Pages

Friday, December 21, 2012

దృష్టి కోణం


శ్రీ గురుభ్యోనమః

ఒక్కో మనిషి దృష్టి కోణం, వ్యక్త పరచిన భావాల వల్ల ఆవ్యక్తి ఏ స్థాయిలో ఉన్న వాడనేది పెద్దలు పసిగడుతుంటారు. ముఖ్యంగా గురువులు/ఆచార్యులు తమ శిష్యులను తమ దగ్గర ఉంచుకొని విద్య బోధించేటప్పుడు ఈ విషయాన్ని వారి శిష్యులకి తెలీకుండా పరీక్ష చేసి తగు విధంగా వారికి శిక్షణని ఇచ్చేవారు.

ఇది దేహ దృష్టి, మనో దృష్టి, ఆత్మ దృష్టి అని మూడు రకాలు. ఇందులో ముందు నుంచీ చూసినప్పుడు ఆత్మ దృష్టి అత్యుత్తమమైనదీ, దేహదృష్టి అథమము / కనిష్టమైనది.

ఒక వ్యక్తి అలా మన ముందు నుంచి వెళ్తుంటే అబ్బా భలే ఉన్నాడురా ఒడ్డూ, పొడుగూ, ఆ వంటి రంగూ, వేసుకున్న చక్కని బట్టలూ అని ఆనందించే వారుంటారు. వారికి ఆ దృష్టి ద్వారా, కట్టు బొట్టు, జుట్టు, బట్ట, కులం, రంగు, సౌందర్యం, ఇవి మాత్రమే వారి దృష్టికి అందుతాయి. ఉదాహరణకి ప్రవచనాలు వినడానికి వచ్చి ప్రవచనకర్త భౌతికాకారాన్ని చూసి పొగిడేవారు కొందరు. ఆయన ఏం చెప్పారు అన్నదాంతో సంబంధం ఉండదు. ఏం విన్నారో ప్రవచనం అయ్యాక గుర్తు ఉంటుందా అంటే అక్కడక్కడా వేంకటేశ్వర స్వామి పంచె లాగా అన్న మాట. వీరిది స్థూల/భౌతిక/దేహ దృష్టి. వీరి దృష్టి ఉన్నదాన్ని ఆస్వాదిస్తూనే ఏది లేదా అని వెతుకుతూ ఉంటారు.

ఇంకొకరు ఒక వ్యక్తిని చూస్తూనే ఈయన పండితుడిలాగా ఉన్నాడు అని తలచి ఆ వేపున కాస్త పరిశీలించి అబ్బా గొప్ప పండితుడు అని సర్టిఫికేట్లిస్తారు. చూసావా ఆ పంచె కట్టు ఆ వీబూధి బొట్టు, ఆ గడ్డంఅదీనూ బహుశా ఈయన కవేమో, లేదా ఉపాసకుడేమో అని వారికి వారే పరి పరివిధాలా పరిశీలించుకొని ఆ వ్యక్తిని ఏదో ఒక పాండిత్యానికి అంటగడతారు. ఇలా చెప్పే వారు బోలెడు మంది. అబ్బా ఏం గుర్తు పెట్టుకుంటారండీ అనో, భలే చెప్తారండీ అనో, అబ్బా పద్యాలు ఏం చెప్పారండీ అనో, అన్ని పురాణేతిహాసాలు అన్నీ ఆయనకి కంఠతా అనో, లా ఏదో ఒక సర్టిఫికేట్లిచ్చేవారుంటారు. వారు రెండవ కోవకి చెందినవారు. అలానే వీరూ అంతే అన్నీ బాగున్నాయంటూనే అదిగో చూసారా అక్కడ సరిగ్గా చెప్పలేదు అదీ ఇదీ అని లెక్కలు కడతారు.

