జయ శ్రీరాధే!
జయ శ్రీకృష్ణ!
జయ జయ బృందావన్!
బృందావనంలో "వైరాగ్యం" అనే పదానికి రూపమిస్తే అది "శ్రీ రఘునాథ దాస గోస్వామి" రూపమే.
ఆయన జీవితాన్ని చూసిన సమకాలికులు "ప్రేమ - భక్తికి పరాకాష్ఠ వైరాగ్యంగా వికసిస్తే, అదే "శ్రీ రఘునాథ దాస గోస్వామి" జీవితం." అని అంటుండేవారు.
ఆయన 15వ శతాబ్దం చివర్లో వంగదేశం (బెంగాల్) లోని సప్తగ్రామానికి సమీపంలోని శ్రీకృష్ణపురం అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి, బాబాయి ఆ ప్రాంతంలో అపారమైన ధనవంతులు, జమీందారులు. వారి ఐశ్వర్యం అంతటి గొప్పది, నెలకు అప్పట్లోనే 12 లక్షల రూపాయల ఆదాయం వచ్చేదని అంటారు.
పుట్టుకతోనే రాజభోగాలు...
అంతులేని సంపద...
సేవకుల సందడి...
ఏ కోరికకూ లోటులేని జీవితం...
కానీ చిన్నతనం నుంచే రఘునాథుని హృదయం మాత్రం ఈ ప్రపంచ సంపదలపై నిలవలేదు. ఆయన మనసు ఎప్పుడూ
శ్రీచైతన్య మహాప్రభువు చరణసేవకై ఆరాటపడేది.
తల్లిదండ్రులు ఆయన వైరాగ్యాన్ని చూసి భయపడ్డారు. 14సం వయసు రాగానే అందమైన యువతితో వివాహం జరిపించారు.
కుటుంబ, వ్యాపార బాధ్యతలు చూసుకోడానికి కొన్ని పనులు అప్పగించారు. అయినా ఆయన హృదయం మాత్రం శ్రీకృష్ణప్రేమలోనే విహరించేది. సంసారంలో ఏమాత్రం ఇమడలేకపోయారు ఇంకా విరాగిగా మారిపోయారు.
పదిహేనేళ్ల వయస్సులో శ్రీచైతన్య మహాప్రభువును దర్శించిన రఘునాథుని హృదయంలో ఆయన మీద భక్తి మరింత పెరిగింది. అయితే కుటుంబ బంధాల నుండి బయటపడలేక బాధపడుతుండేవారు. అలాంటి సమయంలోపానీహాటిలో శ్రీనిత్యానంద ప్రభువును దర్శించి వినయంతో నమస్కరించి "ప్రభూ! మీ కృప లేకుండా ఈ సంసారబంధాల నుండి బయటపడలేను." అంటూ ప్రార్థించారు.
నిత్యానంద ప్రభువు చిరునవ్వుతో "ఈరోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ అటుకులు, పెరుగు, పాలు, మిఠాయిలతో మహాప్రసాద విందు ఏర్పాటు చేయి." అని ఆజ్ఞాపించారు.
ఆ రోజు జరిగిన ఆ మహోత్సవమే ప్రసిద్ధ "దండ మహోత్సవం" (చిడా-దహి మహోత్సవం). రఘునాథుడు అపార భక్తితో వేలాది మంది భక్తులకు ప్రసాదసేవ చేశాడు. ఆ సేవకు సంతోషించిన నిత్యానందుడు ఆశీర్వదించి "ఇక నీ సంసారబంధాలు తెగిపోయాయి. త్వరలోనే గౌరాంగ మహాప్రభువు సన్నిధికి చేరుకుంటావు." అని అన్నారు.
కొద్ది రోజులకే, దాదాపు 23 సం వయసులో సంపూర్ణ వైరాగ్యంతో...
ఇల్లు, సంపద, భార్య, వైభవం అన్నింటినీ వెనక్కి వదిలి...
పన్నెండు రోజుల పాటు కాలినడకన ప్రయాణించి...
జగన్నాథపురిలో వేంచేసి ఉన్న శ్రీచైతన్య మహాప్రభువును చేరుకున్నారు.
పురీలో ఆయన పదహారు సంవత్సరాలు శ్రీచైతన్య మహాప్రభువు, స్వరూప దామోదర గోస్వాముల సేవలో గడిపారు.
ఆయన వైరాగ్యం రోజురోజుకూ మరింత మరింత పెరగసాగింది. మొదట ఆలయ ద్వారం వద్ద భక్తులుచేత భిక్ష స్వీకరించేవారు. తర్వాత దానినీ మానేశారు. భక్తులు తినకుండా పారవేసిన ప్రసాదంలోని ఉపయోగపడే భాగాన్ని కడిగి, అదే మహాప్రసాదంగా స్వీకరించేవారు.
ఈ అసాధారణ వైరాగ్యాన్ని చూసిన శ్రీచైతన్య మహాప్రభువు పరమానందంతో తనకు అత్యంత ప్రియమైన రెండు అమూల్య ప్రసాదాలను అనుగ్రహించారు...
