Pages

Thursday, July 16, 2026

బృందావన కథలు – 41 (పురీ జగన్నాథుడు - భక్త మహాశయుడు బంధు మహాంతి)

జయ శ్రీరాధే!

జయ శ్రీకృష్ణ!
జయ జగన్నాథ!
పురీ శ్రీక్షేత్రానికి దూరంగా, పచ్చని పొలాలతో కళకళలాడే ఒక చిన్న గ్రామం.
ఆ గ్రామంలో నివసించేవాడు బంధు మహాంతి.
అతను ధనవంతుడు కాదు...
పెద్ద పండితుడూ కాదు...
కానీ జగన్నాథునిపై అతనికున్న ప్రేమను కొలిచే కొలమానం ఈ భూమ్మీద లేదు.
ఉదయం కళ్లు తెరిచిన వెంటనే...
ఇంటి ముందు తులసికోట చుట్టూ ప్రదక్షిణ చేసి జగన్నాథుని తలచుకునేవాడు.
మహాబాహో! అఖిల జగన్నాథా!
నీలాచల నాథా! కరుణాసాగరా!
భక్తజన పాలకా! దీనబంధో!
నీ నామమే మాజీవనాధారం!!
చక్రధరా! పద్మనాభా!
పతితపావన జగన్నాథా!
అన్నదాతా! ఆనందమూర్తీ!
అనాథరక్షక! దయామయా!!
రథముపై ఊరేగే విశ్వేశ్వరా!
రమ్యనేత్ర! చకా నయనా!
నీ కటాక్షమే మాకు శరణం,
నీ మహాప్రసాదమే జీవనం!!
జయ జగన్నాథ! జయ జగన్నాథ!
జయ నీలాచలాధీశ!
జయ బలభద్ర సుభద్రాసహిత!
జయ జగత్ప్రభో!
ఆ భజన పాట విన్న అతని పిల్లలు కూడా నవ్వుతూ... "జయ జగన్నాథ! " అంటూ భజన చేస్తూ ఆకలి నిద్ర కూడా మరచిపోయేవారు.
ఒక సంవత్సరం...
ఆ గ్రామాన్ని భయంకరమైన కరువు చుట్టుముట్టింది.
ఆకాశం మేఘాలను మరచిపోయింది.
పొలాలు బీళ్ళు పడ్డాయి.
చెట్లు ఆకులు రాల్చి మోడుగా మారాయి.
ఊళ్ళో ఎవరిని భిక్ష అడిగినా...
"మాకే లేదు బాబూ..." అనే సమాధానమే వినిపించేది.
రోజులు గడిచాయి. ఇంట్లో ఉన్న వంట దినుసులు అన్నీ నిండుకున్నాయి...
ఒక రోజు...
రెండు రోజులు...
మూడు రోజులు...
ఇంట్లో అన్నపు గింజ కూడా లేదు.
నాలుగో రోజు ఉదయం లేచి బంధు మహంత్ తులసికోట వద్దకు చేరి చేతులు జోడించి..
అమ్మా ఓ మమతామయీ...
అన్నమే లేని ఈ బతుకై...
కన్నీటి గంగలో తేలే మా పడవను
కరుణతో తీరం చేర్చవే..
(మా గో మమతామయీ ఒడిస్సీలోపాట భావం...)
అంటూ పాటలు పాడుతూ వేడుకున్నాడు.
ఆరోజు కూడా ఏమీ దొరకలేదు...
తన చిన్న కూతురు తల్లి ఒడిలో తలపెట్టి మెల్లగా "అమ్మా... ఈ రోజు జగన్నాథుడు మనకు అన్నం పెడతాడా?" అని అడిగింది ఆ మాట విన్న తల్లి గుండె తల్లడిల్లింది. పిల్లలకు ధైర్యం చెప్పాలని... ఖాళీ పాత్రలో నీళ్లు పోసి పొయ్యిపై పెట్టింది, కొద్దిగా ముగ్గు పిండి ఉంటే అందులో వేసి, పొలం గట్టుమీద పెరిగిన కొన్ని ఆకులు అందులో వేసి మరిగించింది...
