Pages

Wednesday, October 9, 2013

బతుకమ్మ - గొబ్బిళ్ళు - సర్వమంగళాదేవియే

శ్రీ గురుభ్యోనమః
నమస్తే
బతుకమ్మ తెలంగాణాలోనే ఎందుకు జరుపుకుంటారు అన్న వ్యాసం చూసి చిన్నప్పటి జ్ఞాపకాలు తడిమి గుర్తు చేసుకున్న కొంత...

ఇటువంటి పండుగలు తెలంగాణాలోనే కాదు మొత్తం దక్షిణ భారతంలో ఉన్నాయి సమయం చేసే పద్ధతి వేరంతే, సంక్రాంతికి గొబ్బిళ్ళు పెట్టి గౌరిగా సర్వమంగళగా ఆరాధిస్తారు. అలానే కన్నెపిల్లల్తోటి తప్పక గొబ్బిళ్ళు పెట్టిస్తారు. తమిళనాడు పల్లెల్లో పండగలకి ముగ్గేసి గొబ్బిళ్ళు పెట్టడందానిమీద గుమ్మడి పూవు, లేదా పెద్దగా అరవిరిసే ఇతర పూవులైన మందార వంటివి పెట్టి పూజించడం ఆనవాయితీ. తిరువణ్ణామలైలో ఇప్పటికీ ప్రతి రోజూ చూడచ్చు (ముఖ్యంగా ఆది అణ్ణామలై దేవాలయం ఎదురుగా ఉన్న ఇళ్ళదగ్గర). గొబ్బిళ్ళైనా, బతుకమ్మైనా గౌరిపూజగా కన్నెపిల్లలు ముత్తైదువలు జరుపుకునే ఉత్సవం దీనికి వైదికత అంటూ ప్రత్యేకంగా ఉండదు ఒక జానపద సంబంధ ఉత్సవంలా ఉంటుంది. గొబ్బిళ్ళ పాటల్లోనూ, బతుకమ్మ పాటల్లోనూ గౌరి దేవి, సీతమ్మ, లక్ష్మీదేవి పేర్లతో పిలిచి పూజిస్తున్నట్లుంటాయి, శ్రీ రామడు ఇంకా శ్రీకృష్ణుడు యొక్క కథలని కూడా పాటల్లో కట్టి పాడుతారు ఏదైనా సరే భగవత్సంబంధ ఉత్సవాలే రెండూ.. పైగా కన్నెపిల్లలకి మంచి వరుడు రావాలనీ సుఖంగా జీవించాలనీ పెద్దలు కోరుకునే ఉత్సవాలే రెండూ.. భావం ఒక్కటే సమయం చేసే అలంకారం, కొంత పద్ధతి వేరు...

కానీ, నా చిన్నప్పుడు మహాలయ అమావాస్య నాడు మహర్నవమి నాడు పువ్వులతో చేసిన బతుకమ్మకు ఉత్సవం చేసేవారు మిగతా రోజులు గొబ్బిళ్ళలానే ఆవుపేడతో చేసిన ముద్దలకి పసుపు కుంకుమ పెట్టి చంద్రకాంతం పూలు అలంకరించి మంచి ముగ్గేసి అందులో పెట్టేవారు.  చాలా గొప్పగా ఉండేది చిన్నప్పుడు గోశాల కెళ్ళి పావలాకి ఆవు పేడ ఒక తట్టెడు నిండా తెచ్చేవాణ్ణి. చుట్టూ ఉన్న అన్ని ఇళ్ళల్లోకీ అందరికన్నా చిన్నవాణ్ణేమో నన్నే పంపించేవారు. పైగా అందరం పిల్లలం కలిసి డొక్కు సైకిళ్ళేసుకుని చెల్కలలో ఉన్న బావుల దగ్గర గుణుగు/గునక పూలు చిన్న తంగేడు చెట్లకి చెట్లు పెరుక్కొచ్చేవాళ్ళం, గన్నేర్లు, బంతి ఇలా ఎన్నో రక రకాల పూలు అలాగే సత్యనారాయణ చెట్టు అని చిన్నప్పుడు పిలిచేవాళ్ళం ఒక మొక్కని దానికి ఎరుపు, సింధూర వర్ణంలో పెద్ద పువ్వు పూస్తుంది చిన్న అరటి ఆకుల్లా ఉంటాయి సాధారణంగా పార్కుల్లో పెంచుతారు చెట్లని సత్యనారాయణస్వామి మంటపానికి కట్టేవారు అరటి స్తంభాలు దొరకనందుకు పూలు నాలుగైదు కోసొకొచ్చి బతుకమ్మ మధ్యలో మేరువులా పెట్టే వాళ్ళం, మా మాష్టారు చేసేవారు పెద్ద బతుకమ్మని. మళ్ళో దీంట్లో పోటీ మా పిల్లలకి పెద్దవాళ్ళు పెద్దది చేస్తే చిన్నపళ్ళాలు తీసుకొని ఎవరు ఎత్తుగా విడిపోకుండా చక్కగా చేస్తారు అని. 6-6:30 మధ్యలో పక్కింటి అక్క తన ఫ్రెండ్స్ ఇంటి ముందున్న గ్రౌండ్ మధ్యలో పెద్ద ముగ్గేసేవారు మధ్యలో పీట పెట్టి బతుకమ్మలు పెటి దీపం పెట్టి నైవేద్యంగా అటుకులు, పుట్నాలు, చక్కెర లేదా బెల్లంపొడి, కంపల్సరీగా జామ, సీతాఫల పళ్ళు (అందరిళ్ళల్లోనూ 2,3 చెట్లుండేవి). అక్కావాళ్ళు, అమ్మా పక్కింటి అత్తయ్యగారు ఇంకా బస్తీలో వాళ్లందరూ ఆడిన తరవాత నెమ్మదిగా బతుకమ్మను తీసుకెళ్ళి ఐదుపైసల బాయిలో(ఐదుపైసల నాణెం అంత లోతు బాయిలో పడినా స్పష్టంగా కనిపించేది అందువల్ల ఆపేరు) నిమజ్జనం చేసేవాళ్ళు రాజన్న & ఫ్రెండ్స్. ఇక అక్కవాళ్ళు మేము ప్రసాదం తీసుకొని దాల్దడి , దచ్చన్ పుడి అంటూ ముగ్గు మీద గిరగిరా రెండు చేతులూ పట్టుకుని తిరిగేసి ఆడేవాళ్ళం.

