Pages

Friday, December 21, 2012

సింహాచల యాత్ర-2

..అది చూస్తూ ఎత్తైన అరుగులు ఆలయ మంటపం గోపురం చూస్తుంటే, మీరు ఇటునుంచి వెళ్ళాలి అది వేరే లైను అని అక్కడ నిల్చున్నవాళ్లని అడగ్గా చెప్పారు, రాజ ద్వార ప్రవేశం లభించింది. పెద్ద ద్వారం నమస్కరించుకుంటూ లోపలికి వెళ్ళాం. మమ్మల్ని పంపిన దగ్గర ఏలైనూ లేదు పక్కన ఊచలతో ఉన్న లైనులో భక్తులు ఎందరో ఉన్నారు. ఏమిటీ అనుక్కుంటుంటే, మీరు ఈ పక్కనుంచి వెళ్ళాలి అని ఒక పెద్ద అలమారా అంత ఇత్తడి హుండీ పక్కనుంచి ముఖమంటపంలోకి పంపారు అక్కడ కాస్త భక్తులు, ఆలయ ఉద్యోగస్తుల కోలాహలం ఉంది. సరే స్వామిని తలచు కుంటూముందుకు సాగుతూ నాలుగడుగులు వేశాం. ఎవరో తల్లి మెట్లకి పసుపు కుంకుమ బొట్లు పెడతానని మొక్కుకుందేమో ఆ పసుపు కుంకుమ గిన్నె తీసుకొని వచ్చింది అందులోని పసుపు కుంకుమలు ఆలయ గోడలకి రాస్తుంటే అక్కడే ఉన్న ఉద్యోగి ఇవి మెట్లు కావమ్మాఇక్కడరాస్తారేటీ అని గట్టిగా చెప్పాడు సరే నాలుగడుగులు ముందుకేయగానే ఎదురుగా గర్భాలయం మధ్యలో గంధం పూసిన పెద్ద స్ఫటిక శివలింగాకారంలో ఊర్ధ్వపుండ్రాలు ధరించి అడ్డంగా సాలగ్రామ మాల ధరించి దర్శనమిచ్చారు. అప్రయత్నంగా ప్రహ్లాద వరద గోవిందా అని నామం నానోట... గర్భాలయం దాకా వెళ్ళి దర్శించుకుని పక్కన లైనులో అర్చనకోసం నిలబడ్డాం. అప్పుడు ఆ ఆలయం చూద్దును కదా అబ్బా ఏమి విశాలమైన ఆలయం అనిపించింది. రెండువేపులా ఎత్తైన అరుగుల మీద కట్టిన గాజు గదులలో ఒక వేపు ఏకాంత సేవ చేయబడిన మూర్తులు ఉయ్యాల, ఉయ్యాలలో ఎఱ్ఱని పట్టుబట్టచిన్న దిండ్లు. అవతలి పక్క ఊరెరిగింపుకి ఉత్సవమూర్తులనుక్కుంటా ఇద్దరు దేవేరులతో స్వామివారు సింహాసనాసీనులై ఉన్నారు. చూస్తూ కాసేపు లైనులో ఉండిపోయాం. ఈలోగా కార్తీక దీపం గుళ్ళో వెలిగించాలని కామోసు, ఓ తల్లి ఒక చిన్న స్టీలు మూతలాంటి దాంట్లో దీపం వెలిగించుకుని లైనులో తీసుకొచ్చింది స్వామి దర్శనం అయ్యింది కానీ ఆవిడ చేతులు ఆ దీపం వేడికి కాలుతున్నట్లున్నాయి లైను మధ్యలో క్రింద పెట్టి ముందుకెళ్ళిపోయింది. అది అక్కడి ఉద్యోగులు చూసారు కాబట్టి సరిపోయింది లేకపోతే అనర్థం జరిగుండేది. ఐనా స్వామి సన్నిధి కదా ఏం జరుగుతుందిలే అనుక్కున్నాను.
స్వామిని చూస్తూ అయ్యా ఇంత చల్లని ప్రదేశం అదీ కొండమీద, ఇంత గంధంలో ఎందుకు స్వామీ దాక్కున్నావు అనుక్కుంటుంటే, అర్థమయ్యింది. గర్భాలయంతో సహా ఆలయ అధికారుల కేకలు, భక్తుల కేకలు అరుపులు... స్వామీ ప్రశాంతత లేదనా గంధంలో దాక్కున్నావ్ అనుక్కున్నా, ఐనా మా మనసుల్లో ఉంచుకోడానికి... ఆ వేడికి ప్రపంచాలే కాలిపోతున్నాయి స్వామీ మీకూ ఆ వేడెందుకు అనుక్కున్నావేమో ఈ గంధంలో దాగున్నావు అనిపించింది. ఇక మా వంతు వచ్చింది మమ్మల్ని గర్భాలయంలోకి పంపారు స్వామి వారు పెద్ద గంధం పూసిన స్ఫటికలింగంలా ఠీవీగా విరాజమానమైనట్టుగా మధ్యలో ఉన్నారు గర్భాలయం మధ్యలో స్వామి వారి చుట్టూ ఇత్తడితో చేసిన కట్టడం ఉంది భక్తులందరూ చెయ్యి పెట్టి స్వామి అందుతారేమోనని