Pages

Monday, June 15, 2026

బృందావన కథలు - 9 (బంగారు మురుగులు - లడ్డూలు)

జై రాధే కృష్ణ

బృందావనంలోని నిధివన్ దగ్గర, రాత్రి శృంగార హారతి, భోగ సేవలు ముగిసిన తరువాత దాదాపు తొమ్మిది, పది గంటల సమయానికి అక్కడి దుకాణాలన్నీ మూసివేస్తారు. అక్కడ కిళ్లీ కొట్లు కూడా ఉంటాయి. శృంగార భోగంలో తాంబూలం నివేదిస్తారు. భక్తులు ఆ తాంబూల ప్రసాదం తీసుకుని, తమ తమ దారులు పడతారు. కొద్ది సేపటికే దుకాణాలన్నీ మూసుకుపోయి, బజారు అంతా నిశ్శబ్దంగా మారిపోతుంది.

అలా అన్నీ మూసేస్తున్న సమయంలో, ఒక వ్యక్తి తాంబూల ప్రసాదం తీసుకుని, పక్కనే ఉన్న కిళ్లీ కొట్టులో కిళ్లీలు కొనుక్కుని ఇంటికి వెళ్తుండగా, ఒక మిఠాయి కొట్టులో మాత్రం ఇంకా దీపాలు వెలుగుతుండటం గమనించాడు. అప్పటికే రాత్రి పదకొండు గంటలు దాటిపోయింది.

ఆయన ఆశ్చర్యంగా లోపలికి వెళ్లి “ఏంటి బాబా! పదకొండు దాటిపోయింది. ఇంకా ఇంటికి వెళ్లలేదే? ఏం చేస్తున్నారు?” అంటూ అడిగాడు

అప్పుడు ఆ మిఠాయి కొట్టు యజమాని చిరునవ్వుతో  “లేదు బాబూ! ఒక పెద్ద పురమాయింపు వచ్చింది. రేపు ఉదయాన్నే స్వామివారికి భోగ ప్రసాదంగా సమర్పించడానికి చాలా లడ్డూలు కావాలన్నారు. పొద్దున్నే తీసుకెళ్తామని చెప్పారు. అందుకే ఇవన్నీ సిద్ధం చేస్తున్నాను. ఈ లడ్డూలన్నీ చేసి పూర్తయ్యాకనే ఇంటికి వెళ్తాను.” అని అన్నాడు.

“ఓహో! అలాగా!” అని చెప్పి, తాను తెచ్చుకున్న తాంబూల ప్రసాదాన్ని అతనికి ఇచ్చి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు.

ఆ వ్యక్తి వెళ్లిన తరువాత, ఆ తాంబూల ప్రసాదాన్ని చూసిన వెంటనే మిఠాయి కొట్టు యజమానికి ఒక్కసారిగా గుర్తొచ్చింది — తాను ప్రతిరోజూ కొట్టు త్వరగా మూసేసి, నిధివనంలో జరిగే శయన భోగం, ఏకాంత సేవ, శృంగార హారతి దర్శించుకుని, రాధామాధవులకు దండం పెట్టుకుని ఇంటికి వెళ్తుంటాడు. కానీ ఆ రోజు మాత్రం లడ్డూల తయారీలో పూర్తిగా మునిగిపోయి సమయమే గమనించలేదు. అప్పటికే రాత్రి పదకొండు దాటిపోయింది. ఈ సమయానికి ఆలయ తలుపులు కూడా మూసేసి ఉంటారు.

“అయ్యో! ఈరోజు స్వామివారి దర్శనం కాలేదే!” అని అతని హృదయం బాధతో నిండిపోయింది.

అప్పుడు అక్కడే కూర్చుని, కళ్లుమూసుకుని, తన భావనలో స్వామివారిని శయన మందిరంలో దర్శించుకున్నాడు. తాను ఏకాంత సేవలో పాల్గొంటున్నట్టుగా భావించాడు. శృంగార హారతి జరుగుతున్న దృశ్యాన్ని మనసారా తలచుకున్నాడు. ఆ దివ్య భావనలోనే తిరిగి లడ్డూలు చేయడం ప్రారంభించాడు.

కొంతసేపటి తరువాత అర్ధరాత్రి సమయం అయింది. అంతలో ఒక చిన్న బాలుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు.

“బాబా! నాకు చాలా ఆకలిగా ఉంది. ఏమైనా తినడానికి ఇస్తారా?” అని అడిగాడు.

