Pages

Saturday, July 25, 2026

బృందావన కథలు – 45 (భక్తుని ప్రేమ కోసం కూర్చున్న "తోట గోపీనాథుడు")

"యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్!!"

"ఎవరైతే నన్ను అనన్యమైన, నిశ్చలమైన భక్తితో సేవిస్తారో... నేను కేవలం వారి హృదయంలోనే కాదు, వారి వాత్సల్యానికి దాసుడనై వారి దగ్గరే ఉండిపోతాను." - శ్రీమద్భగవద్గీత (9.29)
పురీ క్షేత్రంలోని ఒక అద్భుతమైన పూలతోట ఒకటుండేది...
రక రకాల పువ్వులు, మందారాలు, గులాబీలు, మల్లెలు, మొల్లలు, అనేక రంగులతో సువాసనలు వెదజల్లే పూలతోట...
అక్కడ ప్రశాంత సాయంసంధ్య వేళ సముద్రపు గాలులు నెమ్మదిగా వీస్తుండగా...
గదాధర పండితుడు ప్రతిరోజూ భాగవతం పారాయణ చేసేవాడు.
ఆ భాగవత పారాయణ శిష్యులు - భక్తులేకాదు, సాక్షాత్ గోపీనాథుడూ వింటూండేవాడు.
గదాధర పండితుడు శ్రీ చైతన్య మహాప్రభువులకు అత్యంత ఇష్టుడు.
గదాధరపండితుడి ప్రాణం గోపీనాథుడు.
అది కేవలం ఒక పూజారికి, గుడిలోని విగ్రహానికి మధ్య ఉన్న సంబంధం కాదు.
అదిప్రాణానికి, ప్రాణనాథునికి మధ్య ఉన్న అమృత బంధం!
గదాధరుడు భాగవత శ్లోకాన్ని ఆలపిస్తుంటే... చెట్ల ఆకులు కూడా నిశ్శబ్దమైపోయేవి. చదివేది గదాధరుడైతే, ఆ మురళీధరుడే స్వయంగా కన్నులు మూసుకుని ఆలకించేవాడు. గదాధరుడు ప్రేమతో పూలమాల తొడిగితే ఆ దివ్యమంగళ విగ్రహం చిరునవ్వులు చిందించేది; నైవేద్యం పెడితే ఆకలి తీరినట్లు తృప్తిగా చూసేది; భక్తిపరవశంతో గదాధరుడు కన్నీళ్లు కార్చితే... ఆ కన్నీటిని తన హృదయానికి హత్తుకునేవాడు ఆ గోపీనాథుడు. అంత గొప్ప కథావాచకుడు, పండితుడు గదాధర పండితుడు.
కొన్నేళ్ళ క్రితం ఏం జరిగిందంటే...
ఒకనాడు శ్రీ చైతన్య మహాప్రభువులు గదాధరుని చేయి పట్టుకుని పురీ క్షేత్రంలో ఉన్న ఆ అందమైన తోటలోకి తీసుకెళ్లారు. ఒక ప్రశాంతమైన చోట ఆగి, చిరునవ్వుతో "గదాధరా! నీ ప్రాణప్రియుడైన జగన్నాథుడైన శ్రీకృష్ణుడు ఇక్కడే, ఈ నేల ఒడిలోనే దాక్కుని ఉన్నాడు. ఇక్కడ త్రవ్వి ఇసక తొలగించి చూడు..." అన్నారు:
గధాధరుడు తన వెంట వచ్చిన భక్తుల సహాయంతో భక్తిశ్రద్ధలతో అక్కడ ఇసుకను తొలగించగానే... ఆహా! ఏమి ఆ రూపం! అనంత సుందరమైన, చిరునవ్వులు చిందిస్తున్న గోపీనాథుని దివ్య విగ్రహం ప్రత్యక్షమైంది. ఆ రూపానికి మంత్రముగ్ధుడైన గదాధరుని కళ్లలోంచి ఆనందభాష్పాలు నదిలా ప్రవహించాయి.
చైతన్య మహాప్రభువు స్వయంగా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి, గదాధరుని భుజంపై చేయి వేసి గోపీనాథుని నిత్యకైంకర్య బాధ్యతను అప్పగించారు. "ఇప్పటి నుండి ఈ గోపీనాథుడు నీ బాధ్యత. కానీ గుర్తుంచుకో... నీవు ఆయన కేవలం సేవకుడివి కాదు, ఆయన ప్రాణస్నేహితుడివి!" అని అన్నారు.
ఆ రోజు నుండి గదాధరుని ఊపిరి, ధ్యానం, ప్రాణం... అన్నీ గోపీనాథుడే అయ్యాయి. ప్రాతఃకాలంలో పూలు కోయడం, చందనం తీయడం, ప్రేమతో మాలలు అల్లడం, సాయంత్రం భాగవతం చదివి వినిపించడం... ఆయన ప్రతి క్షణం గోపీనాథ సేవలోనే కరిగిపోయింది.
