Pages

Friday, July 3, 2026

బృందావన కథలు – 36 ( యమునా నదిలో నౌకా లీల)

జై రాధేశ్యామ్!

బృందావనంలో జరిగే ప్రతి లీల వెనుక ప్రేమ ఉంటుంది...
ప్రతి సంఘటన వెనుక ఒక సమర్పణభావం దాగి ఉంటుంది.
అక్కడ చెట్లు, తీగలు, పుష్పాలు, పక్షులు మాత్రమే కాదు... యమునారాణి కూడా శ్రీజీ - శ్యామ్ల(రాధా-కృష్ణులు) శ్రీయుగళం సేవకోసమే నిరంతరం ఎదురుచూస్తూ ఉంటుంది.
ఒకరోజు యమునారాణి తనలో తాను "శ్రీయుగళం బృందావనవిహారంలో నా తీరాలవద్ద ఎన్నోసార్లు సంచరించారు. నా జలాలను పావనం చేశారు. కానీ నా ఒడిలో కూర్చొని కొంతసేపు విహరించే భాగ్యం నాకు ఇంకా కలగలేదు. ఈ రోజు ఆ సేవను పొందగలనా?" అని అనుకుంది...
భక్తుల మనసులో కలిగే పవిత్రమైన కోరికను శ్రీయుగళం వినకుండా ఉండరు.
అదే రోజు శ్రీజీ తన ప్రియసఖులైన లలిత, విశాఖలతో కలిసి యమునానదిని దాటి అవతలి ఒడ్డున ఉన్న సుగంధ పుష్పవనానికి వెళ్లాలని సంకల్పించారు.
సాయంసూర్యుని ఎర్రని పచ్చని కిరణాలు యమునాజలాలపై బంగారు రేఖల్లా పరచుకున్నాయి. కదంబవృక్షాలు, చంపక వృక్షాలు చల్లనిగాలికి మెల్లగా ఊగుతూ మత్తువాసన వెదజల్లుతున్నాయి. కోయిలలు, చిలుకలు మధురంగా ఆలపిస్తున్నాయి.
ముగ్గురూ ఒడ్డున ఉన్న ఒక చిన్న చెక్కనావలో కూర్చొని ప్రయాణం ప్రారంభించారు. శ్రీజీ పాదస్పర్శతో యమునాజలాలు పులకించిపోయాయి. అలలు ఒక్కదానితో ఒకటి సంతోషమైన వార్త చెప్పుకుంటున్నట్లుగా మృదువుగా తీరాన్ని తాకసాగాయి.
కొంతదూరం వెళ్లిన తరువాత...
యమునారాణి తన కోరిక తీరడానికొ ఒక చిన్న ఉపాయం చేసింది...
శ్రీయుగళులను మరికొంతసేపు తన ఒడిలో నిలిపి సేవించే భాగ్యాన్ని పొందాలని... మెల్లగా... చాలా మెల్లగా... నావ అడుగునుండి నీరు లోపలికి పంపడం ప్రారంభించింది... నావను ముంచేయాలని కాదు... సేవా భాగ్యం పొందడానికి...
లలిత ఆశ్చర్యపడి, "శ్రీజీ! చూడండి... నావలోకి నీరు వస్తోంది!" అంది కంగారుగా...
విశాఖ కూడా కంగారుపడుతూ,
"ఇలా అయితే మనం అవతలి ఒడ్డుకు చేరుకునేలోపే నావ నిండిపోతుంది!" అంది.
శ్రీజీ మాత్రం యమునాతరంగాలను ఒక్కసారి ప్రేమగా చూశారు.
ఆ చూపులో యమునారాణి కోరిక అంతా స్పష్టంగా అవగతమైంది.
మృదువుగా చిరునవ్వు నవ్వారు.
అంతలో ఎదురుగా మరో చిన్న నావ యమునా అలలను చీల్చుకుంటూ నెమ్మదిగా దగ్గరపడుతోంది.
లలితా - విశాఖలు అందులో ఎవరున్నారా... సహాయం అడుగుదాం దగ్గరికొస్తే అని కళ్ళు చిట్లించి మరీ చూస్తున్నారు.
అందులో నీలమేఘశ్యాముడు...
అధరాలపై చిరునవ్వు...
చేతిలో వేణువు...
కళ్లలో చెప్పలేని చిలిపితనం.
దూరం నుంచే నవ్వుతూ "అయ్యో! ఈరోజు యమునారాణి తన అతిథులను అంత తొందరగా విడిచిపెట్టే ఉద్దేశంలో లేనట్లుంది!"అన్నాడు.
