జై రాధే కృష్ణ!
Friday, June 19, 2026
బృందావన కథలు - 13 (కంటినిండా దర్శనం - నోటినిండా నామం)
బృందావన కథలు – 12 ( హరిదాస్ ధ్యానంలో వసంతాలాట)
జై రాధే కృష్ణ
బృందావన కథలు - 11 (భావగ్రాహీ 'లడ్డూ గోపాల్')
జై రాధేశ్యామ్
Monday, June 15, 2026
బృందావన కథలు - 10 (గీతగోవిందం - మీర్ మాధవ్)
జై రాధే కృష్ణ
మధుర దేశంలో ఒక పరమ కృష్ణభక్తుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నిత్యకర్మలు పూర్తి చేసుకుని ప్రతిరోజూ ఉదయం 'గీతగోవిందం' లోని అష్టపదులను పరమ భక్తితో ఆలపిస్తూ శ్రీకృష్ణుని సేవించేవాడు.
ఆ బ్రాహ్మణుడి ఇంటి పైభాగంలో మొఘల్ దర్బారులో పనిచేసే ఒక అధికారి నివసించేవాడు. ప్రతిరోజూ ఉద్యోగానికి వెళ్లేందుకు సిద్ధమవుతూ, కిందనుంచి వినిపించే ఆ బ్రాహ్మణుడి గీతగోవింద గానం ఆయన చెవుల్లో పడేది.
"కాఽపి విలాస విలోల విలోచన ఖేలన జనిత మనోజం ।
ధ్యాయతి ముగ్ధ వధూరధికం మధుసూదన వదన సరోజమ్ ॥"
ఆ మధురమైన గానం, ఆ భక్తి భావం ఆయన మనసును ఎంతగానో ఆకర్షించాయి. కొంతసేపు అక్కడే నిలబడి తన్మయత్వంతో వినేవాడు. తరువాత అక్కడి నుంచి బయలుదేరినా, ఆ గీతాల మాధుర్యం ఆయన హృదయంలో మారుమ్రోగుతూనే ఉండేది.
ఒకరోజు ఆ బ్రాహ్మణుడు అధికారిని చూసి,
“మీరు ప్రతిరోజూ మా గుమ్మం దగ్గర నిలబడి ఎంతో ఆసక్తిగా ఈ గానం వింటున్నారు. మీకు 'గీతగోవిందం' పై ప్రత్యేకమైన అభిరుచి ఉన్నట్టుంది?” అని అడిగాడు.
అప్పుడు ఆ అధికారి వినయంగా నమస్కరించి,
“అయ్యా! ఈ గీతాలు నా హృదయాన్ని ఎంతో ఆకర్షిస్తున్నాయి. వీటిలోని భక్తి, మాధుర్యం వినగానే నా మనసు పరవశిస్తుంది. మీకు అభ్యంతరం లేకపోతే, ఈ గీతాలను నాకు కూడా నేర్పించగలరా?” అని ప్రార్థించాడు.
ఆ బ్రాహ్మణుడు అతని భక్తి భావాన్ని చూసి సంతోషించి,
“తప్పకుండా నేర్పిస్తాను” అని అంగీకరించాడు.
"ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలీ ।
గోపీ పీనపయోధర మర్దన చంచల కరయుగశాలీ॥"
ఆ రోజు నుంచి ప్రతిరోజూ కొద్దికొద్దిగా 'గీతగోవిందం' లోని అష్టపదులను, వాటి రాగభావాలను, భావార్థాలను అతనికి ఎంతో శ్రద్ధగా బోధించసాగాడు. కొంతకాలానికి ఆ అధికారికి 'గీతగోవిందం' మొత్తం భావపూర్వకంగా ఎలా ఆలపించాలో పూర్తిగా నేర్పించాడు.
ఒకరోజు ఆ బ్రాహ్మణుడు అధికారిని పిలిచి ఇలా చెప్పాడు —
“నాయనా! ఈ 'గీతగోవిందం' గానం సాధారణమైనది కాదు. ఈ గీతాలను భక్తితో ఆలపించినప్పుడు స్వయంగా శ్రీకృష్ణుడు వచ్చి వింటాడు. ఎందుకంటే ఇందులో ఆయన బాలలీలలు, గోపికలతో చేసిన రసక్రీడలు, రాధాదేవితో చేసిన మాధుర్యలీలలు ఎంతో మధురంగా వర్ణించబడ్డాయి. వాటిని వింటూ కృష్ణుడు పరమానందంలో మునిగిపోతాడు.
అందుకే నువ్వు ఎప్పుడైనా 'గీతగోవిందం' పాడేటప్పుడు ముందుగా ఒక ఆసనం వేసి పాడాలి. అప్పుడు భగవంతుడు వచ్చి ఆ ఆసనంపై ఆసీనుడై నీ గానం ఆలకిస్తాడు” అని చెప్పాడు.
అది విన్న ఆ అధికారి వినయంగా ఇలా అన్నాడు —
“స్వామీ! నేను మొఘల్ దర్బారులో అధికారిగా పనిచేస్తున్నాను. ఉదయం నుంచి రాత్రివరకు గుఱ్ఱంపైనే ఒక ఊరి నుంచి మరో ఊరికి తిరుగుతూ ఉండాలి. నాకు ఒకచోట కూర్చునే అవకాశం చాలా తక్కువ. అయితే ప్రయాణంలో ఉన్నప్పుడల్లా ఈ 'గీతగోవిందం' గీతాలను పాడుకుంటూ, శ్రీకృష్ణుణ్ణి స్మరిస్తూ వెళ్లాలని నా కోరిక. కానీ మీరు చెప్పినట్లుగా ఒకచోట ఆసనం వేసి కూర్చోలేని స్థితిలో ఉన్నాను. నాకు ఏదైనా ఉపాయం చెప్పండి” అని అడిగాడు.
అప్పుడు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు —
“సరే, నువ్వు గుఱ్ఱంపైనే ప్రయాణిస్తుంటావు కదా! అయితే గుఱ్ఱం జీనుపై ముందుభాగంలో చిన్న ఆసనం ఒకటి ఏర్పాటు చేయి. నువ్వు 'గీతగోవిందం' పాడుకుంటూ ప్రయాణిస్తుంటే, ఆ సాంవరియా స్వయంగా వచ్చి నీ ముందు ఆ ఆసనంపై కూర్చొని నీ గానం ఆనందంగా వింటూ ఉంటాడు” అని చెప్పాడు.
దానికి ఆ అధికారి ఎంతో ఆనందపడి, అలాగే చేయడం ప్రారంభించాడు. ఒక మృదువైన శాలువాను ఎప్పుడూ తన వెంట ఉంచుకునేవాడు. గుఱ్ఱంపై ప్రయాణం చేసే ప్రతిసారి, తాను కూర్చునే జీనుకు ముందుభాగంలో ఆ శాలువాను చిన్న ఆసనంలా పరచేవాడు. తరువాత భక్తి పరవశంతో 'గీతగోవిందం' లోని అష్టపదులను ఆలపిస్తూ ప్రయాణించేవాడు.
"లలిత లవంగ లతా పరిశీలన కోమల మలయ సమీరే ।
మధుకర నికర కరంబిత కోకిల కూజిత కుంజ కుటీరే ॥
విహరతి హరిరిహ సరస వసంతే నృత్యతి
యువతీ జనేన సమం సఖి! విరహి జనస్య దురంతే ॥"
ఒక ఊరిలో పని ముగించుకుని మరొక ఊరికి బయలుదేరినా, మార్గమంతా శ్రీకృష్ణస్మరణతో గానం చేస్తూనే ఉండేవాడు. అడవులు వచ్చినా, గ్రామాలు వచ్చినా, నిర్జన ప్రదేశాలు ఎదురైనా — అతని నోటి నుంచి కృష్ణనామ గానం మాత్రం ఆగేది కాదు. అలా ఊరి నుంచి ఊరికి తిరుగుతూ, తనకు అప్పగించిన పనులు నిర్వర్తిస్తూ అనేక రోజులు గడిచిపోయాయి.
ఒకరోజు సాయంత్రం అతడు ఒక ఊరి నుంచి మరొక ఊరికి బయలుదేరాడు. ఆ రోజు తొందరలో గుఱ్ఱం జీనుపై శాలువా ఆసనం పరచడం మరిచిపోయాడు. అది దట్టమైన అడవి మార్గం. సాయంత్రం క్రమంగా రాత్రిగా మారుతోంది.
"పశ్యతి దిశి దిశి రహసి భవంతం ।
తదధర మధుర మధూని పిబంతమ్ ॥
నాథ! హరే! జగన్నాథ! హరే!
