Pages

Tuesday, October 1, 2013

నాలోని అహంకారం

శ్రీ గురుభ్యోనమః
నమస్తే
అనాయమ స్తోత్రంలోని శ్లోకం అందరూ ఎరిగిన విషయమే ఐనా చెప్పిన పద్ధతి దాంట్లో దాచిన అసలు మర్మం ఆకట్టుకునేలా చేసింది

నోర్ధ్వం గమ్యః సరసిజభువో నాప్యధః శార్ఙ్గపాణే
రాసీ దంత స్తవ హుతవహ స్తంభమూర్త్యా స్థితస్య
భూయ స్తాభ్యా మపరిలఘునా విస్మయేన స్తువద్భ్యాం
కంఠేకాలం కపిలనయనం రూప మావిర్భభూవ

విష్ణువుయొక్కనాభికమలంనుండి జన్మించిన బ్రహ్మగారు, ప్రణవాకారంలా ఉండ్డే శార్ఙ్గమనే ధనస్సు పట్టుకునే శ్రీ మహావిష్ణువూ అహంకారంతో ఉన్నంత వరకూ వారి మధ్యలో అగ్నిస్తంభరూపుడుగా వెలసిన నీ శరీరం ఆద్యంతాలు కనుక్కోవటానికి ఊర్ధ్వంగా బ్రహ్మ అథోభాగానికి విష్ణువు బయలుదేరి వెళ్ళినా ఇద్దరికీ నీ రూపు ఆద్యంతాలు తెలియబడలేదు. తరవాత వారే తమ అహంకారం వదిలి నీ మహత్తుగూర్చి ఆశ్చర్యాన్ని పొంది గొప్ప స్తుతి చేయగా ఆద్యంత రహితమైన అగ్ని స్తంభ రూపును వదిలి వారి ఎదుట నీలకంఠముతో, నుదురులో ఎర్రని కపిల వర్ణపు కన్నుతో ఉన్న నీ మహత్తు రూపాన్ని ఆవిర్భూతము చేసి వారికి నీ సగుణ రూప దర్శనాన్ని అనుగ్రహించావు.

స్వామీ నాలో ఉన్న ప్రతి చిన్న ప్రజ్ఞావిశేషాన్ని, ప్రతిభను చూసుకొని నాకూ ఎనలేని అహంకారం కానీ మహానుభావులైన శ్రీ మహా విష్ణువు, చతుర్ముఖ బ్రహ్మలే కొద్ది కాలం అహంకారానికి పోయి నిన్ను తెలుసుకోలేకపోయారు ఇక మామూలు మనిషిని నేనెంత, నాలోని అహంకారం తీసి నిన్నునీవే నాకు చూపి నేను నిన్ను దర్శించామన్న కీర్తి నాకు కలిగించి దేహాంతమున నన్ను నీలో కలుపుకోవా స్వామీ!

పరమేశ్వరునకు, స్తుతికర్తకు నమస్సులతో

No comments:

Post a Comment