Pages

Friday, June 19, 2026

శ్రీగురు దత్తాత్రేయ కథలు – 2 (వేటగాని కథ)

జై గురు దత్త! జై గురు దత్త!

భక్తవత్సలా! మాం పాహి!
సహ్యాద్రి పర్వతాల మధ్య దట్టమైన అరణ్యం.
ఎత్తైన వృక్షాలు...
పక్షుల కిలకిలారావాలు...
అడవి జంతువుల సంచారం...
ఆ అడవిలోని ఒక గూడెంలో ఒక వేటగాడు జీవించేవాడు.
అతని జీవితం మొత్తం వేటపైనే ఆధారపడి ఉండేది.
జింకలు, కుందేళ్లు, అడవి పక్షులు...
కనిపించిన ప్రతి జీవిని వేటాడేవాడు.
దయ అంటే ఏమిటో తెలియదు.
పాపం అంటే ఏమిటో తెలియదు.
జీవహింసే అతని వృత్తి.
అదే అతని జీవనం.
తనకు, తన కుటుంబ ఆకలికే కాక, చంపిన జంతువుల మాంసాన్ని, చర్మాన్ని అన్నీ అమ్మేవాడు.
ఒక రోజు ఉదయం అతను విల్లు, బాణాలు తీసుకుని అడవిలోకి వెళ్లాడు. రోజంతా తిరిగినా ఒక్క జంతువు కూడా కనిపించలేదు. ఆకలితో, కోపంతో అతని మనసు మండిపోతోంది. సూర్యుడు అస్తమించబోతున్న సమయంలో ఒక అందమైన జింక కనిపించింది. వేటగాడు సంతోషంతో "ఈయాల యేట దొరికినాది!" అని ఆ జింక లక్ష్యంగా బాణం గురిపెట్టాడు.
అయితే, అతను ఆ బాణం వదలబోతున్న క్షణంలో... జింక అకస్మాత్తుగా పరిగెత్తి కొద్ది పక్కకెళ్ళి ఒక అవధూత వెనుకకు వెళ్లి నిలబడింది.
ఆ అవధూత దిగంబరంగా ఉన్నాడు.
ముఖంలో దివ్యకాంతి.
కళ్లలో అపారమైన కరుణ.
చుట్టూ నాలుగు బలిసిన కుక్కలు.
పక్కనే ఒక శాంతంగా కనిపిస్తున్న చక్కని ఆవు.
అసలే ఆకలితో వేటదొరకలేదనే విసుగుతో ఉన్నాడేమో, ఆ వేటగాడు "ఓ సామీ! ఆ జింకను పక్కకంపు, అది నా యేట..." అని అరిచాడు.
అవధూత చిరునవ్వు నవ్వాడు. "నాయనా! అది నీ వేట ఎలా అవుతుంది?" అని ప్రశ్నించాడు.
వేటగాడు ఆశ్చర్యపోయాడు " అది యేట నీమం, ఎవరు ఏ జంతువుకు ఎక్కుపెడితే ఆ యేట ఆడిదే. దీనికి నేను బాణం గురెట్టాను కాబట్టి అది నాదే." అన్నాడు.
అవధూత మళ్లీ అడిగాడు. "నువ్వు దానికి ప్రాణం ఇచ్చావా?"
"లేదు." అన్నాడు వేటగాడు
"అయితే దాని ప్రాణాన్ని తీసుకునే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? ఎవరికోసం ? ఎందుకోసం చంపుతున్నావు నువ్వీ జీవిని?".
ఆ ప్రశ్న వేటగాడి గుండెల్లో బాణంలా దిగింది. ఇంతవరకు ఆ ఆలోచన అతనికి ఎప్పుడూ రాలేదు.
అవధూత మెల్లగా మాట్లాడసాగాడు. "ఈ జింకకు ప్రాణం ఎవరిచ్చారో... నీకు కూడా ప్రాణం ఇచ్చినవాడు ఆయనే, ఈ అడవిలో ఉన్న ప్రతి జీవిలో అదే చైతన్యం ఉంది. జీవులను చంపడం ద్వారా పొట్ట నింపుకోవచ్చు. కానీ మనసుకు శాంతి దొరకుతుందా! దొరకదు కదా..."
వేటగాడు మొదటిసారి తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నాడు.
ఎన్ని జంతువులను చంపాడు!
ఎన్ని ప్రాణాలను తీసుకున్నాడు!
అతని కళ్లలో నీళ్లు తిరిగాయి.
