Pages

Saturday, September 14, 2013

స్తోత్రాలు, స్తుతులు, భగవంతుని కీర్తించడం వంటివి ఎందుకు?

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

 లాంటి ప్రశ్నలు ఒకప్పుడు నన్ను కొందరడిగనప్పుడు నాదగ్గర సమాధానం లేదు, కొంత ప్రయత్నం చేత స్తోత్రాలు, స్తుతులలోని వాటి ఫలశృతి చదివినప్పుడు ఇది ఇందుకు చదవాలి అని సమాధాన పరచుకున్నాను, ఇలా స్తుతిస్తే  స్తుతి చదివితే కొన్ని కొన్ని శుభాలు జరుగుతాయి, అవి భుక్తి ముక్తి దాయకాలు , సుఖ శాంతి సంవర్థకాలు,  అని ఇలా ఎన్నో ఉంటాయి. ఆయా స్తోత్రాలు చదవడం వల్ల మనకి  కోరిక తీరట్లేదో లేదా మనం ఏది పొందడం వల్ల మనకి అభ్యున్నతో అవి పొందడానికి అడ్డుపడుతున్న దురితము పోయి యోగము, క్షేమము కలుగుతాయో   ఫలాలేమో చెప్తాయి  ఫలశృతులు,  ఫల శృతులు ఋషులు  యా స్తోత్రాలను నిర్మించినపుడు వారి రాబోయే తరాలకు అందించాలని తమ తపస్సుధారపోసి  స్తోత్రం చదవండి ఇది ఇందుకు ఉపయోగం అని చెప్పారు. కొన్ని చోట్ల భగవంతుడే సాక్షాత్ ఋషులు భక్తులైనవారు చేసిన స్తుతులకు మెచ్చి  స్తుతి పాఠాన్ని తిరిగి ఎవరు చదివినా గొప్ప ఫలితమొచ్చేటట్లు వరాలిచ్చిన స్తుతులెన్నో ఉన్నాయి. ఎన్నోఆర్ష ప్రోక్తమైన స్తోత్రాదులు పఠన , పారాయాణుదులచేతనూ గొప్ప ఫలితాలనిస్తాయి, అసలు కొన్ని కొన్ని కేవల ఉచ్ఛారణ చేతనే గొప్ప ఫలితాలనిస్తాయి.

ఐతే, ఆయన తలచుకుంటే అవగతమవనిదేముంటుంది. తెలియపరచాలనుకుంటే తెలియపరుస్తాడు లేకపోతే తెరవేసి మాయలో ముంచుతాడు. అది ఆయనిష్టం కదా.. వారూవీరూ చెప్పడం సరే మనకి బాగాపాతుకునేలా ఎక్కాలంటే ఎక్కడోఅక్కడ స్వామే ఈ స్తోత్రపాఠాలెందుకో తెలిసేలా చెయ్యకపోతాడా అని నిబ్బరంగా ఉన్నా.. ఎన్నో సార్లు చూసినా, ఆయన తీస్తేనే తెర తొలుగుతుంది కదా.. ఇదిగో  ఈ రూపంలో ఆ అనుమానం తీర్చారు.

 శబ్దాన్ని అక్షరాలను సృష్టించిన పరమేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, అక్షర రూపుడు ఐన  పరబ్రహ్మం, ఆయనిచ్చిన అక్షరాల సముదాయంతో మనం పదాలు వాక్యాలు కూర్చి లేదా పెద్దలు కూర్చిన స్తోత్రాదులను విని మెచ్చుకొని ఆనందపడిపోయి మనకు కావలసినదిస్తాడా? కాదు... మరెందుకో మహిమ్నా స్తవంలో పుష్పదంతాచార్యులు చెప్తారు

మధుస్ఫీతావాచః పరమమమృతం నిర్మితవతః
తవబ్రహ్మన్ కిం వా గపి సురగురోర్విస్మయపదం
మమత్వేతాం వాణీం గుణగణనపుణ్యేన భవతః
పునామీత్యర్థేస్మిన్ పురమధన! బుద్ధిర్వ వసితా
 మహేశ్వరా! తేనెలతో నిండినట్టి వాక్కునుండి ఎంతో గొప్పనైన వేదమనే అమృతమును   నిర్మించిన నీకు దేవగురువు ఐన బృహస్పతిగారి వాక్కు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందా? అలాంటిది నేనెంత?  త్రిపురమధనా! నీ గుణములను గణించడము అనే పుణ్యంచేత  నా వాక్కును పవిత్రం చేయడము అనే ప్రయోజనము నా బుద్ధిలో నిశ్చితమైనది తప్ప, వేదాన్నే నిర్మించిన నీకు కొత్తగా చెప్పడానికి, నిన్ను కొత్తగా స్తుతించడానికి, కొత్తగా  వాక్కు,  అక్షరం నా దగ్గరుంది? నీదైన దాన్ని నీకివ్వడం! నీదిగా, అంతటా అన్నిటా నిన్నుగా గుర్తించగలిగే బుద్ధి పొందడం తప్ప నేను చేస్తున్నానని చెప్పేది చేసేది ఏదీ లేదుగా పరమేశ్వరా!

దీన్నే ఇంకో విధంగా శ్రీ రామాయణంలో భరతుడు చెప్తారు అదే భరతవాక్యం అని ప్రస్తిద్ధి చెందిందీను  "యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధరా తావత్వమిహ సర్వస్య స్వామిత్వమభివర్తయ" ఈ భూమి ఉన్నంతకాలం నీవే స్వామివి, నాది అంటూ ఏం ఉంది. అన్నీ నీవే అంతా నీవే ఐనప్పుడు, నేనే నీవైనప్పుడు నీవే నేనైనప్పుడు.

అంటే స్తోత్రాదులు ఎందుకంటే మన వాక్కును మనస్సును పరమేశ్వరుని గుణగణాల కీర్తనముచే శుద్ధి చేసుకోవడం, తద్వారా శుద్ధిచేయబడిన మనస్సనే పాత్రలోకి భక్తి అనే వెన్న ప్రస్ఫుటంగా కనిపించేంత జ్ఞానమనే చిక్కటి పాలు వచ్చి చేరటానికే, దాన్నే పొందగలిగినపుడు అన్యమైన కోరికలు తీరడం అనుషంగికమే కదా!...

సర్వం శ్రీపరబ్రహ్మార్పణమస్తు

-శంకరకింకర


No comments:

Post a Comment