..మునుపటి భాగం కొరకు ఈ క్రింద లంకెపై నొక్కగలరు
http://sri-kamakshi.blogspot.in/2013/10/1.html
శ్రీ గురుభ్యోనమః
నమస్తే
అమ్మవారి అభిషేకం సేవ కోసం ఎదురు చూస్తూ ఉండగా, అభిషేకానికి కావల్సిన సంబారాలు పెద్ద పెద్ద గిన్నెల్లలో లోపలికి మడిగా తీస్కెళ్తూ ఆలయం సిబ్బంది కనిపిస్తారు. లోపలనుంచి అర్చక స్వాములు బయటికొచ్చి ఒక్కో జంట పేరు పిలిచి లోపల గాయత్రి మంటపంలో ఈ శాన్యం మూల సంకల్పం చెప్పించుకోమని చెప్తారు. ఇక గాయత్రి మంటపంలోకి అమ్మఒడి చేరినంత ఆనందంగా అడుగిడుతూంటే లోపలికెళ్ళే ఈ మార్గాన్నే ధర్మమార్గం అనీ బయటికొచ్చేప్పుడు భిక్షామార్గమనీ అంటారు కదా అనుక్కుని వెనక్కి తిరిగి అన్నపూర్ణమ్మకి నమస్కరంచేసి లోపలికెళ్ళగానే తామర, మల్లెపూల వాసనలు, గంధం పాత్రనుండి గంధం వాసన అన్నింటినీ మించి గుప్పుమని కుంకుమ సువాసనలు. లోపలికెళ్తూంటే ఎడమ పక్కవేపు అమ్మవారి గర్భాలయగోడకు ఉన్న చిన్న మంటపంలోంచి కొద్దిగా వంగి చూస్తున్నట్లుండే చోర విష్ణువు విష్ణు మూర్తి ఎటుచూస్తున్నారో అటువేపు లక్ష్మీదేవి ఉంటారు. ఈమెను సురూప లక్ష్మి అంటారు, ఆ పక్కన అర్థనారీశ్వరమూర్తిని చూసి నమస్కరించి, ముందు సంకల్పం చెప్పించుకొని తరవాత మిగతా వివరాలు ఆలయంలోవిచూద్దాం అని సంకల్పం చెప్పేవైపుకు గర్భగుడికి ఈశాన్యం మూలకి వెళ్తు అమ్మవారిని ఒక్కసారి చూసి నమస్కరించి ఆ ముందున్న ఆదిశంకరాచార్య ప్రతిష్టిన శ్రీచక్రాన్ని చూసి నమస్కరించి ఆచార్యముఖేన అని సంకల్పం చెప్పించుకోవడానికి వెళ్ళి కూర్చుని అక్కడి అర్చక స్వాములు సంకల్పం చెప్పించాక చుట్టూ అమ్మవారి కుంకుమవాసన అంతా కుంకుమ మయంగా చీకటిగా ఉన్నచోట్ల నలుపుగా వెలుతురున్నచోట్ల ఎర్రని కుంకుమ కాంతులతో నల్లని నేలతో చుట్టూ 24
స్తంభాలతో గాయత్రి మంటపంలో బట్టలు చేతులు వళ్ళు కుంకుమ ధూమంతో కుంకుమ వర్ణంలో మారుతుంటే, ముక్కు పుటాలకి కుంకుమ ఘాటు సువాసన తగులుతుండగా పక్కగా నిల్చునుంటే ’మీరు ఇలా వచ్చి ముందుకూర్చోండి అని అర్చకులనగానే’ సింహవాహనానికి కొద్దిగా వెనక్కి ముందు వరసలో మా జంట కూర్చుని ఎదురుగా అమ్మ కామాక్షిని దీప మాల కాంతులలో చూస్తే, అమ్మవారు అంతకు ముందు భక్తులు సమర్పించిన పట్టుపుట్టాలన్నీ కట్టుకొని రంగు రంగుల చీరలతో ఉన్నట్లు, ఎరుపు, పసుపు,ఆకుపచ్చ, నీలం, నెమలి కంఠం, మామిడి, వంగపండు ఇలా రక రకాలైన పట్టు చీరలు అమ్మకి అలంకారం చేసి పైకి మాత్రం ఎర్రని చీర పచ్చటి అంచుతో ఉన్నదాన్ని కొంగు గా అమర్చి ఉంటే చూసి ఆనందిస్తూ నమస్కారం సమర్పించుకున్నా.
