జై రాధేశ్యామ్
ఒకసారి ఒక చిన్న బాలిక తన పాఠశాల విద్యార్థులతో కలిసి పవిత్రమైన బృందావనం కు వెళ్లింది.
అక్కడి ప్రతి వీధి కృష్ణనామంతో మార్మోగిపోతోంది. ఎవరో భజనలు చేస్తున్నారు, ఎవరో నృత్యాలు చేస్తున్నారు, ఇంకొందరు “రాధే రాధే” అంటూ పరవశంగా సంచరిస్తున్నారు.
ఆ చిన్నారి ఆశ్చర్యంగా చూస్తోంది. అక్కడ చాలామంది తమ చేతుల్లో చిన్న చిన్న లడ్డూ గోపాల విగ్రహాలను పట్టుకొని ఎంతో ప్రేమగా తీసుకెళ్తున్నారు. కొందరు ఊయలలో ఊపుతున్నారు, కొందరు నృత్యం చేస్తూ చూపిస్తున్నారు, ఇంకొందరు చిన్నపిల్లలలా మాట్లాడుతున్నారు.
ఆ దృశ్యాలు చూసి ఆ బాలిక హృదయం మురిసిపోయింది. “నేను కూడా ఒక లడ్డూ గోపాల్ ని ఇంటికి తీసుకెళ్తే ఎంత బాగుంటుంది!” అని అనుకుంది.
అలా ఆమె ఎంతో భక్తితో బాంకే బిహారి మందిర్ దర్శనం చేసుకుంది. అలాగే శ్రీనాథ్‌జీ, గిరిరాజ్‌జీ వంటి అనేక దేవాలయాలను దర్శించి, చివరకు ఒక చిన్న చక్కని లడ్డూ గోపాలుణ్ణి తీసుకుంది.
ఆ విగ్రహాన్ని చేతుల్లో పట్టుకొని ఆమె మనసులో,
“స్వయంగా నా కృష్ణుడే నా ఇంటికి వస్తున్నాడు” అనే భావన ఉప్పొంగింది. "నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానే లడ్డూ గోపాల్" అని ఆ లడ్డూ గోపాల్ తో చెప్పి తన సంచీలో పెట్టుకొని ఇంటికి బయలుదేరింది.
ఇంటికి వెళ్లగానే తన అమ్మ దగ్గరకు పరుగెత్తి—
“అమ్మా! చూడు… మన ఇంటికి స్వయంగా ఠాకూర్‌జీ వచ్చారు!” అని చెప్పింది.
ఆమె అమాయక భక్తి చూసి తల్లి చిరునవ్వుతో,
“సరే బంగారం… జాగ్రత్తగా చూసుకో” అని చెప్పింది.
ఆ రోజు నుంచి ఆ బాలిక జీవితమే మారిపోయింది.
ప్రతి ఉదయం లేచిన వెంటనే ముందుగా ఠాకూర్‌జీకి స్నానం చేయించి, చక్కని వస్త్రాలు వేయించి, చిన్న తలపాగా కట్టి, పూలతో అందంగా అలంకరించేది.
బయట ఆడుకోవడానికి వెళ్లినప్పుడు రంగురంగుల పూలు కనిపిస్తే వాటిని తీసుకొచ్చి ప్రేమగా అలంకరించేది.
తాను ఏదైనా తినే ముందు—
“ముందు నా కృష్ణుడు తినాలి” అని చిన్న పాత్రలో పెట్టి నివేదించేది.
రాత్రివేళ నిద్రపోయేటప్పుడు కూడా తన పక్కనే చిన్న మంచం వేసి—
“ఠాకూర్‌జీ… ఇప్పుడు పడుకోండి” అంటూ నిద్రపుచ్చి, తరువాతే తాను నిద్రపోయేది.
కొన్నిసార్లు పాఠశాలకు కూడా తనతో పాటు తీసుకెళ్లేది।
ఆమెకు ఠాకూర్‌జీ ఒక విగ్రహం కాదు… నిజంగా తనతో ఆడుకునే చిన్న కృష్ణుడే.
