Pages

Thursday, July 23, 2026

బృందావన కథలు – 43 (శ్రావణపు ఊయల)

జై శ్రీ రాధే కృష్ణ

ఆ సంవత్సరం శ్రావణమాసం ఆరంభమైంది.
బ్రజ భూమిలో ఆకాశమంతా నల్లని మేఘాలు కమ్ముకుంటున్నాయి. వర్షపు చినుకులు మృదువుగా భూమిని ముద్దాడుతున్నాయి. తడిసిన నేల నుంచి వెదజల్లుతున్న మట్టి పరిమళం బృందావనమంతా పవిత్ర గంధంలా వ్యాపింస్తోంది.
బృందావనంలోని ప్రతి వృక్షం కొత్త చిగుర్లతో పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించినట్లు మెరిసిపోతోంది. లతలు చెట్లను ఆలింగనం చేసుకుని ఊగుతున్నాయి. మల్లెలు, జాజులు, పారిజాతాలు, కదంబాలు తమ సుగంధాలతో గాలిని మధుర మనోహర సువాసనలతో నింపేశాయి.
యమునా తీరం మీద నెమళ్లు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి. కోయిలలు సుమధురంగా కూస్తున్నాయి. చిలుకలు గుంపులుగా ఎగురుతూ ప్రకృతికి మరింత శోభను తెస్తున్నాయి. ఆ దివ్యమైన శ్రావణ సౌందర్యాన్ని చూసి సఖులందరూ ఆనందోత్సాహాలతో నికుంజవనంలో విహరిస్తున్నారు.
ఆ నికుంజమధ్యలో ఒక మహా వటవృక్షం.
దాని రెండు బలమైన కొమ్మలకు రాధా దేవి సఖులు అందమైన ఊయలను కట్టారు. మల్లె, మందార, కదంబ, చంపక, పారిజాత పుష్పాలతో ఆ ఊయలను అలంకరించారు. పచ్చని ఆకులతో అల్లిన తోరణాలు గాలికి ఊగుతూ మంగళసూచకాలుగా కనిపిస్తున్నాయి.
सावन आयो रे, झूला डारो रे!
राधा संग श्याम झूलत कुंजन माँहि!!
సావన్ ఆయో రే, ఝూలా డారో రే!
రాధా సంగ్ శ్యామ ఝులత్ కుంజబ్ మాంహి!!
తెలుగు భావం: శ్రావణం వచ్చింది. పూల ఊయల కట్టండి. నికుంజవనంలో రాధాదేవితో కలిసి శ్యామసుందరుడు ఊయల ఊగుతాడు...
అని సఖులు పాడుతున్నారు
ఆ ఊయలపై వృషభానునందిని శ్రీరాధాదేవి ఆసీనురాలై ఉంది.
ఆకు పచ్చని పట్టు వస్త్రాలు ధరించింది. పచ్చల హారాలు, పూల ఆభరణాలు ఆమె దివ్యసౌందర్యాన్ని మరింత ప్రకాశింపజేస్తున్నాయి. ఆమె ముఖచంద్రబింబం వర్షమేఘాల మధ్య వెలిగే పౌర్ణమి చంద్రునిలా కాంతులీనుతోంది.
కానీ...
ఆ కాంతిలో ఆనందం లేదు.
ఆమె కమలనేత్రాలు ఒకే దిశగా చూస్తున్నాయి.
మనసు మాత్రం ఆ ఒక్క పేరే జపిస్తోంది..
"కృష్ణా..."
కొన్ని రోజులుగా వేణునాదం వినిపించలేదు.
ప్రతి ఉదయం వినిపించే ఆ మధురమైన మురళీగానం లేక బృందావనమే మౌనంగా మారిపోయినట్లు అనిపిస్తోంది.
"ఈరోజైనా వస్తాడా? నా చేతులతో అల్లిన ఈ పూలహారాన్ని స్వీకరిస్తాడా? ఈ పండ్లను స్వయంగా తినిపించగలనా?" అని ఆమె మనసు వెయ్యిసార్లు ప్రశ్నిస్తోంది.
సఖులు ఆమె మనసును మరల్చాలని మల్హార్ రాగాలను ఆలపిస్తూ ఊయలను ఊపుతున్నారు. కానీ రాధాదేవి చెవులు మాత్రం ఒక్క రాగానికై ఎదురుచూస్తున్నాయి " మురళీనాదానికి"
అంతలో...
దూరంలో ఒక నెమలి తన నెమలితో కలిసి వర్షాన్ని ఆహ్వానిస్తూ నాట్యం చేయసాగింది.
ఆ దృశ్యాన్ని చూస్తూ రాధాదేవి మౌనంగా చిరునవ్వు నవ్వింది. ఆనవ్వులో విరహం ఉంది...