ఆ దీపపుకాంతుల్లో అమ్మవారి రత్న కిరీటం, చంద్రవంక, పెద్ద బొట్టు, ఆ దీపపు కాంతుల్లో కొద్దిగా మెరుస్తూ మనని చూస్తూ ఆనందిస్తున్న విప్పారిన కళ్ళు, పిల్లల్ని చాలారోజుల తరవాత చూసానన్నట్టుగా సంతోషంతో చిరునవ్వు, ఆ పైన ముక్కుకి పోలికలేని మెరుపులతో కూడిన రత్నాల ముక్కెర, చెవులకి పెద్ద పెద్ద ఆభరణాలు, మెడలో మల్లెపూలతో చేసిన పెద్ద లావుపాటి గజమాల, తామరపూల మాల మెడలో అమ్మవారి పాదాలదాకా వచ్చి ఉంటే, మధ్యలో ఇంకా చిన్న చిన్న బిల్వ మాల, మల్లె, గులాబిల మాలలు చూస్తూ పక్కకి చూస్తే అమ్మవారి కుడి చేతిలో ఐదు పువ్వులబాణాల గుత్తులు పైన చిలుక, ఆ పైచేతిలో అంకుశం, ఎడమ వేపు క్రింది చేతిలో చెరుకు విల్లు, పై చేతిలో పాశము చూసి
"అయ్యో అమ్మ పాదాలు కనపడలేదు" అనుక్కుంటూ అమ్మవారికి కుడివేపున క్రింది వేపున ఏదోఉన్నదని కనిపించి నేను ఎడమవేపుకి కొద్దిగా వంగి చూస్తే, అదిగో తపోకామాక్షి అమ్మవారి మూర్తి ఒక కాలు ఎత్తి ఒక కాలిమీదే తపస్సు చేస్తున్న మూర్తిని చూసి మా ఆవిడకి ఇదిగో అమ్మవారు తపస్సు చేస్తున్నప్పటి మూర్తి దణ్ణం పెట్టుకోమని చెప్పి కూర్చుంటే, అమ్మవార్ని అంత దగ్గరగామొదటి గుమ్మంలో శ్రీ చక్రం రెండో గుమ్మంలో
"అమ్మవార్ని చూస్తూ ఏం చెప్పుకోవాలో, ఏం చేయాలో తెలీక అమ్మని తదేకంగా చూస్తూ, ఏం ప్రేమమ్మానీది దగ్గరగా చూడనిద్దామని అందర్లోకీ ముందు కూర్చోబెట్టుకొన్నావా!"