ఆ బాలుడు చూడడానికి ఎంతో అందంగా ఉన్నాడు. చక్కని గిరిజాల జుట్టు, తీరిగ్గా ఉన్న ముక్కు, పెద్ద పెద్ద కళ్ళు, ఎర్రని పెదవులు, గుండ్రని ముఖం, కాంతివంతమైన శరీరం — అతని రూపం చూడగానే ఎవరికైనా మమకారం కలిగేలా ఉంది. మంచి పట్టుబట్టలు ధరించి, బంగారు ఆభరణాలు వేసుకుని ఉన్నాడు.

మిఠాయి కొట్టు యజమాని ప్రేమగా “బాబూ! ఏమి తింటావు? ఇక్కడ ఎన్నో మిఠాయిలు ఉన్నాయి. సమోసాలు ఉన్నాయి, చాట్ ఉంది.” అనడిగాడు.

కానీ ఆ బాలుడు మృదువుగా  “నాకు లడ్డూలే కావాలి. ఇదిగో నా బంగారు మురుగు ఇస్తాను. దానికి బదులుగా నాకు లడ్డూలు ఇవ్వండి. నా దగ్గర డబ్బులు లేవు.” అని అన్నాడు

అప్పుడు మిఠాయి కొట్టు యజమాని నవ్వుతూ “అయ్యో! పర్లేదు బాబూ. ముందు నువ్వు తిను. తర్వాత చూద్దాం.”అన్నాడు.

అని లడ్డూలు ఇవ్వబోతే, ఆ బాలుడు ఒప్పుకోలేదు.

“మీరు నా బంగారు మురుగు తీసుకుంటేనే నేను లడ్డూలు తీసుకుంటాను” అని పట్టుబట్టాడు.

అలా బలవంతంగా తన చేతిలోని బంగారు మురుగు ఇచ్చి, లడ్డూలు తీసుకుని ఒక్కసారిగా పరుగెత్తి వెళ్లిపోయాడు.

ఆయన వెంటనే బయటికి వచ్చి చూశాడు. కానీ ఆ బాలుడు ఎక్కడా కనిపించలేదు. కొంతదూరం వెతికినా ఆచూకీ దొరకలేదు.

“ఏదో పెద్దింటి పిల్లవాడిలా ఉన్నాడు. ఇంటికి వెళ్లాక పెద్దవాళ్లు అడుగుతారు. అప్పుడు వెతుక్కుంటూ ఇక్కడికొస్తారు. అప్పుడే తిరిగి ఇచ్చేయొచ్చు” అనుకుని, ఆ బంగారు మురుగును గల్లా పెట్టెలో పెట్టి తాళం వేశాడు.

కొంతసేపు ఎదురు చూశాడు. ఎవరూ రాలేదు. “సరే, పొద్దున్నే వస్తారేమో” అనుకుని, లడ్డూల పని పూర్తి చేసి ఇంటికి వెళ్లి పడుకున్నాడు.

మరుసటి రోజు ఉదయం లేచి, స్నానం చేసి, తన కొట్టులో ఉన్న ఠాకూర్‌జీకి పూజ చేశాడు. ధూపం వేసాడు. పూలు సమర్పించాడు. దీపం పెట్టాడు. నైవేద్యం సమర్పించాడు.

ఇంతలో ఆలయంలో పనిచేసే భండారీగారు అటుగా వస్తుండటం గమనించాడు.

ప్రతిరోజులాగే నమస్కరించి “జై జై రాధే కృష్ణ భండారీజీ! ఎలా ఉన్నారు?” అని అడిగాడు.

కానీ ఆ రోజు భండారిగారు చాలా దిగులుగా కనిపించారు.

“ఏమైంది భండారీ గారూ?” అని అడిగితే, వారు బాధగా 

“రాత్రి గుడిలో ఏదో ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. స్వామివారికి వేసిన అన్ని ఆభరణాలూ ఉన్నాయి. కానీ శ్రీకృష్ణుడి చేతికి ఉన్న ఒక బంగారు మురుగు మాత్రం కనిపించడం లేదు. ఎవరు తీసుకెళ్లారో, ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు.” అంటూ చెప్పారు.

అది విన్న వెంటనే ఆ మిఠాయి కొట్టు యజమాని ఒక్కసారిగా ఒణికిపోయాడు. పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు శరీరం మొత్తం కంపించసాగింది. చెమటలు పట్టి ఒళ్ళంతా తడిసిపోయింది.

వెంటనే గల్లా పెట్టె తెరిచి, అందులో ఉన్న బంగారు మురుగు తీసుకుని వచ్చి చూపి  “ఇదేనా?” అని అడిగాడు.

