Pages

Saturday, September 21, 2013

కర్కోటకస్య .............కలినాశనం! -3

అప్పుడు తల్లి దమయంతి చెప్పిన మాటలు నన్నయగారి పద్యంలో...

అఖిలదుఃఖరోగార్తున కౌషధంబు
సురుచిరంబుగ భార్యయ చూవె యెందు,
నొనర భార్యాసమేతుఁడై యున్నవాని
కెంత లాపదలయ్యును నెఱుకపడవు.

అలయునెడ డయ్యునెడ నాఁ
కలియుఁ దృషయు నైనయెడలఁ గనుఁగొని ధరణీ
తలనాథ పురుషునకు ని
మ్ముల భార్యయు పాచుఁ జిత్తమున దుఃఖంబుల్

భార్యయొక్క స్వాంత వచనములు విని, అంతటి సుగుణవతికి, కోమలాంగికి తన వల్ల కష్టాలొచ్చాయని బాధపడతాడు. కలి ప్రభావం చేత రాత్రి వేళ పడుక్కున్నప్పుడు తాను వెళ్ళిపోతే తన గురించి వెతికి దమయంతి తన తండ్రి వద్దకు వెళ్ళిపోతుంది అక్కడ సుఖంగా ఉంటుంది అని తలచి తన తను చుట్టుకున్న తన భార్య చీర చెంగుని ఉత్తరించి నిశిరాత్రి అడవిలోకెళ్ళిపోతాడు.

నిద్రలేచిన దమయంతీ దేవి తన భర్త జాడా తెలియక పొదలమాటున దాగున్నాడో లేక ఎక్కడ తిరిగుతున్నాడో అని వెతుకుతుండగా ఒక పాముకి చిక్కుతుంది, పాముబారినుంచి రక్షించిన ఒక కిరాతుడు ఆమెకు సేదతీర్చి ఆమెను కామిస్తాడు. సాధ్వి విషయం తెలిసి అసహ్యించి తన పాతివ్రత్యాన్ని ఫణంగా పెట్టి కిరాతుణ్ణి అగ్నిచేదహించేదిగా చేస్తుంది. తరవాత అడవిలో తిరుగుతూ ముని పల్లె వద్దకు చేరుతుంది.

మునిపల్లెలోని ఆశ్రమంలో వశిష్ఠ, వామదేవ, వాలఖిల్య, భృగు, నారద సదృశులైన మని శ్రేష్ఠులు దీనయైన దమయంతీ దేవిని చూసి ఆదరిస్తారు. వారందరూ సాధ్విని సేదతీర్చి ఆమెగూర్చి విచారిస్తూ ఎవరమ్మానీవు వన దేవతవా? దేవతా స్త్రీవా? ఎవరిదానవు? నీ దివ్య తేజంతో ఉండీ ఎందుకు తిరిగుతున్నావు అని అడుగుతారు. అంత దమయంతి, పుణ్యాత్ములారా! మహానుభావుడైన నలుని పత్నియైన దమయంతిని నేను. విధి వశాత్ సర్వమూ కోల్పోయి అడవులుపట్టాము, ఇప్పుడు నా భర్త కానరావట్లేదు, ఆయన గురించి వెతుకుతున్నాని ఆయన గురించిన సమాచారమేమైనా తెలిస్తే చెప్పండి  అని వేడుకుంటుంది. వారందరూ దివ్య దృష్టితో అంతా చూసి నీ భర్త తిరిగి సమస్త రాజ్యమూ కీర్తి వృద్ధిని పొందగలడు మీరిద్ధరూ సుఖముగానుండగలరని చెప్పి సమస్త ఆశ్రమంతోటి యజ్ఞకుండాలతోటీ కూడా అంతరార్థమవుతారు.

తరవాత అడవిలో దారికానక తిరుగుతూండగా కొందరు సుబాహుపురానికి వెళ్లేవారు కనపడగా వారితో కలిసి తానూ బయలుదేరుతుంది దమయంతి. అందరూ కలిసి రాత్రి ఒక చోట విశ్రమిస్తారు, ఆరాత్రి నీటికొరకు వచ్చిన ఏనుగుల మంద బారినపడి వచ్చినవారిలో చాలామంది హతులౌతారు. అయ్యో పతిని కానరాక విధంగానూ జీవించాలనే కాంక్షలేను నన్ను చంపకుండా తోడువచ్చిన వారిని మదగజాలెందుకు చంపాయో అని బాధపడుతుంది. దేవతల కోరికలు మన్నించగ స్వయంవరంలో నాడు నలుని వరించినందుకు దేవతలు పగబట్టి దుఃఖాలకు కారణమైనారేమో అని బాధపడుతుంది. మిగిలిన వారితో కలిసి నగరానికి చేరుతుంది. అక్కడ రాజ మార్గంలో వెళ్తూండగా రాజాంతఃపురంలో ఉండే దాది చూసి సేద తీర్చి రాజమాత వద్దకు తీస్కెళ్తుంది.