అని అమ్మ కరుణ తలుస్తూ కూర్చుంటే, అర్చక స్వామి మడి కట్టుకు వచ్చి ఎదురుగా ఉన్న తెర వేసి లోపలికెళ్ళి అలంకారం అంతా తీసు ఆకుపచ్చని స్నాశాఠీ అమ్మవారికి కట్టి అభిషేకానికి సిద్ధంచేసి తెర అడ్డుతీయగానే వెనకవైపు ఆలయం వెలుపలనుంచి చూస్తున్నవారందరూ అన్ని భాషలవాళ్ళూ అమ్మా అమ్మా అంటూ గట్టిగా పిలుస్తూంటే హారతి ఇచ్చి వెనకవారికి పంపిస్తే అమ్మవార్ని ముకుళిత హస్తాలతో అలా చూస్తూంటే వెనక ఎవరో తల్లి ..కంజదళాయతాక్షి కామాక్షి…. అని స్వరరాగ యుక్తంగా కీర్తన చేస్తుంటే పక్కనున్న అర్చకస్వాములలోని శ్యామశాస్త్రిగారి వారసులూ ఆకీర్తనకి తాళం వేస్తూ పాడుతూ సంబారాలు సమకూరుస్తుండగా.. అర్చక స్వాములు అభిషేక సంబారాలు ఒక్కొక్కటీ గుండిగలలో లోపలికి తీసుకెళ్ళి అమ్మవారి మీద మొదటగా పాలు అభిషేకించగానే, ఒళ్ళు పులకించి అప్పటి వరకూ చీకట్లో ఉన్న దీపపుకాంతిలో నలుపుగా కనపడ్డ అమ్మవారు తాను కేవల మూర్తిని కాననీ సగుణంగా చైతన్యానికి తానే మారు పేరనీ ఎవరికైనా అనుమానముంటే తెలిసేలా స్పష్ఠంగా తెల్లని పాల తెరలో దర్శనమిస్తుంది. అమ్మవంటిమీదనుంచి జారుతున్న తెల్లని పాలు అమ్మవారి రూపాన్ని స్పష్ఠంగా గోచరింపచేస్తాయి.
తరవాత తిరిగి నీటితో అభిషేకించి అయ్యింతరవాత పెరుగుతో అభిషేకం చేస్తుంటే పాలు పల్చగా ఉంటాయి కాబట్టి తొందరగా జారిపోతాయి అమ్మవారినుంచి పెరుగుని ఒకసారి కలశంతో కలిపి అమ్మమీదనుంచి అభిషేకం చేస్తుంటే చిక్కగా అమ్మవారి మీదనుంచి ఆయుధాల మీదనుంచి పాదాల వరకు చిక్కగా బిళ్ళలుబిళ్ళలుగా జారుతుంటే, ఆకుపచ్చ స్నానశాఠీ మీద మల్లెలు అద్దినట్లుగా కనిపిస్తుంది. తిరిగి నీటితో అభిషేకం చేసి పూసలు కట్టి మంచి వాసన వస్తున్న తెల్లని నేతిని అమ్మవారికభిషేచనం చేస్తే, ఆనెయ్యి అమ్మవార్ని స్నిగ్ధలా అంటుకుంటుంటే “అంతే కదమ్మా మరి ఘృతరాశిఘనీభూతం ఐన మా అయ్యవార్ని స్నిగ్ధలా అంటిపెట్టుకున్నావ్గా అదే లక్షణం దీనికీ వచ్చింది” అని అనుక్కుంటుండగా అర్చకస్వాములు తిరిగి నీటితో అభిషేచనం చేసి రెండేసి బిందెల తేనెతో అభిషేకం చేస్తుంటే ఆ తేనె అమ్మవారి తలమీంచిచెంపల పక్కగా జారుతూంటే అమ్మవారి కురులు కదులుతున్నాయన్నభావన కలుగుతూ చూస్తుంటే తేనె సాంతం అమ్మవారిమీదనుంచి పాదాల వరకూ జారుతూ ఆకుపచ్చని స్నానశాఠీమీద నుంచి తేనెరంగు నెమ్మదిగా జారుతూంటే ఓహో అమ్మవారికి రెండు రంగుల కలనేత బట్టకట్టారనిపిస్తుంది.