సీదతి రాధా వాస గృహే ॥"
అయినా అతడు తన్మయత్వంతో 'గీతగోవిందం' గానం చేస్తూనే ఉన్నాడు. గుర్రం మెల్లగా అడవి దారిలో నడుస్తోంది. కృష్ణుని రూపాన్ని మనసులో దర్శించుకుంటూ, భక్తి మాధుర్యంలో మునిగిపోయి ఆలపిస్తున్నాడు.
"ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలీ ।
గోపీ పీనపయోధర మర్దన చంచల కరయుగశాలీ॥
నామ సమేతం కృత సంకేతం వాదయతే మృదు వేణుం ।
బహు మనుతే నను తే తనుసంగత పవన చలితమపి రేణుమ్ ॥
పతతి పతత్రే విచలతి పత్రే శంకిత భవదుపయానం ।
రచయతి శయనం సచకితనయనం పశ్యతి తవ పంథానమ్ ॥
ముఖరమధీరం త్యజ మంజీరం రిపుమివ కేళిషు లోలం ।
చల సఖి! కుంజం సతిమిరపుంజం శీలయ నీల నిచోళమ్ ॥"
అప్పుడే అకస్మాత్తుగా వెనుకనుంచి గజ్జెల శబ్దం వినిపించింది. ఎవరో ఆడవాళ్ళు వెనకాల పడుతున్నట్లుగా అనిపించిది.
“ఈ అడవిలో గజ్జెల చప్పుడు ఏమిటి?” అని అతనికి కొద్దిగా భయం వేసింది. వెంటనే గుఱ్ఱాన్ని వేగంగా నడిపించాడు. కానీ గుఱ్ఱం వేగం పెరిగిన కొద్దీ, ఆ గజ్జెల శబ్దం కూడా మరింత దగ్గరగా వినిపించసాగింది.
దానితో పాటు కంకణాలు, కేయూరాలు, ఆభరణాలు ఒకదానికొకటి తగులుతున్న మధురనాదం కూడా వినిపించింది. అధికారి గుండెల్లో భయం పెరిగిపోయింది. గుర్రాన్ని ఇంకా వేగంగా దౌడెత్తించాడు. కానీ ఎంత వేగంగా పరిగెత్తించినా, ఆ శబ్దాలు కూడా అంతే వేగంగా వెంబడిస్తున్నాయి.
చివరకు ఒకచోట అతడు గుఱ్ఱాన్ని ఆపేశాడు. వెంటనే వెనుకనుంచి వస్తున్న శబ్దాలూ ఆగిపోయాయి.
భయంతో అతని శరీరం అంతా చెమటలతో తడిసిపోయింది. గుండె బలంగా కొట్టుకుంటోంది. కొంత ధైర్యం తెచ్చుకుని, గుఱ్ఱం దిగాడు. మెల్లగా వెనక్కి తిరిగి చూశాడు.
అప్పుడు అతని కళ్లముందు ప్రత్యక్షమైన దివ్యస్వరూపం చూసి అతడు నిశ్చేష్టుడైపోయాడు.
నెమలిపింఛంతో అలంకరించిన కిరీటం…
ముఖంపై జారిపడుతున్న గిరిజాల జుత్తు...
నొసటిపై చెమటవల్ల కొద్దిగా కరిగిన కస్తూరి తిలకం…
విశాలమైన కమలనయనాలు…
సంపెంగపువ్వులా సుందరమైన నాసిక…
అరుణవర్ణపు పెదవులు…
చెవులకు ముత్యాల కుండలాలు…
భుజాలకు భుజకీర్తులు…
మెడలో మణిమయ హారాలు…
పట్టుపీతాంబరం…
నడుమున బంగారు ఒడ్డాణం…
చేతిలో మురళి…
పాదాలకు గజ్జెలు…
అలా జగన్మోహన స్వరూపుడై స్వయంగా శ్రీకృష్ణుడు అతని ముందున నిలబడి ఉన్నాడు.
ఆ దివ్యదర్శనం చూడగానే ఆ అధికారి భూమిపై సాష్టాంగంగా పడి నమస్కరించాడు. వెంటనే శ్రీకృష్ణుడు తన సుకుమార హస్తాలతో అతనిని లేపాడు.
అధికారి కన్నీళ్లతో ఇలా అడిగాడు —
“స్వామీ! నా వంటి అల్పుడి కోసం మీరు నిజంగానే ఇలా నా వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్నారా? ఎందుకింత శ్రమ పడుతున్నారు?” అని.
అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు —
“ఏవయ్యా! నువ్వు ప్రతిరోజూ 'గీతగోవిందం' పాడేటప్పుడు నాకు ఒక ఆసనం వేస్తావు కదా! ఆ ఆసనంపై కూర్చొని నేను ప్రతిరోజూ నీ వెంట వస్తూ, నువ్వు ఆలపించే 'గీతగోవిందం' మాధుర్యాన్ని ఆనందంగా వింటూ ఉంటాను.
కానీ ఈరోజు నువ్వు ఆ ఆసనం వేయడం మర్చిపోయావు. మరి నేను ఎక్కడ కూర్చోవాలి? అందుకే నువ్వు బయలుదేరినప్పటి నుంచీ నీ వెనకాలే నడుస్తూ వస్తున్నాను.
నువ్వు ఎక్కడ ఆగితే అక్కడ నేనూ ఆగుతున్నాను. నువ్వు మళ్లీ 'గీతగోవిందం" పాడడం ప్రారంభిస్తే, నేను వెంటనే నీ వెనకాల వచ్చేస్తున్నాను.
కానీ నువ్వేమో నా గజ్జెల శబ్దం విని భయపడి గుఱ్ఱాన్ని చాలా వేగంగా నడిపించావు. నీ వేగాన్ని అందుకోవడానికి నేనూ అంతే వేగంగా పరిగెత్తాల్సి వచ్చింది. అందుకే ఈ ఆయాసం… ఈ చెమట…” అని ప్రేమగా పలికాడు.
అది విన్న ఆ అధికారి హృదయం భక్తితో కరిగిపోయింది. మళ్లీ భూమిపై సాష్టాంగంగా పడి, కన్నీళ్లు కారుస్తూ ఇలా అన్నాడు —
“స్వామీ! మీ దయ ఎంత అపారమైంది తండ్రీ! నా వంటి అల్పుడిపై ఇంత కరుణ చూపించారా! నేను పాడుతున్న 'గీతగోవిందం' వింటూ ప్రతిరోజూ నా వెంట వచ్చారా! ఈరోజు నేను ఆసనం వేయకపోయినా, నా వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చారా తండ్రీ!” అని విలపించాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు అతనిని ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు —
“నీ 'గీతగోవిందం' గానం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. నువ్వు భక్తితో పాడే ప్రతి పదం నా హృదయాన్ని పరవశింపజేస్తోంది. ఎప్పుడూ ఇలాగే నా స్మరణలో ఉండి గానం చేస్తూ ఉండు” అని అనుగ్రహించాడు.
ఆ దివ్యదర్శనం అనంతరం మరుసటి రోజే ఆ అధికారి మొఘల్ దర్బారుకు వెళ్లి తన పదవికి రాజీనామా చేశాడు. “ఇక నా జీవితం మొత్తం శ్రీకృష్ణ సేవకే అంకితం” అని ప్రకటించాడు.
ఆ తరువాత ఆయన నిరంతరం 'గీతగోవిందం' ఆలపిస్తూ, ఎన్నోసార్లు శ్రీకృష్ణుని దివ్యదర్శనాన్ని పొందుతూ, తన జన్మను ధన్యముగా చేసుకున్నాడు.
ఆ మహాభక్తుడు మరెవరో కాదు — మధురలో ప్రసిద్ధి పొందిన భక్త మహారాజ్ "మీర్ మాధవ్".
రాధికాకృష్ణ! రాధికా
రాధికా తవ విరహే కేశవ! ॥
హరిరితి హరిరితి జపతి సకామం ।
విరహ విహిత మరణేన నికామం ॥
శ్రీ జయదేవ భణితమితి గీతం ।
సుఖయతు కేశవ పదముపనీతమ్ ॥
రాధికాకృష్ణ! రాధికా
రాధికా తవ విరహే కేశవ! ॥
------
జై రాధే కృష్ణా… రాధే కృష్ణా…
- శంకరకింకరః
బృందావన కథలు - 9 (బంగారు మురుగులు - లడ్డూలు)
జై రాధే కృష్ణ
బృందావనంలోని నిధివన్ దగ్గర, రాత్రి శృంగార హారతి, భోగ సేవలు ముగిసిన తరువాత దాదాపు తొమ్మిది, పది గంటల సమయానికి అక్కడి దుకాణాలన్నీ మూసివేస్తారు. అక్కడ కిళ్లీ కొట్లు కూడా ఉంటాయి. శృంగార భోగంలో తాంబూలం నివేదిస్తారు. భక్తులు ఆ తాంబూల ప్రసాదం తీసుకుని, తమ తమ దారులు పడతారు. కొద్ది సేపటికే దుకాణాలన్నీ మూసుకుపోయి, బజారు అంతా నిశ్శబ్దంగా మారిపోతుంది.