ఇక అతి కొద్ది మంది ఉంటారు, ఆపక్కనుంచో ఆ వ్యక్తికి దగ్గరనుంచి అలా వెళుతుంటేనే అవతల వ్యక్తిలోని పరబ్రహ్మాన్ని చూసి నమస్కరిస్తారు. ఆ వ్యక్తిని చూడగానే అసంకల్పితంగా వారి రెండు చేతులూ ముకుళించుకుంటాయి. ముందు ఏదో ప్రణాళిక వేసుకుని వారిని కలిసి ఇలా నమస్కారం చేయాలి అవీ ఇవీ అని ప్రణాళిక చేయకపోయినా, వారిని చూడగానే వారిని తలచుకోగానే అప్రయత్నంగా రెండు చేతులూ ముకుళించుకుపోతాయి. మరో మాట ఉండదు, ప్రశ్నా ఉండదు, అక్కడ ఉండేది ఆనందం ఆత్మానందం. ఆ ఆత్మ దృష్టి అలవడాలనే ప్రతి ఒక్కరూ సాధన చేసేది.

ఓ చిన్న కథ

జనక మహారాజు గారు విదేహ వంశస్థులు, గొప్ప ఆధ్యాత్మిక జిజ్జాస కలిగి యాజ్ఞవల్కుని బ్రహ్మ విద్యా జ్ఞానమును పొందుటకుగానూ సుశిక్షితుడైనవాడు. ప్రజలకు ఎన్నో దాన ధర్మాలు చేసినవాడు. అటువంటి జనక మహారాజు, పండితులను, భాషాకోవిదులను, శాస్త్రకారులను, వివిధ అంశములందు ప్రావీణ్యము కలవారిని ఎందరినో పిలిచి సభలు జరిపేవాడు. ఒకనాడొక సభకు అష్టావక్రుడు అనే మహానుభావుని అతిథిగా ఆహ్వానించాడు. అతని గూర్చి, అతని తపస్సు గూర్చి, జ్ఞానమును గూర్చి సభలో అత్యధికులు అప్పటి వరకు విన్నవారే తప్ప ఆయనను చూసిన వారు లేరు.

ఆమహర్షి దర్శనానికి, ఆయన వేదాంత శాస్త్ర పాండిత్యాదులను వారి గొంతుతో వినడానికి పామరులు పండితులు ఎందరో ఆనాటి సభకి విచ్చేసారు. అందరూ ఆ మహర్షి రాకకై ఎదురుచూడసాగారు. ఈలోగా ప్రభువుకి తమ తమ పాండితీ ప్రకర్ష చూపే వారు కొందరు, తమ తమ ప్రతిభా పాటవాలు చూపేవారు కొందరు ఇలా సభ కిట కిటలాడుతున్నది. అష్టావక్ర మహర్షి శరీరం ఎనిమిది చోట్ల వంకరగా ఉంటుంది అందుకే ఆయన పేరు అష్టావక్రుడు అని పేరు కలిగింది. బహు తపస్వి, సత్య తత్త్వ విచారణ చేసి తెలుసుకోవలసినదానిని తెలుసుకొని స్వస్వరూప జ్ఞానమునెఱిగినవాడు. అతని ముఖము బ్రహ్మవర్చస్సుచే మరో అగ్నిహోత్రమా అన్నచందమును బ్రహ్మ వర్చస్సుచే వెలుగొందేది. అటువంటి మహర్షి సభా ప్రవేశం చేయుటకు సభలో ప్రవేశించారు. ఈలోగా కలకలం మొదలైంది. అందరూ గుసగుసలు ఈయన ఆకారం చూసి పండితలు, పామరులు అన్న తేడా లేకుండా అందరూ ఆయనని చూసి నవ్వడం మొదలెట్టారు. అది తెలిసి జనక మహారాజు అష్టావక్రులు వెళ్ళిపోకుండా వెనక్కి సభకి తీసుకురావాలని పరుగున వెళ్ళి గౌరవంతో తోడ్కొని వచ్చి ఉచితాసనం వేసి అర్ఘ్య పాద్యాదులిచ్చి ఉచిత సత్కారం చేసి నమస్కరించాడు. అప్పుడు అష్టావక్రుడు గట్టిగా నవ్వసాగాడు. జనక మహారాజు అయ్యా ఎందుకు నవ్వుతున్నారు, మిమ్మల్ని మీ దేహాన్ని చూసి ఇతరులు సభికులు ఇతః పూర్వం నవ్వారు మరి మీరెందుకు నవ్వుతున్నారో తెలియపరచండి అని కోరాడు.