అర్చక స్వాములు నీటితో అభిషేకించి చక్కెర పళ్ళాలతో చేతులు పైకెత్తి అమ్మవార్ని అభిషేకిస్తుంటే చీకట్లో ఊర్థ్వలోకాలనుంచి దేవతలు అమ్మవార్ని తమ దివ్య కాంతులు ఆమె ప్రసాదమే వాటితోటే ఆమెకభిషేకం చేస్తున్నాం అన్నట్లు గా తెల్లగా అమ్మవారిమీదనుంచి ధారగా పడగా, మళ్ళీ నీటితో అభిషేకించి పసుపు కలిపిన చిక్కటి నీళ్ళతో ఆ పైన కుంకుమ కలిపిన చిక్కటి నీళ్లతో అభిషేకిస్తుంటే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే.. అమ్మా శరణు అని నమస్కరిస్తూ చూస్తుంటే ఎన్నో రకాల పళ్ళ ముక్కలతో అమ్మవారికి అభిషేకం చేసి వాటిని తీసి పక్కన ప్రసాదంగా ఇవ్వటానికి ఉంచి తిరిగి నీటితో అభిషేకం చేస్తూండగా బయట ఉన్న అర్చకులు ఇవ్వాళ ప్రత్యేకంగా చందనాభిషేకం చేస్తున్నాం జాగ్రత్తగా చూడండి అని చెప్తే ఓహ్ ఏమి భాగ్యం అని చూస్తుంటే అమ్మవార్ని చందనం బక్కెట్లలోంచి కలశాల్తో చందనంతో అభిషేకిస్తూంటే ఆ చందనం రంగులో అమ్మవారు మనముందు కదలాడేమూర్తిలా ఉంటే పాదాల దగ్గర స్నానశాఠీ మడతపడి చందనం సరిగ్గా అలదుకోకపోతే అర్చకస్వామి "స్నానశాఠీని సరిచేస్తూండగా అమ్మపాదాలు వాటిమీదున్న గోర్లు చూసి ఇప్పటికి కరుణించావా అమ్మా నీ పాదాలు చూపి"
అనుక్కుని నమస్కరించి చూస్తే అమ్మవారు యావత్తూ చందనంతో అభిషేకించబడి పిలుస్తున్నట్లు కనపడుతూ అప్పటివరకూ కుంకుమ వాసనలు కొట్టగా ఇప్పుడు గంధం వాసనలు కొడ్తూంటే అర్చకులు ఒక్కసారి తెరలాగేసి అడ్డువేయగా అయ్యో అని అమ్మ ఆరూపమే తలుస్తూ కూర్చుంటే ఈలోగా మా ఆవిడ “సుధామప్యా స్వాద్యప్రతిభయ జరామృత్యుహరిణీం….” అంటూ సౌందర్యలహరి శ్లోకం ఒకదాని వెంట ఒకటి చదువుతూంది. వెంటనే పక్కన ఇంకో తల్లి ఆ వెనుక ఇంకో శ్లోకం చదువుతూ చక్కగా ఉంది బయట వెనకవేపు దూరంగా ఎవరో కీర్తన పాడుతున్నారు.
ఈలోగా లైట్లు ఆర్పేసి ఒక్కసారి తెర తీసారు అందరూ ..అమ్మా అమ్మా అమ్మా కాపాడమ్మా.. తెలుగు తమిళ కన్నడ హిందీ ఒకటేమిటి అందరూ అన్ని భాషలవారూ బయటనుంచి వేడుకుంటున్నారు అర్చకస్వామి నన్ను చూస్తూ జాగ్రత్తగా చూడండి అంటూ పెద్ద హారతి వెలిగించి అమ్మవారి ముఖం ముందు చూపగా అమ్మవార్ని పూర్తి చందన చర్చిత చేసి కళ్ళు కజ్జలంతో తీర్చి పెదాలు కుంకుమతో దిద్ది మెడలో సన్నని మల్లెమాల ఒకటి వేసి ఇక ఏ ఇతర అలంకారమూ లేకుండా హారతి వెలుతురులో చూపుతున్నారు. హారతి అమ్మవారి ఎడమవేపుకెళ్తే అమ్మవారు కుడివైపుకి కళ్ళు తిప్పుతూ, కుడివైపుకి హారతి