Pages

Wednesday, July 1, 2026

బృందావన కథలు – 35 (దామోదరం - నలుగుడు)

నలుగుడు వచ్చిందని కృష్ణుణ్ణి వదలొద్దు...
నలుగుడు వచ్చినప్పుడే కృష్ణుణ్ణి పట్టుకో!
-------
శిష్యుడు: నమస్కారం గురువుగారూ, జైరాధే కృష్ణ!
(ఓ క్షణమాగి...బాధతో సుదీర్ఘమైన నిట్టూర్పు విడుస్తూ) అయ్యో గురువుగారూ! ఈ లోకాన్ని చూస్తుంటే జాలేస్తోంది. పుట్టిన ప్రతి జీవీ ఏదో ఒక కష్టంతో, బాధతో నలిగిపోతూనే ఉంది. ఈ సంసార చక్రంలో నలిగిపోని ప్రాణి అంటూ ఒకటి లేదా స్వామీ? దీనికి ఉపాయం లేదా భగవన్?
గురువు:(చిరునవ్వుతో) ఆయుష్మాన్ భవ! ఉంది వత్సా! కానీ లోకులంతా ఇలా నిత్యం కష్టాల గానుగలో నలిగిపోవడానికి అసలు కారణం ఎవరో తెలుసా? ఆ నల్లనయ్య... ఆ చిన్ని కృష్ణ పరమాత్ముడేనయ్యా!
శి:(నోరు వెళ్లబెట్టి, చెవులు మూసుకుంటూ) ఆఁ! కృష్ణ కృష్ణా! ఎంత మాట గురువుగారూ! లోక రక్షకుడైన పరమాత్ముడు లోకులను కష్టాలపాలు చేయడమేమిటి? ఒకవేళ మహాభారత యుద్ధం చేయించిన ప్రౌఢ కృష్ణుడంటే ఏదో అనుకోవచ్చు కానీ... అమాయకపు చిన్ని కృష్ణుడి వల్ల లోకం నలుగుతోందా? నాకేమీ అర్థం కావడం లేదు!
గు:(మళ్లీ నవ్వుతూ) అవును నాయనా, ఆ బుజ్జి కన్నయ్యే! ఆ కాస్త వయసులో వాడు అంత అల్లరి చేయకుండా ఉండి ఉంటే... ఈనాడు మనకీ నలుగుడు, ఈ బాధలు ఉండేవే కావు.
శి:(కుతూహలం ఆపుకోలేక) గురువుగారూ, నా బుద్ధికి అస్సలు అందడం లేదు. ఆ యశోద నందనుడి బాల్య చేష్టలకీ, ఈనాడు సమస్త జీవరాశులూ పడే బాధలకీ ముడి ఎక్కడో కొంచెం విప్పి చెప్పండి స్వామీ!
గు: సంబంధం లేకపోవడమేమిట్రా అబ్బాయీ! అంతా ఆ వెన్న దొంగతనాల వల్లే వచ్చింది! ఇల్లూ ఇల్లూ తిరిగి పాలు, పెరుగు, వెన్న దొంగిలిస్తున్నాడని గోపికలంతా కలిసి యశోదమ్మ దగ్గరకు వెళ్లి రోజూ పెద్ద గొడవ చేసేవారు కదా!
శి: అవును స్వామీ, ఆ లీలలన్నీ భాగవతంలో విన్నాను. కానీ గోపికల ఇళ్లల్లో వెన్న దొంగిలిస్తే... ఈనాడు లోకంలో ఉన్న మనమెందుకు నలిగిపోవాలి గురువుగారూ?
గు:(శిష్యుడి తలపై సున్నితంగా తడుతూ) కృష్ణ లీలలు అంత తేలికగా బోధపడవు వత్సా! కన్నయ్య తమ ఇళ్లల్లో దూరి కుండలు పగలగొడుతున్నాడని, వెన్నంతా ఎత్తుకెళ్లి కోతులకు పెడుతున్నాడని గోపికలంతా కలిసి యశోదమ్మ ముందు మొరపెట్టుకున్నారు కదా?
శి: అవునండీ! మరి వాళ్ళు అలా కృష్ణుడి మీద ఫిర్యాదు చేసినందుకు, కృష్ణుడు కోపగించుకుని మనకిలా కష్టాల రూపంలో శిక్ష విధిస్తున్నాడా?
గు: కాదు నాయనా, కాదు! ఇక్కడ తప్పు కృష్ణుడిది కాదు, ఆ గోపికలదీ కాదు... అంతా ఆ యశోదమ్మ వల్ల జరిగింది! ఆ తల్లి చేసిన పనే ఈనాటి మన బాధలన్నింటికీ మూలం!
శి:(ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి) యశోదమ్మ వల్లా?! జగన్మాత లాంటి ఆ తల్లి లోకానికి బాధలు కలిగించడమేమిటి గురువుగారూ? నా తల తిరిగిపోతోంది, కాస్త వివరంగా చెప్పండి.
గు: విను నాయనా... గోపికలందరూ వచ్చి రోజూ వాపోతుంటే, యశోదమ్మకు ఒక పక్క కోపం, మరోపక్క ఉక్రోషం వచ్చాయి. 'వీడి అల్లరి ఈరోజుతో ఆపాలి' అని నిశ్చయించుకుని, ఇంట్లో ఉన్న కవ్వపు త్రాడు తీసుకుని ఆ చిన్ని కృష్ణుడి నడుముకు చుట్టి రోటికి కట్టేసింది! కన్నయ్య బంధించబడటం చూసి గోపకాంతలంతా ఎంతో ఆనందించారు.