"చూడు చూడు... వాటికి విరహం లేదు. ఒకటి పిలిస్తే మరొకటి వెంటనే చేరుతుంది. నా కృష్ణుడు మాత్రం ఇంకా రాలేదు..." అని మనసులోనే అనుకుంది.
ఆ క్షణమే...
ఎక్కడి నుంచో దట్టమైన చందన పరిమళం గాలిలో వ్యాపించింది.
ఆ సుగంధం రాధాదేవి హృదయానికి ఎంతో suపరిచయం.
"ఇది...!"
అని ఆమె ఆశ్చర్యపడేలోపే, వెనుకనుండి రెండు మృదువైన కరకమలాలు వచ్చి ఆమె కళ్ళను మూశాయి.
వెనుక నుంచి వినిపించిన చిరునవ్వు...
ఆ నవ్వును గుర్తుపట్టడానికి రాధాదేవికి క్షణకాలం కూడా పట్టలేదు.
"కాన్హా!" అని ఆనందభాష్పాలతో పలికింది.
నందనందనుడు మెల్లగా తన చేతులను తొలగించాడు.
రాధాదేవి వెనక్కి తిరిగి చూసింది.
మేఘశ్యాముడైన శ్రీకృష్ణుడు ఎదుట నిలబడి చిరునవ్వుతో ఆమెను తిలకిస్తున్నాడు. నెమలిపింఛం వర్షపు చినుకులతో మెరిసిపోతోంది. పీతాంబరం గాలికి రెపరెపలాడుతోంది. ఆయన అధరాలపై చిరునవ్వు... నేత్రాలలో అనంతమైన ప్రేమ...
ఒక్క క్షణం...
ఇద్దరి కమలనేత్రాలు ఒకదానిలో మరొకటి లీనమైపోయాయి.
మాటలు అవసరం లేకుండా పోయాయి.
"ప్రేమ మాట్లాడుతున్నప్పుడు నోరుపలికే భాష మౌనమవుతుంది."
కృష్ణుడు రాధాదేవి చేయి పట్టుకుని ఊయలపై ఆమె పక్కనే కూర్చున్నాడు.
సఖులు ఆనందంతో ఊయలను ఊపసాగారు.
"ఝూలా... ఝూలా..." అంటూ మల్హార్ రాగాలను ఆలపించారు.
झूलत राधा संग गिरिधारी!
वृन्दावन की कुंज गलिन में, शोभा अपरम्पार!!
ఝులత రాధా సంగ్ గిరిధారీ!
బృందావన కీ కుంజ్ గలిన మే, శోభా అపరమ్పారీ!!
తెలుగు భావం: రాధాదేవితో కలిసి గిరిధారి శ్రీకృష్ణుడు ఊయల ఊగుతున్నాడు. బృందావన నికుంజాలలో ఆ దివ్యయుగళ సౌందర్యానికి సాటి లేనేలేదు.
వర్షపు చినుకులు ముత్యాల్లా కురుస్తున్నాయి.
నెమళ్లు మరింత ఉత్సాహంగా నాట్యం చేస్తున్నాయి.
కోయిలలు కొత్త గీతాలు పాడుతున్నాయి.
యమునా అలలు కూడా ఆనందంతో తీరాలను తాకుతూ తాళం వేస్తున్నట్లు అనిపించింది.
ప్రకృతి అంతా ఆ దివ్య యుగళాన్ని దర్శిస్తూ పులకించిపోయింది.
ఆ రోజు బృందావనంలో ఊగింది కేవలం ఒక ఊయల కాదు...
"రాధాకృష్ణుల అద్భుతమైన ప్రేమ."
.....
శ్రావణం ప్రకృతికి పచ్చదనాన్ని అందించినట్లే, భగవత్స్మరణ మన హృదయానికి నిత్యనూతనత్వాన్ని ప్రసాదిస్తుంది.
రాధాదేవి ఒక్క క్షణం కూడా కృష్ణస్మరణను విడిచిపెట్టలేదు. ఆ నిరంతర స్మరణకే ప్రతిఫలంగా కృష్ణుడు స్వయంగా వచ్చి ఆమె నేత్రాలను మూసి తన సన్నిధిని ప్రసాదించాడు.
మనమూ అలాగే ప్రతి రోజు భగవన్నామాన్ని, భగవద్గుణాలను స్మరిస్తూ ఉంటే, ఒక రోజు ఆయన సాన్నిధ్యాన్ని తప్పక అనుభవిస్తాము.
ఎందుకంటే...
భక్తుడు భగవంతుని వెదుకుతూ వేసిన ప్రతి అడుగుకూ, భగవంతుడు భక్తుని వైపు వెయ్యి అడుగులు వేస్తాడు.
జయ జయ శ్రీ రాధే కృష్ణ!
– శంకరకింకరః (శ్రీ నాగేంద్ర అయ్యగారి)

No comments:

Post a Comment