జై గురు దత్త! జై గురు దత్త!
భక్తవత్సలా! మాం పాహి!
ఒకానొక సమయంలో దత్తాత్రేయ స్వామివారికి పరమభక్తుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ ఎంతో నియమనిష్టలతో పూజ చేసేవాడు. ఉదయం లేచి స్నానం సంధ్యా చేసి, దత్తాత్రేయుని విగ్రహానికి అభిషేకం చేసి, పూలతో అలంకరించి, నైవేద్యం సమర్పించి, నిరతమూ దత్త జపం చేసేవాడు.
అతని మనసులో తీరని ఒక కోరిక మాత్రం బలంగా ఉండేది. "స్వామీ! ఒక్కసారి ప్రత్యక్ష దర్శనం ఇవ్వండి."
రోజూ ఇదే ప్రార్థన.
నెలలు గడిచాయి...
సంవత్సరాలు గడిచాయి...
కానీ దర్శనం మాత్రం కలగలేదు.
ఒక రోజు అతను ఎంతో వ్యాకులతచెంది, "దత్తా! ఇన్ని సంవత్సరాలుగా నీ సేవ చేస్తున్నాను. ఒక్కసారి అయినా నన్ను కరుణించవా?" అని దిగులుగా ప్రార్థించాడు.
ఆ రాత్రి స్వప్నంలో శ్రీ దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షమయ్యారు.
ముఖంలో దివ్యకాంతి...
త్రిమూర్తుల ముఖాలు...
వెనుక కామధేనువు...
చుట్టూ నాలుగు కుక్కలు...
అద్భుతమైన రూపం!
స్వామి చిరునవ్వుతో "నాయనా! రేపు నేను నీ ఇంటికి వస్తాను. ఆతిథ్యం ఇద్దువుగాని." అని చెప్పి అంతర్ధానమయ్యారు.
ఆ బాపడి ఆనందానికి అవధులు లేకపోయాయి. "రేపు స్వామి వస్తున్నారు!" అని ఆ రాత్రంతా నిద్రపోలేకపోయాడు. మరుసటి రోజు తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేశాడు. ముగ్గులతో, మామిడి తోరణాలతో, పూలతో అలంకరించాడు.
అనేక రకాల వంటకాలు తన భార్యతో సిద్ధం చేయించాడు.
పాయసం...
పులిహోర...
లడ్డూలు...
వడలు...
ఒకటేమిటి పంచ భక్ష్య పరమాన్నాలన్నీ సిద్ధం చేశాడు.
మధ్యాహ్నం సమయం అయింది. "ఇప్పుడే స్వామి వస్తారు." అని గుమ్మం దగ్గర ఎదురుచూస్తున్నాడు.
అంతలో ఒక బక్కచిక్కిన ఆకలితో ఉన్న కుక్క ఇంటి గుమ్మం వద్దకు వచ్చింది. అది తోక ఊపుతూ లోపలికి రావాలని ప్రయత్నించింది. బాపడు కోపంగా " ఏయ్ ఛీ! ఛీ! పో! పో! ఇది స్వామివారి కోసం ఎదురుచూస్తుంటే నువ్వేంటే మధ్యలో." అని ఒక కర్ర తీసుకుని దానిని తరిమేశాడు. ఆ కుక్క బాధతో "కుయ్ కుయ్"మంటూ వెనక్కి తిరిగి వెళ్లిపోయింది.
కొంతసేపటి తరువాత ఒక ముసలివాడు వచ్చాడు. అతని బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. అతను చేతులు జోడించి "బాబూ! రెండు రోజుల నుంచి అన్నం తినలేదు. కొంచెం భోజనం పెడతావా?" అని అడిగాడు.
ఈ బాపడు విసుగ్గా " ఇప్పుడే కాదు. నేను స్వామివారి కోసం ఎదురు చూస్తున్నాను, స్వామివారికి నివేదించాక అప్పుడు రా పెడతాను, వెళ్ళు వెళ్ళు" అంటూ గద్దించి పంపేశాడు.
