగ్యుణ్ణి" అంటూ దొర్ల సాగారు...
ప్రేమాశ్రువులతో ఆయన హృదయం కరిగిపోయింది. కళ్ళలో నీళ్ళ ధారకి పాదాల వద్ద మట్టి బురద కాసాగింది... సనాతన గోస్వామి రూపగోస్వామిని అనునయించి ఊరడిల్లేలా చేశారు.
కొన్ని క్షణాల తరువాత...
ఆ స్థలమంతా దివ్య పరిమళంతో నిండిపోయింది.
తన హృదయంలోంచి ఒక మృదుమధురమైన స్వరం వినిపించింది.
"రూపా! నీవు నా సేవకుడివి మాత్రమే కాదు... నా ప్రియభక్తుడివి కూడా. నీ చేత మా యుగళ ప్రేమరహస్యాలు మధుర మధురంగా ప్రపంచానికి తెలియాలి. అందుకే నీ సేవ కొనసాగాలని నేను స్వయంగా వచ్చాను, నీ శరీరం పడిపోకూడదనే నేను స్వయంగా వచ్చి నీకు గోలోకంలోని గోవుల పాలు యిచ్చాను. నీ ప్రతి మాటలో, రచనలో నా దర్శనం జరుగుతూనే ఉంటుంది"
అప్పుడు ఆయనకు తన రాధా కృష్ణులపై ఉన్న ప్రేమను వ్యక్తం చేసే మరో మధుర శ్లోకం స్ఫురించింది
అనారాధ్య రాధా పదాంభోజ రేణుం
అనాశ్రిత్య వృందాటవీం తత్‌పదాంకామ్ ।
అసంభాష్య తద్భావ గంభీర చిత్తాన్
కుతో శ్యామసింధో రసస్యావగాహః ॥
భావం: "శ్రీరాధాదేవి పాదరజస్సును పొందకుండా, ఆమె పాదచిహ్నాలతో పవిత్రమైన బృందావనంలో ఆశ్రయం పొందకుండా, ఆమె భావంలో మునిగిన మహాభక్తుల సాంగత్యం లేకుండా, శ్యామసుందరుని ప్రేమరస సముద్రంలో ప్రవేశించడం అసాధ్యం."
ఈ సత్యాన్ని రూప గోస్వామి తన జీవితానుభవంతో గ్రహించారు.
రాధారాణి అనుగ్రహం లేకుండా కృష్ణుని మాధుర్యరసం అందదు. భక్తుని సేవ నిజాయితీగా, నిస్వార్థంగా, అహంకారరహితంగా ఉన్నప్పుడు రాధామాత స్వయంగా అతని యోగక్షేమాలను నిర్వహిస్తుంది.
ఆ తరువాత రూప గోస్వామి రచించిన ప్రతి గ్రంథంలో, ప్రతి పద్యంలో, ప్రతి రసవర్ణనలో రాధామాధవుల అపార కృప ప్రవహించింది. అందుకే నేటికీ ఆయన రచనలు చదివినవారి హృదయాలలో భక్తి, ప్రేమ, మాధుర్యరసం ఉప్పొంగుతూనే ఉంటాయి.
---
శ్రీకృష్ణుని తేలికగా చేరుకోవడానికి మార్గం శ్రీరాధాదేవి కృపయే.
తనను పూర్తిగా సేవలో అర్పించుకున్న భక్తుని యోగక్షేమాలను తాను నమ్ముకున్న దైవమే స్వయంగా చూసుకుంటుంది.
రాధానామం,
బృందావనవాసం,
రసికభక్తుల సత్సాంగత్యం
ఈ మూడు లభించినవారే ప్రేమపూర్వక భక్తిరస మాధుర్యాన్ని నిజంగా ఆస్వాదించగలరు.
జై రాధే కృష్ణ
రాధే రాధే రాధే రాధే
-శంకరకింకరః
No comments:
Post a Comment