"అన్నం ఉడుకుతోంది..." అని చెప్పింది. పిల్లలు ఆ మాట నమ్మి, అన్నం కోసం ఎదురుచూస్తూ నిస్సత్తువ ఆవరించి ఆకలితోనే నిద్రపోయారు. బయట నిలబడి ఆ దృశ్యం చూసిన బంధు మహాంతి కళ్లలో కన్నీళ్లు నిండాయి.
ఆకాశం వైపు చూసి...
"చకా నయన్... నీలాంచల్ వాలే...
తూ న సంభాలే తో హమే కౌన్ సంభాలే..."
అని వణుకుతున్న గొంతుతో ఆలపించాడు. గట్టిగా పాడడానికి కూడా ఓపికలేదు...
ఆ గానం...
నేలను తాకింది...
గాలిని తాకింది...
ఆకాశాన్ని తాకింది...
చివరకు...
నీలాచలంపై కొలువై ఉన్న జగన్నాథుని హృదయాన్నీ తాకింది.
ఆ రాత్రి... భార్య మహంత్ వద్దకు చేరి నెమ్మదిగా "స్వామీ...
మన బంధువుల దగ్గరకు కాదు...
మన బంధువులందరికీ బంధువైన జగన్నాథుని దగ్గరకు వెళ్దాం. ఆయనే ఏదో దారి చూపకపోడు." అని చెప్పింది.
బంధు మహాంతి వెంటనే లేచాడు.
"అవును... తండ్రి ఇంటికి వెళ్తున్న పిల్లలు ఆకలితో తిరిగి రారు." అని భార్యతో చెప్పి మరునాడు ప్రయాణానికి సిద్ధం అవ్వమన్నాడు.
---
నాలుగురోజుల ప్రయాణం...
చిన్నారులను భుజాలపై మోస్తున్నాడు...
భార్య బట్టలమూట నెత్తిన మోస్తోంది...
ఎండ మండుతోంది...
కాళ్లకు ముళ్ళు, రాళ్ళు గుచ్చుకుని పుండ్లయ్యాయి...
అయినా ఆ తన తండ్రిని చూడడానికి వెళ్తున్నాం కష్టం అంతా తీరిపోతుందనే నమ్మకంతో...
ప్రతి అడుగుకూ అదే నామ జపం...
జగన్నాథ జగన్నాథ జగన్నాథ పాహిమాం,
జగన్నాథ జగన్నాథ జగన్నాథ రక్షమాం.
జగన్నాథ పాహిమాం,
జగన్నాథ రక్షమాం.
మహాబాహో మహాబాహో మహాబాహో పాహిమాం,
మహాబాహో మహాబాహో మహాబాహో రక్షమాం.
చివరకు...
పురీ నీలచక్రం కనిపించింది అల్లంత దూరం నుండి కనిపించింది.
బంధు మహాంతి కళ్లలో ఆనందాశ్రువులు పెల్లుబికాయి.
(పురీ ఆలయ గోపురం పైన ఉండే చక్రాన్ని నీలచక్రం అంటారు)
"అదిగో...
మన ఇంటి గుమ్మం...
మన తండ్రి అక్కడే ఉంటాడు" అని అన్నాడు..
తన భార్యతో కలిసి ఉన్న శక్తినంతా కూడదీసుకుని గట్టిగా " జగన్నాథ జగన్నాథ జగన్నాథ పాహిమాం..." అంటూ పిల్లలను తీసుకొని ఇంకా వడివడిగా గుడి దగ్గరకు చేరాడు.
కానీ... అప్పటికే రాత్రయ్యింది....
ఆలయ ద్వారాలు అప్పటికే మూసివేయబడ్డాయి.
జన సంచారం లేదు...
ఆలయ సింహద్వారం వెలుపల...
ఒక మూలన కుటుంబంతో సహా కూర్చున్నాడు.
