Pages

Wednesday, October 30, 2013

నైమిశారణ్య యాత్ర -1

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఆశీస్సులతో మా నైమిశారణ్య దివ్యక్షేత్ర యాత్ర దిగ్విజయంగా జరిగింది. యాత్రలో భాగంగా శ్రీమద్భాగవత సప్తాహంతో పాటు ఇతర కార్యక్రమాలలో పాల్గొన్న వివరాలు అక్కడ మేము దర్శించిన విశేషాలని ఇక్కడ పంచుకోవడం ద్వారా ఇకపై నైమిశారణ్య యాత్రకు వెళ్ళేవాళ్ళకు కూడా ఉపయుక్తంగా ఉండగలదని ఆశిస్తున్నాము (ఇది చదివే వారిలో చాలామంది ఇతఃపూర్వమే చాలా సార్లు నైమిశారణ్య యాత్ర చేసి ఉంటారు, వివరాలు కూడా దీనికి జతచేయగలరని మనవి).

నైమిశారణ్యం వెళ్ళడానికి హైదరాబాదునుండి గోరఖ్పూర్ వెళ్ళే రైలులో కానీ లేదా విమానయానం ద్వారాగానీ లక్నౌ చేరుకొని అక్కడనుంచు రోడ్డు మార్గం గుండా నైమిశారణ్యం చేరుకోవచ్చు (అక్కడ నైమిశారణ్యాన్ని నీమ్సార్ అని కూడా పిలుస్తారు) దాదాపు 2గండలు రోడ్డు ప్రయాణం. సీతాపూర్-కాన్పూర్ లేదా బాలమౌ-సీతాపూర్ పాసింజరులోకానీ లక్నౌనుండి నైమిశారణ్యం చేరుకోవచ్చు.

నైమిశారణ్యం ప్రవేశిస్తూంటేనే గొప్ప అనుభూతి కలుగుతుంది. అక్కడ ఎన్నో ఆశ్రమాలు, గుళ్ళు, వసతి సముదాయాలు ఉన్నాయి. భద్రకాళి మందిరం, బాలాజీ మందిరం, సాయి మందిరం లాంటి పెద్ద పెద్ద వసతి సముదాయాలున్నాయి అక్కడ గదిగి రూ400 నుంచి రూ800 వందల వరకూ ఉన్నాయి. పైన చెప్పిన వాటిలోనే కాక ఇతరమైన ఇంకా కొన్ని వసతి సముదాయాలున్నాయి. A/Cరూములు కూడా అక్కడక్కడా లభ్యమౌతాయి. సాయి మందిరం వంటి వసతి గృహాలలో భోజన సదుపాయం కూడా ఉన్నట్టుంది (తెలుగువాళ్ళుంటారక్కడ). భోజన సదుపాయాలకి ముందుగానే ఏర్పాటుచేసుకోవాలి, సాయంత్రం 7 దాటితే దాదాపు అన్ని దుకాణాలు మూసేస్తారు. రోడ్డుపక్కన ఉండే చిన్న స్వీటు కొట్లలో పూరీలు/చపాతీలు బంగాళాదుంప బఠానీల కూర లభ్యమవుతాయి, పెరుగు కోవా స్వీట్లు లభ్యమవుతాయి. కొంత మంది గుంపుగా వంట ఏర్పాట్లతో వెళ్ళగలిగితే వండుకోవడానికి అక్కడ తాజా కూరలూ, పాలూ, పెరుగూ లభ్యమవుతాయి.

నైమిశారణ్యం ఇతరమైన కొన్ని ప్రదేశాలలాగా ఏదో తిరిగి నాలుగు గుళ్ళు చూసి తిరిగొద్దాం అనుక్కున్నట్లుండదు. ఒక పూట, ఒకరోజులో చూసి వద్దాం అని వెళ్ళే యాత్రా బస్సుల వారు కూడా కనీసంలో కనీసం మూడురోజులు నైమిశారణ్యంలో ఉండేటట్టుంటే బాగుంటుంది.

నైమిశారణ్య ప్రవేశం సమస్త పాతక నాశనం అని కూర్మపురాణం. నైమిశారణ్య క్షేత్రం గురించి చెప్పాలంటే సూక్ష్మంగా (పూజ్య గురువులు తమ ప్రవచనంలో వివరంగా చెప్పారు) కలియొక్క ప్రభావం లేని ప్రదేశంకోసం మునులు, తాపసులు బ్రహ్మగారిని ప్రార్థించగా దర్భలతోచేసిన చక్రాన్ని బ్రహ్మగారు వదిలారు చక్రం అంతటా తిరుగుతూ వచ్చి అరణ్య ప్రాంతంలో తిరుగుతూ ఉండగా దానికున్న నిమి ఊడి చక్రం పడిపోయింది అందువలన ఇది నిమి పడిన క్షేత్రం కాబట్టి నైమిశారణ్యం అయ్యింది. అంటే పుట్టడం-మరణం-పుట్టడం-మరణం-పుట్టడం అనే చక్రం ఆగి పునరావృత్తి రహిత శాశ్వత మోక్ష సిద్ధి కలగడానికి జనన మరణ ఆవృత్తి ఆగిపోవాలంటే సంసారమనే నిమి పడిపోయే ప్రదేశమే నైమిశారణ్యం. నైమిశారణ్యంలో ప్రవేశించిన సాధకులకు భగవత్కృప వలన, సద్గురు వచనం శాస్త్ర వచనం ఆకళింపు చేసుకున్నంత సంసారంలో ఉన్నా సంసారం అంటనివ్వని ప్రదేశమే నైమిశారణ్యం.


