Pages

Wednesday, December 12, 2012

మహానుభావులు పుట్టాలి... పక్కింట్లో..


శ్రీ గురుభ్యోనమః
నమస్తే!

నేను గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ వస్తున్న విషయం ఇది. మరోసారి ఒక స్నేహితుని విషయంలో జరిగింది మొన్ననే చూసాను

భగత్ సింగ్ గురించి చిన్నప్పుడు చెబ్తూ లోకం పోకడ ఎలా ఉంటుందో చెప్తూ ఒక పెద్దాయన అన్నారూ భగత్ సింగ్ మళ్ళీ పుట్టాలి, కానీ మా యింట్లో కాదు పక్కింట్లోఅని అందులో వ్యంగ్యం కనపడచ్చు, లేక మాట చతురత కనపడచ్చు మరేదైనా కావచ్చు. లోకంలో గొప్ప పనులు చేసినవారు మళ్ళీ మళ్ళీ పుట్టి దేశాన్ని ఉద్ధరించాలి, లేదా సమాజాన్ని ఉన్నత మార్గాన నడపాలి అని కోరుకునే ప్రతివారు, తామెందుకు అలాకాలేం అనుక్కోరు, లేదా తమ తమ్ముణ్ణో, కొడుకునో, కూతుర్నో అలా ఎదగడం చూడాలనుక్కోరెందకనో. పొరపాట్న ఆవేపడుగేసిన కుటుంబ సభ్యుల్ని చొక్కాపట్టుకు వెనక్కి లాగడం తప్ప, ప్రజానీకం అంతా ఒప్పుకుని నీరాజనాలిచ్చే స్థితి వస్తే కానీ ఇంట్లో తమ ముందు మసలినవాడు గొప్పవాడయ్యాడని ఆమోదించలేరు.

కానీ ఈ పోకడ, ఆధ్యాత్మిక మార్గంవేపే ఎక్కువ, నేటి పరిస్థితులలో రాజకీయ నాయకులుగా, సామాజికం పేరు చెప్పి నాయకులుగా, చారిటీ పేరు చెప్పి గ్రూపులుగా తయారయ్యేవాళ్ళకు ఆ పరిస్థితి లేదు. మావాడు ఫలానా సంఘంలో ఫలానానోయ్ అని గొప్పగా చెప్పుకుంటారు. ఏ ఒక్కడూ మావాడు తిక్కన మహాభారతంలో పద్యాలు అరటిపళ్ళతొక్క విప్పి గుజ్జు చేసి తేనె చక్కెర వేసి తినిపించినంత తియ్యగా అర్థంతో సహా చెప్పగలడని ఒక్కడు చెప్పడు అసలలా తయారు చేయాలని ఏ ఒక్కరూ కోరుకోరు.

పొరపాట్నో గ్రహపాట్నో ఏమహానుభావుని సంస్పర్శ వల్లో ఆశీర్వాదం వల్లో, మహానుభావుల వచనం విని పిల్లాడు పొరపాట్న కృష్ణ కర్ణామృతం లోని శ్లోకాలో, పోతనగారి పద్యాలో, శాంకర కృతులో చదువుతుంటే, ఆ చాల్లే వాళ్ళకంటే నడిచింది ఇవి చదవటానికింకా టైముంది ఇవేం ఫుడ్డు పెట్టవు ముందు చదువు అని గదిమే వారెంతమందో.... చూసాను చాలా మందిని.

మొన్నొకాయన నా వయసుంటుందనుక్కుంటా, విదేశం నుంచి వచ్చారు. ప్రవచనాలు విని ఎన్నో విషయాలలో మారాడు. చూడడానికి ముచ్చటేసింది. అంతంత పెద్దపెద్ద ఉద్యోగాలలో ఉన్నవారు తీరికలేని వారు కూడా అలా మారుతుంటే మనం ఏమిటి? మన పరిస్థితి ఏమిటి? ఎక్కడి గొంగళి అక్కడే అనిపించింది. సంభాషిస్తే ఆయనో నడిచే ఆధ్యాత్మిక పుస్తకంలా ఉన్నారు, బహుశా గురువుగారి మాటల్ని ఆసాంతం అనుష్టించేసుంటారు, ఆయనలో అదే జీర్ణమైపోయినట్టుంది. పక్కన వాళ్ల కుటుంబ సభ్యులున్నారు, చక్కగా పరివారం తో వచ్చిన శివుడిలా ఉన్నారనిపించేలా. సరే ఏదో పిచ్చాపాటీ కబుర్లు నడుస్తున్నాయి, ఇంతలో ఆయన భార్య అబ్బా మీ ఛాదస్తం ఆపండి అని ఏదో సరదాగా అనింది, అంటే వెంటనే ఆమె తండ్రి (అతని మావగారు) బాబోయ్ ఈనని చూస్తే భయమేస్తోంది ఛాదస్తం పెరిగిపోయింది ఈ వయసుకే, ఏం మాట్లాడితే ఏది తప్పో తెలీట్లేదు మాట్లాడాలంటేనే భయమేసేస్తోంది, ఈనో పండితుడైపోతాడేమో.. అని చిరాగ్గా మొహంపెట్టి వెనక గొణుక్కుంటున్నారు. అది విని ఆయన కొంచెం అన్యమనస్కులై మళ్ళీ ఆయన చిత్తంలో ఆయన ఉన్నారు. నాకే పెద్ద షాక్, అరె ఏమిటి వీళ్ళిలా అలాంటి మనిషిని చూసి నేనెందుకలాలేనని నేననుక్కుంటుంటే వీళ్ళేమిటి ఇలా అని. అసలేమిటి పెద్దవయసులో ఉండాల్సిన గుణంలేక, చిన్నవాడైన అల్లుడికున్న సాధన, అనుష్టానం, ధర్మసూత్ర జ్ఞానం పౌరాణిక జ్ఞానం చూసి ఛాదస్తం అని అనుక్కోవడం ఎంత మూర్ఖం.

మహానుభావులు పుట్టాలి, మహానుభావులు తయారవ్వాలి....... ఆ ఛాదస్తం మాయింట్లో కాదు పక్కింట్లో.... ఎందుకంటే అప్పుడు మేమాచరించక్కర్లేదు, వాళ్ళకి సర్టిఫికెట్లిచ్చెస్తాం భలే చెప్పారండీ అనో భలే పండితుడండీ అనో....


No comments:

Post a Comment