Pages

Tuesday, October 1, 2013

విజయ దశమి ఏరోజు? 13 Oct or 14 Oct ?

శ్రీ గురుభ్యోనమః
విజయ దశమి వ్రతం ఏరోజు చేసుకోవాలి అన్న విషయం గూర్చి  ముఖ్యంగా సంవత్సరం కొందరు 13 అనీ కొందరు 14 అనీ చెప్తున్నారు, ముఖ్యంగా విజయ దశమి వ్రతం నిర్ణయం ఎలా జరుగుతుందో పరిశీలిస్తే

అసలు విజయ దశమి అంటే విజయ అనే ముహూర్త కాలం ఉన్న దశమిని విజయ దశమి అంటారు. "సాతు తారకోదయవ్యాపినీ గ్రాహ్యా, తదుక్తం చింతామణౌ, అశ్వినస్య సితే పక్షే దశమ్యాం తారకోదయే సకాలో విజయోనామ సర్వకామార్థసాధకః.." ఆశ్వయుజ మాసంలో వచ్చే శుక్ల పక్ష దశమి తిథి సాయంత్రం నక్షత్రాలు ఉదయించేవేళ కొద్ది కొద్దిగా నక్షత్రాలు కనిపించినపుడు ముహూర్త కాలానికివిజయఅని పేరు. అందువల్లనే విజయ అనే కాలం తో కూడిన దశమినే విజయ దశమి అంటారు. దీని వల్ల సుస్పష్టం ఏమంటే సూర్యోదయానికి దశమి ఉన్నదాలేదా అనే విషయంతో విజయదశమికి సంబంధంలేదు. తారకోదయ వేళ అంటే సూర్యాస్తమయం అనుక్కోండి, అప్పుడు దశమి ఉంటే ఆరోజు విజయ దశమి.

ఒక వేళ రెండు రోజులు దశమి ఉంటే (దిన ద్వయం) ఉంటే? ఉదయం నుంచి దశమి ఉన్నా తిథి ఆరోజు నక్షత్రోదయం వరకూ వ్యాపించి ఉండాలి. ఏకాదశితో కూడకూడదు, నవమితో కూడిన దశమి తిథినాడు అమ్మవారిని అపరాజితా అన్న పేర పూజించాలి, (శమీ వృక్షమును అమ్మవారిగా పూజిస్తారు కూడా) అపరాజితా పూజ నవమితో కూడిన దశమి తిథిలో చేయాలి, ఏకాదశితో కూడిన దశమి వేళల్లో కాదు. నవమితో కూడిన దశమియే అపరాజిత, ఆరోజు దేవీపూజ సకల విజయాలనూ కలిగిస్తుంది.

ఒక వేళ రాత్రి 7 గంలకో దశమి వచ్చి ఉదయం 11 గంలకి వెళ్ళి పోయిందనుక్కోండి అప్పుడు విజయ ముహూర్తం దశమి తిథిలో కలగనప్పుడు కాలం శ్రవణా నక్షత్ర స్పర్శ దశమికి ఏరోజు ఉంటే ఆరోజే విజయ దశమి

సాతు తారకోదయవ్యాపినీ గ్రాహ్యా, తదుక్తం చింతామణౌ, అశ్వినస్య సితే పక్షే దశమ్యాం తారకోదయే సకాలో విజయోనామ సర్వకామార్థసాధకః.దినద్వయే తద్వ్యాప్తౌ వా అపరా, అపరాజిత పూజాయాం పూర్వైవ తదుక్తం హేమాద్రౌ స్కాందే. దశమ్యాం తు నరై స్సమ్యక్ పూజనీయా విరాజితా, ఐశానీం దిశమాశ్రిత్య అపరాహ్ణే ప్రయత్నతః యా పూర్ణా నవమియుక్తా తస్యాం పూజ్యాపరాజితా, క్షేమార్థం, విజయార్థం పూర్వోక్త పధినా నరైః, నవమీశేష సంయుక్త దశమ్యా మపరాజితా, దదాతి విజయం దేవీపూజితం జయవర్థినీ, అశ్వీకశుక్లపక్షే తు దశమ్యాం పూజ్యయేన్నరః, ఏకాదశ్యాం కుర్వీత పూజనం చాపరాజితమ్.... దినద్వయే ఏకాదశముహూర్తవ్యాప్తావవ్యాప్తౌ వా శ్రవణయుక్తా గ్రాహ్యా తథాచ హేమాద్రౌ... (స్కాందం మరియు వ్రత చూడామణి)

క్రింది మూడింటినీ చూసి విజయ దశమి నిర్ణయిస్తారు.