వెళ్తే ఎడమవైపుకి కళ్ళుతిప్పుతూ నవ్వుతూ ఆకర్ణాంతమూ తన కళ్ళని తిప్పుతూ వచ్చిన అందర్నీచూస్తుండగా (హారతి ఇస్తున్నప్పుడు అమ్మవారి కళ్ళు ఆకాంతిలో మనని చూస్తున్నట్లనిపించే దర్శనమే దర్శనం వెళ్ళనివారు చూడనివారెవరైనా ఉంటే తప్పక చూడాల్సిందే) నమస్కరించి హారతి కళ్ళకద్దుకోగా తిరిగి అర్చకస్వాములు తెరలాగి మిగతా అలంకారం చేసి మనం తెచ్చిన పట్టుపుట్టాలన్నీ కట్టు అందునా అమ్మవారికోసం ప్రత్యేకంగా మా అమ్మనాన్నలు కొనిచ్చిన ఎర్రని మిరపపండు రంగు బంగారు జరీ ఆకుపచ్చ అంచు చీర పైకి కనపడేలా కట్టి గజమాలలు వేసి తిరిగి మిగిలిన పూజచేయడానికి తెర తీసారు. హా...బ్బ నాతల్లి కరుణించిందని సంతోషించి మాఆవిడ, నేను వెలిగిపోతున్న మొహాలతో ఒకరినొకరు చూసుకొని అమ్మని చూస్తూ ఉండగా అర్చకస్వాములు కుంకుమని చేతికి తాకించి శ్రీ చక్రానికి ఒక్కో నామం చదువుతూ కుంకుమ పూజ చేసి కొద్దిగా తీసుకొని పూర్ణదీక్షాపరులైన సహ అర్చకులకిచ్చి ఎదురుగా కూర్చున్న మాకు చిటికెడిస్తే కొంత మా ఆవిడకిచ్చి నేను నుదుటపెట్టుకొని యజ్ఞోపవీతానికి కొంత తాకించి ఆ చిటికెడులోనే సగం వెనక కూర్చున్నవాళ్లకిస్తే అందరికీ ఇస్తారు కంగారులేదు అని తమిళం తెలుగు కలిపి పక్కన అర్చకస్వామి అంటే అలాగేనండీ అని నమస్కరించి అమ్మవారిని చూస్తూ గంధం కుంకుమ మిళితమైన సువాసనలాఘ్రాణిస్తూ అంత వేడిలోనూ చెమటలు లెక్కచెయకుండా ఉంటే తిరిగి తెర అడ్డువేసి అమ్మవారికి ప్రత్యేకమైన పదార్థాలతో నివేదన చేస్తుంటే, మా ఆవిడ ‘ఇక్కడ ప్రసాదం ఏమిస్తారు?’ అనడిగితే ‘ఏమో… అమ్మదయ’ అని నేనని చూస్తుంటే నైవేద్యం తరవాత మహా హారతి ఇచ్చి మంత్రపుష్పం లోపలే చెప్పి అందరూ లేచి వరుసగా రండి అని అనగానే వెనకవాళ్ళు తోసుకోకుండా రండి అంటూ లేచి పక్కకి జరిగి స్థలాభావంవల్ల పంచాంగ నమస్కారం చేసి కుడివైపుకు కదిలితే అర్చన చేసిన కుంకుమ కాగితాలలో అర్చకస్వాములు ఇవ్వగా ఆ కుంకుమ తీసుకొని ముందుకు వెళ్ళి అమ్మవారి ఆలయ ఎడమవేపు గోడ చివర్లో ఉన్న విరూప లక్ష్మి అమ్మవారి మంటపం దగ్గరకెళ్ళి అమ్మవారి ముఖం మాత్రం విరూపంగా ఉండడం చూసి ఆ కుంకుమంతా చేతిలోకి తీసుకొని విరూప లక్ష్మిఅమ్మవారి శిరస్సు నుంచి పాదాలవరకూ అలది ఆ పాదాల వద్ద పడిన మిగిలిన కుంకుమ తీసుకొని వెనక్కి వస్తుంటే పక్కనే ఉన్న వారాహీ అమ్మవార్ని అమ్మా రక్షించు అని నమస్కరించుకొని వెండి తొడుగున్న సంతానస్తంభానికి, అలాగే అసలు కంచీ క్షేత్రంలో