పిల్లలు...
ఆకలితో ఏడుస్తూనే... శోషవచ్చి తండ్రి ఒడిలో నిద్రపోయారు.
బంధు మహాంతి మాత్రం గర్భగుడి వైపు చూస్తూ...
కన్నీళ్లతో ఇలా అన్నాడు...
"ప్రభూ...
నీకు ఛప్పన్ భోగాలు సమర్పించే వారు ఎంతమందో ఉన్నారు.
కానీ... ఈ రోజు నా పిల్లలకు ఒక ముద్ద అన్నం పెట్టేవాడు నువ్వు తప్ప మరెవ్వరూ లేరు. పోషించగలవాడే తండ్రి, నీవు తప్ప నాకెవరూ దిక్కులేరు, నా పిల్లలను పోషించి స్థోమత లేక చేతకానివాణ్ణయ్యాను, ఇక నువ్వే వాళ్ళకూ నాకూ తండ్రివి, దరిద్రుడిని నాకు అంత భాగ్యం లేకున్నా కనీసం పిల్లలకింత అన్నం పెట్టి పోషించి వాళ్ళను రక్షించు "
కొద్దిసేపు మౌనంగా మనసులోనే తన దరిద్రానికి, తనను కట్టుకున్నందుకు బాధపడుతున్న భార్యను, పుట్టిన పిల్లల్ను చూస్తూ వగచి వగచి ఏడుస్తున్నాడు...
ఆ బాధలోనే మళ్లీ
"చకా నయన్... నీలాంచల్ వాలే...
తూ న సంభాలే తో హమే కౌన్ సంభాలే...
జగన్నాథ జగన్నాథ జగన్నాథ జగన్నాథ...
హో... మేరీ యే నైయా హై అబ తో తేరే హవాలే
తూ నా సంభాలే తో హమేం కౌన సంభాలే..." అంటూ నీరసంగా భార్యా భర్తలిద్దరూ తమ పిల్లలను తమ ఒళ్ళొ పెట్టుకుని పాడుతున్నారు.
ఆ గానం...
ఆలయ గోడలను దాటి...
ద్వారాలను దాటి...
శ్రీమందిర గర్భగుడిలోకి చేరి ప్రతిధ్వనించింది.
అప్పటికే శయనసేవ పూర్తయ్యి,
దీపాలు వెలుగులు తగ్గించేసి.
అర్చకులు వెళ్లిపోయి చాలా సేపైనా కానీ...
జగన్నాథుడు మాత్రం శయనించలేకపోయాడు.
తన భక్తుడు, తన బిడ్డ అతని కుటుంబం చిన్నపిల్లలు తిండిలేక ఆకలితో శోష వచ్చి నిద్రపోతుంటే...
జగన్నాథుడైన తండ్రికి నిద్ర ఎలా పడుతుంది?
కొద్దిసేపటికే...
ఒక యువ అర్చకుడు...
చేతిలో బంగారు పళ్లెం...
అందులో వేడివేడి మహాప్రసాదం...
నెయ్యి పరిమళం...
ఖిచిడీ...
దాల్...
కానికా...
మధుర వంటకాలు...
పెద్ద బిందెతో నీళ్ళు, కొన్ని విస్తరాకులు తీసుకుని సింహద్వారం దాటి నేరుగా బంధు మహాంతి వద్దకు వచ్చాడు.
బంధూ మహంత్ భుజం మీద చేయి వేసి "బంధూ! చాలా ఆలస్యమైంది. ముందు పిల్లలను లేపు... వాళ్లు చాలా ఆకలిగా ఉన్నారు." అన్నాడు
బంధు మహాంతి ఆశ్చర్యంతో "స్వామీ... మీకు నా పేరు ఎలా తెలుసు?" అని అడిగాడు.
అందుకు ఆ యువ అర్చకుడు నవ్వాడు.
ఆ నవ్వు...
వెయ్యి చంద్రుల కాంతిలా ఉంది.