ఆరాజమాత మిక్కిలి స్నేహంతో ఆమె గూర్చి విచారించి తన భర్త జూదంలో సమస్తమూ ఓడి  అడవులపాలవడమూ ఏకవస్త్ర ఖండంతో ఉండడమూ తెలుసుకుంటుంది. దమయంతీ దేవి తానుసైరంధ్రి వ్రతంలో ఉన్నానని రాజమాతకు తెలిపి, ఉచ్ఛిష్టం తినను, కాళ్ళు పట్టను, పరపురుషులతో మాట్లాడను, నా పతిని వెదక గలిగే బ్రాహ్మణోత్తములతో మాత్రమే మాట్లాడతాను, అలాఐతేనీ మీవద్ద ఉంటాను అని తెలుపుతుంది. దానికి రాజమాత అతి గౌరవంగా నీవిక్కడ జీవించవచ్చు అని పలుకి తన కూతురు సునందను ఆమె చేతిలో పెడుతుంది.

ఇది ఇలా ఉండగా నలుడు అడవిలో దమయంతీ దేవిని వదిలి అరణ్యంలో తిరుగుతూ ఉంటాడు. అంతలో కార్చిచ్చు రేగి మంటల్లోనుంచి నలునికి కొన్ని రక్షించమనే ఆర్తనాదాలు వినపడతాయి. నలుడు కార్చిచ్చులోకి దూకి చుస్తాడు అక్కడ కదలలేకున్న నాగ కుమారుణ్ణి చూస్తాడు. నాగ కుమారుడు కర్కోటకుడు అను మహాసర్పం. కర్కోటకుడు నలునికి నమస్కరించి ఒక ఋషి శాపం వల్ల కదలక మెదలక ఉన్నాను నన్నెత్తుకెళ్ళి రక్షించమని కోరతాడు. తన క్షాత్ర ధర్మంగా రక్షిస్తాడు. కర్కోటకుని ఎత్తుకొని ఒక తటాకం వద్ద విడువబోగా ఇంకొంచెం ముందుకు వదలమని అడుగుతాడు కర్కోటకుడు, ఆవిధంగా చేయబోయేంతలో కర్కోటకుడు నలుని శరీరాన్ని కాటువేసి విషాన్ని ఎక్కిస్తాడు. అందువల్ల నలుడు కమిలినవాడై నల్లగామారి వికృత రూపం పొందుతాడు. అంత కర్కోటకుడు తన దివ్య శక్తితో అసలు రూపు చూపి ఏమీ భయపడవద్దు, నాచేత విషపీడితుడవైనా నీకు నేను ఉపకారం చేయడం కొరకే పని చేసాను. ఇప్పుడు నీ నిజ రూపం ఎవరికీ తెలియదు. నా విషం ఎంతవరకు నీ శరీరంలో ఉంటుందో అంతవరకు నీకు పిశాచ, రాక్షస శత్రువులచేతనూ భయంకర విషములచేతనూ భయం ఉండదు. దీనివల్ల నీకు అన్ని యుద్ధాలలోనూ విజయం కలగగలదు, తిరిగి నీ భార్యను పొంది ఎప్పటిలా రాజ్యాన్ననుభవిస్తావు అని చెప్తాడు. ఎప్పుడైనా నీకు నీ నిజ రూపం పొందాలని ఇచ్చ కలిగితే నన్ను తలచుకుంటే వస్త్రం నీవద్దకు వస్తుంది దాన్ని ధరించగానే నీ అసలు రూపం పొందుతావు అని చెప్తాడు.

తరవాత కర్కోటకుడు నలునితో ఇక్ష్వాకువంశంలో ధర్మప్రభువైన ఋతుపర్ణుడు అనే మహారాజు వద్ద బాహుకుడను పేర సేవించమని ఉపదేశిస్తాడు. నలునికి తెలిసిన అశ్వహృదయాఖ్య విద్యని రాజుకు నేర్పి, అతని వద్ద నుండి అక్షహృదయ విద్యను పొందమనీ చెప్తాడు. నలుడు ఋతుపర్ణుని వద్దకు చేరి నాపేరు బాహుకుడు మీసేవార్థినై వచ్చాను అని చెప్తాడు. ఋతుపర్ణుని రథానికున్న పొగరుమోతు గుఱ్ఱాలను అణచి అతనికి సారథ్యం వహిస్తూ అతనికి వంట చేసిపెడుతూ ఉంటాడు. తన భార్యను తలచి బాధను పొందుతూ ఉంటాడు.

No comments:

Post a Comment