అలా సంవత్సరాలు గడిచాయి.
ఆ చిన్నారి పెద్దదైంది, చదువులు పూర్తయ్యాయి, మంచి ఉద్యోగం వచ్చింది.
ఉద్యోగ బాధ్యతలు పెరిగాయి. ఉదయాన్నే తొందరలు, పనిఒత్తిడులు, సమావేశాలు… జీవితం పరుగెత్తసాగింది.
మెల్లగా ఆమెకు ముందు లాగా ఠాకూర్‌జీని అలంకరించడానికి సమయం దొరకలేదు.
పూలు పెట్టడం తగ్గింది, సేవలు తగ్గిపోయాయి.
కొన్నిసార్లు త్వరలో బయటకు వెళ్లిపోతూ—
“సాయంత్రం వచ్చి చేస్తాను” అనుకునేది, కానీ అలసటతో మళ్లీ మరిచిపోతుండేది.
ఒక రోజు ఆఫీస్ నుంచి ఎంతో అలసటగా ఇంటికి వచ్చిన ఆమె, తన గదిలో మూలగా ఉన్న ఠాకూర్‌జీని చూసింది,
బట్టలు మాసిపోయాయి, ముఖం మీద దుమ్ము చేరింది, పూలు ఎండిపోయాయి.
ఆ దృశ్యం చూసి ఆమె గుండె బరువెక్కింది.
అమ్మ దగ్గరకు వెళ్లి బాధగా చెప్పింది—
“అమ్మా… నేను ఇప్పుడు ఠాకూర్‌జీని ముందులా చూసుకోలేకపోతున్నాను.
ఉద్యోగ ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది,
ఉదయం తొందరగా వెళ్లిపోవాలి… రాత్రికి ఆలస్యంగా వస్తున్నాను,
రోజూ సేవ చేయలేకపోతున్నాను,
నువ్వైనా నా బదులు కొంచెం చూసుకుంటావా?”
ఆమె తల్లి ప్రేమగా,
“సరే అమ్మా… నేను చూసుకుంటాను” అని చెప్పింది.
ఆ తర్వాత రోజులు గడిచాయి.
తల్లి తన వయసు, ఓపిక ఉన్నంతవరకు సేవ చేసేది.
కానీ ఆమె కూడా వృద్ధురాలైపోయింది.
కొన్ని రోజులు శక్తి ఉంటే స్నానం చేయించేది, బట్టలు మార్చేది.
మరికొన్ని రోజులు అలసటతో అలాగే వదిలేయాల్సి వచ్చేది.
మళ్లీ ఒక రోజు ఆ అమ్మాయి ఠాకూర్‌జీని చూసింది.
ఈసారి ఆ రూపం చూసి ఆమె గుండె పగిలిపోయింది.
ఒకప్పుడు ఎంతో చక్కగా మెరిసిపోయే తన చిన్న కృష్ణుడు…
ఇప్పుడు సరైన సేవ లేక, అలంకారం లేక, బట్టలు మాసిపోయి, ఒంటరిగా ఉన్నట్టుగా కనిపించాడు.
ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.
“అయ్యో… నేను బృందావనం నుంచి ఎంతో ప్రేమగా ఇంటికి తీసుకొచ్చాను.
‘నేను బాగా చూసుకుంటాను’ అని మాటిచ్చాను.
కానీ ఇప్పుడు అదే చేయలేకపోతున్నాను…”
అని బాధతో ఏడ్చింది. చివరికి ఒక నిర్ణయం తీసుకుంది.
“నేను సేవ చేయలేనప్పుడు… ఠాకూర్‌జీని ఇలా నిర్లక్ష్యంగా ఉంచడం కంటే, తిరిగి ఆయనను బ్రుందావనానికే పంపించడం మంచిది” అనుకుంది.
ఆ ఆలోచనతో ఆమె ఒక వారం రోజుల పాటు ఎంతో బాధపడింది.
ప్రతి రోజు ఠాకూర్‌జీ ముందు కూర్చొని ఏడ్చేది.