అలా అన్నీ మూసేస్తున్న సమయంలో, ఒక వ్యక్తి తాంబూల ప్రసాదం తీసుకుని, పక్కనే ఉన్న కిళ్లీ కొట్టులో కిళ్లీలు కొనుక్కుని ఇంటికి వెళ్తుండగా, ఒక మిఠాయి కొట్టులో మాత్రం ఇంకా దీపాలు వెలుగుతుండటం గమనించాడు. అప్పటికే రాత్రి పదకొండు గంటలు దాటిపోయింది.
ఆయన ఆశ్చర్యంగా లోపలికి వెళ్లి “ఏంటి బాబా! పదకొండు దాటిపోయింది. ఇంకా ఇంటికి వెళ్లలేదే? ఏం చేస్తున్నారు?” అంటూ అడిగాడు
అప్పుడు ఆ మిఠాయి కొట్టు యజమాని చిరునవ్వుతో “లేదు బాబూ! ఒక పెద్ద పురమాయింపు వచ్చింది. రేపు ఉదయాన్నే స్వామివారికి భోగ ప్రసాదంగా సమర్పించడానికి చాలా లడ్డూలు కావాలన్నారు. పొద్దున్నే తీసుకెళ్తామని చెప్పారు. అందుకే ఇవన్నీ సిద్ధం చేస్తున్నాను. ఈ లడ్డూలన్నీ చేసి పూర్తయ్యాకనే ఇంటికి వెళ్తాను.” అని అన్నాడు.
“ఓహో! అలాగా!” అని చెప్పి, తాను తెచ్చుకున్న తాంబూల ప్రసాదాన్ని అతనికి ఇచ్చి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు.
ఆ వ్యక్తి వెళ్లిన తరువాత, ఆ తాంబూల ప్రసాదాన్ని చూసిన వెంటనే మిఠాయి కొట్టు యజమానికి ఒక్కసారిగా గుర్తొచ్చింది — తాను ప్రతిరోజూ కొట్టు త్వరగా మూసేసి, నిధివనంలో జరిగే శయన భోగం, ఏకాంత సేవ, శృంగార హారతి దర్శించుకుని, రాధామాధవులకు దండం పెట్టుకుని ఇంటికి వెళ్తుంటాడు. కానీ ఆ రోజు మాత్రం లడ్డూల తయారీలో పూర్తిగా మునిగిపోయి సమయమే గమనించలేదు. అప్పటికే రాత్రి పదకొండు దాటిపోయింది. ఈ సమయానికి ఆలయ తలుపులు కూడా మూసేసి ఉంటారు.
“అయ్యో! ఈరోజు స్వామివారి దర్శనం కాలేదే!” అని అతని హృదయం బాధతో నిండిపోయింది.
అప్పుడు అక్కడే కూర్చుని, కళ్లుమూసుకుని, తన భావనలో స్వామివారిని శయన మందిరంలో దర్శించుకున్నాడు. తాను ఏకాంత సేవలో పాల్గొంటున్నట్టుగా భావించాడు. శృంగార హారతి జరుగుతున్న దృశ్యాన్ని మనసారా తలచుకున్నాడు. ఆ దివ్య భావనలోనే తిరిగి లడ్డూలు చేయడం ప్రారంభించాడు.
కొంతసేపటి తరువాత అర్ధరాత్రి సమయం అయింది. అంతలో ఒక చిన్న బాలుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు.
“బాబా! నాకు చాలా ఆకలిగా ఉంది. ఏమైనా తినడానికి ఇస్తారా?” అని అడిగాడు.
ఆ బాలుడు చూడడానికి ఎంతో అందంగా ఉన్నాడు. చక్కని గిరిజాల జుట్టు, తీరిగ్గా ఉన్న ముక్కు, పెద్ద పెద్ద కళ్ళు, ఎర్రని పెదవులు, గుండ్రని ముఖం, కాంతివంతమైన శరీరం — అతని రూపం చూడగానే ఎవరికైనా మమకారం కలిగేలా ఉంది. మంచి పట్టుబట్టలు ధరించి, బంగారు ఆభరణాలు వేసుకుని ఉన్నాడు.
మిఠాయి కొట్టు యజమాని ప్రేమగా “బాబూ! ఏమి తింటావు? ఇక్కడ ఎన్నో మిఠాయిలు ఉన్నాయి. సమోసాలు ఉన్నాయి, చాట్ ఉంది.” అనడిగాడు.
కానీ ఆ బాలుడు మృదువుగా “నాకు లడ్డూలే కావాలి. ఇదిగో నా బంగారు మురుగు ఇస్తాను. దానికి బదులుగా నాకు లడ్డూలు ఇవ్వండి. నా దగ్గర డబ్బులు లేవు.” అని అన్నాడు
అప్పుడు మిఠాయి కొట్టు యజమాని నవ్వుతూ “అయ్యో! పర్లేదు బాబూ. ముందు నువ్వు తిను. తర్వాత చూద్దాం.”అన్నాడు.
అని లడ్డూలు ఇవ్వబోతే, ఆ బాలుడు ఒప్పుకోలేదు.
“మీరు నా బంగారు మురుగు తీసుకుంటేనే నేను లడ్డూలు తీసుకుంటాను” అని పట్టుబట్టాడు.
అలా బలవంతంగా తన చేతిలోని బంగారు మురుగు ఇచ్చి, లడ్డూలు తీసుకుని ఒక్కసారిగా పరుగెత్తి వెళ్లిపోయాడు.
ఆయన వెంటనే బయటికి వచ్చి చూశాడు. కానీ ఆ బాలుడు ఎక్కడా కనిపించలేదు. కొంతదూరం వెతికినా ఆచూకీ దొరకలేదు.
“ఏదో పెద్దింటి పిల్లవాడిలా ఉన్నాడు. ఇంటికి వెళ్లాక పెద్దవాళ్లు అడుగుతారు. అప్పుడు వెతుక్కుంటూ ఇక్కడికొస్తారు. అప్పుడే తిరిగి ఇచ్చేయొచ్చు” అనుకుని, ఆ బంగారు మురుగును గల్లా పెట్టెలో పెట్టి తాళం వేశాడు.
కొంతసేపు ఎదురు చూశాడు. ఎవరూ రాలేదు. “సరే, పొద్దున్నే వస్తారేమో” అనుకుని, లడ్డూల పని పూర్తి చేసి ఇంటికి వెళ్లి పడుకున్నాడు.
మరుసటి రోజు ఉదయం లేచి, స్నానం చేసి, తన కొట్టులో ఉన్న ఠాకూర్జీకి పూజ చేశాడు. ధూపం వేసాడు. పూలు సమర్పించాడు. దీపం పెట్టాడు. నైవేద్యం సమర్పించాడు.
ఇంతలో ఆలయంలో పనిచేసే భండారీగారు అటుగా వస్తుండటం గమనించాడు.
ప్రతిరోజులాగే నమస్కరించి “జై జై రాధే కృష్ణ భండారీజీ! ఎలా ఉన్నారు?” అని అడిగాడు.
కానీ ఆ రోజు భండారిగారు చాలా దిగులుగా కనిపించారు.
“ఏమైంది భండారీ గారూ?” అని అడిగితే, వారు బాధగా
“రాత్రి గుడిలో ఏదో ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. స్వామివారికి వేసిన అన్ని ఆభరణాలూ ఉన్నాయి. కానీ శ్రీకృష్ణుడి చేతికి ఉన్న ఒక బంగారు మురుగు మాత్రం కనిపించడం లేదు. ఎవరు తీసుకెళ్లారో, ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు.” అంటూ చెప్పారు.
అది విన్న వెంటనే ఆ మిఠాయి కొట్టు యజమాని ఒక్కసారిగా ఒణికిపోయాడు. పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు శరీరం మొత్తం కంపించసాగింది. చెమటలు పట్టి ఒళ్ళంతా తడిసిపోయింది.
వెంటనే గల్లా పెట్టె తెరిచి, అందులో ఉన్న బంగారు మురుగు తీసుకుని వచ్చి చూపి “ఇదేనా?” అని అడిగాడు.
భండారిగారు ఆశ్చర్యంతో: “అవును! ఇదే! ఇది మీ దగ్గరకు ఎలా వచ్చింది?” అని అడిగారు.