అష్టావక్ర మహర్షి తన నవ్వుకి కారణం ఇలా వివరించారు " రాజు నన్ను పండిత సభకి ఆహ్వానించారు, కానీ ఇక్కడ ఒక్క పండితుడూ లేడేమి? సభ అంతా చర్మకారుల, మాంస విక్రేతలతో నిండి ఉంది. చర్మ కారుల సభతో నాకేమి పని అని వెనుదిరుగుతుంటే మీరు పిలిచి సింహాసనం లో కూర్చోపెట్టి అతిథి సత్కార్యాలు చేసారు. మీరు నన్నే సభకి పిలిచారో, ఇది ఆ సభ కాదు. పండితులు, ముని వర్యులు, మహర్షులు ఉండవలసిన సభలో మీరు నన్ను కూర్చోపెట్టి ఇలా ఆతిథ్యం ఇవ్వడం సబబే, కానీ ఈ చర్మకారులు, మాంస విక్రేతల సభలో ఉన్నతుడిగా కూర్చోబెట్టి సన్మానం చేస్తున్నారేమిటా అని నవ్వు వచ్చింది" అని అన్నారు. అంత రాజు అయ్యో అంత మాట ఎందుకన్నారు ఇక్కడున్న పండిత జనులందర్నీ మీరు చర్మకారులూ, మాంస విక్రేతలూ అని ఎందుకన్నారో సెలవీయండి పొరపాటు సవరించుకోగలరు అని అడుగగా, ఆ మహర్షి "వీరు జీవుల ఎడ సమభ్రాంతి ఉన్నవారు కాదు. నా శరీర సౌష్ఠవము చూసి బాగున్నదాలేదా అని తలచి ఎనిమిది వంకరలున్నవని కొలచి, నన్ను చూసి నవ్వుకున్నారు. ఆత్మను వదిలి చర్మము, మాంసమును చూసి దాని విలువ లెక్క కట్టేది చర్మ కారులు మాంస విక్రేతలే కదా అందుకే అలా అన్నాను." అది విని సభికులంతా ఆ మహా జ్ఞానిని చూసి సిగ్గుపడి తమ తప్పిదాన్ని మన్నించమని వేడుకున్నారు.

అష్టావక్ర మహర్షి యొక్క ఈ చిన్న కథ ఆత్మ దృష్టిని అలవర్చుకోవలసిన అవసరాన్ని, అలా అలవర్చుకోని వారి స్థితినీ తెలియజేస్తున్నది.


వ్యక్తి యొక్క ఒడ్డూ, పొడుగూ, సౌందర్యం, వయ్యారం, వస్త్రాడంబరం, వాగాడంబరం కాదు ప్రధానం. ఆత్మగుణ ప్రవృత్తి ఎంత స్వచ్ఛమైనదీ, మాటలచేతల పొంతన ఎంత స్పష్టమైనదీ అన్న విషయం ప్రధానం

ఇందుకే సుభాషితంలో చెప్తారు
అక్షరాణి పరీక్ష్యన్తామమ్బరాడమ్బరేణ కిమ్ !
శమ్భురమ్బరహీనోఽపి సర్వజ్ఞః కిం న జాయతే !

పట్టుపుట్టాలనీ, ఆకారాన్నీ ఏం పరీక్షిస్తావ్? విద్యను పరీక్షించు. దిగంబరుడైనంత శివుడు సర్వజ్ఞుడుకాడా?


సర్వం శ్రీ పరబ్రహ్మరాపణమస్తు

-శంకరకింకర
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
जय जय शंकर हर हर शंकर


2 comments:

  1. చాలా చాలా బాగా మంచి విషయం చెప్పారు చెప్పారు నాగేంద్ర గారు

    ReplyDelete