జై రాధే కృష్ణ
పంజాబ్ ప్రాంతంలో “సాయన్ జీ నాయీ” అనే ఒక మహాభక్తుడు ఉండేవాడు.
వృత్తిరీత్యా ఆయన రాజదర్బారులో మంగలిగా పని చేసేవాడు. రాజుగారికి క్షౌరం చేయడం, నూనెతో ఒళ్ళంతా పట్టించి అభ్యంగన సేవ చేయడం, స్నానం చేయించడం — ఇవన్నీ ఆయన సేవలు.
కానీ సాయన్ జీ హృదయం మాత్రం ఎల్లప్పుడూ భగవన్నామంలోనే మునిగిపోయి ఉండేది.
ఉదయం నుండి రాత్రివరకు —
“రామ్… కృష్ణ… గోవింద… హరి…”
అనే నామస్మరణే ఆయన శ్వాస.
సాధువులు, భాగవతులు ఎక్కడ కనిపించినా అన్నీ వదిలేసి వారి సేవలో లీనమైపోయేవాడు.
సాధుజనుల భజన, సత్సంగాలంటే ఆయనకు అపారమైన ప్రేమ. వారి సేవలో అపారమైన శ్రద్ధ.
ఒకరోజు రాజుగారికి క్షౌరం చేసి, అభ్యంగన సేవ చేయాల్సిన రోజు వచ్చింది.
సాయన్ జీ తన మంగలి పెట్టె సర్దుకుని రాజదర్బారుకు బయలుదేరాడు. ఇంటి బయటకు వచ్చేసరికి, వీధిలో దూర ప్రాంతాల నుండి వచ్చిన కొందరు సాధు సంతులు భజనలు చేస్తూ, నృత్యం చేస్తూ కనిపించారు.
వారిని చూసిన క్షణమే సాయన్ జీ పరవశించిపోయాడు.
తాను ఎక్కడికి బయలుదేరాడో, ఏ పని ఉందో అన్నది కూడా మరిచిపోయి, వారితో కలిసి భజనలో లీనమయ్యాడు. నామసంకీర్తనలో మునిగి నృత్యం చేయసాగాడు.
---
ఇక్కడ రాజదర్బారులో మాత్రం రాజుగారి వ్యక్తిగత సేవకులు సాయన్ జీ కోసం ఎదురుచూస్తున్నారు.
“ఇంకా ఎందుకు రాలేదు?” అని ఆందోళన చెందుతుండగానే, సాయన్ జీ కొత్త క్షౌర సామగ్రి పెట్టె పట్టుకుని వేగంగా అక్కడికి వచ్చాడు.
అతన్ని చూసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సాయన్ జీ రాజుగారి వద్దకు వెళ్లి ఎంతో శ్రద్ధగా సేవ ప్రారంభించాడు. ముందుగా సుగంధభరితమైన నూనెతో రాజుగారికి అభ్యంగనం చేశాడు.
ఆ నూనె నుంచి ఇంతవరకు ఎప్పుడూ రాని అపూర్వమైన పరిమళం వ్యాపించింది.
అతడు ఒళ్ళు పడుతుంటే రాజుగారికి శరీరమంతా హాయిగా మారిపోయింది. ఎన్నో రోజులుగా ఉన్న అలసట, నొప్పులు అన్నీ క్షణాల్లో తొలగిపోయినట్లనిపించింది.
తరువాత తన పెట్టెలోంచి కుంకుడు, శీకాయ నురగ తీసి రాజుగారి గడ్డానికి పట్టించి, కొత్త కత్తిని సానపెట్టి ఎంతో మృదువుగా క్షౌరం చేయసాగాడు.
రాజుగారు ఆశ్చర్యంతో అన్నారు:
“ఏమిటి సాయన్! ఇవాళ నీ చేతిలో అపూర్వమైన మృదుత్వం ఉంది. ప్రతిసారికంటే ఈరోజు నీ సేవ ఎంతో దివ్యంగా అనిపిస్తోంది. నీ ముఖం కూడా కొత్త కాంతితో, ఆనందంతో వెలిగిపోతోంది!”
అందుకు సాయన్ జీ ముసిముసిగా నవ్వుతూ అన్నాడు:
“అంతా సాధు సజ్జన్ కీ కృపా... భజన్ సత్సంగ్ కీ కృపా… నా చేతిలో ఏముంది ప్రభూ!” అని సేవ పూర్తి చేసి వెళ్లిపోయాడు.
---
ఆ సాధు సంతులను సాయన్ జీ తన ఇంటికి తీసుకెళ్లాడు.
అతని భార్య ఆందోళనగా “ఇంట్లో పిల్లలకు సరిపడా అన్నం కూడా లేదు. వీరందరికీ ఎలా భోజనం పెట్టాలి?”
సాయన్ జీ వెంటనే సమీపంలోని సేఠ్ దగ్గరకు వెళ్లి సరుకులు అప్పుగా తెచ్చాడు.
ఆ దంపతులు ఎంతో ప్రేమతో రొట్టెలు, కూర, పాయసం సిద్ధం చేసి సాధు సంతులకు భోజనం పెట్టారు.
వారి ఆదరణ చూసి ఆ మహాత్ములు ఆనందించి “మీ వృత్తి సమాజానికి చిన్నదిగా కనిపించవచ్చు. కానీ మీ హృదయాలు చాలా గొప్పవి. రాధాకృష్ణులు మిమ్మల్ని చల్లగా చూస్తారు.” అని ఆశీర్వదించి వెళ్లిపోయారు.