కాలం ఎవరికోసమూ ఆగదుగా.... తెలియకుండానే గడిచిపోయింది. గదాధర పండితుడు యవ్వనం కరిగి, వృద్ధాప్యం పైబడింది.
శ్రీ చైతన్య మహాప్రభువు విదేహముక్తిపొందారు (వారు ఇక్కడే అంతర్ధానమయ్యారని (భగవంతుని విగ్రహంలో ఐక్యమయ్యారని) గౌడీయ వైష్ణవులు నమ్ముతారు. అందుకు చిహ్నంగా ఈ విగ్రహం కుడి మోకాలిపై ఒక చిన్న బంగారు రంగు గీతను నేటికీ చూడవచ్చు.)
ఒకప్పుడు చిరునవ్వుతో గంపెడు పూలను కోసిన ఆ చేతులు... ఇప్పుడు ఆ పువ్వులను ముట్టుకోడానికే వణుకుతున్నాయి.
గంటల తరబడి నిలబడి నృత్యం చేసిన ఆ కాళ్లు... ఇప్పుడు అడుగు తీసి అడుగు వేయడానికి తడబడుతున్నాయి.
సుదూరం నుంచి భాగవతుల రాకను గమనించే చూపు మందగించింది.
ఎంత ఆలస్యమైనా ఏమీ తినకుండా నిలబడి, తిరుగుతూ కైంకర్యం చేసే దేహం బలహీనపడింది.
కానీ...ప్రాణనాథునిపై ఉన్న ఆ అనంతమైన ప్రేమ మాత్రం రవంతైనా తగ్గలేదు పైగా మరింత పెరిగుతోంది!
అలాంటి సమయంలో ఓ ప్రశాంతమైన ఉదయం...
గదాధరుడు ఎంతో ప్రేమతో, వీలైనన్ని తాజా సుగంధ పుష్పాలతో ఒక సుందరమైన మాలను మెల్ల మెల్లగా అల్లాడు.
మోకాళ్ల నొప్పులను ఓర్చుకుంటూ, వణుకుతున్న అడుగులతో గోపీనాథుని ఆలయ గర్భగుడిలోకి అడుగుపెట్టాడు.
గోపీనాథుని దివ్యమైన ఎత్తైన విగ్రహం ముందు నిలబడ్డాడు. మాలను తన రెంటి చేతులతో పట్టుకుని, మెడలో వేయడానికి చేతులు పైకి ఎత్తాడు...
కానీ... వృద్ధాప్యంతో ఉన్న చేతులు వణికుతున్నాయి, నడ్డి వంగిపోయిన మూలాన కలిగిన నొప్పివలన నిటారుగా నుంచిని చేతులతో మాలవేయడానికి రావట్లేదు. తన చేతులలో మాల పైకి లేవడం లేదు గోపీనాథుని మెడలో పడటంలేదు.
మళ్లీ ప్రయత్నించాడు... చేతులు సగానికే ఆగిపోయాయి.
మరోసారి... శరీరం సహకరించడం లేదు. చేతులు కిందకు జారిపోయాయి.
గోపీనాథుని మెడ అంత ఎత్తులో ఉంది... గదాధరుని దేహం చేతన కోల్పోతోంది.
చివరకు... ఆ పూలమాలను తన గుండెలకు హత్తుకుని, గోపీనాథును పాదాలపై పెట్టి, గర్భగుడి నేలపై పడి వెక్కివెక్కి ఏడవడం ప్రారంభించాడు గదాధరుడు. ఆయన కన్నీళ్లతో గోపీనాథుని పాదపద్మాలు తడిసిపోయాయి.
"గోపీనాథా! దేవా...
ఇన్నాళ్లూ నిన్ను అలంకరించిన ఈ చేతులు... నేడు నీ మెడను కూడా తాకలేకపోతున్నాయే!
నా దేహం ముసలిదైపోయిందయ్యా... కానీ నీపై నాకున్న ఈ ప్రేమ మాత్రం క్షణక్షణానికీ యవ్వనంగానే ఉందే!
శరీరం సహకరించని ఈ అభాగ్యుని సేవను నీవు ఎలా స్వీకరిస్తావు తండ్రీ? నేను నీకు మాల కూడా వేయలేకపోతున్నానే... నీ సేవ చేయలేని ఈ శరీరం ఇంకా ఉండడం వల్ల ఏం ప్రయోజనం తండ్రీ!!!" అంటూ బాధపడి చెప్పుకున్నాడు. మెల్లగా లేచి అడుగులో అడుగేసుకుంటూ ఇంటికెళ్ళాడు.
ఆ రాత్రి గదాధరుడు భోజనం లేదు, విశ్రాంతి లేదు... గోపీనాథునికి సేవచేయలేకపోతున్నానే అన్న ఆ విరహ వేదనలోనే, ఏడిచి ఏడిచి శోషవచ్చి నిద్రలోకి జారుకున్నాడు.