చివరకు ఒక రోజు ఆఫీస్‌కు సెలవు తీసుకుని, చిన్న లడ్డూ గోపాలను తన చేతుల్లో తీసుకుని ఇంటి దగ్గరున్న నది వద్దకు వెళ్లింది.
నది ఒడ్డున కూర్చుంది... కళ్ల నుంచి నీళ్లు ఆగట్లేదు...
“ఠాకూర్… చిన్నప్పుడు ఎంతో ప్రేమగా నిన్ను ఇంటికి తీసుకొచ్చాను.
కానీ ఇప్పుడు నీకు సరైన సేవ చేయలేకపోతున్నాను.
ఉద్యోగ బాధ్యతలు, ఇంటి బాధ్యతలు… జీవితంలో తలమునకలైపోయాను.
నిన్ను ఆఫీస్‌కు తీసుకెళ్లినా అక్కడ సేవ చేయలేను,
ఇంట్లో చేయాలంటే సమయం సరిపోవట్లేదు,
అమ్మ కూడా వృద్ధురాలైపోయింది… కాబట్టి నన్ను క్షమించు…” అని వెక్కివెక్కి ఏడ్చింది.
ఆ తర్వాత ఆమె మనసులో కిశోరీజీ ని తలుచుకుంది.
“కిశోరీజీ… ఇక మీ చేతుల్లో పెట్టేస్తున్నాను అన్న భావనతో నిమజ్జనం చేసేస్తున్నాను, మీరైనా నా కృష్ణుడిని జాగ్రత్తగా చూసుకోండి…” అని నమస్కారం పెట్టుకుంది.
అప్పుడే వెనక నుంచి బాలిక స్వరం వినిపించింది—
“అక్కా… ఆ లడ్డూ గోపాలను నీళ్లలో వేయొద్దు… నాకు ఇస్తావా?”
ఆమె వెనక్కి తిరిగి చూసింది.
దాదాపు పన్నెండు, పదమూడు ఏళ్ల చిన్న పాప,
నీలం రంగు పరికిణీ వేసుకుని ఉంది.
చూడటానికి సహజమైన కాంతితో మెరిసిపోతోంది,
ఒక సాధారణ పల్లెటూరి పిల్లలాగా అమాయకంగా నిలబడి ఉంది.
“నేను మా ఇంట్లో పెట్టుకుంటాను అక్కా… ఆయనతో ఆడుకుంటాను… జాగ్రత్తగా చూసుకుంటాను…” అని అంది.
ఆ మాటలు విన్న వెంటనే ఆ అమ్మాయి హృదయానికి కొంచెం శాంతి కలిగింది.
చాలా జాగ్రత్తగా లడ్డూ గోపాలను ఆ చిన్న పాప చేతుల్లో పెట్టింది.
ఇంకా ఆగకుండా ఒక్కొక్కటి చెప్పసాగింది—
“చూడమ్మా…
ప్రతి రోజు స్నానం చేయించాలి...
బట్టలు మార్చాలి...
అందంగా శృంగారం చేయాలి...
నువ్వు ఏం తిన్నా ముందుగా ఆయనకు పెట్టాలి...
ఆయనను ఒంటరిగా అనిపించనీయకూడదు...
చాలా జాగ్రత్తగా చూసుకోవాలి…”
ఆ చిన్న పాప చిరునవ్వుతో—
“అలాగే అక్కా… నేను చాలా ప్రేమగా చూసుకుంటాను…” అని చెప్పింది.
ఆ అమ్మాయి ఠాకూర్‌జీని ఇచ్చేసి ఇంటికి బయలుదేరింది. కానీ ఆమె మనసులో మాత్రం ఆందోళన ఆగలేదు।
“ఆ చిన్నపాప నిజంగానే బాగా చూసుకుంటుందా?
నీళ్లలో వదిలేసి ఉంటే కనీసం కిషోరీజీ చూసుకునేవారు…
ఇప్పుడు ఈ పాప ఎక్కడుంటుందో కూడా తెలియదు…” అని బెంగపడింది.
