జయ శ్రీరాధే!
జయ శ్రీకృష్ణ!
జయ జయ బృందావన్!
బృందావనంలో ఎన్నో పుష్పాలు వికసిస్తాయి.
కొన్ని పరిమళాన్ని పంచుతాయి.
కొన్ని అందాన్ని ప్రసరిస్తాయి.
కానీ కొన్ని పుష్పాలు... తమ సువాసనతో యుగయుగాల పాటు భక్తుల హృదయాలను పరిమళింపజేస్తాయి.
అలాంటి దివ్య పుష్పమే శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్.
ఆయన పాండిత్యంలో ప్రసిద్ధుడు.
కవిత్వంలో మేటి
భక్తిరసానికి భాష్యకారుడు.
కానీ, ఆయన గొప్పదనమంతా పాండిత్యంలోనీ, జ్ఞానంలోనో కాదు...
తన గురువుపట్ల ఉన్న అచంచలమైన భక్తిలో ఉంది.
బృందావనంలో ఆయన తన గురుదేవునితో కలిసి నివసిస్తూ ఉండేవారు.
ఆ రోజుల్లో అతని గురుదేవులు వృద్ధాప్యంతో డస్సిపోయారు.
పెద్దగా నడవలేరు...
ఆలయానికి కూడా వెళ్లలేకపోయేవారు.
కానీ వారి హృదయంలో మాత్రం ఏరోజుకారోజు "ఈరోజు శ్రీరాధా-శ్యామసుందరులను దర్శించుకోగలిగితే..." అనుకుని ఓపిక లేక నిట్టూర్చేవారు.
ఆ కోరికను గమనించిన విశ్వనాథ చక్రవర్తి హృదయం ద్రవించేది... ఏదో ఒకటి చేయాలనే తలపుండేది. కానీ తన భక్తి, ధృతితో గురువుగారిని అనునయించేవారు.
"గురుదేవా! మీరు ఎందుకు బాధపడుతున్నారు? మీ పాదాలే నాకు బృందావనం. మీ సేవే నాకు రాధాకృష్ణుల దర్శనం. మీరు కాకుండా రాధాకృష్ణులు వేరే ఉన్నారా, వారే మీరు మీరే వారు." అని వినయంగా చెప్తుండే వాడు. తన గురుసేవనే తన జీవితంగా మార్చుకున్నాడు.
ఒక సాయం సంధ్య దాటి చుక్కలు పొడుస్తున్న వేళ...
ఆ సమయంలో గురుదేవులు మెల్లగా శిష్యులతో "ఇప్పుడు శ్రీరాధాకుండ్ లో స్నానం చేయాలనిపిస్తోంది... ఎవరైనా తీస్కెళ్ళగలరా అన్నారు." గురువుగారు నడవలేరు కాబట్టి అది సాధ్యమే కాదని అందరూ భావించి మౌనంగా ఉండిపోయారు..
కానీ...
విశ్వనాథ చక్రవర్తి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.
"గురుదేవా! మీ సంకల్పమే నాకు ఆజ్ఞ." అని వినయంగా వారి పాదాలకు నమస్కరించాడు.
గురువును తన భుజాలపై ఎక్కించుకొని బయలుదేరాడు...
అలా బయలుదేరి నాలుగడుగులు వేయగానే,
బృందావనంపై మేఘాలు ఒక్కసారిగా కమ్ముకున్నాయి.
మెరుపులు మెరిశాయి.
ఉరుములు ఉరిమాయి.
వర్షం కుండపోతగా కురిసింది.
చుట్టూ బురద.
దారంతా నీరు.
వర్షంలో...
బురదలో...
ముళ్ల దారిలో...
నెమ్మదిగా ముందుకు సాగసాగాడు.
అతని శరీరం పూర్తిగా తడుస్తోంది.
కాళ్లు జారుతున్నాయి.
కానీ హృదయంలో మాత్రం ఒకటే భావన.
"నా గురుదేవులకు కించిత్ కష్టం కూడా కలగకూడదు. ఆయన కోరిక మేరకు ఇవాళ రాధా కుండంలో స్నానం చేయగలగాలి..." అనుకుంటూ చిమ్మచీకటిలో జడివానలో బురద నేలమీద జాగ్రత్తగా అడుగులో అడుగేసుకుంటూ నడుస్తున్నాడు...
అప్పుడే...
ఒక అద్భుతం జరిగింది.
చీకటిగా ఉన్న దారంతా ఒక్కసారిగా ప్రకాశించింది.
కొంచెం ముందుగా...
ఒక అపూర్వ సౌందర్యమూర్తి చేతిలో దీపం బుడ్డి పట్టుకుని నడుస్తోంది.
దీపం బుడ్డి చిన్నదే ఐనా ఆ కాంతి చుట్టూ ఉన్న పరిసరాలనిండా వ్యాపించింది...
ఆ చుట్టూ అనేక చంపక, జాజి వంటి పూల గుభాళింపు నిండిపోయింది.
