Pages

Friday, September 13, 2013

ధర్మం ఎలా రక్షిస్తుంది?


శ్రీ గురుభ్యోన్నమః
నమస్సులు
ధర్మమును అవలంబిస్తే ధర్మములో చరిస్తే ధర్మము మనని కాపాడుతుంది అని వాక్కు. ఐతే ఇది ఎలా సాధ్యము, అలా ఎలా కుదురుతుంది? అన్న దానికి కాళిదాసు అభిజ్ఙాన శాకుంతలంలో ఒక సన్నివేశాన్ని ఉదహరించారు.

అంతః పురంలో ఉద్యోగి అవసరమున్నా లేకున్నా ఒక కర్రను పట్టుకు తిరుగుతాడు. మనమూ అంతే ధర్మము ఆచరించడం వలన మనకి సద్యః ఫలితం ఉన్నా లేకున్నా ధర్మాన్ని పట్టుకునే ఉండాలి.

ఉద్యోగి మాటలు ఇవి
"ఆచార ఇత్యహితేన మయా ధృతా యా వేత్రయష్టి రవరోధగృహేషు రాజ్ఞః"
పెద్దలు చెప్పారనో, ఆచారమనో, నేను అంతఃపురంలో అవసరమున్నా లేకున్నా ఉద్యోగిగా చేరిననాటినుండి అంతఃపురంలో తిరిగేటప్పుడు దండాన్ని ఎంతో శ్రద్దతో వదలకుండా పట్టుకుని తిరిగాను. (అంటే ప్రతి పనికీ చేతిలో కఱ్ఱ ఉందా లేదా చూసుకుని, కఱ్ఱను పట్టుకునే పని చేసేవాడన్నమాట.)

"కాలే గతే బహుతిథే మమ సైవ జాతా ప్రస్థానవిక్లబగ తే రవలంబనార్థా"అలా చాలాకాలము గడిచిపోయిన తరవాత వార్థక్యము మూలాన నా నడకలో తొట్రుపాటు, తడబడుట కలుగుతోంది. తడబాటులో నేను పడిపోకుండా నేను చాలాకాలం పట్టుకోవడం వల్ల అలవాటైన దండమే కాపాడుతున్నది. (అలా ప్రతి విషయంలో జీవితాంతం కఱ్ఱను పట్టుకుని అన్ని పనులూ చేయడం వల్ల, నిలదొక్కుకోలేని వయసులో నిలబడడానికి కఱ్ఱయే సహకరించి నిలబెడుతోందన్నమాట)

ధర్మము కూడా ఇంతే, దండము వంటిదే ధర్మము. ధర్మము ఆచరించేటప్పుడు అప్పటికప్పుడు ఫలితము లేకపోవచ్చు/రాకపోవచ్చు అలా అని ధర్మమును వదిలి త్వరగా ఫలితం పొందటానికి అధర్మాన్నాశ్రయించకూడదు. ధర్మమును వదలకుండ శ్రద్ధతో ఆచరించిననాడు, ఒకచో మనమీ శరీరమును వదలినప్పుడు దేహ త్యాగానంతరము కూడా గతిలో వైక్లవ్యము కలుగకుండ ధర్మమే మనను చేతికఱ్ఱలాగ రక్షిస్తుంది.

చేతి కఱ్ఱను మనం ధరిస్తే తరవాత కఱ్ఱ మనని ధరిస్తుంది. ధర్మాన్ని రక్షించి అవలంబిస్తే అది మనని రక్షిస్తుంది


2 comments:

 1. చాలా బాగుందండీ!

  ధర్మాచరణ వల్ల సద్యః ఫలితమూ ఉంటుంది - మనసు తేలిక గా ఉంటుంది, ఎవరూ వేలెత్తి చూపలేరు (చూపినా సమాధానం ధైర్యంగా, బిగ్గరగా చెప్పగలమూ) ఇత్యాది మానసిక లాభాలే కాక, ధర్మ బధ్ధంగా ఆచరించిన పని ఏదైన సరైన ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది.

  ఈకాలంలో చాలామందికి "ధర్మం" అంటే కేవలం వేదశాస్త్రాదులలో చెప్పబడినట్టుగా భావించే కర్మకాండ, పూజాదికాలు మాత్రమే. నిజానికి వ్యక్తిగత దైనందిన జీవితం దగ్గరనుంచి లోకపాలన, బ్రహ్మాండ నాయకత్వం దాకా: ఏది ఎలా ఉండాలో ఏది ఎలా చేయాలో అన్నది "ధర్మం". ఇవన్నీ వేదాల్లో ఉన్నాయి, తరచి చూడగల్గితే తెలుస్తాయి.
  దైనందిన జీవితానికి సంబంధించి ఏది ఎలా చేయాలో, ఉండాలో, జరగాలో తెలుసుకుని ఆ ప్రకారం నడచుకుంటే సత్ఫలితం వెంటనే పొందటం తథ్యం.

  ReplyDelete
  Replies
  1. అవునండీ ధన్యవాదాలు

   Delete