ప్రయత్నం, అర్చక స్వామి ఎవరా చెయ్యి పెట్టిందీ అని కేకలు... సరి స్వామినే చూస్తూ.. స్వామి వారికి ప్రదక్షిణం చేసి స్వామివారికి ముందువేపుకి ఒక పక్కకి నిల్చుని స్వామిని చూస్తూ ఉన్నాను. అర్చక స్వామి వచ్చి తులసి స్వీకరించి గోత్రనామాదులు చెప్పి, ఇతరుల గోత్రనామాలూ చెప్పి అర్చించి తీర్థ ప్రసాదాలు, హారతి ఇచ్చి ఆశీర్వదించి పంపారు. స్వామి వారు అసలే గంధం అలది ఉన్నారు పైగా అర్చక స్వాములిచ్చిన హారతి వెలుగుల్లో తప్త కాంచన సన్నిభం అన్నట్లు సింహాచలం సంపెంగకి బంగారు మెఱుపు వచ్చినట్లున్నారు. అడ్డంగా పట్టు వస్త్రం, పైన ఊర్ధ్వపుండ్రాలు, వెండితో చేసిన రెండు సాలగ్రామ మాలలు ఊర్ధ్వపుండ్రం చివర ఎర్ర తామర పువ్వు, పైనుంచి కిందకి తులసి మాల... ఆహా అని స్వామికి నమస్కరించిమళ్ళీ మళ్ళీ నమస్కరించుకుని బయటికి వచ్చాము. బయట ఎడమ వేపున ఒక చిన్న మూర్తులున్నాయి వాటిని బహుశా నేనే పరధ్యానంలో సరిగా చూడలేదు.
గర్భాలయం బయటికి రాగానే కప్ప స్తంభం అలంకరించి ఉంది ఎవరో కౌగిలించుకొని కోరికలు కోరుకుంటున్నట్లున్నారు. ఇంకా ఒక పాతిక మంది లైను ఉన్నట్లుంది. ఆ కప్ప స్తంభం సంతాన గోపాల యంత్రం మీద ప్రతిష్టింపబడినదట, పిల్లలు కోరే దంపతులే కాక, ఇతర కోరికలు కోరుకునే వారూ వెళ్తున్నారు. పక్కకి వచ్చి లైనులో నిలబడనా అని అనిపించింది. మళ్లీ కొత్తగా నేను కోరే కోరిక ఏముంది స్వామికి తెలీనివి ప్రత్యేకంగా నేను చెప్పుకునేవి! అని ఆలయం చుట్టూ చూస్తూ ముందుకు సాగాం. బహు ఉన్నతమైన ఆలయం, చక్కని శిల్పాలు చుట్టూ అరుగులు. విశాలంగా ఉంది. అరుగుల మీద ఏవో ఫోటోల ఫ్రేమ్స్ ఉన్నాయి ఏమిటాఅని తేరిపార చూశాను. స్వామి వారికి చెందిన విలువైన పురాతన ఆభరణాలు ఇత్యాది ఫోటోలు తీసి చుట్టు పెట్టారు. బాగుంది అనుక్కుని ముందుకు కదిలాము. ఆలయం చుట్టూ, వరాహ స్వామి, నరసింహ స్వామి, హిరణ్య కశిపు వధ ఇత్యాది ఘట్టాల సంబంధ శిల్పాలు ఉన్నాయి, చిన్న చిన్న నగిషీల శిల్ప చాతుర్యం అమోఘం. వెనకవేపున శ్రీ హరి ఆలయం దర్శించి తీర్థం తీసుకొని ముందుకు కదిలాం.. పక్కన సత్య నారాయణ వ్రతాలు సామూహికంగా చేయిస్తున్నారు. నమస్కరించి ముందుకు వెళ్ళగా అమ్మ గోదాదేవి ఆలయం కనపడింది. అమ్మకి నమస్కరించుకొని హారతి తీసుకొని బయటికొచ్చాము.
అసలు ఈ ఆలయం గురించి చెప్పలేదు కదూ, ఈ స్వామి ప్రహ్లాద ప్రతిష్టిత ఆలయమని చెప్తారు, పురూరవ చక్రవర్తి విమానంలో వెళ్తుంటే ఈ కొండ దగ్గర ఆగిపోయి ముందుకు వెళ్లలేక కిందకి దిగిపోయిందిట. అప్పుడు ఈ మట్టిలో కూరుకుపోయిన స్వామిమూర్తిని బయటికి తీసి శ్రుతి ప్రమాణకంగా చందనంతో కప్పి ఉంచి, వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రం నిజరూపార్చన చేసే విధంగా పునః పూజాదులను ప్రారంభించాడని తెలుసుకున్నాను. (కానీ చిన్నప్పుడు ఒకసారి కుటుంబంతో వెళ్ళినప్పుడు అక్కడి వారు ఈ ఆలయం దైవ నిర్మితమనీ, నిర్మాణంలో కొంత ఆలస్యం జరిగినందుకు ఒకచోట ఎక్కడో అతి కొద్ది మాత్రం అసంపూర్తిగా ఉందనీ చెప్పారు... )