1.    నవమితోకూడిన దశమి
2.    విజయ ముహూర్తంతో ఉన్న దశమి
3.    శ్రవణంతో ఉన్న దశమి
ప్రకారం విజయ నామ సంవత్సరంలో విజయ దశమి 13 అక్టోబరు 2013నాడే కదా!
ఇక ఆరోజు చేయవలసినది శమీపూజ(అపరాజితా పూజ) సీమోల్లంఘనం, విజయ కాంక్ష కోరుకునేవాళ్ళు విజయ యాత్ర లేదా శుభయాత్ర చేయాలి. శమీ వృక్షం వద్ద అమ్మవారిని మధ్యాహ్నం పూజించి విజయ ముహూర్తంలో సీమోల్లంఘనం చేయాలి అంటే ఊరి పొలిమేర దాటి తిరిగి రావాలి. అంటే విజయ ముహూర్తం కన్నా ముందరే శమీ వృక్షం వద్ద చక్కగా అలికి ముగ్గులు పెట్టి మంటపంలో అమ్మవారిని అపరాజితగా పూజించాలి, లేదా శమీ వృక్షాన్నే అపరాజితా అమ్మవారిలా పూజించాలి. తరవాత అక్కడి మట్టి కొద్దిగా ఇంటికి తెచ్చుకోవాలి, ఆకులు తెంపరాదు. మట్టి తెచ్చుకొని నుదుట ధరించవచ్చు, లేదా ఇంట్లో ఉన్న ఇతర చెట్ల మట్టిలో కలపవచ్చు.

అపరాజితా పూజ వల్ల విజయం సిద్ధించి ఎవరిచేతా ఓడింపబడకుండా ఉంటారు అని చెప్తారు. తరవాత విజయ యాత్ర/శుభయాత్రలాగా సీమోల్లంఘనం చేయాలి విజయ ముహూర్త కాలంలో ఐతే శ్రేష్ఠం. అప్పుడు యాత్ర మొదలు పెట్టినా గ్రహ నక్షత్ర ఫలితాలకతీతంగా ఉత్తమ ఫలితాలు విజయం సిద్ధిస్తుంది కనుకనే ముహూర్తానికి విజయ అని పేరు. ఇంటికి తిరిగి వచ్చి లక్ష్మీ పూజ చేసుకోవచ్చు ఇంట్లో అందరికీ ధన వస్త్ర కాంచన, కానుకలు యథాశక్తి ఇచ్చి పుచ్చుకోవాలి.

ఇక ప్రస్తుతం చేస్తున్నవి చేయకూడనివి ఏంటంటే జమ్మి పూజ పేరిట సాయంత్రం నుంచి రాత్రి వరకు జమ్మి చెట్టును ముట్టుకొని ఆకులు తెంపుతుంటారు అది చేయకూడదు. అసలు సాయంత్రం చెట్లమీద చేయి వేయకూడదు, అందునా చెట్టుగా అమ్మవారిని పూజించామో అప్పుడే చెట్టు ఆకులే తెంపేస్తే పూజించినట్లా బాధించినట్లా.

విజయ యాత్రగా ఆరోజు ప్రస్తుతం మనముంటున్న కాలనీయో ఊరో దాటి ఏదైనా దగ్గర్లో ఉన్న గుడికి వెళ్ళి రావటం మంచిది.

సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు


2 comments:

  1. Mee suchana, vyakhya salaha....adhbhutham.....chaalaa chakkani vivarana

    ReplyDelete
  2. స్వాగతం రావుగారూ!
    ధన్యవాదాలండీ

    ReplyDelete