Pages

Wednesday, December 12, 2012

సింహాచల యాత్ర -1


           దేశకాలములు అనుక్కోకుండా ఒక్కోసారి మనకి ప్రత్యేక అవకాశాన్ని ఇస్తుంటాయి
,
కొన్నిటిని గుర్తెరిగి అందిపుచ్చుకుంటాము, కొన్ని తెలియకుండానే మనకి ఆ అవకాశం కలిగి తరవాత ప్రాశస్త్యం తెలుస్తుంది. కొన్ని కొన్ని సార్లు అవకాశం అన్ని రకాలూ ఉన్నా అందిపుచ్చుకోడానికి పూర్వ కర్మానుగత పాపం అడ్డుపడుతూంటుంది.         
           పూజ్య గురువుగారిచే ధర్మ సోపానాలు అన్న విషయాంతర్గతంగా మాతృ దేవో భవ
, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్న అంశాలపై విశాఖపట్టణంలో జరుగుతున్న ప్రవచనాలని ప్రత్యక్షంగా వినాలన్న కోరికతో మొన్న శని,ఆది వారాలలో విశాఖపట్టణం వెళ్లడం జరిగింది. ఈ సమయంలోనే దగ్గర్లో ఉన్న సింహాచల క్షేత్రదర్శనం చేద్దామన్న సంకల్పం కలిగి ఆదివారం పొద్దున్నే నిత్యానుష్ఠానం తరవాత ఆటోలో సింహాచలానికి బయలుదేరాను. సంధ్యావందనంలో దేశకాల సంకీర్తనం చేసినా, సింహాచలం బయలు దేరేటప్పుడు ఎందుకో ఆరోజు ఏకాదశి అనీ, ఆదివారమనీ గుర్తు రాలేదు. అక్కడికి వెళ్ళాకకానీ!        
          విశాఖ నాకు తెలియని పట్టణం
, ఎప్పుడో 5ఏళ్ళా క్రితం ఒక సందర్భంలో ఒక్కరోజుకై వెళ్ళాను, అసలు ఆ పట్టణమే గుర్తులేదు. సరి, అక్కడ ఒక ఆటో అతన్ని మాట్లాడుకును ఆది వారం పొద్దున్నే సింహాచల క్షేత్రాన్ని సేవించుకోడానికి బయలుదేరాను. చల్లగాలి ఒక్కణ్ణే ఆటోలో అలా వెళ్తూ సింహాచలం గురించి ఆలోచిస్తూ ఉన్నాను, అంత చల్లని ప్రదేశంలో ఉంటూ కూడా స్వామి అంత వేడిగా ఎలాఉన్నాడాని. ఈలోగా దూరంగా కొండలు కనపడ్డాయి, ఎడమవేపు ఏదో సింహం పడుక్కున్నట్లు దాని వెనకవేపునుంచి నేను చూస్తున్నట్లు ఆకారంగా అనిపించాయి కుడి వైపు దూరంగా ఉన్న ఆకుపచ్చని కొండల మధ్యలోని లోయల గుండా దూరంగా ఉన్న మరో కొండ కనపడింది, అన్నీ పచ్చగా చెట్లతో ఉన్నాయి ఆ కొండ మటుక్కు గంధం, పసుపు, ఎరుపుల కలయికతో సింహాచల సంపంగి పువ్వులాటి రంగుతో లేత సూర్య కిరణాలు పడుతూ గుడిలో ఏం చూస్తావు బయట ఈ విరాట్స్వరూపంలో చూడు అన్నట్లు గంధం అలంకరించబడిన పెద్ద కొండలా కనిపించింది. మనసులోనే నమస్కారం చేసుకుంటుంటే ఆటో రోడ్డుకి ఎడమవేపుకొండ చివర్నుంచి ఎడమవేపుకి మళ్ళింది ఆశ్చర్యం నాకు సింహంపడుక్కున్నట్లు భావన కలిపించిన కొండే సింహాద్రి, అక్కడే శ్రీ లక్ష్మీ వరాహనృసింహస్వామి వేంచేసినది అని సంభ్రమాశ్చర్యానికి గురయ్యాను.
         
ఆటో నిలిపేస్థలానికి వెళ్తూంటే కొండపైకి వెళ్ళేదారిలో మొట్టమొదటే స్వామి విఘ్నేశ్వరాలయం కనిపించింది. స్వామి వారికి నమస్కరించుకుని, ఆటో ఆపుకున్నాము. ఆటోలు కింద ఆపేస్తారుట, వాటికి పైకిఅనుమతి లేదు. బస్సుల్లోకానీ, కార్లలోకానీ వెళ్ళాలి. లేదా దాదాపు వెయ్యి మెట్లు ఉన్న నడకదారి గుండా వెళ్ళాలి. సమయానుభావం వల్ల బస్సులోనే వెళ్ళాను, ఘాట్ రోడ్డులో స్వామివారి నామాలు లిఖించబడి ఉన్నాయి, ఏనామమైతే ఏమిటి అక్కడి వారు అందరూ అప్పన్నా.... అని ఆత్మీయంగా పిలుచుకునే పేరు నేనూ అదే పేరుతో అప్పన్నా సింహాద్రి అప్పన్నా అంటు తలుచుకుంటూ కూర్చున్నాను. ఆ ఆటో అతను పరమ భక్తుడు, భవానీ మాల వేసుకుని ఉన్నారు. భవానీ పద అని ఇద్దరం కలిసి వెళ్ళాం. పొద్దున్నే ఐనా కాస్త జనం ఎక్కువగానే కనిపించారు.