అప్పుడు ఆయన రాత్రి జరిగిన సంగతంతా వివరంగా చెప్పాడు.
“రాత్రి లడ్డూలు చేస్తూ ఉండిపోయాను. స్వామివారి దర్శనం కాలేదని బాధపడి, మానసికంగా దర్శనం చేసుకుంటూ లడ్డూలు చేస్తున్నాను. అప్పుడు ఒక చిన్న బాలుడు వచ్చాడు. చూడడానికి కన్నయ్యలాగే ఉన్నాడు — గిరిజాల జుట్టు, పెద్ద కళ్ళు, ఎర్రని పెదవులు, పట్టు బట్టలు, బంగారు ఆభరణాలు… ఆకలేస్తోంది, లడ్డూలు కావాలని అడిగాడు. బలవంతంగా ఈ మురుగు ఇచ్చి లడ్డూలు తీసుకుని మాయమైపోయాడు.”
అది విన్న భండారిగారి కళ్ళల్లో ఆనందభాష్పాలు, అలౌకిక ఆనందంతో కలగలసిన పశ్చాత్తాపం...
“అయ్యో! నిన్న రాత్రి భోగ నైవేద్యాలన్నీ పెట్టాం. కానీ లడ్డూలు మాత్రం పెట్టడం మర్చిపోయాం. ప్రతిరోజూ శయన భోగంలో లడ్డూలు సమర్పిస్తాం. నిన్న ఎందుకో అవి పెట్టలేదు. అందుకే స్వామివారే నీ దగ్గరకు వచ్చి లడ్డూలు తీసుకుని తిన్నట్టున్నారు!” అని భావోద్వేగంతో అన్నాడు.
తర్వాత ఇద్దరూ కలిసి ఆలయానికి వెళ్లి, ఆ లడ్డూలను మళ్లీ స్వామివారికి సమర్పించారు.
ఆ మిఠాయి కొట్టు యజమాని స్వామివారిని చూస్తూ కన్నీళ్లతో ఇలా అనుకున్నాడు:
“స్వామీ! ఇన్ని ఏళ్లుగా ప్రతిరోజూ నీ దర్శనానికి వస్తున్నాను. ఒక్కరోజు నేను రాలేకపోయానని నువ్వే నా దగ్గరకు వచ్చావా? నా చేత్తో చేసిన లడ్డూలు తిన్నావా? నీ చేతికున్న బంగారు మురుగును నాకు ఇచ్చావా? నాతో మాట్లాడావా స్వామీ!”
అని ఆనందంతో భజనలు చేస్తూ, కృతజ్ఞతతో స్వామిని చూస్తూ పరవశించిపోయాడు.
కన్హయ్య ఆయజమాని భక్తితో కర్తవ్యనిష్ఠతో చేసే లడ్డూలు తినడానికి రాత్రి సేవలో లడ్డూలు లేకుండా చేసాడా?
ఆకొట్టు యజమాని తన ఠాకూర్ కోసం చేసే లడ్డూల తయారీలో నిమగ్నమై ఆలయ దర్శనం మరిచిపోయేలా చేసాడా?
ఆరాత్రి పనిలో మునిగిన ఆ కొట్టు యజమానికి సంజ్ఞ ఇవ్వడానికి తాంబూల ప్రసాదం పంపాడా?..
అంతా నిధివన్లో రాసలీల జరిపే కృష్ణలీల...
ఎవ్వరికీ అంతుబట్టని అలౌకిక హేల...
ఈ లీలను ఇప్పటికీ అక్కడ భక్తులు ప్రేమతో చెప్పుకుంటుంటారు. కపటం లేకుండా, నిర్మలమైన హృదయంతో స్వామిని సేవించే భక్తులను భగవంతుడు ఎప్పుడూ వదలడు. తానే వారి వెంట ఉండి, వారిని రక్షిస్తూ, అనేక లీలలు చేస్తూ ఉంటాడు.
------
అపరాధ సహస్రంబుల
నపరిమితములైన యఘము లనిశము నేఁ
గపటాత్ముఁడనై చేసితిఁ
జపలుని ననుగావు శేషశాయివి కృష్ణా!!
------
జై రాధే కృష్ణ॥
-శంకరకింకరః
బృందావన కథలు - 8 (భక్తుని పూమాల బరువు)
జై శ్రీ రాధే కృష్ణ
బృందావనంలో ఒక గొప్ప పండితుడు, పరమభక్తుడు ఉండేవాడు. ఆయన ప్రతిరోజూ తన ఇంట్లో పూజించే ఠాకూర్ శ్రీకృష్ణునికి ఒకరోజు అద్భుతమైన పూలబంగళా అలంకారం చేసి, అందులో స్వామిని కూర్చోబెట్టి సేవ చేయాలని సంకల్పించాడు.
దగ్గరలో పెద్ద పూలఅంగడి ఎక్కడ ఉందో విచారించగా, మథురలో ఉందని తెలిసి అక్కడికి వెళ్లాడు. ఎన్నో రంగురంగుల పూలతో కళకళలాడుతున్న ఆ అంగడిలో పువ్వుల ధరలు చూస్తూ వెళ్తుండగా, ఒకచోట గులాబి పూలమ్మేవాడు కనిపించాడు. ఆ గులాబీలు ఎంతో మృదువుగా, తాజాగా, అందమైన గులాబి వర్ణంతో మనోహరంగా మెరిసిపోతున్నాయి.
“ఈ గులాబీలతో నా ఠాకూర్‌కు ఒక అందమైన మహల్ కట్టి సేవించాలి” అని భావించి, ఆ పూలకొట్టు యజమానితో బేరమాడి ధర నిర్ణయించుకున్నాడు.
ఆ సమయంలో దేశంలో ముఘల్ పాలన సాగుతోంది. అక్బర్ చక్రవర్తి తన షాహీ మహల్‌ను పూలతో అలంకరించమని ఆజ్ఞాపించడంతో, అతని అధికారులు అదే మార్కెట్‌కు పూలు కొనడానికి వచ్చారు. వారిలో ఒక అధికారి కళ్ళు ఆ గులాబీలపై పడ్డాయి.
“ఆ పూలు నాకు కావాలి” అని అతడు కొట్టు యజమానితో అన్నాడు.
అందుకు యజమాని, “అయ్యయ్యో! ఇవి ఇప్పటికే వీరికి అమ్మేశాను. మీరు వేరే పూలు తీసుకోండి” అన్నాడు.
“కుదరదు. అవే కావాలి. ఇతను ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తాను” అన్నాడు అధికారి.
యజమాని, “బేరమైపోయిన పూలకు మళ్లీ కొత్త బేరమేమిటి?” అని చెప్పినా, అతడు వినలేదు.
అప్పుడు అధికారి, “నేనెవరినో తెలుసా? ఈ దేశాన్ని పాలించే సుల్తాన్ అక్బర్ దగ్గర పనిచేసే అధికారిని. ఇవాళ సుల్తాన్ మహల్‌ను అలంకరించాలి. ఈ పూలే కావాలి. ఇతను ఎంత చెప్పాడో దానికి రెట్టింపు ఇస్తాను” అన్నాడు.
అది విన్న ఆ భక్తుడు తనలో తాను ఇలా అనుకున్నాడు:
“ఈ భూమిలో కొంత భాగాన్ని పాలించే రాజు సేవకుడే ఇలా అంటుంటే, సర్వలోకాలను పాలించే సకలబ్రహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణుని సేవకుడైన నేను ఎందుకు వెనక్కి తగ్గాలి?”
అంతే, అతడూ బేరం పెంచసాగాడు. ఇద్దరూ తగ్గకుండా వెండి రూపాయల నుంచి బంగారు మొహరీల వరకూ ధర పెంచుకుంటూ పోయారు — పది, పదిహేను, ఇరవై, ముప్పై, యాభై… చివరకు వంద బంగారు మొహరీల వరకూ వెళ్లింది.
చివరకు ఆ అధికారి,“ఈ గులాబీలకు వంద మొహరీలేమిటి! ఇంకెక్కడో కొనేస్తాను” అని వెళ్లిపోయాడు.
అప్పుడు పూలకొట్టు యజమాని ఆ భక్తుణ్ని చూసి,
“అయ్యా! బేరం వంద బంగారు మొహరీల వద్ద ఆగింది. కాబట్టి మీరు ఆ డబ్బు ఇచ్చి ఈ గులాబీలు తీసుకెళ్లండి” అన్నాడు.
కానీ ఆ భక్తుని దగ్గర చూసుకుంటే పది, పదిహేను వెండి రూపాయలకన్నా ఎక్కువ లేవు. అయినా తన సంకల్పం విడువలేదు. వెంటనే ఇంటికి వెళ్లి తన భార్యను పిలిచాడు. పొరుగువారిని, తాకట్టు వ్యాపారులను రప్పించి ఇల్లు అమ్మేశాడు.