ముఖ్యమైన నాభిస్తానం చూసి అక్కడ నమస్కరిస్తుంటే వెంటనే అర్చకులు కదలండి చాలామంది వస్తారు అని అంటుంటే (అందరికీ నాభిస్థానం దర్శిమ్చుకునే అవకాశం ఇవ్వరట ఎందుకో ఆ రహస్యం మాత్రం నాకు తెలీదు) కుంకుమ ప్రసాదం తీసుకొని ముందు వచ్చిన దారిలోనే బయటకు వస్తూ తిరిగి అమ్మను చూసి నమస్కరించి ముందుకు రాగా అభిషేకం చేసుకున్నవారికి అమ్మవారి ప్రసాదంగా పులిహోర, మినపగారెలు, పళ్ళముక్కలు, పాయసం, కుంకుమ పొట్లం ఒక చిన్న డబ్బాలో అమ్మవారిమీంచి పడిన గంధం ఇస్తూ అమ్మవారికలంకరించిన పేద్ద పూలమాలని నా మెడలో వేసి మా ఆవిడకి చక్కని మల్లె దండ చేతిలో పెట్టారు, అవితీసుకొని వారికి నమస్కరించి వారి ఆశీర్వచనం తీస్కొని ముందుకు కదిలాం.
అలా ముందుకు కదులుతూ మొదట చూసిన సురూప లక్ష్మిని, చోర విష్ణువును, అర్థనారీశ్వరమూర్తిని తిరిగి చూసి అక్కడ ఉన్న విరూపలక్ష్మియే అమ్మవారికి పూజించిన కుంకుమ ధారణం వల్ల తిరిగి విష్ణుశాపాన్ని పోగొట్టుకొంది అని మా ఆవిడకి చెప్పి ఇంతకు ముందు లోపలికి వచ్చిన గుమ్మం మధ్యలో తాడుకి అవతలి పక్కగా బయటికొస్తూ దీన్నే భిక్షామార్గం అంటారు అని మెట్లు దిగి ముందుకు చూస్తే ఎదురుగా అన్నపూర్ణ అమ్మవారి చిన్న ఆలయం అమ్మకి నమస్కరించి తల్లీ నీ వల్ల ఎన్నో లోకాలు కాపాడబడుతున్నాయి, లోకంలో ఎవరికీ అన్నపానాలకు లోటులేకుండా చూడమ్మా అని చెప్పుకొని నమస్కరించి పక్కగా ఇంతకు ముందు చూసిన రాజ శ్యామలా దేవి ఉన్న ఆలయం మంటపం మెట్లే ఎక్కి అమ్మని చూసి పక్కనే ఉన్న బంగారు పాదుకలను చూసి తిరిగి బయటికొస్తూ పూర్ణాపుష్కలాంబా సమేత అయ్యప్ప స్వామిని చూస్తూ నమస్కరించి స్వామి మళ్ళీ మళ్ళీ వచ్చే అనుమతివ్వు అని ప్రార్థించి ఆది శంకరులకు పునః నమస్కరిమ్చి బయటికివస్తూ మెట్లెక్కుతూ కుడివేపు లీలగా కనిపిస్తున్న దుర్వాసోమునికి నమస్కరిస్తూ గుమ్మందాటి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం దాటి ఎడంపక్కన ఉన్న గణపతికి తిరిగి నమస్కరించి వెనక్కొచ్చి ముందుకెళ్ళి ఆలయం వారి కార్యాలయం చూస్తూ బయటికి వచ్చి ఆ మంటపంలోనుంచీ బయటికి వచ్చి ఎదురుగా పటాలు, మెడలో వేసుకునే బిళ్ళలు కొందామని ఉన్న చిన్న కొట్టు దగ్గరికి వెళ్తే పోయినసారి ఉన్నాయనే కనపడితే ‘గుర్తు పట్టారా పోయిన్సారి ఇలా వచ్చాం’ అని ఆవివరాలు చెప్తా ‘ఓహ్ అవునవును మా అబ్బాయీ కూకట్పల్లిలోనే ఉంటున్నారు కలవండి వీలైతే’ అని పోయిన్సారిలాగానే ప్రత్యేకంగా