జయ శ్రీరాధే!
జయ శ్రీకృష్ణ!
జయ జయ బృందావన్!
---
బృందావనం...
అది కేవలం ఒక పుణ్యక్షేత్రం కాదు.
అది ప్రేమకు పరిమళం...
భక్తికి పరాకాష్ఠ...
కృష్ణలీలలకు శాశ్వత నిలయం...
యమునాతీరంలో మెల్లగా వీచే సుగంధ సమీరం ఇప్పటికీ గోపికల నిశ్వాసాలను మోస్తున్నట్లు అనిపిస్తుంది. కదంబ వృక్షాలు ఇప్పటికీ మురళీనాదాన్ని ఆలకిస్తున్నట్లు నిలిచి ఉన్నాయి. వృందావనంలోని ప్రతి ధూళికణం "రాధే... రాధే..." అనే నామస్మరణతో పరిమళిస్తూనే ఉంది.
అందుకే కృష్ణభక్తులంటారు
वृन्दावनं परित्यज्य पदमेकं न गच्छति। - బృందావనం పరిత్యజ్య పదమేకం న గచ్ఛతి..
"శ్రీకృష్ణుడు వృందావనాన్ని విడిచి ఒక్క అడుగు కూడా వేయడు."
అటువంటి దివ్యధామంలో, శ్రీచైతన్య మహాప్రభువు ఆజ్ఞతో భక్తిరసాన్ని ప్రపంచానికి ప్రసరింపజేసిన ఆరుగురు గోస్వాములలో ఒకరు "శ్రీగోపాల భట్ట గోస్వామి"
ఆయన జీవితం ఒక మహాతపస్సు.
ఆయన భక్తి ఒక మహాయజ్ఞం.
ఆయనకు లభించిన రాధారమణుని అనుగ్రహం బృందావన భక్తచరిత్రలో అపూర్వమైన అధ్యాయం.
---
కావేరీ తల్లి ఒడిలో వెలసిన శ్రీ రంగం - అఖిలాండేశ్వరీ జంబుకేశ్వర క్షేత్ర ప్రాంతం
అక్కడ శ్రీరంగనాథస్వామి సేవలో నిమగ్నమైన వైష్ణవ కుటుంబంలో గోపాల భట్టుడు జన్మించాడు.బాల్యం నుంచే ఆయనకు ఆటల కంటే భగవదారాధనంటేనే ఇష్టం.
స్నేహితులతో పరుగులు పెట్టే వయసులో ఆయన ఆలయ ప్రాంగణంలో కూర్చొని శ్రీరంగనాథుని తిలకిస్తూ ఆనందించేవాడు.
ఆ కాలంలో దక్షిణ భారత యాత్రలో ఉన్న "శ్రీచైతన్య మహాప్రభువు" శ్రీరంగానికి విచ్చేశారు.
ఆ బంగారు వర్ణం...
ఆ విశాల నేత్రాలు...
ఆ కృష్ణప్రేమతో తడిసిన హృదయం...
మహాప్రభువును చూసిన ప్రతి ఒక్కరూ మైమరచిపోయేవారు.
బాలుడైన గోపాల భట్టుడు మాత్రం ఆయనను చూడగానే పరుగెత్తి పాదాలపై పడిపోయాడు.
మహాప్రభువు చిరునవ్వుతో బాలుడిని లేవదీశారు.
"నీ పేరు ఏమిటి నాయనా?" అని అడిగారు
"గోపాల..." అని చెప్పాడు బాలుడు.
"గోపాలా... నీ హృదయం కృష్ణుని కోసం పుట్టింది. ఒక రోజు నీవు బృందావనానికి వస్తావు. అక్కడ నా ప్రియశిష్యులతో కలిసి భక్తి సంప్రదాయాన్ని ప్రచారం చేస్తావు." అని ఆశీర్వదించారు. ఆ మాటలు బాలుడి హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయాయి.
---
కొన్ని సంవత్సరాల తరువాత తల్లిదండ్రుల అనుమతితో గోపాల భట్టు బృందావనానికి చేరుకున్నాడు. అక్కడ రూప గోస్వామి, సనాతన గోస్వామి ఆయనను హృదయపూర్వకంగా ఆహ్వానించారు.
"మహాప్రభువు ఎంతో ప్రేమతో చెప్పిన గోపాలుడివి నువ్వేనా!" అని అక్కున చేర్చుకున్నారు. వారి మధ్య గాఢమైన బంధం ఏర్పడింది.
అది రక్తసంబంధం కాదు...
గురు భక్తి బంధం...
కృష్ణప్రేమసంబంధం.
అప్పట్నుంచీ గోపాలభట్టు బృందావనంలోనే జీవించసాగాడు.
కొంతకాలం తరవాత గోపాల భట్ట గోస్వామి నేపాల్‌లోని పవిత్ర గండకీ నదికి తీర్థయాత్రకు వెళ్లారు. ఆ నదిలోనే సాలగ్రామ శిలలు లభిస్తాయి.
స్నానం ముగించుకొని, నిత్య విధికై కమండలంలో నీరు తీసుకుని పైకిరాగా అకస్మాత్తుగా ఆయన కమండలంలో ఏదో కదిలింది.