కట్టుకునే ముతక బట్టలు మాత్రమే ఉంచుకుని, ఇంట్లో పూజించే ఠాకూర్‌ను చేతబట్టి, మిగిలిన విలువైన వస్తువులు, పట్టు బట్టలు, సామగ్రి అన్నీ అమ్మేశాడు. ఇంకా సరిపోక కొద్దిగా అప్పు కూడా చేసి, ఆ డబ్బంతా తీసుకెళ్లి పూలబ్బికి చెల్లించాడు.
తాను, తన భార్య — కట్టుబట్టలతోనే, చేతిలో ఠాకూర్‌ను పట్టుకుని, తలపై గులాబీపూల బుట్టలు మోసుకుంటూ బృందావనానికి బయలుదేరారు.
బృందావనంలో ఒక విశాలమైన వనం మధ్య పెద్ద నీడనిచ్చే చెట్టు కింద ఆగారు.
“ఇక్కడే బాగుంది” అని భావించి, ఒక బట్ట పరచి ఠాకూర్‌ను కూర్చోబెట్టాడు. ఆ తరువాత తీగలతో గులాబీపూల దండలు అల్లుతూ, చిన్న అందమైన పూలబంగళా నిర్మించాడు. అందులో ఠాకూర్‌ను కూర్చోబెట్టాడు. మరికొన్ని గులాబీలతో ఎంతో జాగ్రత్తగా ఒక సుందరమైన దండ అల్లి, ఠాకూర్ మెడలో సమర్పించాడు.
అదే సమయానికి గిరిరాజ్ గోవర్ధనగిరి సమీపంలోని శ్రీనాథ్ ఆలయంలో హారతి సేవ జరుగుతోంది. అక్కడ శ్రీనాథ్ మూర్తి — ఒక చెయ్యి పైకెత్తి, మరొక చెయ్యి నడుముపై ఉంచి, గోవర్ధనగిరిని ఎత్తిన రూపంలో నిటారుగా నిలిచి ఉంటాడు.
గోస్వామిగారు హారతి ఇస్తుండగా, అకస్మాత్తుగా శ్రీనాథ్జీ మెడ వంగిపోయింది. ఆయన కళ్ళలోనుండి టపటపా నీళ్లు కారసాగాయి.
గోస్వామిగారు భయాందోళనలకు గురయ్యారు.
“జై జై ఠాకూర్! ఏమైంది స్వామీ?” అని ఆదుర్దాగా ప్రార్థించారు.
అప్పుడు ఠాకూర్ ఇలా పలికాడు:
“గోవర్ధనగిరిని చిటికెనవేలిపై ఎత్తిన ఈ శ్రీకృష్ణుడు, ముల్లోకాల భారాన్ని నిత్యం భరించే ఈ శ్రీకృష్ణుడు — తన సర్వస్వాన్ని నాకోసం త్యజించిన ఒక భక్తుడు వేసిన ప్రేమమాల బరువును మాత్రం మోయలేకున్నాడు. నా మెడ ఎంతో నొప్పిగా ఉంది.”
అది విన్న గోస్వామిగారు వెంటనే హారతి ఆపించి, పరదా వేయించారు. తరువాత తన శిష్యులను, అక్కడున్న ఐశ్వర్యవంతులైన భక్తులను పిలిచి,
“వెళ్లండి! ఠాకూర్ కోసం సర్వస్వం త్యజించిన ఆ మహాభక్తుడు ఎక్కడున్నాడో వెతికి, అతని కష్టాన్ని తీర్చి, గౌరవంగా ఇక్కడికి తీసుకురండి” అని ఆజ్ఞాపించారు.
వెంటనే వారంతా బృందావనం అంతా వెతకసాగారు. చివరకు ఒక పండితుడు ఠాకూర్ కోసం గులాబీ బంగళా అలంకారం చేయాలని తన యావదాస్తిని అమ్మేసి వనంలోకి వెళ్లిపోయాడని తెలిసింది.
వాళ్లు అక్కడికి వెళ్లి చూసేసరికి — గులాబీలతో నిర్మించిన ఆ బంగళా, అందులో వెలిగిపోతున్న ఠాకూర్ సేవ — చూసి ఆశ్చర్యపోయారు.
వెంటనే ఆ భక్తునికి జరిగిన విషయమంతా వివరించి, ఒప్పించి, అతని ఇల్లు, సామగ్రి అన్నీ తిరిగి విడిపించి, భార్యతో పాటు ఠాకూర్‌ను తీసుకుని శ్రీనాథ్జీ మందిరానికి తీసుకువచ్చారు.
ఆ భక్తుడు మందిరంలోకి ప్రవేశించి శ్రీనాథ్జీని చూడగానే ఆశ్చర్యపోయాడు.
శ్రీనాథ్జీ మెడ వంగి ఉంది. తాను గులాబీలతో అల్లిన మాలలాగే ఒక పెద్ద గులాబీమాల స్వామి మెడలో అలంకరించి ఉంది.
గోస్వామిగారు ఆ భక్తుడిని చూసి ఆనందంతో ముందుకు వచ్చి, శ్రీనాథ్జీ మెడలో ఉన్న ఆ గులాబీమాలను తీసి ఆ పండితుని మెడలో వేసారు.
అంతే!క్షణంలోనే శ్రీనాథ్జీ మెడ సరిగా నిలిచింది. కళ్ళు విశాలంగా విప్పి, తన ప్రియభక్తుణ్ని ప్రేమగా చూస్తూ, చిరునవ్వుతో మళ్లీ స్థిరంగా నిలిచారు.
-----
అగణితవైభవ కేశవ
నగధర వనమాలి యాది నారాయణ యో
భగవంతుఁడ శ్రీమంతుఁడ
జగదీశ్వర శరణు శరణు శరణము కృష్ణా!
-----
గోవర్ధనగిరిధార గోవింద - గోకులబాలక పరమానంద!
శ్రీ వత్సాంకిత శ్రీ కౌస్తుభధర - భావకభయహర పాహి ముకుంద!
- శంకరకింకరః
Monday, May 25, 2026
బృందావన కథలు - 7 (పూలబ్బి - ఠాకూర్ మిత్రుడు)
జై శ్రీ రాధే కృష్ణ
బృందావనంలో కన్నయ్య లీలలు నేర్పించే జీవితపు పాఠాలు అద్భుతమైనవి. భక్తుల గుండెల్లో నిలిచి, జీవితాలనే మార్చేవిగా ఉంటాయి. అలాంటి లీలలలో ఒకటి ఇది.
మనము భగవంతుణ్ణి చూడడం చాలా కష్టం—అది కోటికో ఒక్కరికి లభించే అదృష్టమని భావిస్తాం. ఆ భగవంతుడితో మాట్లాడటం మన వల్ల అయ్యే పని కాదనుకుంటాం. సరే, అవి నిజమే అనుకున్నా… భగవంతుడితో స్నేహం చేయడం, అతని మిత్రుడిగా మారడం, అతని స్నేహాన్ని ఆస్వాదించడం ఎంతో సులభమని బృందావనంలో చెప్పుకునే ఈ కథ ద్వారా తెలుస్తుంది.
బృందావనంలో బాంకేబిహారీ ఆలయం ఎప్పుడూ భక్తుల రాకతో పెళ్లివారిల్లులా కళకళలాడుతూ ఉంటుంది. బయట భోగ్ సమర్పించడానికి మిఠాయి దుకాణాలు, వస్త్రాల దుకాణాలు, పూజా సామగ్రి దుకాణాలు ఉంటాయి. తిరుగుతూ అమ్మేవాళ్లూ ఉంటారు.
ఒకనాటి మధ్యాహ్నం, ఒక యువకుడు బాంకేబిహారీ దర్శనానికై వచ్చి, బయట ఉన్న మిఠాయి దుకాణంలోకి వెళ్లాడు. దుకాణదారుడు అతనికి తాజా మిఠాయిలు, పేడాలు చూపించాడు. ఆ యువకుడు వాటిని చూసి, “ఇవి బాంకేబిహారీ ఠాకూర్‌కు సమర్పిస్తే బాగుంటుంది” అనుకుని, ఒక్కో కిలో చొప్పున కట్టమన్నాడు. దుకాణదారుడు తూకం వేస్తూ ఉండగా, యువకుడు బయట జరుగుతున్న దృశ్యాలను గమనిస్తున్నాడు.