ఆ రాత్రి ఆమె ఏమీ తినలేదు. తల్లి ఎంత బలవంతం చేసినా— “అమ్మా… ఠాకూర్‌జీ! నా లడ్డూ గోపాల్ వెళ్లిపోయారు… నాకు ఏమీ వద్దు…” అని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తూ అలాగే పడుకుంది.
ఆ రాత్రి ఆమెకు ఒక అద్భుతమైన కల వచ్చింది.
కలలో బృందావనంలో ఉన్న రాధారమణ మందిర్ కనిపించింది.
అక్కడ రాధారమణ్‌జీ, రాధారాణి దివ్యంగా దర్శనమిచ్చారు.
వారి ముందే తన చిన్న లడ్డూ గోపాల్ కనిపించాడు.
ఆ లడ్డూ గోపాల్ పక్కనే తాను ఇచ్చిన ఆ చిన్న పాప నిలబడి ఉంది. ఒక్కసారిగా ఆ పాప రూపం మారిపోయింది. ఆమె స్వయంగా రాధాదేవిలా ప్రకాశిస్తూ చిరునవ్వుతో కనిపించింది.
ఆమె ప్రేమగా చెప్పింది—
“నేను చెప్పానుగా… నీ ఠాకూర్‌ను! నా ఠాకూర్‌లా చూసుకుంటానని. నువ్వు ఏమీ బాధపడకు.
నీ ఠాకూర్‌ను ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటాను।
"భావగ్రాహీ జనార్దనః"
కృష్ణునకు కావలసింది కేవలంగా నీ సేవ మాత్రమే కాదు… అంతకు మించింది నీ భావం.
నువ్వు భౌతికంగా ఎంత చేశావన్నది కాదు…
నీ హృదయంలో ఎంత ప్రేమ ఉందో అదే ఆయనకు ముఖ్యం.
నువ్వు సేవ చేసినా, చేయలేకపోయినా…
నీ మనసంతా ఎప్పుడూ ఠాకూర్‌జీ చుట్టూనే తిరిగింది.
అందుకే ఆయన ఎప్పుడూ నీతోనే ఉన్నాడు.
ఇప్పుడు నాకప్పగించినా కూడా…
నీ కృష్ణుడు ఎప్పటికీ నీ హృదయంలోనే ఉంటాడు.
ఈ భావాన్ని మాత్రం ఎప్పుడూ వదలవద్దు.
కృష్ణభక్తిని పెంచుకుంటూ ఉండు.
కృష్ణుడు ఎప్పుడూ నిన్ను కాపాడుతూనే ఉంటాడు…”
అని చెప్పి మెల్లగా అంతర్ధానమైంది.
వెంటనే ఆ అమ్మాయి నిద్రలోంచి ఒక్కసారిగా లేచింది.
ఆమె కళ్లలో ఆనందబాష్పాలు వెల్లువెత్తాయి.
“రాధే కృష్ణ… రాధే కృష్ణ…” అంటూ పరవశంగా భజన చేయసాగింది.
ఆమె తల్లి లేచి ఏమైందని అడగగా, ఆనందంగా—
“అమ్మా! రాధమ్మే వచ్చి మన ఠాకూర్‌ను తీసుకెళ్లింది… ఇప్పుడు ఆయన చాలా సంతోషంగా ఉన్నారు…” అని చెప్పింది.
ఆ రోజు తర్వాత ఆమె హృదయంలో బాధ పూర్తిగా తొలగిపోయింది. తర్వాత జీవితంలో ఎప్పుడెప్పుడు అవకాశం వచ్చినా, సెలవులు వచ్చినా మళ్లీ మళ్లీ బృందావనం వెళ్లి రాధాకృష్ణ సేవలో గడిపేది. తాను, వివాహంబ్తరవాత తన కుటుంబం సభ్యులందరితో కలిసి కృష్ణభక్తితో, రాధేనామంతో, ఆనందంగా జీవితం గడిపింది.
కృష్ణం కలయ సఖి సుందరం - బాల
కృష్ణం గతవిషయ తృష్ణం జగత్ప్రభ
విష్ణుం సురారిగణ జిష్ణుం సదా - బాల...
- శంకరకింకరః
No comments:
Post a Comment