సాయంత్రం అయింది.
రాత్రి అయింది.
కానీ దత్త స్వామి రాలేదు.
భక్తుడి మనసు బాధతో నిండిపోయింది.
ఆ రాత్రి ఏడుస్తూ నిద్రపోయాడు.
స్వప్నంలో మళ్లీ దత్తాత్రేయ స్వామి దర్శనమిచ్చారు.
ఈసారి స్వామి ముఖంలో చిరునవ్వు లేదు.
భక్తుడు వెంటనే అడిగాడు.
"స్వామీ! మీరు వస్తానని మాటిచ్చారు, భార్యకి పిల్లలకి చెప్పి ఇల్లంతా అలంకరించాను, మీ కోసం మంచి వంటలు చేయించాను, కానీ ఇది కలలో మాటే అయ్యింది... మీరు మాత్రం రాలేదు అని భోరుమన్నాడు" కలలో
అప్పుడు దత్త స్వామి ప్రశాంతంగా "నాయనా... నేను రెండు సార్లు వచ్చాను." అన్నారు.
భక్తుడు ఆశ్చర్యపోయి"ఎప్పుడు స్వామీ?" అనడిగాడు
అందుకు బదులిస్తూ దత్తుడు "మొదట ఆకలితో ఉన్న కుక్క రూపంలో వచ్చాను. నువ్వు కర్రతో తరిమేశావు. తర్వాత ఆకలితో ఉన్న వృద్ధుడి రూపంలో వచ్చాను. నువ్వు భోజనం పెట్టకుండా పంపించేశావు." అని అనారు.
భక్తుడి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లైంది. కళ్లలో కన్నీళ్లు ఉబికాయి.
"స్వామీ! నిజంగా మీరేనా? తెలుసుకోలేకపోయాను..." అని బాధగా అడిగాడు.
దత్తుడు మృదువుగా "నాయనా... నన్ను విగ్రహంలో మాత్రమే వెతకకు. ప్రతి జీవిలో నేను ఉన్నాను. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే నాకే పెట్టినట్లే. దాహంతో ఉన్నవాడికి నీళ్లు ఇస్తే నాకే ఇచ్చినట్లే. జీవులసేవే శివునిసేవ. సాటి వారియందు దయయే నిజమైన భక్తి." అని అన్నారు.
భక్తుడు కన్నీళ్లు కారుస్తూ స్వామి పాదాలపై పడ్డాడు. "స్వామీ! ఇప్పటి వరకు నేను పూజ మాత్రమే చేశాను. భక్తి అర్థం తెలుసుకోలేదు." అని పశ్చాత్తాపపడ్డాడు.
ఆ రోజు నుంచి అతని జీవితం మారిపోయింది.
ప్రతీ జీవిలో దత్తుని దర్శించసాగాడు.
తనకున్నదాంట్లో...
ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేశాడు.
జంతువులను ప్రేమించాడు.
పేదలను ఆదుకున్నాడు.
"దత్తాత్రేయుని చేరుకునే మార్గం కేవలం పూజ కాదు... జీవకారుణ్యం.
---
దత్తాత్రేయ స్వామి విగ్రహాల్లో మాత్రమే ఉండరు.
ప్రతి జీవిలో, ప్రతి హృదయంలో ఉంటారు.
ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం,
దాహంతో ఉన్నవారికి నీరు ఇవ్వడం,
బాధలో ఉన్నవారిని ఆదుకోవడం—
ఇవన్నీ దత్తసేవే.
"దయ లేని భక్తి అసంపూర్ణం.
సేవతో కూడిన భక్తే దత్తునికి ప్రియమైనది."
జై గురు దత్త! జై గురు దత్త!
భక్తవత్సలా! మాం పాహి!
జై గురుదత్త!
No comments:
Post a Comment