విల్లు చేతిలో నుంచి జారిపోయింది.
బాణం నేలపైబడిపోయింది.
"సామీ! నేను చాలా పాపాలు చేశాను. నా పాపాలకు విముక్తి ఉందా? " అని వణుకుతున్న గొంతుతో అడుగుతూ అవధూత కాళ్లమీద పడ్డాడు.
అవధూత ప్రేమగా నవ్వాడు.
"పాపం కంటే పశ్చాత్తాపం గొప్పది.
తప్పు కప్పిపుచ్చుకోవడం కంటే ఒప్పుకుని మారడం గొప్పది.
నిజంగా పశ్చాత్తాపపడే హృదయాన్ని భగవంతుడు ఎప్పుడూ తిరస్కరించడు." అని చెప్పి అతని తలపై చేయి ఉంచాడు.
ఆ స్పర్శతో వేటగాడి హృదయంలో ఏదో అలజడి కలిగింది,
తన హృదయం ఆర్ధ్రత, కరుణలతో నిండిపోయింది.
ఎన్నో సంవత్సరాల క్రూరత్వం ఒక్క క్షణంలో కరిగిపోయింది.
అతని కళ్ల నుంచి ఆనందబాష్పాలు ధారగా కారాయి.
అతను అవధూత పాదాలపై పడి నమస్కరించాడు.
"సామీ! ఇక నుంచి ఏ ప్రాణినీ సంపను. నువ్వు సెప్పిన బాటలోనే ప్రేమగా బతుకుతా ." అని ప్రతిజ్ఞ చేశాడు.
అప్పుడు అవధూత తన అసలు స్వరూపాన్ని చూపించాడు.
మూడు ముఖాలు ప్రకాశిస్తున్నాయి.
చుట్టూ దివ్యకాంతి వ్యాపించింది.
నాలుగు కుక్కలు మాయమై నలుగు వేదపురుషులుగా వారి వేద మంత్ర స్వరంతో వినిపించారు .
కామధేనువు దివ్యరూపంలో వెలిగింది, ధర్మంగా తెలియబడింది.
వేటగాడు ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. "మా గూడెంలో పంతులుగారు సెప్పే దత్తాత్రేయ సామే!" అని కన్నీళ్లతో కేక వేశాడు.
శ్రీ దత్తాత్రేయుడు ఆశీర్వదిస్తూ అన్నారు:
"నాయనా! నిజమైన పశ్చాత్తాపం మనిషిని పవిత్రుణ్ని చేస్తుంది. ఈ రోజు నుంచి నీ హృదయం నా ఆలయం." అని చెప్పి అంతర్ధానమయ్యారు.
ఆ రోజు నుంచి వేటగాడు పూర్తిగా మారిపోయాడు. అడవిలో గాయపడిన జంతువులను కాపాడేవాడు. ఆకలితో ఉన్నవారికి సహాయం చేసేవాడు. దత్తనామాన్ని జపిస్తూ జీవించాడు. చివరికి అతని జీవితాంతంలో దత్తస్మరణలో లీనమై పరమశాంతిని పొందాడు.
దత్త భక్తులు ఈ కథ చెప్పుకుంటూ అంటారు...
దత్తుని కరుణాకటాక్షం ఒక క్షణమైనా మీద పడితే,
పరమ దుర్మార్గుడైనా మహాత్ముడవుతాడు. ఈ వేటగాడిలా... అదీ దత్తానుగ్రహ మహిమ!
---
భగవంతుడు నీ గతాన్ని చూడడు.
నీ హృదయంలో వచ్చిన నిజమైన మార్పును చూస్తాడు.
పూర్వం నువ్వెంత పెద్ద పాపపు పనులు చేసినా ...
నిజమైన పశ్చాత్తాపంతో భగవంతుని ఆశ్రయిస్తే...
ఆ భగవంతుని కృప అతనిని ఉన్నత స్థితికి చేర్చగలదు.
ఆ భగవంతుడే గురువైతే, ఇక దాని స్థాయి చెప్పడం ఎవరివల్లా కాదు.
పాపాన్ని నాశనం చేసేది శిక్ష కాదు...
పరిపూర్ణ పశ్చాత్తాపంతో కూడిన జీవనం, దేవతా-గురు అనుగ్రహం.
జై గురు దత్త! జై గురు దత్త!
భక్తవత్సలా! మాం పాహి!
జై గురుదత్త! జై గురుదత్త!

-శంకరకింకరః



No comments:

Post a Comment