"నీ పేరు నాకు తెలియకపోతే... మరెవరికీ తెలుస్తుంది బంధూ? ఇక్కడ భక్తులందరిగురించీ తెలుస్తుందిలే, లే లే త్వరగా పిల్లల్ని లేపి కాళ్ళు చేతులు ముఖం కడుగు, అందరూ ప్రసాదం తిందురుగానీ" అన్నాడు.
పిల్లలను లేపారు. కాళ్ళు చేతులు కడుక్కుని బంగారు పళ్లెంలోని ప్రసాదం వడ్డించారు
చిన్న కూతురు మొదటి ముద్ద తిని...
అంత అద్భుతమైన రుచి చూడని కారణానా,
అన్నం తిని చాలారోజులైన కారణానా చాలా ఆనందపడింది.
ఆనందంగా ఆ యువకుడి దగ్గరకు వచ్చి...
ఒక చిన్న ముద్ద అతని నోటికి అందించి "అన్నయ్యా... స్వామి ప్రసాదం నువ్వూ తిను..." అంది.
ఆ యువకుని... కళ్ళలో నీళ్ళు మెరిశాయి...
ఆ చిన్న పిల్ల దాదాపు వారానికి పైగా భోజనం సరిగా చేయలేదు...
కానీ, తనకు దొరికిన ప్రసాదంలో ఒక ముద్ద తనకివ్వడం మరింత ఆనందం కలిగింది...
తాను ఆ ముద్దను స్వీకరించాడు.
అతని కళ్లలో...
అపారమైన వాత్సల్యం మెరిసింది.
బంధు మహాంతి అది చూసి...
ఏదో తెలియని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
అందరూ భోజనం చేసి...
ఆ యువ అర్చకుడికి నమస్కారం చేయడానికి చూసేసరికి...
అతను కనిపించలేదు. సరే రాత్రైంది కదా ఇంటికి వెళ్ళిపోయుంటాడు, పొద్దున్న కనిపిస్తే ఇచ్చేద్దాం అని, బిందెలో నీళ్ళతో బంగారు పళ్ళెం కడిగి, విస్తరాకులు తీసు పాడేసి, ఆ పక్కనే ఒక మూల పడుక్కున్నారు.
తెల్లవారింది.
ఆలయంలో కలకలం.
మహాప్రసాదం బంగారు పళ్లెం బిందె కనిపించలేదు!
వెతుకుతూ వెతుకుతూంటే...
సింహద్వారం బయట...
బంధు మహాంతి పడుక్కున్న పక్కనే ఆ పళ్లెం కనిపించింది.
అతన్ని పట్టుకుని రాజాస్థానానికి విచారణ చేసి శిక్షించడానికి మర్నాడు పంపాలని నిశ్చయించి భటులకు చెప్పి బంధించారు.
ఆ రాత్రి...
గజపతి మహారాజుకు స్వప్నంలో...
నీలమేఘశ్యాముడైన జగన్నాథుడు చిరునవ్వుతో ప్రత్యక్షమయ్యాడు.
"రాజా! బంధు మహాంతిని ఎందుకు అపరాధిగా చూస్తున్నావు? నిన్న రాత్రి... అర్చకుడి రూపంలో బంగారు పళ్ళెంలో మహాప్రసాదం తీసుకెళ్లి వాళ్ళకిచ్చింది నేనే. " అన్నాడు...
కొద్దిసేపు ఆగి... కరుణ - ప్రేమ - వాత్సల్యం నిండిన కళ్ళతో...
"ఆలయంలో నాకు వేలాది మంది నైవేద్యం పెడతారు.
కానీ నిన్న రాత్రి...
ఒక చిన్నారి తన చేతితో ’అన్నయ్యా... నువ్వూ తిను’ అని పెట్టిన ఆ ఒక్క ముద్ద...
అది నాకు అన్ని రాజభోగాల, ఛప్పన్ భోగాల నైవేద్యాల కంటే మధురంగా అనిపించింది.
భక్తుని ఇంట్లో అందరూ ఆకలి ఏడుస్తుంటే...