ఆ రాత్రి... పురీ జగన్నాథ ధామంలో ఒక పరమ అద్భుతం సంభవించింది.
మరుసటి రోజు ఉదయం, గోపీనాథ ఆలయ పూజారులు గర్భగుడి తలుపులు తెరిచారు.
తలలు వంచి లోపలికి అడుగుపెట్టిన అర్చకులు... ఒక్కసారిగా స్తంభించిపోయారు! చేతుల్లోని పూజ పాత్రలు కిందపడిపోయాయి! కళ్లు నమ్మలేక రెప్పలు వేయడం కూడా మరచిపోయారు!
నిన్నటి వరకు నిటారుగా, ఎత్తుగా నిలబడి ఉన్న శ్రీ గోపీనాథుడు...
ఈరోజు... తన భక్తుని కోసం, మోకాళ్లు మడిచి పద్మాసనంలో ప్రశాంతంగా కూర్చుని మురళి వాయిస్తున్నాడు !
ఈ వార్త కార్చిచ్చులా వ్యాపించింది.
అర్చకులు వచ్చి గదాధర పండితుడుకి విన్నవించారు. అది విన్న గదాధర పండితుడు సత్తువనంతా కూడదీసుకుని, చేతిలో పూల సజ్జాతో పరుగెత్తుకుంటూ పడుతూ లేస్తూ ఆలయానికి వచ్చాడు.
ద్వారం దగ్గర ఆగి చూశాడు...
అవును! తన ప్రాణనాథుడు, నీలమేఘశ్యాముడు... తన ఎత్తుకు సరిపడా, తను సులువుగా మాల వేసేలా అన మోకాళ్ళు మడిచి కూర్చుని, అత్యంత వాత్సల్యంతో చిరునవ్వు చిందిస్తున్నాడు!
ఆ దృశ్యాన్ని చూడగానే గదాధరుని చేతిలోని పూలమాలతో సహా సాష్టాంగ పడ్డాడు.
ఆయన మోకాళ్లపై బడి,"గోపీనాథా... నా కోసమా ఈ శ్రమ? నా కోసమా నీవు వంగావు? మోకాళ్లు మడిచి కూర్చున్నావు" అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు.
వణుకుతున్న చేతులతో ఆ మాలను ఎత్తి... ఈసారి ఏమాత్రం శ్రమ లేకుండా, గోపీనాథుని మెడలో అలంకరించాడు.
ఆ క్షణంలో...
భక్తుని కళ్ల నుండి కృతజ్ఞతాపూరితమైన ఆనందబాష్పాలు ధారగా కారుతున్నాయి...
భగవంతుని పెదవులపై సృష్టి అంతటినీ సమ్మోహనం చేసే మందహాసం వికసిస్తోంది...
అక్కడున్న భక్తజనమంతా జయజయధ్వానాలు చేస్తూ గదాధరని భక్తిని పొగడసాగారు...
ఆ గోపీనాథుని సేవలోనే చివరివరకూ తరించి గదాధరపండితుడు తన గోపీనాథునిలోనే ఐక్యమయ్యాడు.
---
అందుకే... ఈనాటికీ జగన్నాథ పురీ క్షేత్రంలో'తోట గోపీనాథుడు' (తోటలో లభించిన గోపీనాథుడు) కూర్చున్న భంగిమలోనే దర్శనమిస్తాడు. ప్రపంచంలో కూర్చుని ఉన్న కృష్ణుని విగ్రహం అత్యంత అరుదు.
ఆ మారిన దివ్య భంగిమ ద్వారా గోపీనాథుడు, ఎంత కాలం గడిచినా వచ్చిన ప్రతి భక్తునికీ ఇచ్చే చక్కని సందేశం
"నా భక్తునికి నన్ను చేరుకోవడం కష్టమైతే... నా భక్తుని సౌలభ్యంకోసం నన్ను నేను మార్చుకోగలను. కానీ, ప్రేమాతురుడైన నా భక్తుడిని నేను ఎన్నటికీ విడిచిపెట్టను!"
అలసిపోయిన దేహంతో, వణికిపోయే చేతులతోనైనా..."స్వామీ! నీ సేవ చేయాలి" అని తపించే ఆ అమాయకపు ఆక్రందనే నిజమైన భక్తి!
అలాంటి నిశ్చలమైన ప్రేమ ముందు... ఆ బ్రహ్మాండ నాయకుడే దిగి అవసరమైతే మోకాళ్ల మీదకొస్తాడు!
జయ జయ తోటా గోపీనాథ్
జయ శ్రీరాధే!
జయ శ్రీకృష్ణ!
జయ జయ బృందావన్!
-శంకరకింకరః (శ్రీ అయ్యగారి నాగేంద్ర)

No comments:

Post a Comment