అప్పట్నుంచీ ఇక్కడ ఎన్నో వేల మంది ఋషులు, తాపసులు, వారి శిష్యగణాలతో వసించి తపస్యాదులు చేసుకొన్న క్షేత్రం గొప్ప తపోభూమి. మనోలయం తొందరగా కాగలిగిన క్షేత్రం. అందుచేతనే ఇక్కడ కొన్ని రోజులుండి అతి ప్రాచీన దేవాలయాలు ఎన్నో ఏళ్ళనుంచీ తాపసులు తపస్సు చేస్తున్నారా అన్నట్లుండే పెద్ద పెద్ద కైవారంతో ఉన్న దేవతా వృక్షాలు, గోమతీ నది, శ్రీ చక్ర తీర్థం ఇత్యాది ఎన్నో గొప్ప గొప్ప విశేషాలతో ఉన్న ప్రదేశం గొప్ప సాధనా క్షేత్రం. ఏదో చూసి వెళ్ళిపోదాం అనుక్కునేలాటి క్షేత్రం మాత్రం కాదు.

ఐనా సరే, ఒక్కసారి ఇందులో ప్రవేశిస్తే చాలు "రుజో హరం యస్య రజా పవిత్రం తేజోమయం యస్య తమసా పురస్తాత్..." నైమిశారణ్యంలోని రజస్సు (ధూళి, మన్ను, మట్టి) తాకగానే సకల పాపాలు హరించుకుపోతాయట,  చక్రతీర్థంలో స్నానం చేసిన భక్తులు, అక్కడి జానపదులు తడిబట్టలతో అడుగడుగు దండాలు పెడుతూ చక్రతీర్తానికి ప్రదక్షిణ చేస్తుంటారు... నైమిశారణ్య క్షేత్రానికి కూడా అరుణాచల గిరి ప్రదక్షిణ లాగ చేస్తారు కానీ అడవి ప్రాంతం కావడం మూలాన అక్కడి వారే చేస్తూంటారు, సింహాచల క్షేత్రప్రదక్షిణోత్సవంలాగా నైమిశారణ్యంలో ఏటా ఫాల్గుణ శుక్ల పంచమి నాడు చేస్తారని అక్కడి వారు చెప్పారు. సనాతన ధర్మంలో చరించే ప్రతి ఒక్కరూ నైమిశారణ్య క్షేత్రానికి వచ్చి చక్ర తీర్థంలో మునకలు వేయవలసిందే, చక్ర స్నానం చేసి ఒడ్డున ఉన్న యజ్ఞవరాహస్వామిని దర్శించాలి అందువల్ల అపార పాప హరం, కలిదోష హరం, యజ్ఞఫలితమూ కలుగుతాయని పెద్దల వాక్కు. దివ్య ధామానికి వచ్చి ప్రతి ఒక్కరూ కనీసంలో కనీసం ఒకరోజైనా నిద్ర చేసి అనుష్ఠానాదులు చేసుకొని, ప్రత్యేక దీక్షలు, మంత్రాలు ఉంటే ఇక్కడ సాధన చేసుకోవలసిందే ఎందుకంటే ఇది సిద్ధ క్షేత్రం. అందుకే వ్యాసులు కలి స్సాధుః  అన్నారు ఇందువల్లనే కదా మనకి నైమిశారణ్యమనే గొప్ప క్షేత్రం దొరికింది.

గోస్వామి తులసీదాసు గారి మాటలలో తీర్థ వర నైమిశ్ విఖ్యాతా! అతి పునీత్ సాధక్ సిద్ధిధాతా!!” అని అన్నారు. భూమండలంలో ఉన్న అన్ని తీర్థాలూ క్షేత్రాలుకలిసి పెళ్ళివారి ఊరేగింపుగా కదిలి వస్తే అందులో ముఖ్యమైనదీ మధ్యలో ఉండి అందరూ చూడాలనుక్కునేదీ ఐన వరుని స్థానంలో ఉండేది నైమిశారణ్యం. ఇది అతి పునీతమైనది సమస్త సాధకులకీ సిద్ధినొనరించే క్షేత్రముగా విరాజిల్లుతోంది.

వ్యాస, శుక, సూత, శౌనకాది మహర్షులు 88వేల మంది వారి వారి శిష్యగణాలు, అందులో శౌనకాదులు కులపతులు (11 వేల మంది శిష్యులను పోషిస్తూ వేదవేదాంగాలను బోధించేవారిని కులపతి అంటారు) దీర్ఘ సత్ర యాగం (1000 సంవత్సరాలు) చేసిన స్థలం అందునా యాగం జరిగిన చోట అన్ని వేల మందికీ అన్నదానం జరిగిన ప్రదేశం. అంత గొప్ప గొప్ప మునులు మహర్షులు, రాజర్షులు నడయాడిన ప్రదేశం దేవతలు మెచ్చి దర్శనమిచ్చే ప్రదేశం నైమిశారణ్యం. మూడు నాలుగు భాగాలుగా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను.
--
~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
जय जय शंकर हर हर शंकर
---
You received this message because you are subscribed to the Google Groups "సత్సంగము (satsangamu)" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to satsangamu+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to satsangamu@googlegroups.com.
Visit this group at http://groups.google.com/group/satsangamu.
For more options, visit https://groups.google.com/groups/opt_out.

No comments:

Post a Comment