ఈ సింహ గిరికి గిరి ప్రదక్షిణలు చేస్తారు, దాదాపు 35 కిలోమీటర్లు పరిధి, ప్రత్యేకంగా గిరి ప్రదక్షిణ ఉత్సవం చేస్తారట, ఆ ఉత్సవం ఎంతో కోలాహలంగా ఉంటుందట. చుట్టూ ఉన్న గ్రామాల వాళ్ళు, గిరిజనులు అందరూ ఆ ఉత్సవంలో పాల్గొనేవారికి దారి పొడుగునా మజ్జిగ, పులిహోర, మంచినీరు అందిస్తూ ఉంటారట... ఆ ప్రదక్షిణలో, నడకదారిలో ఎన్నో ఆధ్యాత్మిక అనుభూతులుంటాయట... మరో విషయం, శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యుల వారి తల్లిదండ్రులు వయసైపోతోంది పిల్లలు లేరని బెంగపెట్టుకోకుండా సింహాద్రి అప్పన్నే ఉన్నాడని పూనికతో ఈ గిరి ప్రదక్షిణ చేసిన తరవాత అప్పలాచార్య స్వామి పుట్టారట. అందుకే వారికి అప్పన్న పేర అప్పలాచార్యులు అని పెట్టారట.
స్వామిని మనసునిండా నింపుకుని, బయటికి రాగానే అక్కడ గోశాల కనపడింది అక్కడ ఉన్న కపిల గోవుకి ఇతర గోవులకి నమస్కరించి తిరిగి విడిదికి బయలు దేరాను. బయలు దేరుతూ మా యింట్లో సింహాసనానికి, సింహాసనాన్నధిష్టించిన దేవతామూర్తులకు అలంకరించడానికి, అక్కడే ఒక అమ్మి అమ్ముతున్న సింహాచలం సంపెంగ పూల దండ కొన్ని విడిపూలు కొనుక్కుని మళ్ళీ తిరుగు ప్రయాణం కట్టాం.
అనుక్కోకుండా కార్తీక బహుళ ఏకాదశీ భానువారం నాడు స్వామి అనుగ్రహించి ఇచ్చిన దర్శనం ఇది.. స్వామిని పునః పునః దర్శనం కటాక్షించమనీ, ధర్మానుష్టానంలో తొట్రుపాటు పడకుండా నిలదొక్కుకునేలా స్థైర్యాన్ని ఇవ్వమనీ కోరుకుకుంటూ బయలు దేరి... ఒక ముఖ్య స్నేహితుడికి ఫోన్ చేసి ఈ వివరం ఇతర వివరాలు చర్చించుకుంటూ విశాఖపట్నంలోని విడిదికి చేరాను..
ఇక్కడికి వచ్చాక స్వామి వారి మీద కీర్తనలో, పద్యాలో ఏదో సాహిత్యం ఉంటుది కదా అని గూగుల్తే, గోగులపాటి కూర్మనాథ కవి వ్రాసిన సింహాద్రి నారసింహ శతకం గూర్చి తెలిసింది... అక్కడ్నుంచి సేకరించిన ఒక పద్యం మచ్చుకి... పరాకులను పద్యరూపంలో వ్రాసారు
  
సీ: శ్రీమద్రమారమణీ మణీరమణీయ
సరస చిత్తాబ్జ బంభర ! పరాకు
శంఖ చక్రగదాసి శార్జ చపాది భా
సురదివ్య సాధనకర ! పరాకు
ప్రహ్లాద నారద వ్యాస శుకాదిక
భక్త సంరక్షణ పర ! పరాకు
బహుతర బ్రహ్మాండ భాండ పరం పరా
భరణ లీలా దురంధర ! పరాకు

తే: నీకు సాష్టాంగ వినతు లనేక గతుల
జేసి విన్నప మొనరింతు జిత్తగింపు
చెనటి వీడని మదిలోన గినుక మాని
వైరి హర రంహ సింహాద్రి నారసింహ !

సర్వం శ్రీ లక్ష్మీ వరాహ నృసింహ స్వామి పాదారవిందార్పణమస్తు..
మీ

No comments:

Post a Comment