Pages

Tuesday, October 1, 2013

నీ మీద భక్తి ఏమివ్వలేదు?

శ్రీ గురుభ్యోనమః
నమస్తే
అనాయమ స్తోత్రంలోని మరో రెండు శ్లోకాలు అందరూ ఎరిగిన విషయమే ఐనా చెప్పిన పద్ధతి దాంట్లో దాచిన అసలు మర్మం ఆకట్టుకునేలా చేసింది

ఉద్ధృత్యైకం నయన మరుణం స్నిగ్ధతారాపరాగం
పూర్ణేధా ద్యః పరమ సులభే పుష్కరాణాం సహస్రే
చక్రం భేజే దహన జటిలం దక్షిణం తస్య హస్తం
బాలస్యైవ ద్యుతువలయితం మండలం భాస్కరస్య

విష్ణుమూర్తి ఒకనాడు నిన్ని సహస్ర కమలములతో అర్చించడానికి సంకల్పించి నీకు పూజాధికాలు ప్రారంభించి నీ గుణములను నామరూపంగా కీర్తనము చేస్తూ పద్మములతో అర్చిస్తుండగా ఒక్క కమలం తక్కువైంది. సర్వవ్యాపి ఐన విష్ణువుకి పూజనుండి తాను కదలకుండా మరొక్క కమలము తెచ్చి నీ పాదముల చెంత సమర్పించడం కష్టమేమీకాదు ఐనా ఆయన నీ పూజకు పనికివచ్చే పూవుగా తారలనే పరాగము కలిగిన అప్పుడే అరవిరుస్తున్న ఎర్రని సూర్యాత్మకమైన  (ఎర్రని బాల భాస్కరుడను కమలమును )తన కుడికంటిని పెకలించి నీకు సమర్పించి దానితో వేయి సంఖ్య పూర్తి అయినట్లు నీపాదములమీద ఉంచాడు. వెంటనే అగ్నిజ్వాలలు జడలు దాల్చాయా అన్నట్లు కనబడుతున్న కాంతుల వలయంతో చుట్టబడినదై, అదే బాల భాస్కరుని మండలముగా సుదర్శన చక్రము విష్ణుమూర్తి కుడిచేతిని చేరింది.

విష్ణు శ్చక్రే కరతలగతే విష్టపానాం త్రయాణాం
దత్తాశ్వాసో దనుసుతశిర శ్ఛేదదీక్షాం బబంధ
వ్రత్యాసన్నం తదపి నయనం పుండరీకానుకారి
శ్లాఘ్యా భక్తిస్త్రినయన భవత్యర్పితా కిం సూతే

అలా చక్రము తన చేతిలోకి రాగానే విష్ణువు మూడులోకములవారికీ ఆశ్వాసమును కలిగించి దానవుల తలలను ఖండించే దీక్షను పూనాడు. శివా! అతడు నీ చరణపూజకై పెకలించిన సూర్యాత్మకమైన పద్మమును పోలినదైన కుడికన్ను కూడా తిరిగి తన స్థానమును పొందింది.   శంభో! ప్రశంసనీయమగు ఉత్తమభక్తిని నీ చరణములయందు నిలిపినచో అది ఏమి ఇవ్వలేదు? అది సత్ఫలాన్నైనా ఇవ్వగలదు. ఎంత గొప్పవానిగానైనా కీర్తి కూర్చగలదు.

పరమేశ్వరునకు, స్తుతికర్తకు నమస్సులతో

No comments:

Post a Comment