ఉండే అమ్మవారి మూర్తుల చిత్రాలను లోపల్నుంచి తీసి ‘వీటి విలువ అందరికీతెలీదు అందుకే లోపల దాస్తాం’ అంటూ మనందరికీ తలా ఒకటీ పంచుతే అ ప్రత్యేక మూర్తులను తీసుకొని నమస్కరించి తిరిగి వెనక్కి చూసి నమస్కరించి రాజద్వారం గుండా బయటికి వచ్చి యాత్రినివాస్లో రూముకెళ్ళి అమ్మవారి ప్రసాదం అందరిచేతిలో తలా ఇంత పులిహోర, పాయసం, పళ్ళముక్కలు, మినపగారె ముక్కలు తీసుకొని తిని చేతులు కడుక్కోగానే యాత్రీనివాస్ మేనేజర్ చంద్రుగారు వచ్చి “అర్చక స్వాములు కబురు చేసారు ఇవాళ శుక్రవారం పౌర్ణమి ప్రత్యేకంగా సాయంత్ర తంగతేరుసేవ ఉంది ఇంకా ఎవరూ టికట్లు కొనలేదు అన్నీ ఉన్నాయి మీరు తీసుకుంటారా?” అనగానే “హమ్మబాబోయ్ అమ్మవారికి బంగారు రథం ఊరేగింపు సేవ అవకాశమొస్తే వద్దంటామా.. మా వంటిమీద బంగారం తాకట్టుపెట్టైనా చేసుకోమూ..!” అనుక్కుంటూ “అలాగే, టికట్లు అన్నీ మాబృందానికే కావాలి” అని వారికి చెప్పి అందరూ కాస్త విశ్రమించండి తిరిగి సాయంత్రం తంగతేరు ఉత్సవానికి వెళ్ళాలని పెద్దలు చెప్తూంటే.................... లీలగా ఆ మాటలు వింటూంటే.........
రేపు లలిత పంచమినాడు ఇంట్లో రాజరాజేశ్వరీ అమ్మవారి గుళ్ళో అర్చకస్వామి భార్యకి సుహాసినీ పూజ అనుక్కున్నాం కదా! ఆవిడని, ఇతర ముత్తైదువలని ఆహ్వానించి వచ్చాను, సంబారాలు అన్నీ ఎప్పుడు తెస్తారు? రోజూలా ఇవ్వాళ సాయంత్రం లేటుగా రాకండి అని మా ఆవిడ....
జయ జయ జయ జయ కామాక్షీ - జయ జయ జయ జయ కామాక్షీ
- శంకరకింకర
(అసలే భాష రాదు, వ్యాకరణం రాదు, వ్యాకరణము అక్షరదోషాలు ఎన్నో ఉండచ్చు దీన్ని పేరాలుగా కూడా సరిగా విభజించలేను, గమనించి అమ్మ నన్ను మన్నించగలదు.)
సర్వం శ్రీ ఉమామహేశ్వరపరబ్రహ్మార్పణమస్తు
Enta adbhutamga chepparu !!
ReplyDeleteChinnappudu Amma ni 2 sarlu darsanam cheskunna . Modatisari Edo divya akarshana chustu undipoyanu.Appatlo darsanam chala sepu cheskovali avem telivu Chinna pillanni. Ooha ochaka Lalithamba ga Amma under ekaika kshetram ani telsukuni enta ga edchano Amma ni darsanam ela avtundi nenoka vidyarthi ni ! Peddayye varaku Naku dikku Leda ? Ne kataksham na mida padada ani kungipoya. Anukokunda evarno kalavadam, vallu Nannu Kanchi teeskeldam, Amma ni chooddam. Na jeevitam lo most miraculous incident .Abhisekam eppudu chustano ??