కాలేజి కొచ్చాక, ఆల్మోస్ట్ రాజన్నబాయి, ఆలియాబాద్, లాలదర్వాజలోని నాగుల్చింత బాయి తిరిగేసి గౌలిపురా గాంధిబొమ్మ దగ్గర ఆలయానికి వచ్చేవాళ్ళం అక్కడ బతుకమ్మబాయి ఉంటుంది ఫేమస్ అది బతుకమ్మపండక్కి, ఆల్మోస్ట్ తెలిసినవారందరూ అక్కడ కనపడేవారు. కలర్ ఫుల్ & యూత్ఫుల్. రకరకాల రంగుల్లో, చిన్న పెద్ద రక రకాల సైజుల్లో బతుకమ్మలు. మధ్యలో వరసయ్యే బావా మరదళ్ళ టీజింగ్స్, కొత్త స్నేహాలు. ‘రాబిడ్డా ఇంత ప్రసాదంతినిపో ఇంటికెల్లనీకె ఆల్సం ఐతది అని ప్రత్యేకంగా ప్రేమతో పులిహోర, పాయసం, చక్కిలాలు ఇచ్చి పెద్ద గ్లాసు నిండా చా ఇచ్చి పంపేవారు దగ్గర్లోని స్నేహితుల తల్లి దండ్రులు, ‘పంతులు (మా నాన్నగారు) మా ఇంట్ల తింటడా..’ అంటూ ప్రత్యేకంగాఅమ్మనాయినకియ్యి అని సాదా ముర్కులు, స్టార్ ముర్కులు (అలాగే పిలిచే వాళ్ళం ఇప్పటికీ అంతే లేదా అప్పుడప్పుడు సాఫ్ట్ జంతికలు, స్టార్ జంతికలు) ఒక డబ్బాలో వేసి సంచీలో పెట్టిచ్చేవారు, ఐనా నాన్నగారికి పట్టింపుల్లేవు.

సంస్కృతి ఆనందం ఆహ్లాదం కనపడట్లేదు, వినాయక చవితి పండుగలో ప్లాస్టిక్ కాగితాలు, రంగు చెంకీలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్లు, రెడిమేడ్ నైవేద్యాలు మైకు సెట్లు సినిమాపాటలు లాగ ఆడంబరం చోటు చేసుకుని అసలు ఎలా మాయం ఐందో బతుకమ్మ, గొబ్బిళ్ళు కూడా రాబొవు రోజుల్లో అంతేనేమో.. ఇప్పటి పిల్లలు ఇవన్నీ మిస్ అవుతున్నారు కాదు వాళ్ళకి మనం యధాతథంగా అందించలేకపోతున్నాం మన సంస్కృతి సంప్రదాయాలని..

కొత్త ఫ్లాట్స్ లోకొచ్చాం కదా పోయినేడాది ఇక్కడ అందరూ బతుకమ్మ ఆడతారనుక్కున్నా, ఇక్కడ మా ఫ్లాట్స్లోనే కాదు వీధిలో కూడా ఎవరూ బతుకమ్మ ఆడట్లేదు, మొన్నే మా ఆవిడకి చెప్పా పాటలు నేర్పు పిల్లలకి అష్టమి/నవమి నాడు బతుకమ్మ ఆడిద్దాం ఫ్లాట్స్లో అని... గొబ్బిళ్ళ అనుభవం పిల్లలకెలాగూ ఉందిగా..

ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయే చందమామ శివుడొచ్చె వేళాయె చందమామ శివుడు రాకపాయె చందమామ శివునికీ సిరి గద్దె చందమామ నాకు సారె గద్దె చందమామ రెండేసి.... లో ఐనా, గొబ్బీయళోయి గొబ్బిళ్ళు సుబ్బీ గొబ్బెమ్మ సుఖమూ లియ్యావే తామర పువ్వంటి తమ్ముణ్ణియ్యావే చేమంతి పూవంటి చెల్లెల్నియ్యావే అరటి పూవంటీ అక్కానివ్వావే పున్నాగ పూవంటీ అన్నానివ్వవే మొగలి పూవంటి మొగుణ్ణివ్వావె.. లో ఐనా ఉన్నది సర్వమంగళాత్వమే, గౌరియే...
అందుకే పసుపుల బుట్టే గౌరమ్మా, పస్పుల బుట్టె గౌరమ్మా పస్పుల పెరిగే గౌరమ్మా పస్పుల వసంతమాడె గౌరమ్మా పొన్నగంటితాళ్ళ కెల్లీ పోకలగంటీవనముల కెల్లీ.. మంగళం...
...


No comments:

Post a Comment