ఒక చిన్న పిల్లవాడు పూలమాలలు అమ్ముతున్నాడు. దర్శనానికి వచ్చే భక్తుల దగ్గరకు పరిగెత్తి వెళ్లి, మళ్లీ వెనక్కి పరిగెత్తుకొస్తున్నాడు. కొందరు మాలలు కొనుగోలు చేస్తున్నారు, మరికొందరు కాదు. అయినా పిల్లవాడు ఆగకుండా తిరుగుతూనే ఉన్నాడు.
యువకుడికి ఆశ్చర్యంగా అనిపించింది. మరింత నిశితంగా గమనించాడు. ఆ పిల్లవాడికి చెప్పులు లేవు. మిట్టమధ్యాహ్నం కావడంతో నేల మండుతోంది. అతను వేడిని తట్టుకోలేక, పరిగెత్తి వెళ్లి మాల అమ్మి, తిరిగి నీడలోకి వచ్చి కాళ్లను చల్లబరుచుకుంటున్నాడు.
ఈ దృశ్యం చూసి యువకుడు చలించిపోయాడు. మిఠాయి కట్టడాన్ని కాసేపు ఆపమని చెప్పి, పక్కనే ఉన్న చెప్పుల దుకాణానికి వెళ్లి ఒక జత చెప్పులు కొనుక్కొచ్చాడు.
పిల్లవాడి దగ్గరకు రాగానే, ఆ పిల్లవాడు “పూలమాల కావాలండీ, మంచి పూలదండ ఠాకూర్‌కి సమర్పించండి” అంటూ వేడుకుంటున్నాడు.
అప్పుడు యువకుడు, “తప్పకుండా కొంటాను, కానీ ముందు ఈ చెప్పులు వేసుకో” అంటూ చెప్పులు ఇచ్చాడు.
పిల్లవాడు చెప్పులు వేసుకుని, కళ్లలో నీళ్లు తెప్పించుకుని, తల ఎత్తి ఆ యువకుణ్ణి చూశాడు. గిరిజాల జుట్టు, పసుపు బట్టలు చూసి ఆశ్చర్యంగా అడిగాడు:
“నువ్వు కృష్ణుడివి కదా?”
యువకుడు నవ్వుతూ, “లేదు బాబూ, నేను కృష్ణుణ్ణి కాదు” అన్నాడు.
కానీ పిల్లవాడు ఒప్పుకోలేదు. ఆలయ ద్వారం వైపు చూస్తూ, మళ్లీ యువకుడిని చూస్తూ,
“కాదు, నువ్వే కృష్ణుడివి—ఒప్పుకో!” అన్నాడు.
యువకుడు మళ్లీ, “నేను కృష్ణుణ్ణి కాదు బాబూ” అన్నాడు.
పిల్లవాడు కన్నీళ్లు పెట్టుకుని, “నువ్వే కృష్ణుడివి. నేనెవరికీ చెప్పను. నన్ను మోసం చేయకు” అంటూ అతని నడుము పట్టుకుని ఆప్యాయంగా అంటిపెట్టుకున్నాడు.
యువకుడు మృదువుగా, “నేను కృష్ణుణ్ణి కాదు బాబూ” అని మళ్లీ చెప్పాడు.
అప్పుడు పిల్లవాడు కన్నీళ్లు తుడుచుకుంటూ,
“నువ్వు కృష్ణుడివి కాకపోతే… నాకు చెప్పులు ఎలా ఇచ్చావు?” అని అడిగాడు.
యువకుడు కాసేపు ఆలోచించి,
“కృష్ణుడు చెప్పాడు కాబట్టే ఇచ్చాను” అన్నాడు.
అప్పుడా పిల్లవాడు ఆనందంతో చెప్పాడు:
“నిన్ననే నేను కృష్ణుడిని అడిగాను—ఈ ఎండల్లో చెప్పులు లేక ఇబ్బంది పడుతున్నాను, ఒక జత చెప్పులు ఇప్పించమని. ఇప్పుడు నువ్వు ఇచ్చావు… అంటే కృష్ణుడికి నువ్వు చాలా దగ్గర మిత్రుడివి కదా!”
అని చెప్పి అతని పాదాలపై పడబోయాడు. యువకుడు వెంటనే అతన్ని లేపి, కౌగిలించుకున్నాడు.
ఇద్దరి కళ్లలో నీళ్లు. ఇద్దరూ ఆలయం వైపు చూస్తున్నారు.
పిల్లవాడు—తన కోరిక తీర్చినందుకు ఆనందంతో…
యువకుడు—చేసిన చిన్న సహాయం తనను ఠాకూర్ మిత్రుడిగా నిలబెట్టిందనే కృతజ్ఞతతో…
జై బాంకేబిహారీ కన్నయ్యా లాల్ కీ
రాధే రాధే – రాధే కృష్ణ
— శంకరకింకరః
బృందావన కథలు - 6 (మోర్కుటి లీల - నెమళ్ళ నృత్యపు లీల)
జై రాధే కృష్ణ
బృందావనానికి సమీపంలో ఉన్న పవిత్ర బర్సానా గ్రామం రాధారాణి నివాసస్థలం. ఆ ప్రాంతంలోని గహ్వర వనం దట్టమైన, మధురమైన రహస్యలీలలకు నిలయంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ రాధా–కృష్ణులు నిత్యం కలుసుకుని విహరిస్తూ ప్రేమరసాన్ని విరజిల్లిస్తుంటారు. ఈ వనమధ్యంలో ఒక చిన్న సరస్సు ఇప్పటికీ దర్శనమిస్తూ, వారి లీలలకు సాక్ష్యంగా నిలిచింది. ఆ సరస్సు ఒడ్డున ఇప్పటికీ ఎన్నో దివ్యస్మృతులు పరిమళిస్తూనే ఉన్నాయి.
రాధారాణి తన ప్రియ సఖులైన లలిత, విశాఖ, చిత్ర, చంపకలత, తుంగవిద్య, ఇందులేఖ, రంగదేవి, సుదేవి లతో కలిసి ఈ వనంలో విహరిస్తూ, ఆటలాడుతూ, నృత్యగీతాలతో ఆనందంగా కాలం గడిపేది. ఆ అష్టసఖులు రాధారాణికి అత్యంత సన్నిహితులు — ఆమెను సింగారించటం, సరదాగా మాట్లాడటం, కావలసినవి తెచ్చిపెట్టటం, కలిసి ఆటలాడటం, నృత్యం చేయటం, పాటలు పాడటం — ఇవన్నీ వారి సేవలో భాగం.
ఒక పౌర్ణమి సాయంత్రం రాధారాణి తన మనసులో ఒక మధురమైన కోరిక కలిగించుకుంది — “ఈ రోజు నా సింగారం కృష్ణుడే చేయాలి” అని. కానీ ఈ విషయం సఖులకు చెబితే వారు ఆటపట్టిస్తారనే సిగ్గుతో, ఆ భావాన్ని బయటపెట్టలేదు. సఖులతో కలిసి గహ్వర వనం మధ్యలోని సరస్సు పక్కన ఉన్న ఒక పొదరింట్లో (కుంజంలో) సింగారం కోసం కూర్చుంది, కానీ మనసంతా కృష్ణుడిపైనే ఉంది.
సర్వజ్ఞుడైన కృష్ణుడికి అది తెలియక మానదు. సరిగ్గా సాయంత్రం, రాధారాణి సింగారానికి సిద్ధమవుతున్న సమయంలో, ఆయన అక్కడికి చేరుకున్నాడు. రాధ ఎక్కడుందని అడిగితే, సఖులు కొంటెగా నవ్వుతూ — “లోపల నీకోసమే సింగారమవుతోంది” అని చెప్పి పక్కకు వెళ్లిపోయారు.
కృష్ణుడు మెల్లగా తీగలతో ఉన్న తెరను తొలగించి లోపలికి వెళ్లాడు. కృష్ణుణ్ణి చూసిన వెంటనే రాధారాణి బుగ్గలు మరింత ఎర్రగా మెరిశాయి. కృష్ణుని కళ్ళు ఆనందంతో తడిసిపోయాయి. ఆయన ఎంతో ప్రేమతో రాధారాణిని సింగారించాడు — చందనం అలంకరించాడు, బొట్టు పెట్టాడు, కస్తూరి తిలకం, కాశ్మీర తిలకం దిద్దాడు, నుదుటన తెల్ల - పచ్చ చదనాలతో పత్రలేఖ దిద్దాడు, కళ్ళకు కాటుక పెట్టాడు. జడ వేసి పువ్వులు తురిమాడు, తల ఆభరణాలు అమర్చాడు, చెవులకు దుద్దులు, ముక్కుకు ముత్యాల నత్తు పెట్టాడు, ముసుగు సరిచేశాడు. చేతులకు అల్తాతో పుష్పలతలు చిత్రించి, మణులు పొదిగిన బంగారు గాజులు తొడిగాడు. అనంతరం ఆమె పాదాలను తన ఒడిలో పెట్టుకుని పారాణి అద్దాడు.
