(కొనసాగింపు...)
జయ శ్రీరాధే!
జయ శ్రీకృష్ణ!
జయ జయ బృందావన్!
ఆ రాత్రి...
యమునా తరంగాలు మృదువుగా తీరాన్ని తాకుతున్నాయి. కదంబవృక్షాలు గాలికి తలలూపుతున్నాయి. ఆకాశంలో పూర్ణచంద్రుడు తన వెన్నెలను బృందావనమంతా పరచాడు.
బృందావనం అంతా నిద్రలో ఉంది.
కానీ...
గోపాల భట్ట గోస్వామి మనసులో మాత్రం ఆవేదన ఆగలేదు.
తన ముందు బుట్టతో కప్పబడిన పన్నెండు సాలగ్రామాలు...
ఆ పక్కనే భక్తుడు కానుకగా సమర్పించిన కిరీటం, వేణువు, పట్టు వస్త్రాలు, ఆభరణాలు...
వాటిని ఒక్కసారి చూస్తున్నాడు...
శాలగ్రామాలను మరోసారి చూస్తున్నాడు...
మార్చి మార్చి చూస్తూ మనసులో "ప్రభూ! నిన్ను శిలగా నేను ఎన్నడూ చూడలేదు. ఈ సాలగ్రామంలోనే సాక్షాత్తూ గోపాలకృష్ణునిగా, రాధారమణునిగా దర్శిస్తున్నాను.
అయినా... నీకు ఈ కిరీటం ధరింపజేయలేకపోతున్నాను. ఈ వేణువును నీ మృదుల హస్తాలలో ఉంచలేకపోతున్నాను. నీ పాదాలకు నూపురాలు తొడగలేకపోతున్నాను.
నాకు విగ్రహం కావాలని కాదు ప్రభూ...
నీ సేవ సంపూర్ణంగా చేసుకోవలనే ఆకాంక్ష తీరాలని మాత్రమే కోరుకుంటున్నాను." అంటూ సాలగ్రామాలను చూస్తున్నాడు...
ఆయన కళ్ల నుండి జాలువారిన కన్నీటి బిందువులు శాలగ్రామాలపై పడ్డాయి.
అప్పుడు భాగవతంలోని ఒక మహావాక్యం సత్యమవుతున్న క్షణం సమీపించింది.
अहं भक्तपराधीनो ह्यस्वतन्त्र इव द्विज !
साधुभिर्ग्रस्तहृदयः भक्तैर्भक्तजनप्रियः !!
అహం భక్తపరాధీనో హ్యస్వతంత్ర ఇవ ద్విజ!
సాధుభిర్గ్రస్తహృదయో భక్తైర్భక్తజనప్రియః!!
(శ్రీమద్భాగవతం 9.4.63)
ఓ ద్విజశ్రేష్ఠా! నేను నా భక్తులకు పరాధీనుడను. స్వతంత్రుడనైనప్పటికీ, భక్తుల ప్రేమకు బద్ధుడనైనవానిలా ఉంటాను. సాధువులు నా హృదయాన్ని సంపూర్ణంగా ఆక్రమించుకున్నారు. అందువల్ల నేను నా భక్తులను, భక్తజనులను అత్యంత ప్రియంగా ప్రేమిస్తాను.
ఆ రాత్రి భగవంతుడు భక్తుని కన్నీటిలోని కోరికలను గమనించాడు.
అది వైశాఖ పౌర్ణమి ప్రాతఃకాలం బ్రహ్మముహూర్తంలో గోపాల భట్టులు యమునాస్నానం చేసి, "హరే కృష్ణ... హరే కృష్ణ..." అంటూ తన కుటీరానికి చేరుకున్నారు.
నిత్యార్చనకు సిద్ధమయ్యారు...
అన్ని ఏర్పాట్లూ చేస్కుంటున్నారు...
హృదయంలో చెప్పలేని ఆనందం...
ఎందుకో ఆ రోజు ఎప్పటికన్నా భిన్నంగా తోస్తోంది.
మెల్లగా బుట్టను తొలగించారు...
ఆ క్షణం...
ఆయన చేతులు వణికిపోయాయి.
కళ్లలో ఆశ్చర్యం...
ఆనందం...
తనని తాను నమ్మలేని స్థితి...
మాటలు రావడం లేదు.
పన్నెండు సాలగ్రామాలలో ఒకటి కనిపించలేదు పదకొండే ఉన్నాయి.
పన్నెండో సాలగ్రామ స్థానంలో...
అపూర్వ సౌందర్యంతో, త్రిభంగ భంగిమలో నిలబడి...
సుకుమార హస్తాలలో వేణువు ధరించినట్లు...
చిరునవ్వుతో జగత్తునే మోహింపజేస్తూ...
కరచరణాదులతో సాక్షాత్తూ "శ్రీరాధారమణ" మూర్తి ప్రత్యక్షమయ్యాడు!
గోపాల భట్టులు నేలపై సాష్టాంగంగా పడిపోయారు.