           చుట్టూ చూస్తే ఏవో కొత్త కట్టడాల్లా అనిపించాయి
, సరే అని, స్వామివారికి చక్కని తులసి మాల తీసుకుని ముందుకు వెళ్ళాం. అప్పుడు తల్లి శ్రీమతి గీత (శ్రీ సుబ్బారావుగారి భార్య) గారు చెప్పింది గుర్తి వచ్చింది, సింహాద్రి అప్పన్న దర్శన పూర్తి ఫలం దక్కాలంటే గంగధారలో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకోవాలి, కనీసం ప్రోక్షించుకుని దర్శనం చేసుకోండి అని. తిన్నగా మా సెల్ ఫోనులు అక్కడ జమ చేసే చోట ఉంచి. గంగధారకి వెళ్ళాం. వెళ్తుంటే కుడిపక్క మహా ఆలయ గోపురం కనిపించింది అందరూ లైన్లలో వెళ్తున్నారు. కుడిపక్క ఆలయానికి వాయువ్యంలో పురాతన శివాలయం ఉన్నది, నమస్కరించుకుని ముందుకు వెళ్ళాం, ఎందరు భక్తులో ఎంత నమ్మకంతోటో అక్కడికి వచ్చి ఎడం పక్కనున్న కళ్యాణకట్టలో తలనీలు సమర్పిస్తున్నారు. ఎడమ పక్క శ్రీ సీతారామ స్వామి దేవస్థానం ఎప్పటిదో పురాతనం రాతి కట్టడం. గంగ ధార దగ్గరికి రాగానే సింహాల నోటిలోంచి పడుతున్న నీటి ధారలా ఏర్పాటు చేసారుట ఈమధ్య. ఇంతకు పూర్వం వాటి పైన ఉన్న ఏక ధారగానే వచ్చేదిట. ఆ ధార ఎక్కడినుంచి ఊరి ఉబికి బయటికి వస్తున్నదో ఆ కొండమీద తెలియదట. చుట్టూ చూస్తే ఆ కొండ మీద జలపాతాలూ లేవు. వేంకటాచలంలో విరజానది పుష్కరిణి ఐనట్లు, ఇక్కడా గంగమ్మ పాతాళం నుంచి ఉబికి వచ్చిందేమో అనిపించింది. ఆనీటితోనే స్వామికి నిజరూపదర్శన సమయంలో అభిషేకం కోసం అర్చకస్వాములు వినియోగిస్తారట దాదాపు వేయి మందికి పైగా వైష్ణవ స్వాములు ఆ కార్యంలో వారంతట వారుగా పాల్గొంటారట. అక్కడ గంగధార లో నీటిని తీసుకుని కాళ్ళు చేతులు కడుక్కుని తల మీద ప్రోక్షించుకుని ఆ ధారకి నమస్కరించి తిరిగి ఆలయం వేపుకి బయలుదేరాం. అక్కడ పూజకు కావలసిన సామగ్రి తీసుకుని ముందుకు వెళ్ళి 100 రూపాయల వరుసలో వెళ్ళి మా ఇద్దరి దర్శనానికి అర్చనకి కావలసిన రసీదులు తీసుకుని ముందుకు వెళ్ళాం. లైన్లోకి వెళ్ళి పై కుర్తా తీసు ఉత్తరీయం వేసుకుని కుర్తాని సంచీలో పెట్టి ఇంతకు ముందు కొన్న తులసి, పూజా సామగ్రి పట్టుకుని ముందుకు వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు సమర్పించి. ముందుకు సాగాం.
          అలా వరుసలో ముందుకు వెళ్తుంటే అక్కడ కప్ప స్తంభం గురించిన సూచిక కనిపించింది
. ఓహో ఇక్కడే కదా కప్పస్తంభం ఉండేది అసలు దాని వివరమేమో అని ఆలోచిస్తుంటే పక్కనే ఇంకో పలకపై కప్ప స్తంభం గురించి వ్రాసి ఉంది. కప్పస్తంభం అంటే మండూకస్తంభం అన్న భావన కాదని అప్పుడు కానీ అర్థం కాలేదు. సంతానం కోసం పరితపిస్తున్న భార్యా భర్తలు ఆ స్తంభాన్ని కౌగిలించుకుని సంతాన ప్రాప్తికై కోరుకుంటే తప్పక ఆ కోరిక తీరుతుంది. సంతానమే కాదు ఇంకా ఏ కోరికలు కోరుకోవాలన్నా ఆ స్తంభాన్ని కౌగిలించుకుని కోరుకుంటే కోరికలు తీరుతాయి. ఐతే ఆ కోరికలు కోరుకోడానికి అక్కడ కప్పం చెల్లించాలి. కప్పం చెల్లించి కౌగిలించుకుని కోరిక కోర్తే తీర్చే స్తంభం కాబట్టి కప్పం స్తంభం అది కాస్తా కప్పస్తంభం అయ్యింది.
సశేషం..

No comments:

Post a Comment