కానీ వత్సా... ఆ త్రాడు గట్టిగా బిగించడం వల్ల, ఆ చిన్ని కృష్ణుడి పొట్ట (ఉదరం) గట్టిగా నలిగిపోయింది!
శి:అయ్యో పాపం! చిన్ని కృష్ణుడి కడుపు నలిగితే... మనకెందుకు కష్టం స్వామీ?
గు:(భక్తిపూర్వక భావోద్వేగంతో) ఓరి వెర్రి నాగన్నా!!! అక్కడే ఉంది మర్మం! ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి గర్భంలోనే కదా ఈ బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి! మూడు లోకాలూ, సమస్త జీవరాశులూ ఆయన కడుపులోనే నివసిస్తున్నాయి. ఎప్పుడైతే యశోదమ్మ త్రాడుతో ఆ ఉదరాన్ని గట్టిగా బంధించిందో... ఆ కడుపు నలగడంతో పాటు, అందులో ఉన్న సమస్త ప్రాణికోటి కూడా ఒక్కసారిగా నలిగిపోయి విలవిలలాడింది!
"ఘోషప్రఘోషశమనాయ మథోగుణేన... మధ్యే బబన్ద జననీ నవనీతచోరమ్!"
ఆనాడు యశోదమ్మ కట్టిన బంధనం... ఈనాటికీ త్రిజగత్తులలోని సమస్త జీవుల ఆక్రందనలకు, కష్టాల నలుగుడికి కారణమైంది. గోపికలకేమో అది ఆనందం... కానీ మూడు లోకాల జీవులకూ అది నలుగుడు కష్టం! ఈ నలుగుడుకి కృష్ణుడూ, యశోదమ్మా, గోపికలూ కాదు కారణం ఆకవ్వపు త్రాడేనోయ్...
శి:(కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా, చేతులు జోడించి) ఆహా! ఎంతటి గంభీరమైన అంతరార్థం గురువుగారూ! కర్ణామృత శ్లోకంలో ఇంతటి మధుర భావం ఉందా! మరి ఈ నలుగుడు నుండి మాకు విముక్తి లేదా స్వామీ?
గు: ఉంది నాయనా! ఎంత కష్టం వచ్చినా, ఎంత నలుగుడు ఎదురైనా ఆ కన్నయ్యను మాత్రం మరువకు. మన కష్టాలనన్నింటినీ ఆ కృష్ణుడి పాదాల చెంత పెట్టేసి... "కృష్ణా! నీ కడుపులోనే ఉన్నాం, నీవే రక్షించాలి" అని శరణు వేడితే, ఆ బంధనాలను తెంచి, ఆయనే మనకు పరమానందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు!
శి:ధన్యుణ్ణి గురువుగారూ! జై రాధే కృష్ణ!
గు: జై రాధే కృష్ణ! మరోమాట...
నలుగుడు వచ్చిందని కృష్ణుణ్ణి వదలొద్దు...
నలుగుడు వచ్చినప్పుడే కృష్ణుణ్ణి పట్టుకో.
నీ బాధను ఆయనకు సమర్పించు.
నీ కన్నీటిని ఆయన పాదాలపై చిందించు.
నీ భారాన్ని ఆయన భుజాలపై ఉంచు.
ఎందుకంటే...
లోకానికి నలుగుడు ఇచ్చిన దామోదరుడే...
భక్తుడి హృదయానికి ఆనందాన్ని ఇచ్చే గోవిందుడు.
అందుకే...
కష్టం వచ్చినప్పుడు "ఎందుకు కృష్ణా?" అని అడగకు...
"నీ దగ్గరకే వచ్చాను కృష్ణా!" అని చెప్పు.
అప్పుడు నలుగుడు కూడా ప్రసాదమవుతుంది...
బాధ కూడా భక్తిగా మారుతుంది...
కన్నీరు కూడా కృపగా మారుతుంది.
జై శ్రీ రాధా దామోదర!
-----
ఘోషప్రఘోషశమనాయ మథోగుణేన
మధ్యే బబన్ద జననీ నవనీతచోరమ్!
తద్బన్ధనం త్రిజగతామ్దరాశ్రయాణా
మాక్రోశకారణమహో! నితరాం బభూవ!!
గోపికల కోలాహలాన్ని శాంతపరచడానికి యశోదమ్మ పెరుగు చిలికే త్రాడుతో వెన్నదొంగ అయిన బాలకృష్ణుణ్ణి నడుముకు కట్టింది. కానీ ఆ చిన్న బంధమే, తన ఉదరంలో మూడు లోకాలనూ ధరించిన ఆ జగన్నాథుని ద్వారా, మూడు లోకాల జీవులందరికీ బాధలు, నలుగుడు, విలాపాలకు కారణమైందని కవి చమత్కారంగా వర్ణిస్తున్నాడు.
(శ్రీ కృష్ణ కర్ణామృతం - 22 వ శ్లోకమాధారంగా పై సంభాషణ రచన, ఈ శ్లోకంయొక్క భావార్థం దామోదరలీలను గుర్తుచేసుకోవడం, నిందించడంకాదు భక్తిపూర్వక ఉత్ప్రేక్ష్యాలంకారం ఇందులో ఇమిడి ఉంది)
-శంకరకింకరః

No comments:

Post a Comment