జై రాధే కృష్ణ
తాన్‌సేన్ అందరికీ తెలిసిన ప్రముఖ సంగీత విద్వాంసుడు. ఆయన గురువు హరిదాస్ స్వామి. హరిదాస్ గారు బృందావనంలో ఉండి బాంకే బిహారీ మందిరంలో బాంకే బిహారీ స్వామివారికి సేవ చేసుకునేవారు. బృందావనంలోని నిధివనంలో ప్రత్యక్షమైన బాంకే బిహారీ స్వరూపం, హరిదాస్ గారి గానమాధుర్యానికి ముగ్ధుడైన శ్రీకృష్ణుడి కరుణకు నిదర్శనమని భక్తులు విశ్వసిస్తారు. నేటికీ హరిదాస్ గారి భక్తికి అక్కడి ఠాకూర్ కృష్ణ కన్హయ్య మూర్తి తార్కాణంగా నిలిచింది.
వారి జీవితంలో జరిగిన ఒక మధురమైన కథ.
ఒక రోజు హరిదాస్ గారు ఆలయం దగ్గర ఒక చెట్టు కింద కూర్చుని ధ్యానంలో మునిగిపోయి ఉన్నారు.
అప్పుడే దూర ప్రాంతం నుండి ఒక ధనిక వ్యాపారి వచ్చాడు. ఆ రోజు స్వామివారి సేవలో సమర్పించేందుకు ఎన్నో ఉపహారాలు తీసుకొచ్చాడు. వాటిలో ఎంతో విలువైన, అపూర్వ సువాసన గల ఒక ఖరీదైన అత్తరు సీసా కూడా ఉంది.
అతను ఆలయానికి చేరుకునే సరికి లోపల స్వామివారి సేవలు జరుగుతున్నాయి. పరదా వేసి ఉంది. దర్శనం గురించి అడగగా, అక్కడి వారు మర్యాదగా ఇలా చెప్పారు:
“స్వామివారి సేవ ప్రారంభమైంది. ఇప్పుడు దర్శనం కుదరదు. ఈ సమర్పణలను కూడా ఇప్పుడు వినియోగించలేము. సాయంత్రం సేవకి తీసుకురండి.”
అది విని వ్యాపారి వేడుకుంటూ,
“నేను సాయంత్రానికి వెళ్లిపోవాలి. చాలా దూరం నుండి స్వామివారి సేవకోసమై, వారి దర్శనార్థం వచ్చాను,” అన్నాడు.
కానీ ఆలయ నియమాలకు విరుద్ధంగా చేయలేమని వారు వినయంగా చెప్పారు. చేసేదేమీ లేక వ్యాపారి నమస్కరించి వెనక్కి తిరిగాడు.
అప్పుడు అక్కడ చెట్టు కింద ధ్యానంలో ఉన్న హరిదాస్ గారిని చూసి, “వీరు ఎవరు?” అని అడిగాడు. అక్కడి వారు, “వీరు శ్రీకృష్ణుని పరమభక్తుడు హరిదాస్ స్వామి” అని చెప్పి వారి గొప్పతనం గురించి చెప్పారు.
వెంటనే వ్యాపారి హరిదాస్ గారి దగ్గరకు వెళ్లి తాను తెచ్చిన సమర్పణలను వారి ముందుంచాడు. అందులోని అత్తరు సీసాను చేతిలోకి తీసుకుని ఇలా అన్నాడు:
“బాబా! ఈ ప్రత్యేకమైన అత్తరును స్వామివారి శృంగార సేవ కోసం తెచ్చాను. కానీ ఇప్పుడు వినియోగించలేమన్నారు. మీరు దయచేసి మాపటి సేవలో దీనిని ఉపయోగించేలా చూడండి.”
హరిదాస్ గారు మాత్రం ధ్యానంలోనే ఉన్నారు. ప్రశాంతంగా చిరునవ్వు నవ్వుతూ తమ మనసులో బాంకే బిహారీనే దర్శిస్తున్నారు.
అప్పుడే ఆయన ఆ అత్తరు సీసాను తీసుకుని, మూత తీసి, అందులోని అత్తరును కొద్దికొద్దిగా నేలపై చల్లసాగారు. కొద్దిసేపట్లో మొత్తం అత్తరు నేలలో కలిసిపోయింది.