ఒక గోవర్ధన శిల...
ఒక గుంజా (గురివింద గింజల మాల) హారం...
చైతన్య మహాప్రభువు రఘునాథునితో "ఈ గోవర్ధన శిల సాక్షాత్తు శ్రీకృష్ణుని స్వరూపమే. ఈ గుంజామాల రాధారాణికి ప్రతిరూపం" అని చెప్పి, ఆశీర్వదించి ఇచ్చారు.
ఆ రోజు నుండి రఘునాథ దాస గోస్వామి జీవితం మారిపోయింది.
ఆ గోవర్ధన శిలను ఎదుట ఉంచుకుని...
తులసీదళాలు సమర్పిస్తూ...
కొద్దిగా పవిత్రజలంతో అభిషేకిస్తూ...
ప్రేమాశ్రువులతో సేవించేవారు.
కొన్నిసార్లు ఆ శిలను హృదయానికి హత్తుకుని గంటల తరబడి భక్త్యాత్మకప్రేమసమాధిలో ఉండిపోయేవారు.
ఆయనకు అది శిల కాదు...
గిరిరాజధారి శ్రీకృష్ణుడే!
శ్రీచైతన్య మహాప్రభువు ఈ లోకం విడిచిన తరవాత, రఘునాథుని మరింత హృదయం వైరాగ్యంతో విరిగిపోయింది. జీవితేచ్చ పోయింది "నా ప్రభువు లేని ఈ లోకంలో నేను ఎందుకు జీవించాలి?" అని భావించి గోవర్ధన పర్వతం మీద నుండి దూకి ప్రాణత్యాగం చేయాలని సంకల్పించారు.
కానీ...
శ్రీరూప గోస్వామి, సనాతన గోస్వాములు అడ్డుకొని ఇలా "మహాప్రభువు బోధలను ప్రపంచానికి చెప్పడానికి నీవు జీవించాలి. గురువు శరీరంతో లేకపోయినా వారి బోధలున్నాయి, ఆత్మహత్య కూడని పని " అని చెప్పి ఒప్పించారు.
వారి మాటలను గురువాజ్ఞగా స్వీకరించి...
రాధాకుండ దగ్గరలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.
రాధాకుండలో ఆయన భజన, నిత్య కర్మాచరణం వింటే నేటికీ భక్తులను ఆశ్చర్యపరుస్తుంది.
ప్రతిరోజూ ఆయన దిన చర్య ఇలా సాగేది...
లక్షకు పైగా శ్రీకృష్ణ నామజపం...
వెయ్యి సాష్టాంగ నమస్కారాలు శ్రీకృష్ణునికి...
రెండు వేల సాష్టాంగ ప్రణామాలు భక్తులకు...
రోజుకు మూడుసార్లు రాధాకుండలో స్నానం...
నిద్ర గంటన్నరకు కూడా మించదు...
రోజంతా కొన్ని చుక్కల మజ్జిగతోనే జీవనం...
మిగిలిన సమయమంతా...
రాధా-కృష్ణుల అష్టకాల లీలాస్మరణ...
గోవర్ధన శిల సేవ...
హరినామ సంకీర్తనం...
ఇదే ఆయన శ్వాస.
ఒకసారి ఒక శిష్యుడు "గోస్వామీ! ఈంతటి వైరాగ్యం ఎలా సాధ్యమైంది?" అని అడిగాడు.
రఘునాథ దాస గోస్వామి చిరునవ్వుతో "శ్రీరాధా-కృష్ణుల ప్రేమరసంలో ఒక్క బిందువైనా ఆస్వాదించినవారికి, ఈ ప్రపంచ సుఖాలన్నీ ఎండిపోయిన గడ్డిపోచలవంటివే. ఈ సంసారమంతా తాలుధాన్యమే!" అన్నారు.
నేటికీ రాధాకుండలోనిశ్రీల రఘునాథ దాస గోస్వామి భజనకుటీరం వేలాది మంది యాత్రికులకు భక్తి, వైరాగ్యాలకు సజీవ సాక్ష్యంగా నిలిచి ఉంది.
ఆయన జీవితం మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది.
వైరాగ్యం అంటే సంపదను వదిలేయడం మాత్రమే కాదు.
శ్రీకృష్ణప్రేమను పొందిన తరువాత, సంపద స్వయంగా తనంత తానుగా విలువ కోల్పోతుందని తెలుసుకుని మసలుకోవడం నిజమైన వైరాగ్యం.
రఘునాథ దాస గోస్వామి అందుకే శ్రీ కృష్ణ భక్తుల పరంపరలో చైతయ్న ప్రభు పరంపరా సంప్రదాయంలో "ప్రయోజనాచార్యుడు", "వైరాగ్య శిఖామణి"గా చిరస్మరణీయులయ్యారు.
జై రాధే!
జై గిరిరాజ్ గోవర్ధన!
జై శ్రీరాధా-శ్యామసుందర!
No comments:
Post a Comment