ఏంటా అని చూశారు...
ఒక సాలగ్రామం.
"ఆహాఁ... "అనుకుని ఆ సాలగ్రామాన్ని పక్కనెపెట్టి, తిరిగి నదిలో నీటికై వెళ్ళారు.
మళ్లీ నీళ్లు తీసుకుంటే...
మళ్లీ అదే.
మళ్లీ పక్కనపెట్టి మళ్ళీ ప్రయత్నించారున్
ఇలా వరుసగా పన్నెండు సార్లు జరిగింది.
గోపాల భట్టుడు ఆశ్చర్యపోయాడు.
"ప్రభూ! ఇది నీ సంకల్పమే కదా!" అని ఆనందభాష్పాలతో ఆ పన్నెండు శాలగ్రామాలను తన హృదయానికి హత్తుకున్నాడు.
బృందావనానికి తిరిగి వచ్చిన తరువాత వాటిని అత్యంత భక్తిశ్రద్ధలతో నిత్యం సేవించసాగాడు.
ప్రభాతంలో యమునాజలంతో అభిషేకం.
తులసీదళాలతో పూజ.
సుగంధ చందనం.
పుష్పాలు.
ఉన్నంతలో నైవేద్యం.
హారతి.
ఇలా నిత్యం ఎంతో ప్రేమ పూర్వక భక్తితో ఆరాధించేవాడు.
पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति।
तदहं भक्त्युपहृतम् अश्नामि प्रयतात्मनः॥ (గీతా 9.26)
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి
"భక్తితో సమర్పించిన ఒక ఆకు, ఒక పువ్వు, ఒక పండు, కొద్దిపాటి నీరైనా నేను సంతోషంగా స్వీకరిస్తాను."
గోపాల భట్టుల సేవలో వైభవం లేదు.
ప్రేమ మాత్రమే ఉంది.
---
రోజులు గడుస్తున్నాయి.
వృందావనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారు. ఒక రోజు ఓ రాజవంశీయ భక్తుడు దర్శనానికి వచ్చాడు. తనతో పాటు ఒక అందమైన పెట్టె తెచ్చాడు.
అందులో...
రత్నఖచిత కిరీటం.
చిన్న బంగారు వేణువు.
పట్టు వస్త్రాలు.
హారాలు.
కంకణాలు.
నూపురాలు.
అన్నీ బాలకృష్ణుని అలంకరణకు తగినవే.
ఆ భక్తుడు వినయంగా నమస్కరించి "గోస్వామీజీ!
మీ ఠాకుర్జీ కోసం ప్రత్యేకంగా తయారు చేయించాను.
దయచేసి వీటిని ఆయనకు అలంకరించండి.
నా జీవితం ధన్యమవుతుంది." అన్నాడు.
గోపాల భట్టు ఆనందంగా వాటిని స్వీకరించాడు.
కానీ...
తరువాతి క్షణమే ఆయన ముఖం దిగులుతో నిండిపోయింది.
ఆ ఆభరణాలన్నింటినీ ఒకసారి...
తన సాలగ్రామాలను మరోసారి చూశాడు.
కళ్లలో నీరు మెదిలింది.
"ఈ కిరీటాన్ని నా ప్రభువు తలపై ఎలా ఉంచాలి?
ఈ వేణువును ఏ చేతిలో పెట్టాలి?
ఈ నూపురాలను ఏ పాదాలకు తొడగాలి?
నా కృష్ణుడు సాలగ్రామ స్వరూపంలో ఉన్నాడు...
ఆయనకు అవయవాలు లేవు...
నా సేవ అసంపూర్ణంగా మిగిలిపోతోందా?"
అని హృదయం విలవిల్లాడింది.
ఆ రాత్రి ఆయనకు నిద్ర రాలేదు.
శాలగ్రామాలను తన ఒడిలో ఉంచుకొని ప్రేమగా చేతిలోకి తీసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఆ కన్నీళ్లు యమునాజలంకంటే పవిత్రమైనవి.
ఆ నిశ్శబ్ద రాత్రిలో ఆయన మనసు ఒక్కటే ప్రార్థిస్తోంది...
"ప్రభూ...
నిన్ను అలంకరించాలనుకోవడం అనేది
నా ప్రేమ, ముచ్చట, మురిపెం...
నేను చేస్తాననే అహంకారం లేదు.
నీ త్రిభంగ సుందర రూపాన్ని ఒక్కసారి దర్శించనివ్వు.
నీ చేతిలో వేణువును పెట్టి సేవించనివ్వు.
నీ పాదాలకు నూపురాలు తొడగనివ్వు.
అంతకంటే నాకు మరే వరమూ వద్ద..."
ఆ ప్రార్థనతో ఆయన కన్నీటి తడిలోనే శాలగ్రామాలకు శయనసేవ చేసి, ఒక బుట్టతో కప్పి, "రాధే... కృష్ణ..." అని జపిస్తూ నిద్రలోకి జారుకున్నారు.
(సశేషం...)
No comments:
Post a Comment