అది చూసిన వ్యాపారి దిగ్భ్రాంతికి గురయ్యాడు. అంత విలువైన అత్తరు నేలపాలైందన్న బాధతో కళ్లలో నీళ్లు వచ్చాయి. పక్కన ఉన్నవారు అతనికి,
“హరిదాస్ గారిని ఏమీ అనకండి. జరిగినది జరిగిపోయింది. కొద్దిసేపటికి దర్శనం మొదలవుతుంది. వెళ్లి స్వామివారిని దర్శించండి,” అన్నారు.
వ్యాపారి ఆలయానికి వెళ్లి దర్శనం కోసం ఎదురుచూశాడు.
కొంతసేపటికి పరదా తొలగించారు.
అంతే!
బాంకే బిహారీ స్వామివారి దివ్య అలంకరణతో పాటు, అపూర్వమైన అత్తరు పరిమళం ఆలయం అంతా వ్యాపించింది. ఆ సువాసన ఎంతో మధురంగా, దివ్యంగా ఉంది.
వ్యాపారి ఆశ్చర్యంతో స్వామివారి పాదాలకు నమస్కరించాడు. తాను తెచ్చిన అత్తరు వాసనే స్పష్టంగా వస్తోంది.
అతను వెంటనే అక్కడి గోస్వాములను అడిగాడు:
“ఈ రోజు ప్రత్యేకంగా ఏ అత్తరు వాడారు?”
వారు ఆశ్చర్యంగా,
“ఏమీ ప్రత్యేకం కాదు. ప్రతిరోజూ వాడేదే వాడాము. కానీ ఈ రోజు ఈ సువాసన మాత్రం అద్భుతంగా ఉంది,” అన్నారు.
ఇది విన్న వ్యాపారి వెంటనే హరిదాస్ గారి వద్దకు పరుగెత్తి వెళ్లి నమస్కరించి ఇలా అడిగాడు:
“బాబా! నేను తెచ్చిన అత్తరును మీరు నేలపై పోశారు. కానీ అదే పరిమళం ఇప్పుడు స్వామివారి వద్దనుంచి వస్తోంది. ఇది ఎలా జరిగింది?”
అప్పుడు హరిదాస్ గారు చిరునవ్వుతో ఇలా చెప్పారు:
“నేను ధ్యానంలో ఉండగా రాధా–కృష్ణులు వసంతాలాట ఆడుతున్నారు. ఒకవైపు కృష్ణుడు, గోపబాలురు; మరోవైపు రాధారాణి, సఖులు. నేను రాధారాణి పక్షంలో ఉన్నాను.
చాలాసేపు వసంతాలాట జరిగిన తరువాత, కృష్ణుని వద్ద ఇంకా రంగులు ఉన్నాయి. కానీ రాధారాణి పక్షంలో అయిపోయాయి. అప్పుడు నేను ఒక సీసా ఇచ్చాను. ఆ సీసాలోని ద్రవ్యాన్ని తీసుకుని రాధారాణి పక్షంలోని వారంతా కృష్ణునిపై చల్లి మళ్లీ వసంతాలాట ఆడాము.
బహుశా అది నువ్వు ఇచ్చిన అత్తరు సీసానే కావచ్చు. రాధారాణీ ఆ ద్రవ్యాన్ని ఠాకూర్ మీద పూర్తిగా పోసేసింది, అందుకే ఇప్పుడు బాంకే బిహారీ వస్త్రాలు, ఆలయం అంతా ఆ పరిమళంతో నిండిపోయాయి.”
అని చెప్పి హరిదాస్ గారు ప్రేమగా ఇలా ఉపదేశించారు:
“నాయనా! ఆ ఠాకూర్ సేవలో తరించి నీ జీవితాన్ని ధన్యం చేసుకో. నువ్వు భగవంతుని కోసం ఎంత తపనపడతావో, భగవంతుడు కూడా నీ కోసం అంతే తపనపడతాడు. నిష్కపటమైన భక్తితో, స్వార్థం లేకుండా ఆయనను ఎలా ఆశ్రయిస్తావో, భగవంతుడు కూడా అలాగే నీకు అనుగ్రహిస్తాడు. నువ్వాయనను ఎలా చూడాలనుకుంటావో నీకలాగే దర్శనమిస్తాడు ”
--
కరుణ కరో - కష్ట్ హరో - జ్ఞాన్ దో భగవన్,
భవ మేఁ ఫంసీ నావ్ మేరీ తార్ దో భగవన్
కరుణ కరో - కష్ట్ హరో - జ్ఞాన్ దో భగవన్,
రాధే కృష్ణ్ రాధే కృష్ణ్ రాధే కృష్ణ్... రాధే...
-శంకరకింకరః
No comments:
Post a Comment