ఇద్దరూ కలిసి బయటకు వచ్చి గహ్వర వనం సరస్సు ఒడ్డున కూర్చొని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆ ప్రశాంత వాతావరణంలో రాధ మృదువుగా అడిగింది
“కృష్ణా! నేను నీకు ఎలా కనిపిస్తున్నాను?”
కృష్ణుడు ప్రేమతో
“రాధా! నీవు ఆకాశంలో వెన్నెలలు వెదజల్లే చంద్రబింబంలా ఉన్నావు” అని అన్నాడు.
ఆ మాట రాధారాణి మనసుకు కొంచెం బాధ కలిగించింది. తన పక్కనే ఉండి చంద్రుణ్ణి చూసి పోల్చడం ఆమెకు అలక తెప్పించింది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. కృష్ణుడు వెంటపడినా, ఆమె కనిపించలేదు. “రాధా… రాధా…” అని ఆర్తిగా వెతుకుతుండగా, లలిత సఖి కనిపించి — “ఆమె మయూరకూటిలో ఉంది” అని తెలిపింది.
మయూరవనంలో నెమళ్ళు రాధను చూసి ఎప్పుడూ పురి విప్పి నాట్యం చేస్తాయి. కానీ ఆ రోజు రాధకు ఆనందం కలగలేదు. కృష్ణుడి విరహంతో ఆమె మనసు నిండిపోయింది. కృష్ణుడు అది చూసి బాధపడి, తానే ఒక అందమైన నెమలిగా మారి, నెమళ్ళ మధ్యలో చేరి అద్భుతంగా నాట్యం చేయసాగాడు. “రాధా… రాధా…” అనేలా మధురధ్వని చేస్తూ నాట్యం చేశాడు.
ఆ నాట్యాన్ని చూసి రాధ ఆశ్చర్యపోయింది. ఆ నెమలిని దగ్గరకు తీసుకొంది, ఆ నెమలి ఇంకా ఇంకా ఆనందంతో నృత్యం చేస్తోంది. కానీ మిగతా నెమళ్ళు ఆ నాట్యానికి సరితూగలేక ఓటమితో దిగులుగా నిలిచిపోయినట్టు ఆమె గమనించింది. తన వారి బాధలను, కష్టాలనే చూడలేదు రాధమ్మ. ఆవనంలో తనను సంతోషపెట్టే నెమళ్ళ బాధను చూడలేకపోయింది. వెంటనే రాధకు జరిగిందేమిటో అర్థం అయ్యింది,ఆ నెమలి ఎవరో తెలిసింది, తనకోసం కృష్ణుడు పడుతున్న విరహం అర్థమైంది. ఇటు తన వనంలో నెమళ్లను గెలిపించాలని తలపుకూడా వచ్చి తాను కూడా ఒక బంగారు నెమలిగా మారి, వాటి తరఫున నాట్యం చేయడం ప్రారంభించింది.
అది ఒక అపూర్వ దృశ్యం —
కృష్ణుడు నెమలిగా నాట్యం… రాధకోసం
రాధ బంగారు నెమలిగా నాట్యం… కృష్ణునికోసం
చుట్టూ నెమళ్ళ సమూహం ఆనందంతో నాట్యం… రాధాకృష్ణులకోసం నెమళ్ళు.
ప్రకృతి అంతా పులకరించింది. రెండు దివ్య నెమళ్ళు పరస్పరం దగ్గరగా, దూరంగా, గాల్లో ఎగిరి, రంగురంగుల ఈకలను విప్పి అద్భుత విన్యాసాలతో నాట్యం చేశాయి మిగిలిన నెమళ్ళన్నీ ఈ రెండు దివ్య నెమళ్ళ చుట్టూ పురివిప్పి తిరుగుతూ అమోఘమైన నృత్యం చేస్తూ తలలు పైకెత్తి ఖ్రేంకణాలు చేస్తున్నాయి. ఆ సమయంలో ఆకాశంలో ఆ నెమళ్ళ ధ్వని “రాధా–కృష్ణా! రాధా–కృష్ణా..” అని మారుమ్రోగింది.
రాధా వదన విలోకన వికసిత వివిధ వికార విభంగం,
జల నిధిమివ విధు మండల దర్శన తరళిత తుంగ తరంగమ్!
హరిమేక రసం చిరమభిలషిత విలాసం,
సా దదర్శ గురు హర్ష వశంవద వదనమనంగ నివాసమ్!!
(జయదేవ)
ఈ మయూరకూటి లీలను స్మరించుకుంటూ బర్సానాలో ఇప్పటికీ భక్తులు నృత్యాలు చేస్తుంటారు. ఆ దివ్య స్థలాలను దర్శించే వారికి ఆ లీలామాధుర్యం హృదయంలో సజీవంగా నిలుస్తుంది.
రాధే కృష్ణ!
Wednesday, May 20, 2026
బృందావన కథలు - 5 (కాలే ఖాన్ భక్తి )
శ్రీ రాధే కృష్ణ
రాజస్థాన్‌లోని కరోలీ అనే పుణ్యక్షేత్రంలో, మదనమోహన్ ఆలయం సమీపంలో కాలే ఖాన్ అనే పోస్టుమాన్ జీవించేవాడు. అతను వేరే మతానికి చెందినవాడైనా, అతని హృదయం మాత్రం సున్నితమైనది, నిర్మలమైనది.
ఒక రోజు అతని చేతికి ఒక విచిత్రమైన ఉత్తరం వచ్చింది — మదనమోహన్ పేరుతో, ఆలయ చిరునామాతో. కాలేఖాన్ ఆలయ ద్వారం వద్దకు చేరి గోస్వామి గారిని పిలిచాడు.
“ఇక్కడ మదనమోహన్ గారు ఎవరు?” అని వినయంగా అడిగాడు.
గోస్వామి గారు చిరునవ్వుతో, “మన ఠాకూరే మదనమోహన్. భక్తులు ఆయనకు ఉత్తరాలు రాస్తుంటారు,” అని సమాధానమిచ్చారు.
ఆ సమయంలో గుమ్మం లోపల నుండి ఒక దివ్య కాంతి మెరిసింది. ఆ కాంతిలో — క్షణకాలం — మోహనమూర్తి దర్శనమిచ్చింది. ఆ రూపం కాలే ఖాన్ హృదయంలో చెరిగిపోని ముద్ర వేసింది.
అది ఒక చూపే అయినా — అది అతని జీవితం మారడానికి సరిపోయింది.
దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో, వారి హృదయంలో తనపై విరహాన్ని పెంచుతాడు.
కాలే ఖాన్ హృదయంలో అదే విరహం మొదలైంది.
ఆ రోజు నుంచి కాలే ఖాన్ మనసులో ఒక కొత్త తపన మొదలైంది. మదనమోహనుని మరలా చూడాలని, ఆ మాధుర్యాన్ని మళ్లీ ఆస్వాదించాలని అతని అంతరంగం కోరుకుంది. కానీ అతనికి ఆలయంలోకి ప్రవేశం లేదు. మత పరిమితులు అతన్ని బయటే నిలిపేశాయి.
అయినా ప్రేమ మార్గం ఆగదుగా...
కొన్ని రోజులు గడిచాయి. ఆ ఉత్తరాలు రాక కూడా ఆగిపోయింది. అప్పుడు కాలే ఖాన్ ఒక ఉపాయం ఆలోచించాడు. తానే ఉత్తరాలు రాసి, అవి వచ్చినట్టు తీసుకెళ్లి గోస్వామి గారికి అందించేవాడు. ఆ సందర్భంలో ఆలయ గుమ్మం వద్ద నిలబడి, లోపల కనిపించే మదనమోహనుని కొద్ది లఘు దర్శనంతో తన మనసును నింపుకునేవాడు.
అది ఒక భక్తుని సాహసమా? లేక ప్రేమలోని అమాయకత్వమా? — చెప్పడం కష్టం.
ఒక రోజు అతని హృదయం మరింత మధురమైన ఆర్తితో నిండిపోయింది.
“స్వామీ! నేను లోపలికి రాలేను. కానీ నువ్వు బయటికి రావచ్చు కదా!” అని అతను మృదువుగా ప్రార్థించాడు.
నీ సంపూర్ణ దర్శనం కావాలి అని అతను అన్నపానీయాలను మానేశాడు. “నువ్వు దర్శనం ఇచ్చే వరకు నేను తినను, మంచినీళ్లు కూడా తాగను” అని సంకల్పం చేసుకున్నాడు.
రెండుమూడు రోజులు గడిచాయి… శరీరం బలహీనమైంది… కానీ తపన మాత్రం మరింత బలపడింది.