భండారిగారు ఆశ్చర్యంతో: “అవును! ఇదే! ఇది మీ దగ్గరకు ఎలా వచ్చింది?” అని అడిగారు.

అప్పుడు ఆయన రాత్రి జరిగిన సంగతంతా వివరంగా చెప్పాడు.

“రాత్రి లడ్డూలు చేస్తూ ఉండిపోయాను. స్వామివారి దర్శనం కాలేదని బాధపడి, మానసికంగా దర్శనం చేసుకుంటూ లడ్డూలు చేస్తున్నాను. అప్పుడు ఒక చిన్న బాలుడు వచ్చాడు. చూడడానికి కన్నయ్యలాగే ఉన్నాడు — గిరిజాల జుట్టు, పెద్ద కళ్ళు, ఎర్రని పెదవులు, పట్టు బట్టలు, బంగారు ఆభరణాలు… ఆకలేస్తోంది, లడ్డూలు కావాలని అడిగాడు. బలవంతంగా ఈ మురుగు ఇచ్చి లడ్డూలు తీసుకుని మాయమైపోయాడు.”

అది విన్న భండారిగారి కళ్ళల్లో ఆనందభాష్పాలు, అలౌకిక ఆనందంతో కలగలసిన పశ్చాత్తాపం...

“అయ్యో! నిన్న రాత్రి భోగ నైవేద్యాలన్నీ పెట్టాం. కానీ లడ్డూలు మాత్రం పెట్టడం మర్చిపోయాం. ప్రతిరోజూ శయన భోగంలో లడ్డూలు సమర్పిస్తాం. నిన్న ఎందుకో అవి పెట్టలేదు. అందుకే స్వామివారే నీ దగ్గరకు వచ్చి లడ్డూలు తీసుకుని తిన్నట్టున్నారు!” అని భావోద్వేగంతో అన్నాడు.

తర్వాత ఇద్దరూ కలిసి ఆలయానికి వెళ్లి, ఆ లడ్డూలను మళ్లీ స్వామివారికి సమర్పించారు.

ఆ మిఠాయి కొట్టు యజమాని స్వామివారిని చూస్తూ కన్నీళ్లతో ఇలా అనుకున్నాడు:

“స్వామీ! ఇన్ని ఏళ్లుగా ప్రతిరోజూ నీ దర్శనానికి వస్తున్నాను. ఒక్కరోజు నేను రాలేకపోయానని నువ్వే నా దగ్గరకు వచ్చావా? నా చేత్తో చేసిన లడ్డూలు తిన్నావా? నీ చేతికున్న బంగారు మురుగును నాకు ఇచ్చావా? నాతో మాట్లాడావా స్వామీ!”

అని ఆనందంతో భజనలు చేస్తూ, కృతజ్ఞతతో స్వామిని చూస్తూ పరవశించిపోయాడు.

కన్హయ్య ఆయజమాని భక్తితో కర్తవ్యనిష్ఠతో చేసే లడ్డూలు తినడానికి రాత్రి సేవలో లడ్డూలు లేకుండా చేసాడా? 

ఆకొట్టు యజమాని తన ఠాకూర్ కోసం చేసే లడ్డూల తయారీలో నిమగ్నమై ఆలయ దర్శనం మరిచిపోయేలా చేసాడా?

ఆరాత్రి పనిలో మునిగిన ఆ కొట్టు యజమానికి సంజ్ఞ ఇవ్వడానికి తాంబూల ప్రసాదం పంపాడా?..

అంతా నిధివన్లో రాసలీల జరిపే కృష్ణలీల... 

ఎవ్వరికీ అంతుబట్టని అలౌకిక హేల...


ఈ లీలను ఇప్పటికీ అక్కడ భక్తులు ప్రేమతో చెప్పుకుంటుంటారు. కపటం లేకుండా, నిర్మలమైన హృదయంతో స్వామిని సేవించే భక్తులను భగవంతుడు ఎప్పుడూ వదలడు. తానే వారి వెంట ఉండి, వారిని రక్షిస్తూ, అనేక లీలలు చేస్తూ ఉంటాడు.

------

అపరాధ సహస్రంబుల

నపరిమితములైన యఘము లనిశము నేఁ

గపటాత్ముఁడనై చేసితిఁ

జపలుని ననుగావు శేషశాయివి కృష్ణా!!

------

జై రాధే కృష్ణ॥ 

-శంకరకింకరః

No comments:

Post a Comment