నేను ఈ సింహాసనంపై ప్రశాంతంగా కూర్చోలేను. అందుకే నేనే బంగారు పళ్ళెంలో ప్రసాదం ఇచ్చాను. బంధు మహంత్ ను విడుదల చేసి సగౌరవంగా చూసుకో." అని చెప్పాడు.
మరుసటి రోజు తెల్లవారుఝామునే రాజు నిద్దురలేచి, భటుల ద్వారా "బంధు మహంతును విడుదల చేసి గౌరవంగా చూసుకోండి" అనే సమాచారం ఆలయ అధికారులకు ముందుగా పంపాడు.
ఆతరవాత రాజు స్వయంగా బంధు మహాంతి వద్దకు వచ్చి...
అతని పాదాలకు నమస్కరించాడు.
ఆలయ అధికారుల పొరపాటుకు క్షమాపణ కోరాడు.
బంధు మహాంతి మాత్రం కన్నీళ్లు తుడుచుకుంటూ
"మహారాజా...
నేను పురీకి దర్శనం కోసం వచ్చాను.
కానీ...
నా జగన్నాథుడు దర్శనం మాత్రమే ఇవ్వలేదు...
మా జంటకు, మా పిల్లలకు తండ్రిగా మారాడు." అన్నాడు.
ఆ రోజు నుండి పురీలో భక్తులు
"జగన్నాథుడు ఆలయంలో ఉంటాడు...
కానీ భక్తుని కన్నీరు కనిపిస్తే,
తండ్రిలా పరుగెత్తుకుంటూ వస్తాడు." అని అంటుంటారు
----
భగవంతునికి మనుష్యులలాగా ఆకలి ఉండదు...
కానీ...
భక్తుని ఆకలిని ఆయన తన ఆకలిగా భావిస్తాడు.
భక్తుడు ఒక్కసారి హృదయపూర్వకంగా పిలిస్తే...
ఆయన ఆలయ ద్వారాలు దాటి...
అన్ని మర్యాదలూ విడిచి...
ఒక సాధారణ సేవకుడిలా...
ప్రేమతో మహాప్రసాదం చేతబట్టి వస్తాడు.
అందుకే...
"చకా నయన్... నీలాంచల్ వాలే...
తూ న సంభాలే తో హమే కౌన్ సంభాలే...
చక్రాల్లాంటి పెద్ద పెద్ద కళ్ళతో
నీలాచలం మీద నివసించేవాడా
నువ్వు సంరక్షించకపోతే
మమ్మల్నింకెవరు సంరక్షిస్తారయా...!"
నమస్తే ప్రభు జగన్నాథ, అనాథ జనకర నాథ
నమస్తే ప్రభు వాసుదేవ, భకత జనక బంధబ
నమస్తే ప్రభు హృషీకేశ, భకత జనక విశ్వాస
నమస్తే ప్రభు విశ్వరూపి, సకల హృదయే అచా వ్యాపి
సృష్టి ప్రళయ అంతకారు, ఏ సర్వ గర్భరే సంభాలు
అశేష కోటి బసుంధరి, తోర హృదయరే చంతి పూరి
చౌడ భువన పాతణ, ఏ సర్వ తోహరి రచనా
తు బ్రహ్మ రుద్ర విష్ణు తుహి, తో బిను అన్య గతి నహి
సృష్టి జహర ఖేళ-ఘర, అశేష మాయా జీవ పర
తోహర నిశ్వాస మురుత, దేవ హోఇలే తాహర జాత
తుహితి దేవ ఆగ్ని ఇంద్ర, నయను జాత సూర్య చంద్ర
భుజరు అనంత మరుతి, కంఠరు జాత సరస్వతి
(ఒడిస్సాలో ప్రముఖ భజన)
జయ జగన్నాథ!
జయ శ్రీరాధే!
జయ శ్రీకృష్ణ!
జయ జయ బృందావన్!
– శంకరకింకరః

No comments:

Post a Comment