Pages

Friday, December 21, 2012

పెద్దలతో మాట్లాడేప్పుడు

నమస్తే
మీకు పెద్దలు భాగవతులైన వారు సమయమిచ్చి సావకాశంగా మాట్లాడమంటే అభివాదం చేసి, కుశల ప్రశ్నానంతరం మీరేమి మాట్లాడదలుచుకున్నారో మాట్లాడండి. ఏమి మాట్లాడాలో ముందుగా నిర్ణయించుకోండి. తప్పుగా అనుక్కోకండి, విషయాన్ని సాగదీయకుండా, మధ్య మధ్యలో ఆప కుండా, (without continuos long pauses) క్లుప్తంగా పూర్తి భావం ప్రకటించగలిగేలా మాట్లాడండి. నేను నాది లాంటి అహం పొడచూపే మాటలు వద్దు. మీ తల్లి దండ్రులు, గురువులు, మీ వంశంలోని పెద్దల గూర్చి అడిగినప్పుడు ఉన్నతంగా కీర్తించండి కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీ పెద్దలతో కలిసి వెళ్తున్నప్పుడు మీరు మీ పెద్దల్ని డామినేట్ చేస్తునట్లు భావన ఇవ్వకండి. మీరు మాట్లాడినా, మీ కన్నా ముందుగానీ, మీ పక్కన గానీ ఉంచుకుని మాట్లాడండి. అతి ముఖ్యంగా వారు మీకు సమయమిచ్చారు కాబట్టి మీకొరకు వారెదురుచూసే విధంగా చూసుకోండి. సమయపాలనం ముఖ్యం. అలా అని వారు 10గం అని చెప్పారని సమయానికి వేరెవరో ఉన్నా లోపలకి దూరి పోకుండా, అక్కడి వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి మీరు వచ్చిన సమాచారం ఇచ్చి వారి పిలుపుకై ఎదురు చూడండి. వారు చెప్పిందానికన్నా ఐదు నిమిషాలు ముందే వారున్నచోటికి వెళ్ళి సమయానికి వారిని కలవడానికి వెళ్ళడం మీ కర్తవ్యం పావుగంట సమయం అంటే అందులోనే మీ పరిచయాదులు మీరు చెప్పాల్సిన విషయం అంతా జరగాలి, వారు ఆనందంతో మీకేదైనా చెప్తే వినడమే మీరు చేయవలసినది, అలా ఆలస్యమైతే.. తిరిగి వారు పంపడం వారి ఇష్టం. అలా అని వారు వెళ్ళమనలేదని అక్కడే ఉండకండి. పనైపోతే బయలుదేరతామని మీరే చెప్పండి, ఆగి ఏమైనా సేవించి వెళ్లమంటే వద్దనకుండా తీసుకోండి అది భాగవతోచ్చిష్టం. మధ్య మధ్యలో వారికి ఇబ్బందిలేకుండానే మీరున్నారని చెక్ చేసుకోండి.
సాంప్రదాయ ఆహార్యం ముఖ్యం శూన్య లలాటంతో వెళ్ళకండి. వారి దేవతార్చనకై (భోజనానికని కాదు) కొన్ని పండ్లు, పువ్వులు వీలైతే తీసుకెళ్ళండి. వారు ఎటువంటి త్వరలోనూ లేకుండా సావకాశంగా ఉంటే, నాలుగు మంచి మాటలు భగవంతుని గూర్చో, వారి గురువుల గూర్చో అనుష్టానం గూర్చో చెప్పమని అడగండి. వారి పూజామందిరాన్ని దర్శించే అవకాశం అడగండి. సందేహాలుంటే అడగమంటే అడగండి, కానీ నిజంగా సందేహం తీరడం వల్ల మీకు అనుష్టానంలో సందిగ్ధత తొలగుతుందనుక్కుంటే అడగండి. అడగమన్నారని ఏదో ఒకటి అడగకండి. ఏమి అడగాలో తెలియకపోతే, ఏమడగాలో కూడా తెలియని వాణ్ణండీ మీరే దారి చూపండి అన్న అర్థం వచ్చేలా అడగండి.
మొత్తానికి మీరు వారికిబ్బంది కలిగించేలా కాక, విసుగు కలిగించేలాగ కాక, మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చూస్తే పలకరించి మాట్లాడేలా వ్యవహరిస్తే బాగుంటుంది. You have to be very attentive, భాగవతుడు చిరాకు పడితే, ఎంత చదువు, ఆస్థి, పెద్ద కుటుంబం అన్నీ ఉండీ వ్యర్థమైపోతుంది. అటువంటి భాగవతులతో గడిపిన సమయం వృధా కాకుండా సంపూర్ణంగా మిమ్మల్ని ఉద్ధరణవేపుకి నడిపేటట్టు చూసుకోండి.

ఇక ఫోన్ గురించైతే, నమస్కారం నేను (పేరు)శర్మ, (స్థలం)చోటు, రిఫరెన్సు ఏదైనా అవసరమైతే అదీ చెప్పి, అయ్యా ఇప్పుడు మీతో మాట్లాడవచ్చా ఒక్క నిముషం లేదా మీరు ఎన్ని నిమిషాలు మాట్లాడాలనుక్కుంటున్నారో అన్ని నిముషాలు అని అడిగి వారి అంగీకారం పిమ్మట, కుశలమడిగి, చెప్పవలసిందో, అడగవలసిందో అడిగి వారి సమాధానం పొంది చివర్లో తిరిగి నమస్కారం చెప్పి వారూ ఇక ఫోన్ పెట్టెసారు అని నిర్ధారించుకుని పెట్టెయండి, వారు మాట్లాడుతుంటే మీరు పెట్టేయకండి. ఫోనే కదా అని టీవీలు పాటలు ప్లే అవుతున్న చోట, ఇతర శబ్దాలున్నచోట కాకుండా, రణగొణ ధ్వనులు లేని చోట కాక లోపలికెళ్ళి మాట్లాడండి. ప్రత్యక్షంగా ఉంటే ఎలా ఉంటారో, పరోక్షంలోకూడా అలానే ఉండండి.

ఏదో తెలిసింది, తెలుసుకున్నది చెప్పాను, సరి అనిపిస్తే సూచనలు తీసుకోగలరు, అన్యంగా అనిపిస్తే వదిలివేయగలరు.
మీ..

2 comments:

  1. ఈరోజుల్లో, పెద్దవారితో ఎలా ప్రవర్తించాలో చక్కగా, సౌమ్యంగా వివరించారు. విన్నారా మహబాగు.. లేదా వాళ్ళ....

    ReplyDelete