---
వాళ్లు వెళ్లిన తరువాత సాయన్ జీ భార్య “మీరు రాజుగారి సేవ చేసి జీతం తీసుకొస్తానన్నారు కదా! ఆ డబ్బుతోనే ఈ సాధు సంతులకు సేవ చేశారా? మన ఇంట్లో సరుకులు నిండిపోయాయి, ఇంట్లోకి కూడా సరుకులు తీసుకురండి.” అన్నది.
అప్పుడు మాత్రమే సాయన్ జీకి తాను చేసిన పొరపాటు గుర్తుకొచ్చింది. “అయ్య బాబోయ్ !” అని గుండె దడదడలాడిపోయింది. వెంటనే తన గబగబా రాజమహల్‌కు పరుగెత్తాడు. రాజభటులు అతన్ని చూసి “ఏమిటి సాయన్ జీ! మళ్లీ ఎందుకు వచ్చారు? ఇవాళ మీ సేవతో రాజుగారు ఎంతో ఆనందంగా ఉన్నారు. మీ చేతిలో ఏదో మహిమ ఉందిట, కానుకలిస్తానంటున్నారు!” అన్నారు
వాళ్లు తనను ఎగతాళి చేస్తున్నారని సాయన్ జీ మరింత భయంతో లోపలికి వెళ్లాడు. రాజుగారి పాదాలపై పడిపోయి
“ప్రభూ! ఆలస్యమైంది. నన్ను క్షమించండి. నేను సమయానికి రాకపోవడంతో మీరు మరొక మంగలితో సేవ చేయించుకున్నట్లున్నారు. నన్ను ఉద్యోగం నుంచి తొలగించకండి. ఈ ఉద్యోగంపైనే నా కుటుంబం ఆధారపడి ఉంది. భాగవతుల సేవ వల్ల ఇవాళ ఆలస్యం ఐంది” అంటూ వేడుకున్నాడు:
రాజుగారు ఆశ్చర్యంతో “అదేమిటి సాయన్ జీ! ఉదయమే వచ్చి సుగంధభరితమైన నూనెతో అభ్యంగనం చేసి, ఎంతో మృదువుగా క్షౌరం చేసి వెళ్లావు కదా! నా శరీరం ఇప్పటికీ ఎంతో తేలికగా, ఉల్లాసంగా ఉంది. పైగా నేను నీకు బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను!, నువ్వేమీ ఇలా అంటున్నావేం?” అన్నారు
ఆ మాటలు విన్న సాయన్ జీ నిర్ఘాంతపోయాడు.
శరీరమంతా కంపించసాగింది.
గోడపై ఉన్న రాధాకృష్ణుల విగ్రహాలను చూసి ఒక్కసారిగా నేలపై పడిపోయి వెక్కివెక్కి ఏడవసాగాడు.
“దయామయా!
నీ కరుణకు హద్దులేదా!
నన్ను రక్షించడానికి ఇంతకీ దిగివచ్చావా ప్రభూ!
నేను మీ సేవ చేయవలసిన వాడిని…
మీరు నా పని చేయడానికి వచ్చారా!”
అంటూ నేలపై దొర్లుకుంటూ, “జై రాధే కృష్ణ… జై రాధే కృష్ణ…” అని నామస్మరణ చేయసాగాడు.
రాజుగారికి ఏమీ అర్థం కాలేదు. ఆయనే సాయన్ జీని లేపి “ఏమైంది సాయన్?” అని అడిగాడు:
సాయన్ జీ కన్నీళ్లు తుడుచుకుంటూ జరిగినదంతా చెప్పాడు.
“రాజమహల్‌కు బయలుదేరుతుండగా భాగవతుల బృందం ఎదురైంది. వారితో కలిసి భజనలో లీనమై, వారికి సేవ చేస్తూ ఆలస్యమైంది…” అన్నాడు.
అది విన్న రాజుగారు విస్తుపోయాడు. తన భక్తుని పరువు కాపాడటానికి స్వయంగా శ్రీకృష్ణుడే వచ్చి తనకు అభ్యంగన సేవ చేసి, క్షౌరం చేశాడని గ్రహించి శరీరమంతా పులకించిపోయింది.
వెంటనే ఒక్కసారిగా రాజుగారు సాయన్ జీ పాదాలపై పడిపోయి “సాయన్ జీ! మీ మహాభక్తిని నేను గుర్తించలేకపోయాను, మీ వంటి మహాభక్తుడి గౌరవం కాపాడడానికి నాకు క్షౌర కర్మ చేసాడా ఆ పరంధాముడు, కృష్ణుడితో ఒళ్ళు పట్టించుకున్నానా? గడ్డం గీయించుకుని, అభ్యంగన స్నానం చేయించుకున్నానా? .” అంటూ వల వలా ఏడ్చాడు.
ఆ రోజు నుండి రాజుగారు సాయన్ జీని సాధారణ మంగలిగా కాక, మహాభక్తునిగా గౌరవించాడు.
అతని భగవద్భక్తి, భాగవతసేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా జీవితాంతం ఆదరించాడు.
చివరికి వారిద్దరూ కృష్ణభక్తిరసంలో లీనమై పరమానందాన్ని పొందారు.
రాధే రాధే
గోపాల కృష్ణ మురహర
పాపాలను బాఱఁదోలు ప్రభుఁడవు నీవే
గోపాలమూర్తి దయతో
నాపాలిటఁగలిగి ప్రోవు నమ్మితిఁ గృష్ణా!
-శంకరకింకరః
No comments:
Post a Comment