ఆమె అడుగులు నెమ్మదిగా బురదలేని చోట వేస్తూ నడుస్తోంది.
ఆమె చూపించిన దారిలో బురద లేదు...
ముళ్లు లేవు...
చీకటి లేదు.
ఆ దివ్య కాంతిని అనుసరిస్తూ విశ్వనాథ చక్రవర్తి సులభంగా రాధాకుండ్ చేరుకున్నాడు.
ఆ యువతి వారికి కాంతి కనపడేలా తను తెచ్చిన దీపం బుడ్డితో కొద్ది దూరం కుండం మెట్లమీద నిల్చుని దీపాన్ని అక్కడ పెట్టింది. వర్షం తగ్గింది... వాతావరణం ప్రశాంతంగా మారిపోయింది
గురుదేవులు స్నానం ముగించుకుని తిరిగి వచ్చి చూస్తే.. ఆ యువతి కనబడలేదు.
గురుదేవులు ఆశ్చర్యపడి "మనకు దారి చూపింది ఎవరు? మన ఊళ్ళో అమ్మాయా, ఆశ్రమానికొచ్చే భక్తురాలా, అంత లావణ్యం, దివ్యమైన రూపం నేనెప్పుడూ చూడలేదే? నీకు తెలిసిన అమ్మాయా ? " అని అడిగారు
విశ్వనాథ చక్రవర్తి వినయంతో "నాకు తెలియదు గురుదేవా. ఏదో బృందావనవాసిని, ఆమే ఈ రాధా కుండ్ వేపుకు వస్తోందేమో అని అనుకున్నాను." అన్నారు.
గురుదేవులు ఏదో అనుమానం వచ్చినవారిలా కళ్లుమూసి కాసేపు ధ్యానించారు. వెంటనే వారి కళ్లలో ఆనందబాష్పాలు ఉబికాయి. "విశ్వనాథా! నువ్వెంత అదృష్టవంతుడివో తెలుసా? ఆమె సాధారణ యువతి కాదు... సాక్షాత్తు శ్రీరాధారాణి! నీ గురుభక్తికి ప్రసన్నురాలై... స్వయంగా నీకు దారి చూపించింది. నీ ద్వారా నన్నూ అనుగ్రహించింది. నీవు ధన్యుడవు విశ్వనాథా!! ధన్యుడవు!" అని శిష్యుడిని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.
అది విన్న విశ్వనాథ చక్రవర్తి క్షణంలోనే నేలపై గురువుకి సాష్టాంగపడ్డాడు. రాధాకుండం వేపు తిరిగి "అమ్మా! రాధమ్మా నేను నిన్ను గుర్తించలేకపోయాను." అని కన్నీరుమున్నీరయ్యాడు.
ఆ రోజు సాటి శిష్యులకు గురుసేవ చేసిన చోటే రాధాకృప ఉన్నదని అర్థమైంది.
ఆ తరువాత విశ్వనాథ చక్రవర్తి అనేక స్తోత్రాలు, గ్రంథాలు రచించారు. ఆయన రచించిన ప్రతి గ్రంథం భక్తిరసంతో నిండిపోయింది.
ఆయన కలం నుండి జాలువారిన ప్రతి పదం...
రాధాకృష్ణుల ప్రేమను ప్రపంచానికి పరిచయం చేసింది.
అందుకే ఆయనను భక్తులు "రసాచార్యుడు" అని పిలుస్తారు
విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ రచనలు భక్తిరసానికి అమూల్య నిధివంటివి.
ముఖ్యంగా ఆయన రచించిన మాధుర్య కాదంబినీ, రాగవర్త్మచంద్రికా, సారార్థ దర్శిని భక్తి మార్గంలో అత్యంత ప్రామాణిక గ్రంథాలుగా భావించబడుతున్నాయి.
ఆయన అత్యంత ప్రసిద్ధ ప్రార్థనలలో ఒకటి గుర్వష్టకం నుండి ఒక శ్లోకం చదువుదాం...
యస్య ప్రసాదాద్ భగవత్ ప్రసాదో
యస్యాప్రసాదాన్న గతిః కుతోऽపి !
ధ్యాయన్ స్తువన్ తస్య యశస్త్రిసంధ్యం
వందే గురోః శ్రీచరణారవిందమ్ !!
భావం: "గురువు ప్రసన్నుడైతే భగవంతుడు ప్రసన్నుడవుతాడు. గురువు అనుగ్రహం లేకపోతే ఏ సాధనకూ ఫలం లభించదు. అందుకే మూడుకాలాల్లోనూ గురుదేవుని చరణకమలాలను ధ్యానిస్తూ నమస్కరిస్తాను."
"గురుసేవలో పులకించే హృదయం...
రాధమ్మ కృపకు ఖచ్చితంగా పాత్రమవుతుంది."
జయ శ్రీరాధే కృష్ణ!
జయ జయ గురుభగవాన్!
No comments:
Post a Comment