ఒక నాటి అర్థ రాత్రి — నిశ్శబ్దంలో ఒక అద్భుతం జరిగింది.
ఒక బాలుడు అతని ముందుకు వచ్చాడు. మేఘశ్యామల వర్ణం, పెద్ద కన్నులు, తలపై నెమలిపింఛం, పీతాంబరం — ఆ రూపం మాటల్లో చెప్పలేనిది. అతని చేతిలో పాయసం ఉన్న గిన్నె ఉంది.
“కాలే ఖాన్! నీకోసం తెచ్చాను, తిను ” అని బాలుడు మృదువుగా అన్నాడు.
ఆ క్షణంలో కాలే ఖాన్ హృదయం కరిగిపోయింది. మదనమోహనుడి చేతితో పాయసం స్వీకరించి, ఆ బాలుణ్ణి కౌగిలించుకుని ఆనందభాష్పాలతో తడిసిపోయాడు.
ఆ బాలుడు — స్వయంగా శ్రీకృష్ణుడే.
మరుసటి ఉదయం ఆలయంలో కలకలం చెలరేగింది. నైవేద్యానికి ఉంచిన పాయసం గిన్నె కనిపించలేదు. అందరూ ఆశ్చర్యంతో మాట్లాడుకున్నారు.
ఆ సమయంలో కాలే ఖాన్ ఆ గిన్నెతో ఆలయానికి వచ్చి, జరిగినది అన్నీ వివరంగా చెప్పాడు.
భక్తులు, ఊరి ప్రజలు ముందు సందేహించారు, తరవాత మదనమోహనుని లీలలు తెలిసినవారు కావడంచేత ఆశ్చర్యచకితులైయ్యారు. ఇది మదనమోహనుడి లీలే అని గ్రహించారు.
కాలే ఖాన్ హృదయంలో ఒక కోరిక కలిగింది — “ఇక్కడే సేవ చేయాలి.”
కానీ అతను అన్య మతస్థుడవడం వల్ల ఆలయ నియమాల వల్ల అతన్ని ఆలయం లోపలికి అనుమతించలేకపోయారు. కాబట్టి అతనికి ఆలయం బయట ప్రాంగణం శుభ్రం చేసే సేవ అప్పగించారు.
అతను ఆనందంగా అంగీకరించాడు.
రోజులు గడిచాయి. అతని భక్తి మరింత లోతుగా మారింది. కానీ ప్రపంచం మాత్రం అతన్ని అర్థం చేసుకోలేదు. అతని మతస్తులు విమర్శించారు కాఫిర్లకు సేవ చేస్తున్నావ్ అని నిందించారు, అందుకే నీకు సంతానంలేదు అని హేళన చేసారు.. అతని భార్య కూడా బాధతో అతన్ని నిందించింది, తన మతస్థులను సమర్థించింది.
ఒక రోజు కాలే ఖాన్ మదనమోహనుడితో
“స్వామీ! నాకు ఒక సంతానం ఇవ్వు, వీళ్ల నోళ్లు మూయించు.” అని వేడుకున్నాడు
కొద్ది కాలంలో అతనికి కుమారుడు పుట్టాడు. తన మతం వాళ్ళు అల్లా మెహర్బాన్ అన్నారు, ఇతను కృష్ణుని లీల అన్నాడు, ఆనందంతో గుడిద్వారం బైట నుంచుని పదాలు పాడుతూ కొద్దిగా కనిపిస్తున్న శ్రీ కృష్ణుణ్ణి చూస్తూ భజన చేస్తూ గడుపుతున్నాడు.
కాలం గడిచింది. ఆ బాలుడు పెరిగాడు.
ఒక రోజు — విధి మరో పరీక్షను తీసుకువచ్చింది.
ఆ బాలుడిని పాము కాటేసింది.
కాలే ఖాన్ భార్య భయంతో పరుగెత్తుకుంటూ వచ్చి,
“ఇక్కడ గుళ్ళో భజన చేస్తూ కూర్చున్నావా అక్కడ నాకొడుకును పాము కరిచిది త్వరగా వైద్యుణ్ణి తీసుకురా! ఆలస్యం చేసావో... నాకొడుక్కేదైనా ఐతే నీ సంగతి నీ కృష్ణుడి సంగతి చూస్తాను” అని అరిచింది.
కానీ కాలే ఖాన్ — మదనమోహనుని నామస్మరణలో లీనమైపోయాడు. ఆలస్యంగా వైద్యుణ్ణి తీస్కెళ్లాడు.
చివరకు వైద్యుడు వచ్చేసరికి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
వేదనతో అతని భార్య బాలుణ్ణి ఎత్తుకుని వీధులవెంట పరుగెడుతోంది ఆలయం వేపు, ఆవెనక కాలేఖాన్ వాళ్ళవెనక ఊరిజనాలు వస్తున్నారు . ఆమె తన కొడుకును ఆలయ గుమ్మం ముందు పెట్టి,
“నా కొడుకు బ్రతకాలి! లేకపోతే నిన్నూ ఉండనివ్వను!” అని విలపించింది.
ఆ సమయంలో కాలే ఖాన్ నిశ్చలంగా నిలబడి — కన్నీళ్లు కారుస్తూ — చిరునవ్వుతో ఇలా అన్నాడు:
“ప్రభూ! నేను వేరే మతానికి చెందినవాడిని.
కానీ నువ్వు జగన్నాథుడివని అందరూ అంటారు.
ఈ సత్యాన్ని నిరూపించు!” అంటూ
"దయగలవాడా, కరుణామయుడా, ఈ జగత్తులో ఉన్న శ్రేష్ఠుడా,
నన్ను వంటి పేదవారి పాపాలను క్షమించు.
కాలే ఆతురతతో నీ దర్వాజా ముందు నిలబడి ఉన్నాడు,
నంద కుమారుడా, ఈసారి కొంచెం దయ చూపించు.
హిందువుల దేవుడివే ఐతే నిన్ను నిలదీయడానికొ మాకు ఎలాంటి హక్కు లేదు
కాని జగత్తుకే నాథుడివైతే, మాపై కూడా దృష్టి సారించు కనికరించవా! జగమ్నాథా! మదనమోహనా!"
అని ప్రార్థించాడు. ఈ అర్థం వచ్చేలా పాడాడు.
అప్పుడు అతని కన్నీటి చుక్క బాలుడిపై పడింది…
ఒక్క క్షణం తర్వాత — అద్భుతం!
బాలుడు ఒక్కసారిగా లేచాడు!
“అమ్మా! నా స్నేహితుడు ఎక్కడ?” అని అడిగి, లేచి అటూ ఇటూ వెతికేసుకుంటున్నాడు.
“ఎవడు?” అని ఆశ్చర్యంతో అడిగితే,
“గిరిజాల జుట్టు ఉన్న ఒక బాలుడు… నాతో ఆడుకుంటున్నాడు సాయంత్రం నుంచీ, ఇప్పుడు మీరందరూ వచ్చారు తను ఎటోవెళ్ళిపోయాడు…” అన్నాడు.
అందరూ ఆశ్చర్యపోయారు...
కాలే ఖాన్ ఆనందభాష్పాలతో,
“స్వామీ! నా పిల్లాడితో స్నేహితుడిలా ఆడుకున్నావా! ఈ జగత్తే నీ లీల, అది నీకో ఆటకదా ! జగన్నాథా !” అంటూ, కనుకొనల్లోంచి నీరు ధారగా ప్రవహిస్తున్నా, గానం చేస్తూ ఆ మదనమోహన రూపాన్నే చూస్తూ ఉండిపోయాడు.
----
ఆ రోజు నుంచి కాలే ఖాన్ కేవలం ఒక పోస్టుమాన్ కాదు…
అతను కృష్ణభక్తుల చరిత్రలో ఒక చిరస్మరణీయ వ్యక్తిగా మారాడు.
ఇప్పటికీ కరోలీ ప్రాంతంలో, మదనమోహనుని లీలల్లో ఈ కథను భక్తులు ఆవేదనతో, ఆనందంతో స్మరించుకుంటారు. రాజస్థాన్‌లోని మేవార్ ప్రాంతాన్ని తన భక్తులకోసం కృష్ణుడే మరో బృందావనంగా ఎంచుకున్నాడని భక్తుల విశ్వాసం ఆ ప్రాంతాన్ని గుప్త బృందావనా పిలుస్తారు.
శ్యామ సుందర్ మదన మోహన్ బాఁసురి వాలే
తూ న సంభాలే తో హమే కౌన్ సంభాలే?
జై మదన మోహన్ - రాధా మోహన్
జై మదన మోహన్ - రాధా మోహన్
-శంకరకింకరః