Pages

Saturday, September 21, 2013

కర్కోటకస్య .............కలినాశనం! -4

విషయమంతా భీమ మహారాజుకు తెలిసి బాధపడి తన అల్లుడు కూతురు ఎక్కడున్నారో అని బ్రాహ్మణుల చేత వెతికిస్తూంటాడు. అలా ఒకనాడు సుదేవుడు అనే బ్రాహ్మణుడు సుబాహుపురంలో రాజమందిరంలో పుణ్యాహవాచనం చేయడానికి వెళ్ళి రాజకుమార్తెఐన సునందతో ఉన్న సైరంధ్రిని దమయంతిగా గుర్తిస్తాడు. దమయంతితో మాట్లాడుతుండగా ఆమె దుఃఖవశురాలై ఏడుస్తూంటే రాజమాత ఇతరులు వచ్చి సుదేవుని చేరి ఈమె గూర్చి విచారించగా ఆమె విదర్భేశుడైన భీమమహారాజు కుమార్తెయనీ నిషధ మహారామైన నలుని పట్టమహిషి అనీ తెలుసుకుంటారు. దమయంతి తల్లి, రాజమాత ఇద్దరూ అక్కచెల్లలు దశార్ణమహారాజు కూతుర్లనీ, దమయంతి, రాజమాతకు వరుసకు కూతురనీ తెలిసి ఆనందం పొందుతుంది.

అక్కడ్నుంచి దమయంతి విదర్భకు బయలుదేరి వెళ్తుంది. భీముడు బ్రాహ్మణులను నియోగించి నలుని వెతికించే ప్రయత్నంలో ఉంటాడు. అందులో పర్ణాదుడు అనే బ్రాహ్మణుడు అయోధ్యకు వెళ్ళి అక్కడ రాజుతో ఈవిషయం చెప్పి సహాయం చేయమని కోరతాడు అక్కడే ఉద్యోగంలో ఉన్న బాహుకుడు పర్ణాదుడ్ని ఏకాంతంగా పిలిచి నిట్టూర్పులతో భర్తలోని దోషాన్ని సహించిన భార్య దేహాంతముతరవాత ఉత్తమలోకాలు పొందుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. అంత పర్ణాదుడు ఇతడు నలుడు కాకపోతే ప్రతివచనం ఎందుకు పలుకుతాడు అనే అనుమానాన్ని పొందుతాడు, విషయాన్ని సుదేవునికి భీమునకు చేరవేస్తాడు.

భీముడు ఋతుపర్ణుని వద్ద ఉన్న నలుని బయటికి తీసుకురావడానికి దమయంతికి ద్వితీయ స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. అతి త్వరగా ఋతుపర్ణుని రమ్మని కబురు పెడతాడు. సుదేవుడు అయోధ్యచేరి ఋతుపర్ణుని ఆహ్వానిస్తాడు. అంత ఋతుపర్ణుడు నాకు దమయంతి ద్వితీయ స్వయంవరం చూడాలని ఉంది అతి వేగంగా నన్ను అక్కడకు చేర్చు నాకు నీ అశ్వనైపుణ్యం చూపించి అని బాహుకుడితో చెప్తాడు. అలాగే అని బాహుకుడు వారిని తీసుకొని బయలుదేరతాడు. తన భార్య ద్వితీయ స్వయంవరానికి ఎలా ఒప్పుకొంది అని పరి పరివిధాల ఆలోచిస్తాడు.

బాహుకుని అశ్వనైపుణ్యం చూసి ఆశ్చర్యపోయి ఇతడు, శాలిహోత్రుడో, మాతలో లేక నలుడో తప్ప అన్య మానవులు కాజాలరని తలుస్తాడు ఋతుపర్ణుడు. వయస్సు, విద్యను జూస్తే నలుని వలె ఉన్నాడు, కానీ రూపము వికారముగా ఉంది అని పరి పరి విధాల ఆలోచిస్తాడు. మహానుభావులు దైవ వశాత్త్ ప్రచ్ఛన్న వేషాలలో తిరిగుతుంటారు అలా నలుడు కానీ కాదు కదా అని అనుమానిస్తాడు, అలా ఆలోచిస్తూంటే తన ఉత్తరీయం జారి నేల మీద పడుతుంది, ఒకసారి వేగాన్ని తగ్గిస్తే బ్రాహ్మణుడు తన ఉత్తరీయం తిరిగి తీసుకొస్తాడని చెప్పగా బాహుకుండు నవ్వి అది పడి యోజనం దూరం దాటింది ఇప్పుడు బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళి తేవడం ఆలస్యమవుతుందని చెప్తాడు. అంత వేగంగా రథాన్ని తోలడం తెలుసుకొని ఋతుపర్ణుడు ఆశ్చర్యపోతాడు.

ఆదారిలో బాహుకుడు ఋతుపర్ణునికి అశ్వతత్త్వ శాస్త్రమంతా చెప్తాడు. అంత సంతోషించి ఋతుపర్ణుడు తనకు తెలిసిన ఫల వృక్షముల గూర్చి మొత్తం చెప్తాడు. చెట్లు ఎలాంటివి ఎలాంటి పళ్ళుంటాయి వాటి ఆకులు రకాలు అన్నీ చెప్తాడు. అలా ఒకరికొకరు అశ్వవిద్య, అక్షవిద్యను ఉపదేశించుకుంటారు. అంత అక్షవిద్యా మహిమ వలన బాహుకుని నుంచి కలి బయటపడ్తాడు, ఆశ్చర్యంతో చూస్తున్న నలుని వంక జూసి చేతులు జోడించి తాను కలిననీ తన ప్రభావం వల్లనే ఇన్ని కష్ఠాలు కలిగాయనీ చెప్తాడు. కోపంతో నలుడు కలిని శపించబోగా శరణువేడి నీ శరీరంలో ఉన్న కారణంచేత కర్కోటకుని విషంవల్ల నిత్యమూ దగ్ధమవుతూనే ఉన్నాను నన్నుపేక్షించుమని కోరతాడు. నిన్ను కీర్తించిన నరులు నావలన బాధలు పొందరు అని మాట ఇస్తాడు. అపుడు శాంత పడిన నలుడు తనలోని దుర్గుణములన్నీ పోగా కేవల విరూపం మాత్రం ఉండగా ఋతుపర్ణుడు, బ్రాహ్మణునితో సహా విదర్భపురి చేరతాడు. కలి అక్కడే ఉన్న భీత వృక్షాన్ని చేరతాడు. అప్పటుంచీ భీత వృక్షమూ ప్రసిద్ధి చెందింది.

ఋతుపర్ణుని రథం అంతఃపురం వేపుకు వస్తుంటే దాని శబ్దము నాలుగు దిక్కులా వ్యాప్తిచెందుతూ వేగంగా వస్తూండగా దమయంతి ధ్వని విని ఇది నా నాథుడే వస్తున్నాడని నమ్మి అనురాగయై బయటికి వచ్చిచూడగా భీముడు ఋతుపర్ణుని ఆహ్వానించడం చూస్తుంది. అక్కడ నలుడు కనపడక మనసులో తల్లడిల్లుతుంది. బాహుకుడు రథాన్ని రథశాలలో కట్టి అక్కడే విశ్రాంతి తీసుకుంటూంటాడు.

No comments:

Post a Comment