లలిత నవ్వుతూ, చిరుకోపంతో.. "శ్యామా! నీ పరిహాసం తరువాత వింటాం. ముందు మమ్మల్ని రక్షించు!" అంది.
శ్రీకృష్ణుడు నవ్వి, "రక్షిస్తాను... కానీ ఒక చిన్న షరతు." అన్నాడు.
"ఏమిటది?" అని విశాఖ అడిగింది.
"ఈరోజు నేను నావకు తెడ్డు వేయను. నా పని వేణువు వాయించడం మాత్రమే. లలిత, విశాఖలే నావను నడపాలి. నేను శ్రీజీ పక్కనే కూర్చొని యమునారాణి సేవను స్వీకరిస్తూ వేణుగానం చేస్తాను." అన్నాడు.
అప్పుడు విశాఖ "శ్యామా! ఈ ఉపాయం అంతా శ్రీజీ పక్కనే ఏకాంతంగా కూర్చోవడానికి కదా!" అంది కొంటెగా నవ్వుతూ...
ఆ మాటకు అందరూ నవ్వుకున్నారు. శ్రీజీ సిగ్గుతో అంగీకారంగా ముసిముసినవ్వు నవ్వగా, ఆ నవ్వు యమునాజలాల్లో ప్రతిబింబించి వేల చంద్రుల కాంతిలా మెరిసింది.
ఆ ముగ్గురూ శ్రీకృష్ణుని నావలోకి చేరారు. లలిత, విశాఖలు ప్రేమతో తెడ్డు వేస్తూ నావను ముందుకు నడిపించసాగారు.
శ్రీజీ-శ్యామ్ పక్క పక్కనే కూర్చున్నారు..
శ్రీజీ శ్యామసుందరుడి భుజం మీద తలవాల్చి తన శ్యాముని ముఖచంద్రాన్నే తదేకంగా చూస్తూ మురిసిపోతోంది...
శ్రీశ్యామసుందరుడు వేణువును అధరాలకు చేర్చాడు.
మొదటి స్వరం వినిపించగానే...
యమునాతరంగాలు నిశ్చలమయ్యాయి.
గాలి తన వేగాన్ని తగ్గించుకుంది.
ఒడ్డున ఉన్న కదంబశాఖలు నమస్కరిస్తున్నట్లు వంగిపోయాయి.
ఆ దివ్య మురళీగానం కొనసాగుతోంది..
నదీతీరాల్లోని సరస్సులలో తామరలు మరింత వికసించాయి.
హంసలు కూడా తమ విహారాన్ని ఆపి ఆ దివ్యసంగీతాన్ని ఆలకించసాగాయి.
యమునారాణి పరవశించి తన అలలను మృదువైన చేతుల్లా మార్చి, శ్రీయుగళుల నావను ఎంతో జాగ్రత్తగా మోసుకెళ్లింది.
కొంతసేపటి తరువాత శ్రీజీ ప్రేమతో యమునారాణిని చూసి "యమునే! మమ్మల్ని నిలిపింది నీ అలలు కాదు... నీ ప్రేమ. సేవ చేయాలనే నీ తపన మాకు తెలుసు. ప్రేమతో చేసిన సేవ ఎప్పుడూ ఫలిస్తుంది." అని అన్నారు.
ఆ మాటలు విన్న యమునారాణి ఆనందంతో పొంగిపోయింది.
ఆమె అలలు శ్రీయుగళుల పాదాలను మృదువుగా స్పృశిస్తూ కృతార్థతను వ్యక్తం చేశాయి.
-----
యమునాతీరానికి వచ్చే భక్తులు ఇప్పటికీ ఆ రాధాకృష్ణుల నౌకాలీలల మధురానుభూతిని పొందుతుటారు, కొందరు ఆ ప్రేమను అనుభవించడానికి యమునలో నౌకలలో విహరిస్తుంటారు.
ఎందుకంటే...
ఆ అలల్లో ఇప్పటికీ యమునారాణి సేవాభావం ఉంది...
ఆ గాలిలో ఇప్పటికీ శ్యామసుందరుని వేణుగానం వినిపిస్తూనే ఉంది...
ఆ నిశ్శబ్దంలో ఇప్పటికీ శ్రీయుగళుల మధురహాసం ప్రతిధ్వనిస్తూనే ఉంది.
అందుకే బృందావనంలో ప్రతి అల ఒక కథ చెబుతుంది...
ప్రతి గాలి ఒక లీలను గుసగుసలాడుతుంది...
ప్రతి హృదయం ఒక్కటే జపిస్తుంది—
జై రాధే! జై శ్యామ్!
జయ జయ శ్రీ రాధే!!
-శంకరకింకరః

No comments:

Post a Comment