"కృష్ణా...!
ఇది కలా?
నిజమా?
ఇది నా భ్రమా?
లేక నీ అనంత కరుణా?"
అని ఆనందంతో కళ్లనీళ్లు ధారగా కారసాగాయి.
ఆనందాశ్రువులతో తన శరీరం తడిసి ఆయన పాదాలు తడిశాయి.
మెల్లగా లేచి...
భక్తుడు సమర్పించిన పట్టు వస్త్రాలు తీసుకున్నారు.
అదే కిరీటాన్ని ధరింపజేశారు.
అదే ఆభరణాలను అలంకరించారు.
"ప్రభూ! నిన్న రాత్రి నేను చెప్పిన కోరికను... ఇంత త్వరగా తీర్చేశావా!"
అని ఏడుస్తూనే సేవ చేశారు.
ఆ క్షణంలో గీతా వాక్యానికి తార్కాణం సాక్షాత్కరించింది.
ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्!
యే యథా మాం ప్రపధ్యన్తే తాంస్తథైవ భజామ్యహమ్!
(భగవద్గీత 4.11)
"భక్తుడు నన్ను ఏ భావంతో ఆశ్రయిస్తాడో, నేను కూడా అతనికి అదే విధంగా అనుగ్రహిస్తాను."
ఈ వార్త క్షణాల్లో శిష్య ప్రశిష్యుల ద్వారా బృందావనమంతా వ్యాపించింది. బృందావనం అంతా సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోయింది.
"గోపాల భట్టుల సాలగ్రామం స్వయంగా కృష్ణమూర్తిగా ప్రత్యక్షమైందట!"
రూప గోస్వామి పరుగెత్తుకుంటూ వచ్చారు.
సనాతన గోస్వామి వచ్చారు.
రఘునాథ దాస గోస్వామి...
జీవ గోస్వామి...
అనేకమంది కృష్ణభక్తులు చేరుకున్నారు.
రాధారమణుని దర్శించిన రూప గోస్వామి కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.
"గోపాలా! ఇది నీ భక్తి విజయం కాదు...
భక్తికి లొంగిపోయిన భగవంతుని విజయం." అన్నారు
సనాతన గోస్వామి చిరునవ్వుతో
"శిల ఇక శిలగా లేదు... ప్రేమ రూపంగా ప్రత్యక్షమైంది." అన్నారు
అందరూ హరినామ సంకీర్తన ప్రారంభించారు.
"హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే ।
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే ॥"
ఆ రోజు బృందావనంలో యమునా తరంగాలు కూడా నాట్యం చేశాయని బ్రజవాసులు ఈ కథ చెప్తూ వర్ణిస్తారు.
---
ఈ స్వయంభూ విగ్రహం నేటికీ బృందావనంలోని శ్రీరాధారమణ మందిరంలో భక్తులకు దర్శనమిస్తోంది.
ఆయన వెనుక భాగంలో శాలగ్రామ స్వరూపానికి సంబంధించిన చిహ్నాలు ఇప్పటికీ ఉన్నాయని గోస్వాములు చెప్తారు.
అందుకే రాధారమణుడు కేవలం ఒక దేవాలయంలో ప్రతిష్ఠింపబాదిన విగ్రహం కాదు...
భక్తుని ప్రేమకు భగవంతుడు ఇచ్చిన ప్రత్యక్ష సమాధానం.
బ్రహ్మసంహితలో చెప్పిన ఈ వాక్యం ఇక్కడ అక్షరసత్యమవుతుంది—
प्रेमाञ्जनच्छुरितभक्तिविलोचनेन
सन्तः सदैव हृदयेषु विलोकयन्ति!
ప్రేమాంజనచ్ఛురిత భక్తివిలోచనేన
సంతః సదైవ హృదయేషు విలోకయంతి!
"ప్రేమ అనే దివ్యమైన అంజనంతో నిండిన భక్తి నేత్రాల ద్వారా సంతులు , మహాభక్తులు భగవంతుణ్ణి తమ హృదయంలో ఎల్లప్పుడూ దర్శిస్తూ ఉంటారు."
---
భక్తుడు శిలలో దేవుణ్ణి చూశాడు...
దేవుడు భక్తునిలో ప్రేమను చూశాడు...
అందుకే శిలగా ఉన్న పరబ్రహ్మమే భక్తుని ప్రేమకు కరిగి, "శ్రీరాధారమణుడు"గా అవతరించాడు.
భక్తి అంటే భగవంతుడి రూపాలు మార్చడం కాదు... భగవంతుడు స్వయంగా ప్రత్యక్షమయ్యేంత ప్రేమను మన హృదయంలో వెలిగించడం."
---
జై శ్రీరాధారమణలాల్ కీ జై!
జై శ్రీరాధే!
జై శ్రీకృష్ణ!
రాధే! రాధే! రాధే! రాధే!
— శంకరకింకరః
No comments:
Post a Comment