Pages

Saturday, September 21, 2013

కర్కోటకస్య .............కలినాశనం! -5

దమయంతి తన చెలికత్తెఐన కేశిని ని పిలిచి అయోధ్యారాజు ఋతుపర్ణుడు తప్ప అన్య రాజులెవ్వరూ ఇపుడు రాలేదు అతనితోపాటు బ్రాహ్మణుడు అతని సూతుడు వచ్చారు. ఆసూతుడెవరో కనుక్కో మన పర్ణాదునికి ప్రతివచనమిచ్చిన బాహుకుడి యెడ ఎందుకో మనసు ముదితమవుతోంది అని చెప్తుంది. కేశిని పరిపరివిధముల అతనిని పరీక్షించి, అతడు వాయువేగమున అన్ని యోజనములు ఎలా వచ్చినదీ తెలుసుకొని, అతడు ఋతుపర్ణునికి వంటవాడనీ తెలుసుకొని అతడు వండిన వంటలు దమయంతీ దేవవద్దకు పంపుతుంది అవి రుచి చూసిన దమయంతీదేవి అతడు నిశ్చయంగా నలుడే అని నమ్మి తన కొడుకు కూతురును నలుని వద్దకు పంపగా అతడు వాత్సల్యం చేత వారిని కౌగిలించుకొని నాపిల్లల్లా ఉన్నారని అంటాడు.

మా పురోహితులవల్ల నువ్వు మారురూపంలో అయోధ్యలో ఉన్నావని తెలిసి నిన్ను రప్పించటానికే  బ్రాహ్మణులచేరి సమాలోచింది ద్వితీయ స్వయంవరాన్ని రచించవలసి వచ్చింది, అని బాహుకుణ్ణి చేరి చెప్తుంది. విలపిస్తుంది విన్నవిస్తుంది. అంత దైవ వశాన ఆకాశవాణి పలుకుగా నరోత్తమా ఆమె పతివ్రత మహాసాధ్వి నీకొరకే పరితపించునది కానీ మారు వివాహమునకు నీయందు అన్యభావనతో స్వయంవరం రచించలేదు అని వినపడుతుంది. ఆకాశంలోంచి పుష్పవృశ్టి కురుసి, దేవ దుందుభులు మ్రోగుతాయి, వాయుదేవుడు ప్రత్యక్షమై నలునికి దమయంతీపతివ్రతాగుణాలు, నలుని యందున్న అనురాగాన్ని విశదీకరిమ్చి చెప్తాడు. నలుడు ప్రమోదాన్ని పొంది క్షణమే కర్కోటకుణ్ణి తలచుకోగా పట్టుపుట్టం వచ్చి తనపైబడి తన అసలు రూపు పొందుతాడు.
తరవాత పుష్కరుని చేరి తన రాజ్యం పొందుటకు జూదమో యుద్ధమో తెలుపమని కోరతాడు, పుష్కరుడు ఇంతకు ముందు నలుని ఓడించిన గర్వముచే దమయంతిని మోహించి తాను ఓడితే  రాజ్యమిస్తాననీ నలుడోడితే దమయంతినీయవలెననీ పందెం కాస్తాడు, కలి ప్రభావంలేని కారణాని దైవ వరప్రభావాన నలుడు గెలిచి రాజ్యాన్ని పొందుతాడు. ఓడిన పుష్కరుని చూసి కిందటిసారి కలి ప్రభావం చేత ఓడాను ఈసారీ అలాగే అనుక్కున్నావు కానీ నిన్నేమీ చేయను నీవు నాకు దాయాదివి కాబట్టి నిన్నేమీ చేయను పొమ్మని వదిలేస్తాడు. ఇక పిల్లా పాపలతో దమయంతి తన భర్తను చేరి సుఖ సంతోషాలతో ధర్మబద్ధంగా జీవిస్తూ కీర్తినిపొందారు.

కథను మహాభారతంలో బృహదశ్వుండు , ధర్మరాజుకు చెప్పి ఇందులోని అక్షహృదయాన్ని ఉపదేశిస్తాడు. తరవాత నలోపాఖ్యాన ఫలశృతినీ ఇలా చెప్తాడుఎవరు నలోపాఖ్యానాన్ని సావధానంగా భక్తితో వింటారో, చదువుతారో వారు కలిదోష నిర్ముక్తులౌతారు. అఖిల పుణ్యాన్ని ఆర్జిస్తారు, కష్టాలు బాయరు, పుత్ర పౌత్రాభువృద్ధిని పొందుతారు. ఆరోగ్యము, ఆదాయము, ధన ధాన్యాదులు పొందుతారు, దుష్ట విషయములకు వ్యసనములకు బానిసలవ్వరు, ధర్మాత్ములై కీర్తిని పొందుతారుఅలాగే కలి వరమిచ్చినట్లుగా నలుని కీర్తించినవారిని కలి బాధించడు. ఉపాఖ్యానం పూర్తిగా చదవడం కానీ వినడం కానీ కుదరకపోయినా ఇందులోను పుణ్యచరిత్రులైన వారు పేర్లు తలచుకునేలా క్రింది శ్లోకం పఠించినా కలిదోషం అంటదు. అని చెప్తారు.

కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్యచ!
ఋతుపర్ణస్య రాజర్ష్యేః కీర్తనం కలినాశనం!

ఆస్తికులు ఈ శ్లోకాన్ని నిత్యమూ చదివి వృద్ధిని పొందెదరుగాక!
స్వస్తి
సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు

1 comment: